నేడు మనం అనుభవిస్తున్న దేశ స్వాతంత్య్రం ఎందరో దేశభక్తుల, త్యాగధనుల అంకితభావ ఫలం. స్త్రీలు ఇంటి గడప దాటి బయటకు రావటానికి ఆంక్షలు ఉన్న ఆ రోజులలో భారతమాత దాస్య శృంఖలాలను చేధించి స్వేచ్ఛను ప్రసాదించటానికై తమ జీవితాలను, కుటుంబాలను అంకితం చేసిన నారీమణులెందరో! వారు కఠిన జైలుశిక్షలు అనుభవించారు. కష్టాలన్నీ వారు పడి, మనకు సుఖ, సౌఖ్యాలను అందించారు. అటువంటి వారిలో విశిష్ట నారీ తిలకం ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి.

వీరేశలింగం స్పూర్తితో…

ఈమె 1891లో మద్రాసులో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. హుగ్గిళ్ల శ్రీనివాసరావు, చూడమ్మ ఆమె తల్లిదండ్రులు. ఆనాటి సమాజంలో బాల్య వివాహాలే అమలులో ఉండేవి. రుక్మిణి తల్లిదండ్రులు కూడా ఈమెకు బాల్యంలోనే వివాహం చేయాలని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితులుగా ఉన్న కందుకూరి వీరేశలింగం, అమ్మాయికి అప్పుడే పెళ్లి వద్దని, చదివించమని చెప్పారు. కందుకూరి స్ఫూర్తితో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రుక్మిణి మెట్రిక్యులేషన్ చదివింది. మద్రాసులో సుప్రసిద్ధ వైణికురాలు ధనమ్మ దగ్గర 12 సంవత్సరాలు వీణ నేర్చుకున్నారు. వీణతో పాటు వయోలిన్, సితార కూడా నేర్చుకున్నారు ఆమె.

ఆ రోజుల్లోనే ప్రేమవివాహం….

భారతదేశంలో ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులలో ఒకరైన ఆచంట లక్ష్మీపతి, రుక్మిణి మధ్య పరిచయం ప్రేమగా పరిణమించింది. ఇరువురు, ఇరువైపుల పెద్దలను ఒప్పించి ప్రేమను సఫలవంతం చేసుకుని దంపతులయ్యారు. శాఖాంతరమే కాక, నాటి బాల్య వివాహలకు వ్యతిరేకంగా 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగింది. దీనితో రుక్మిణి అత్తగారింటి వారిని అందరు వెలి వేశారు. కాని, పత్రికలు ఈ అభ్యుదయ వివాహాన్ని ప్రశంసిస్తూ వార్తలు రాశాయి. రుక్మిణీ స్వయంవరం పద్యాలు కూడా ప్రచురించాయి. అప్పటి నుండి ఆమె ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి అయ్యారు.

భర్త ప్రోత్సాహంతో రుక్మిణి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. ఆ కాలంలో ఇంగ్లీషులో అంతటి వాగ్దాటి గల మహిళలు అరుదు. ఈమె మద్రాసు రేడియో కేంద్రంలో వీణ కచేరీలు చాలాసార్లు చేశారు.

రుక్మిణి బాల్య వివాహాలను వ్యతిరేకించారు. స్త్రీ విద్యను ప్రోత్సాహించారు. 1921లో గాంధీజీని కలిసారు రుక్మిణీదేవి. ఖద్దరు ప్రచారం, విదేశీ వస్త్ర బహిష్కరణ ప్రచారం ముమ్మరంగా చేశారు. గాంధీజీ స్వతంత్ర నిధికి తన బంగారం అంతా ఇచ్చేశారు ఆమె. గాంధీజీ, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రోత్సాహంతో రుక్మిణి స్వరాజ్యోద్యమంలో ప్రముఖ భూమిక వహించారు. 1920లో పారిస్‌లో జరిగిన ప్రపంచ మహిళా సభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్లారు ఆమె. అప్పుడే యూరప్‌లో కొన్ని దేశాలలో పర్యటించారు. ఆ దేశాలకు ఉన్నట్లు జెండా, జాతీయగీతం భారతదేశానికి లేవని రుక్మిణీదేవి కలత చెందారు. ఎలాగైనా తమ దేశానికి జెండా, జాతీయ గీతంతో స్వాతంత్య్రం సాధించాలనే పట్టుదలతో స్వరాజ్యోద్యమంలో అంకితభావంతో పాల్గొన్నారు రుక్మిణీదేవి.

