అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రాలు దేవదాసు (1953), విప్రనారాయణ (1954), బాటసారి (1961) —మొదటి చిత్రానికి శ్రీ వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించగా, మిగిలిన రెండింటిని భానుమతి భర్త పి.ఎస్. రామకృష్ణారావు రూపొందించారు. అంతేకాదు, వాటికి దర్శకుడూ అయ్యారు.
ఈ మూడు చిత్రాలకు సంగీతం, నటన, సాంకేతిక విలువల పరంగా విశేష ప్రశంసలు లభించాయి. విమర్శకులు, సినీ పండితులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా వీటిని గొప్ప చిత్రాలుగా కొనియాడారు.
అక్కినేని నటించిన చిత్రాలు వందల్లో ఉన్నాయి. వాటిలో అనేకం శతదినోత్సవాలు జరుపుకున్నాయి. మరెన్నో ఘన విజయాలు సాధించాయి. సాంఘిక చిత్రాల కథానాయకుడిగా ఆయనకు అపారమైన పేరు, ప్రతిష్ఠలు వచ్చాయి. ప్రేక్షకులను ఊర్రూతలూగించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. సినీ పండితులు, విమర్శకులు ఆయన నటన అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చిత్రాలు మాత్రం ఈ మూడేనని పేర్కొంటారు. ఆశ్చర్యంగా అనిపించినా, వారి అభిప్రాయం సహేతుకమైనదే. అక్కినేని కూడా అదే విషయాన్ని అంగీకరించారు.
నాటకాలలో గానీ, సినిమాలలో గానీ నటిస్తున్నప్పుడు సృష్టికర్త మలచిన పాత్రలే ప్రేక్షకులకు కనిపించాలి. ఆ పాత్ర తీరుతెన్నులే అక్కడ ప్రత్యక్షమవ్వాలి. మాటలు, ఆహార్యం, నడక, నడవడిక, అంతరంగం—అన్నింటిలోనూ ఆ పాత్రే మనకు దర్శనమివ్వాలి. అంటే ఆ పాత్రలే మనముందు సంచరించాలి; వాటిని పోషిస్తున్న నటుడు కాదు.
దీనినే పరకాయ ప్రవేశం అంటారు. అది జరిగినప్పుడే నటన పరిపూర్ణతను సంతరించుకుంటుంది.
అలా చూస్తే, అక్కినేని నటించిన ఈ మూడు చిత్రాలలో ప్రేక్షకులకు కనిపించేది అక్కినేని కాదు; దేవదాసు, విప్రనారాయణ, సురేంద్రనాథ్. ఆ పాత్రలు అంతగా జీవం పోసుకున్నాయి.
భరణీ పిక్చర్స్ : భానుమతి–రామకృష్ణ
విప్రనారాయణ, బాటసారి చిత్రాలను భరణీ పిక్చర్స్ పతాకంపై భానుమతి–రామకృష్ణ దంపతులు నిర్మించారు. నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను పి.ఎస్. రామకృష్ణారావే నిర్వహించారు.
1954లో ఆయన నిర్మించిన చక్రపాణి, విప్రనారాయణ చిత్రాలు రెండూ ఘన విజయాలు సాధించడం విశేషం. ఆ రెండు చిత్రాల్లోనూ భానుమతి, నాగేశ్వరరావులే నాయికా నాయకులు.
బాటసారి :
బాటసారి 1961 లో విడుదలైన సాంఘిక చిత్రం. శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ప్రసిద్ధ బెంగాలీ నవల… బడదీది… ఆధారంగా దీనిని రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్. రామకృష్ణారావు నిర్మాత, దర్శకుడు. మాస్టర్ వేణు సంగీతాన్ని అందించగా, సముద్రాల రాఘవాచార్య సంభాషణలు, గీతాలు రచించారు.
నటీనటులు :
అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, జానకి, దేవిక, బి.ఆర్. పంతులు, సూర్యకాంతం, ముదిగొండ లింగమూర్తి, బేబీ శశికళ. శరత్ చంద్ర సృష్టించిన పాత్రలను అక్కినేని నాగేశ్వరరావు అంత సహజంగా, అంత పరిపూర్ణంగా పోషించేవారు; ఆ పాత్రలు ఆయన కోసమే రాసినవేమో అనిపిస్తుంది. దేవదాసు చిత్రంలోని దేవదాసు పాత్ర ఆయనకు “ట్రాజెడీ కింగ్” అనే గుర్తింపును తెచ్చిపెట్టగా, బాటసారి చిత్రంలోని సురేంద్రనాథ్ (సురేన్) పాత్ర ఆయన నటనా వైశిష్ట్యానికి మరో నిదర్శనంగా నిలిచింది.
