నవరసాల్లో హాస్యం స్థానం విశిష్టమైనది, విలక్షణమైనది. అందరూ హాస్యాన్ని ఇష్టపడతారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. బహుజనుల హితమే బహుజనుల సుఖమన్నది ఆకాశవాణి ధ్యేయం. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తుంది. శ్రోతల స్పందనను కోరుకుంటుంది. ఈ ఒత్తిడి ప్రపంచంలో వాటిని అధిగమించి నవ్వుల పువ్వులు పూయించి ఊరటనిచ్చేది హాస్యమే కదా. ఏడున్నర దశాబ్దాలుగా విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన హాస్యనాటికలు, సంభాషణలు, ప్రసoగాలు, ప్రహసనాలు, గుళికలు, ఎన్నని… అయినా 36 ఏళ్ల ఉద్యోగిగా విన్నవి, కన్నవి, కొన్ని మీకు అందిస్తాను.
1960,70 దశకాల్లో పండుగల సందర్భoగా విజయవాడ కేంద్రం ప్రభాత ప్రసారాలు హాస్య నాటికలతో ప్రారంభం అయ్యేవి. పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ 10,15 నిముషాలు హాస్య నాటికలు సాగేవి. ఇక ఆ రోజంతా నవ్వులే నవ్వులు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన హాస్య నాటకాల్లో తలమానికమైన నాటకం చిలకమర్తి వారి “గణపతి”. నేటికీ ఆ నాటకం పునః ప్రసారమవుతుంటే ఉత్తరాల రూపంలో స్పందించే శ్రోతలెందరో. అమాయకపు గణపతిగా శ్రీ నండూరి సుబ్బారావు, తల్లిగా సీతారత్నమ్మ పలికిన సంభాషణలు ఈ నాటికి హాస్యప్రియుల చెవుల్లో మార్మో గుతున్నాయంటే ఆ నాటక రచన ఎంత పటిష్టమైనదో వేరే చెప్పక్కర్లేదు. ఈ నాటకం రేడియోలో విని, మార్కెట్లో నవల కోసం పరుగులు పెడుతున్నారంటే హాస్య నాటకానికి ఇంత శక్తి ఉందా అనిపిస్తుంది. నిర్వహించిన బందా వారి కృషి మాటల్లో చెప్పలేనిది. గురజాడ వారి " కన్యాశుల్కమ్ " మరో అద్భుత నాటకం. రేడియోకి అనువుగా సాగిన రచన శ్రోతల్లో నవ్వుల పువ్వులు పూయించింది. గిరీశంగా కె. వెంకటేశ్వరరావు, మధురవాణిగా వాణిబాల నటన మరువరానిది. కాళ్ళకూరి నారాయణరావు గారి “వరవిక్రయం” నాటకంలో సింగరాజు లింగరాజుగా నటించిన కూచిమంచి కుటుంబరావు (నిలయ విద్వాంసుడు), కందుకూరి చిరంజీవిరావు, ఎం. నాగరత్నమ్మలు పలికిన సంభాషణలు, ముఖ్యంగా కుటుంబరావుగారి మాటలు ప్రత్యేకంగా ఉంటాయి. వారు తప్ప మరెవరు పలకలేని దీర్ఘాలు, విరుపులు వారి సొంతం. వారే ప్రధాన పాత్రలో సీతారత్నమ్మ గారితో కలిసి నటించిన మల్లాది విశ్వనాథ కవిరాజు గారి “నాటికి నేడు” ( రెండే పాత్రలు ) నాటిక రేడియో నాటకం ఇలా ఉండాలి అనడానికి ఉదాహరణ. రైలు ప్రయాణంలో ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ఈ నాటిక. 20 నిముషాల నిడివితో నడుస్తుంది ఈ నాటిక. “సీతాపతి సంసారం” గొలుసుకట్టు హాస్య నాటకం కొన్ని వారాల పాటు సాగింది ధారావాహికంగా. ఆదివిష్ణు, కొమ్మూరి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచయితలు. రేడియోలో నాటకం విని కళాకారులను చూడాలని శ్రోతలు స్టేషన్ కి రావడం గొప్పేగా మరి. పురాణం వారిదే మరో రచన “మూడంతస్తుల మేడ”. ఇందులో నటించిన వి.బి. కనకదుర్గ, నండూరి పాత్రలకు ప్రాణం పోశారు.
నండూరి వారు మంచి హాస్యనటులే కాదు. చక్కటి హాస్య రచయిత. రేడియోకి లెక్కలేనన్ని హాస్య నాటికలు రాశారు. “మా తాయారమ్మత్తయ్య”, “నేను - మా ఆవిడ”, “నళినితో నేను” లాంటి రచనలు కొన్ని. వారు ఆకాశవాణి ఆహూతుల సమక్షంలో ఇతర ఊళ్ళల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్టేజిపై నాటికలు ప్రదర్శింప చేసేవారు.
అనంతర కాలంలో నిన్నటి సినిమా రచయిత జంధ్యాల సినీరంగ ప్రవేశం చెయ్యకముందు రేడియో కోసం “బామ్మగారు - బొమ్మలపెట్టె”, “బామ్మగారు - తిరుపతి యాత్ర", “కృష్ణమూర్తి - కుక్కపిల్ల","మధ్యతరగతి మందహాసం” లాంటి హాస్య రచనలు రేడియోకి అందించారు.