1929లో ఉన్నవ లక్ష్మీబాయమ్మతో కలిసి రుక్మిణి ఆంధ్ర దేశంలో జాతీయోద్యమ ప్రచారం తీవ్రంగా చేశారు. ఆమె ఉపన్యాసాలు ప్రజలలో చైతన్యాన్ని కలిగించేవి.

అరెస్టు అయిన తొలి మహిళ

1930లో వేదారణ్యంలో ఉప్పు తయారు చేసి స్వయంగా శిబిరం నడిపి రుక్మిణి అరెస్ట్ అయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయిన ప్రథమ మహిళ ఈమె. అప్పుడు రాయవేలూరులో దుర్గాబాయి, వేదాంతం కమలాదేవి మొదలైన వారితో రుక్మిణీదేవి ఒక సంవత్సరం జైలుశిక్ష అనుభవించారు. ఈమె ఎ క్లాసులో ఉన్నారు. సి క్లాసు ఖైదీలకు భోజనాలు సరిగ్గా అందడం లేదని తెలుసుకుని, ఈమె తమ దగ్గర కొంత మజ్జిగ మిగిల్చి, కుండ భుజాన పెట్టుకుని ప్రతిరోజూ వారికి ఇచ్చి వచ్చిన సౌజన్యమూర్తి.

జైలులో రాజకీయ ఖైదీలకు రుక్మిణి ఇంగ్లీషు బోధించేవారు. వీణ వాయించి, పాటలు పాడి అక్కడ అందరినీ ఆహ్లాదపరిచేవారు.

జైలులో స్త్రీలను బొట్టు పెట్టుకోనిచ్చేవారు కాదు. అంచు చీరలు కట్టుకోనిచ్చేవారు. గాజు గాజులు వేసుకోనిచ్చేవారు కాదు. స్త్రీలకు మంగళప్రదమైన వీటి నిషేధాన్ని వ్యతిరేకిస్తూ, స్త్రీలు ఎదురు తిరిగినప్పుడు, నిరసన ప్రకటించినప్పుడు, రుక్మిణి శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. అప్పుడు రంగు రంగుల రబ్బరు గాజులతో స్త్రీల చేతులు కళకళలాడాయి.

వరించిన పదవులెన్నో…

రుక్మిణి ప్రతిభ, పట్టుదల, కార్యదీక్షకు ఆమెను వరించిన పదవులెన్నో! ఆమె మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. చెంగల్పట్టు జిల్లా బోర్డు సభ్యులుగా, అన్నామలై యూనివర్సిటీ సిండికేట్ సభ్యులుగా ఉన్నారు. 1936లో జనరల్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి శాసనసభ సభ్యులయ్యారు. 1937లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.

ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రుక్మిణి ఆంధ్రులకు గుంటూరులో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. మద్రాసులో మూతపడిన ఆయుర్వేద పాఠశాలను ఈమె తిరిగి తెరవటమే కాక ఆయుర్వేద కళాశాలగా రూపొందించారు. ఈ కళాశాలల ఏర్పాటు ఈమె నిర్మాణాత్మక కృషికి నిదర్శనం.

భారత స్వాతంత్ర్య సాధనకు అహరహం పాటు పడి, అనేకసార్లు జైలు శిక్షలను అనుభవించారు రుక్మిణి. కష్టాలన్నీ అనుభవించి, స్వాతంత్ర్యమనే అమృత ఫలాన్ని మనకందించారు. పాలనారంగంలో అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించి దేశాభ్యున్నతికి తన వంతు సేవలందించిన విశిష్ట మహిళ రుక్మిణీ లక్ష్మీపతి. రేడియో ప్రసార ప్రముఖుడు, రచయిత, చిత్రకారుడు ఆచంట జానకిరామ్ ఈ దంపతుల కుమారుడు.

1951లో రుక్మిణి భౌతికంగా మనను వీడినా, ఆమె జీవిత ప్రస్థానం, ఆమె త్యాగ జీవితం నేటి నారీ లోకానికి ఎంతో స్ఫూర్తిదాయకం.