బాటసారి –అవ్యక్త ప్రేమకు దృశ్యకావ్యం :
శరత్ చంద్ర పాత్రలను తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. పాత్ర స్వభావం, ఆలోచనా సరళి, మానసిక స్థితి, భావోద్వేగాల తీవ్రతలను ముందుగా ఆకళింపు చేసుకోవాలి. పాత్ర అంతరంగంలో కదిలే భావాలను, ఆలోచనల తరంగాలను పట్టుకుని వాటిని దృశ్యరూపంలో వ్యక్తం చేయాలి. ఆ భావావేశాలు పాత్ర ఆహార్యంలో, ప్రవర్తనలో, ఆంగికాభినయంలో ప్రతిఫలించేలా చేసి, ప్రేక్షకుడు వాటిని అనుభూతి చెందగలిగే విధంగా దర్శకుడు వెండితెరపై ఆవిష్కరించాలి. దానికి తగిన నటీనటులు దొరకాలి. వారి నుంచి పాత్రోచితమైన, సహజమైన నటనను రాబట్టగలగాలి.
ఈ విషయంలో పి.ఎస్. రామకృష్ణారావు అసాధారణ ప్రతిభ కనబరిచారు. పాత్రల అంతరంగాన్ని అర్థం చేసుకుని, నటుల సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ సహజమైన నటనను రాబట్టగలిగారు. బాటసారి ఇందుకు చక్కని ఉదాహరణ.
బడదీది నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కథాపరంగా చూస్తే సురేంద్రనాథ్–మాధవిల అనుబంధం. కానీ అంతర్భావంలో ఇది ప్రేమ గురించి కాదు; ప్రేమను మించిన ఒక ఆరాధన గురించి.
సురేన్ మనసులో మాధవి పట్ల ఉన్న భావం ప్రేమా? మాతృత్వానుభూతా? అక్కచెల్లెళ్ల అనుబంధమా? లేక ఇవన్నింటినీ అధిగమించిన ఒక ఆత్మీయతా? నిర్మలమైన ప్రేమకు తార్కాణమా? అనే ఈ ప్రశ్నలకు శరత్ చంద్ర స్పష్టమైన సమాధానం ఇవ్వరు. ఆ సందిగ్ధతే ఈ రచనకు శాశ్వతత్వాన్ని ప్రసాదించింది. శరత్ చంద్ర సాహిత్యంలో కనిపించే మహోన్నత స్త్రీ పాత్రల సరసన మాధవి నిలుస్తుంది. బాల వితంతువు. తన కోరికలను సమాజానికి బలిచేసుకున్న స్త్రీ. తన జీవితాన్ని ఇతరుల సుఖసంతోషాల కోసం అంకితం చేసిన వ్యక్తిత్వం.
భానుమతి ఈ పాత్రలో నటించలేదు; జీవించారు అనడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా తన వ్యక్తిత్వంతో తెరను ఆక్రమించే భానుమతి, ఇక్కడ మాత్రం పాత్ర వెనుక దాగి మాధవిని మాత్రమే ప్రేక్షకుల ముందుంచారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ప్రేమ కాదు — విరహం. ప్రధాన భావం కలయిక కాదు — అవ్యక్తత. ప్రధాన విషాదం మరణం కాదు — మనసులోని మాటను చెప్పుకోలేకపోవడం. అందుకే చిత్రం ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుడి మనసులో ఒక నిశ్శబ్ద వేదన మిగిలిపోతుంది.
కళాఖండం :
వాణిజ్య విజయాలు కాలంతో పాటు మరుగున పడవచ్చు. కానీ మానవ హృదయ రహస్యాలను ఆవిష్కరించిన కళాఖండాలు మాత్రం నిలిచిపోతాయి. ఆ కోవకు చెందిన చిత్రమే బాటసారి.