భమిడిపాటి కామేశ్వరరావు గారి శిష్యులు, ప్రముఖ న్యాయవాది పుచ్చా పూర్ణానందంగారు స్వతహాగా హాస్యప్రియులు. రేడియోలో ఎన్నో హాస్య ప్రసంగాలు చేశారు. “భార్యతో బజారుకి”,“పట్నంలో పాడి గేదె”,“మీసాల సొగసులు”,“కాఫీ పడని కాంతయ్య (నాటిక)”, లాంటి హాస్య రచనలు ఎన్నో. జంధ్యాల సినిమాల్లో వేషాలు కూడా వేశారు. వైవిధ్యభరితమైన “చెళుకులు” రేడియో కార్టూన్ ఆ రోజుల్లో పలువురిని ఆకర్షించాయి. సత్యం శంకరమంచి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు వీటిని నిర్వహించారు. భట్టు రూపొందించిన “చీరెల భార్య” ఢిల్లీ నుంచి ప్రసారమైన వార్షిక కార్యక్రమంలో హిందీలో కూడా ప్రసారమైంది. పూసల వెంకటేశ్వరరావు, పిసిపాటి ఉమామహేశ్వరం, రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు, రావి కొండలరావు, గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఆదివిష్ణు లాంటి రచయితలు హాస్యాన్ని సుసంపన్నం చేశారు. మల్లాది విశ్వనాథ కవి గారి “దొంగాటకం”, పూసల గారి “బ్రహ్మ! నీ రాత తారుమారు”, డి.వి. నరసరాజు గారి “నాటకం”, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి “అప్పు సత్యాగ్రహం”, ఆదివిష్ణు “పండగొచ్చింది” గుర్తుంచుకోదగ్గ హాస్య నాటికలు. సినిమాలలోకి వెళ్లక ముందు కామరాజు రామారావు అనే “శ్రీరమణ” రేడియో కోసం “చిలకలపందిరి” అనే హాస్య ప్రహసన మాలికను అందించారు. స్కిట్స్ అనే ప్రహసనాలు వేదికపై కూడా ప్రదర్శించాము. ఇందులో ఉషశ్రీ, ఎ.బి. ఆనంద్, సుత్తి వీరభద్రరావు, మల్లాది సూరిబాబు, శ్రీకాంత శర్మ, నాగరత్నం, కనకదుర్గ బయటి రంగస్థల నటులు నటించారు. పేరెన్నిక కన్న కళాకారులలో శనగల కబీరదాస్, ఆర్. రామచంద్రరావు, విన్నకోట విజయరామ్, వై. రాజకుమారి, మద్దాలి సుశీల, విజయభాను, కోట శంకరరావు ముఖ్యలు. రేడియో అనౌన్సర్ గా పేరు గాంచిన శ్రీ కోకా సంజీవరావు రచించిన “మీర్ జాన్ పుల్లయ్య,” “వయసు పదహారు" మరువరాని హాస్య నాటికలు.
రేడియోలో ఉషశ్రీ నిర్వహించిన “ధర్మసందేహాలు” హాస్యభరితమైన విజ్ఞాన కార్యక్రమం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రోతలు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు. “బావగారి కబుర్లు” మరో గొప్ప విజ్ఞాన హాస్య కార్యక్రమం. ప్రతి రోజూ సాయంత్రం 5 నిముషాలపాటు సి. రామమోహనరావు, నండూరి ఇందులో సాంఘిక, రాజకీయ సమస్యలను సున్నితంగా చర్చించేవారు… వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగంలో రెండు ఆదివారాల్లో ఉదయం 15 నిముషాల పాటు “వినోద వల్లరి” పేరిట హాస్య నాటికలు ప్రసారమయ్యేవి. మాడుగుల, సర్వజిత్, వీర్లవర ప్రసాద్, ఖుద్ధుస్ లాంటి రచయితలు ఎక్కువ హాస్య నాటికలు అందించారు. రేడియో ఓ.బి.లలో ఆ రోజులలో సినీ హాస్య నటులు బ్రహ్మనందం, సుబ్రహ్మణ్యం (ఎ.వి.ఎస్.) ఎక్కువగా పాల్గొనేవారు. ఆకాశవాణిలో హాస్యం పండించడం అంత తేలికేమి కాదు. చక్కని రచన, హాస్య సంభాషణాలు, వాచికాభినయం, టైమింగ్ సమపాళ్ళల్లో కూడితేనే హాస్యం పండుతుంది. రంగస్థలంపై ఆంగికం, వాచికం, ఆహార్యం, నటన, భావ ప్రకటన సమాహారమైతే రేడియోలో కేవలం గొంతే అన్నింటిని పలికించాలి. అలా పలికించిన ఎందరో నటులకి, నిర్వాహకులకి రచయితలకి అభినందనలు. శ్రోతలకు నిత్యం విందు భోజనం లాంటి పసందైన కార్యక్రమాలని, పిండి వంటల్లాంటి హాస్యమధురిమలను అందిస్తున్న ఆకాశవాణి అందరి మనసు దోచిన ప్రసార మాధ్యమం.