కథ :
సరికొత్త ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో నాయకుడు సురేంద్రనాథ్. సవతి తల్లి గారాబంతో పెరిగిన అతడు చదువులో మేటి, కానీ లోకజ్ఞానం తక్కువ. ఎం.ఎ.లో విశ్వవిద్యాలయం అంతటికీ ప్రథముడిగా ఉత్తీర్ణుడైన అతడు ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఇల్లు విడిచి మద్రాసుకు చేరుకుంటాడు.
ఉద్యోగాన్వేషణలో శ్రీమంతుడు అప్పారావు ఇంట ఆశ్రయం పొందుతాడు. ఆయన కుమార్తె ప్రమీలకు పాఠాలు చెబుతూ అక్కడే ఉంటాడు. అప్పారావు పెద్ద కుమార్తె మాధవి బాలవితంతువు. ఇంటి బాధ్యతలన్నీ నిర్వహిస్తూ సురేన్ అవసరాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. అతన్ని చూడకుండానే అతని స్వభావాన్ని అర్థం చేసుకున్న ఆమె క్రమంగా అతనిపై అనురాగం పెంచుకుంటుంది.
ఒకసారి మాధవి బెంగుళూరుకు వెళ్లినప్పుడు సురేన్ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఆమె తిరిగి వచ్చిందని తెలిసి ఆనందంతో ఆమె గదికి వెళ్లిన సురేన్‌ను, లోకోపవాద భయంతో మాధవి దూరం చేస్తుంది. బాధపడిన సురేన్ ఆ రాత్రే ఇల్లు విడిచి వెళ్లి ప్రమాదానికి గురవుతాడు. ఆస్పత్రి నుంచి కోలుకున్న తరువాత స్వగ్రామానికి చేరి జమీందారవుతాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహం చేసుకుంటాడు.
ఇదిలా ఉండగా మాధవి తండ్రి అప్పారావు మరణిస్తాడు. మాధవి ఆస్తిని జమీందారీ మేనేజరు కుట్రపూరితంగా కాజేస్తాడు. ఇదంతా సురేన్ పేరుతో జరిగినా అతనికి తెలియదు. నిజం తెలుసుకున్న తరువాత మాధవి కోసం వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఎన్నాళ్ల నుంచో ఉన్న గుండెజబ్బు ముదిరి చివరకు ఆమె ఒడిలోనే ప్రాణాలు విడుస్తాడు.
సురేన్ పాత్ర:
సురేన్ అమాయకుడు.ఈ లోకంలో ఉండడు. పరధ్యాన మనిషి. జోడు పెట్టుకున్నా ఎప్పుడూ దేన్నో వెతుకుతున్నట్టుంటాడు. ఏమి కావాలో తోచని మనిషిగా, నీరసంగా, దిగులుగా కనిపిస్తాడు. అతనికి అపకారచింత లేదు. ఉపకారచింత కూడా లేదు. స్వార్థం లేదు. పరార్థం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుంటాడు. కానీ దేన్ని గురించి ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు; బహుశా అతనికీ తెలియకపోవచ్చు.
అతనికి ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యలు లేవు. ప్రేమ విఫలం కాలేదు. ఆరోగ్య సమస్యలు కూడా మొదట్లో కనిపించవు. కవి కాదు, గాయకుడు కాదు, రాజకీయవేత్త కాదు, భగవత్ ధ్యానంలో మునిగిపోయినవాడు కాదు.
అందుకే అతని దిగులు వెనుక కారణం ఏమిటో ప్రేక్షకుడు పూర్తిగా గ్రహించలేడు. ద్వితీయార్థంలో మాత్రం అతని మనస్సు మాధవి చుట్టూ తిరుగుతుంది. అందువల్ల అతని వేదనకు ఒక అర్థం లభిస్తుంది.
మాధవి పాత్ర:
మాధవి పాత్ర విషయంలో ప్రేక్షకుడు ఆమెతో పూర్తిగా ఏకీభవించగలడు.
ఆమె కరుణామయి. ఉపకారచింతన తప్ప మరో భావం లేని వ్యక్తిత్వం. సురేన్‌ను చూడకుండానే అతని గురించి తెలుసుకుని అతని అవసరాలన్నీ చూసుకుంటుంది.
తాను ఊరి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సురేన్ తన బాధలు చెప్పుకోవడానికి తన గదికి రావడం ఆమెకు అంతరంగంలో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ వెంటనే సంప్రదాయం, కట్టుబాట్లు, తన వితంతు స్థితి గుర్తొచ్చి గాబరాపడుతుంది.
నౌకర్లలో గుసగుసలు మొదలయ్యాక మరింత క్షోభ చెందుతుంది. మనసులో స్థానం ఇచ్చినా, జీవితంలో స్థానం ఇవ్వడానికి ఆమె సిద్ధపడలేకపోయింది. ప్రేమను అంగీకరించడానికి కూడా భయపడింది. ఆ పరిస్థితుల్లో ఒక సంస్కారవంతమైన భారతీయ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అచ్చంగా అలాగే ప్రవర్తించింది. అందుకే ఆమె పాత్ర సహజంగా, విశ్వసనీయంగా నిలిచింది.
సంగీతం:
సముద్రాల సీనియర్ మాటలు రాసారు. వారు రచించిన పాటలకు మాస్టర్ వేణు స్వరాలు సమకూర్చారు.
ప్రసిద్ధ గీతాలు:
“ఓ బాటసారి నను మరువకోయి” — భానుమతి
“కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్” — భానుమతి, జిక్కి
పాటలన్నీ ప్రజాదరణ పొందకపోయినా, భానుమతి స్వరంలోని హాయి, విలక్షణత కొన్ని గీతాలను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
చిత్ర విశేషాలు
ఈ చిత్రానికి మొదట “ఎండమావులు” అనే పేరును నిర్ణయించారు. తరువాత దానిని "బాటసారి"గా మార్చి 1961 జూన్ 30న విడుదల చేశారు. తమిళంలో “కానల్ నీర్” పేరుతో సమాంతరంగా నిర్మించారు. అక్కినేని, భానుమతి, జానకి, దేవిక, సూర్యకాంతం తమిళ రూపాంతరంలోనూ తమ పాత్రలను పోషించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. మొదటి నుంచి చివరి వరకు శోకరసంతో నిండిన కథను ఎంచుకోవడంలో నిర్మాతగా రామకృష్ణ చూపిన సాహసాన్ని ఎంతైనా అభినందించాలి. ఈ సినిమా నిర్మాతకు నష్టాన్నే ఇచ్చింది.
అయితే దేవదాసు కూడా విషాదాంత చిత్రమే. అయినప్పటికీ అది కళాత్మకంగానూ, ఆర్థికంగానూ ఘనవిజయం సాధించింది. బాటసారి మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. కారణం ఏమిటన్నది పాఠకుల ఆలోచనకే వదిలివేయవచ్చు.
మొత్తం మీద చెప్పాలంటే, కథ కంటే రెండు విభిన్న మనస్తత్వాల చిత్రణకే ఈ చిత్రంలో ప్రాధాన్యం ఎక్కువ. ఆ చిత్రణను బలపరచడానికే మిగతా పాత్రలు, సంఘటనలు ఉపయోగపడ్డాయి.
చివరి సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయి. సాధారణంగా కంటతడి పెట్టని వారి కళ్లూ చెమరించేంత భావోద్వేగ తీవ్రత వాటిలో ఉంది.
తుఫాన్ రేగే సమయంలో, విపరీతమైన గాలులు, కళ్ళజోడు పగిలిపోయి, మాధవిని సురేన్ వెతుక్కుంటూ వెళ్లేది చివరి సన్నివేశం. ఆమె కూడా ఇతణ్ణి వెతుక్కుంటూ వస్తూ వుంటుంది. చివరకు, ఒకచోట కలుస్తారు. ఆ బీభత్స వాతావరణంలో ఆమె ఒడిలోకి చేరి, ఆమెతో ఏదో చెప్పే యత్నం చేసి, ఆమె ఒడిలోనే మరణిస్తాడు సురేన్.
చివరి సన్నివేశం ప్రేక్షకులను బాధాతప్త హృదయులను చేస్తుంది. మంచి చిత్రాలను నిర్మించాలన్న సాహసం, చిత్తశుద్ధి గల నిర్మాతలు, దర్శకులు తెలుగుసినీ రంగంలో ఉన్నారన్న సంతృప్తిని కలిగించే చిత్రాలలో బాటసారి ఒకటి.

