“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం” అని శ్రీ శ్రీ అన్న విధంగా ఇప్పుడు “ఏ పత్రిక తీరు చూసినా ఏమున్నది గొప్పతనం, పత్రికా రంగం మొత్తం పతనం అంచుకు ప్రయాణం” అని అన్వయించుకోవాల్సి వస్తోంది. “గత కాలము మేలు వచ్చు కాలం కంటెన్” అనే నానుడి పత్రికల స్థితికి అక్షరాల వర్తిస్తుంది. “విలువల పతనం - విశ్వసనీయతకు విఘాతం” లా ప్రమాణాలు పడిపోయాయి.

నిజానికి సమాజంలో తక్కిన వ్యవస్థలతో పోల్చి చూస్తే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పేర్కొనే పత్రికా రంగంపై సామాజిక బాధ్యత కీలక పాత్ర వహిస్తుంది. అలనాటి పత్రికలు ఆ బాధ్యతను చాలా చక్కగా నెరవేర్చాయి. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి అంశాల ప్రాధాన్యం మారుతూ ఉంటుంది. స్వాతంత్ర్యానికి ముందు సంఘ సంస్కరణ, స్వదేశీ ఉద్యమాలకు ప్రాధాన్యమిస్తూ పత్రికలు తమ పాత్ర నిర్వహించాయి. వాటితో బాటు భాషకు, విద్యకు, సాంస్కృతిక విలువలకూ పెద్దపీట వేశాయి. పత్రికలలో దిన, వార, పక్ష, మాస పత్రికలుగా ఎన్నో విభాగాలు ఉన్నా, దినపత్రికలకు ఉన్న ప్రచారం, ప్రాధాన్యం మిగిలిన వాటికి ఉండదు. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సమాచారంతో అవి కొనసాగడమే వాటికి ఆ ప్రత్యేకతను ఇచ్చింది. పత్రికలలో వచ్చే ఏ విషయమైనా ప్రామాణికమే అని ప్రజలు భావించే స్థితి ఉండేది. అందుకే, గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి జాతీయ నాయకులే కాకుండా టంగుటూరి ప్రకాశం వంటి ప్రాంతీయ నాయకులు కూడా పత్రికలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. స్వార్థ ప్రయోజనాలకు కాకుండా సామాజిక హితం కోసం విలువలకు కట్టుబడి పత్రికలు నడిపారు. మీడియా అంటే పత్రికలే అని ఆనాడు అందరూ భావించేవారు. అదే సత్యం కూడా. మొదట జాతీయ ఆంగ్ల పత్రికలకే ప్రాధాన్యం వుండేది. అక్షరాస్యులు తక్కువగా వున్న ఆ కాలంలో ఆంగ్ల పత్రికలు చదివేవారు అతి కొద్దిమంది మాత్రమే వుండేవారు. భాషా సమస్య వల్ల ఈ పరిస్థితి ఏర్పడడంతో ప్రాంతీయ భాషలు తెలిసిన వారి కోసం ఆయా రాష్ట్రాలలో ప్రత్యేకంగా పత్రికలు నడపడం ప్రారంభమైంది. ఇవి ప్రారంభమైన తొలినాళ్ళలో పాఠకులను విశేషంగా ఆకర్షించాయి. తెలుగు పత్రికల విషయానికి వస్తే ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ అనేవి తొలినాళ్ళలో బాగా పేరున్న పత్రికలు. పార్టీ పత్రికలుగా ‘విశాలాంధ్ర’, ‘ప్రజాశక్తి’ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. తర్వాత క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రభూమి’, ‘ఉదయం’, ‘ఈనాడు’,‘సాక్షి‘, ‘వార్త’, ‘సూర్య’ పత్రికలు రంగ ప్రవేశం చేశాయి. అయితే, రామోజీరావు నవ్య ఆలోచనా ధోరణులతో రూపుదిద్దుకున్న ‘ఈనాడు’ పత్రిక ప్రవేశంతో తెలుగునాట పత్రికా రంగంలో విశేష మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యాపార దృక్పథంతో జనాకర్షక విషయాలకు ‘ఈనాడు’ పెద్దపీట వేసింది. పెద్ద పత్రికతో బాటు అనుబంధంగా పిల్ల పత్రిక (ట్యాబ్లాయిడ్)ను తీసుకురావడం, పేజీల సంఖ్యను పెంచడం, కలర్ పేజీలతో, గ్రాఫిక్స్, ఫోటోషాప్ గిమ్మిక్కులతో ఆకర్షణీయంగా మలచడంతో పాఠకులను ఎంతో ఆకట్టుకుంది. అప్పటివరకు సాదాసీదాగా నడిచిన ఇతర దిన పత్రికలు కూడా అదే విధానం అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా చేయకుంటే వాటి మనుగడే ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏర్పడింది. నిర్వహణ భారం కూడా పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు పత్రికా రంగంలోకి కూడా ప్రవేశించారు. క్రమంగా ఈ రంగం వ్యాపార సంస్థ కోవలోకి వెళ్ళిపోయింది. అటు రాజకీయంగా జాతీయ పార్టీల ప్రభావం తగ్గి ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. పేపర్ ని ఆయుధంగా వాడుకుంటూ ప్రభుత్వాలనే మార్చగలిగే కొత్త పరిణామానికి ‘ఈనాడు’ బాటలు వేసింది. అనుకూల పార్టీలకు కొమ్ము కాయడమూ అలవడింది. పత్రికలను మేనేజ్ చేయగలిగితే చాలు ప్రజల్ని తమవైపు మలచుకుని అధికారం అందుకోవచ్చు అని పార్టీలకు తెలిసి వచ్చింది. ఈ తెలివిడి వచ్చాక ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఓ పత్రికను స్థాపించుకుని ప్రజలను మభ్యపెట్టే అంకానికి తెర తీశారు. ఒకప్పుడు ‘విశాలాంధ్ర’, ‘ప్రజాశక్తి’ పత్రికలు మాత్రమే పార్టీ కరపత్రాలుగా పేరుబడగా ఇప్పుడు అన్ని పత్రికలు ఏదో ఒక పార్టీకి కరపత్రాలుగా మారిపోయాయి.

పత్రికలకు సవాల్ విసురుతూ ఎలక్ట్రానిక్ మీడియా వీరవిహారం చేయడం ప్రారంభించింది. టీవీలలో ఛానల్స్ ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి. పేరున్న పత్రికాధిపతులు వారి పత్రికలకు అనుబంధంగా టీవీ ఛానల్స్ ని ప్రవేశపెట్టాయి. ఇదిలావుండగా స్మార్ట్ ఫోన్ల రాకతో సమాచార యవనికపై విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వాట్సప్ లు, యూట్యూబ్ లు, ఫేస్బుక్ లు, వెబ్ సైట్ లు ఇలా బహుముఖంగా సోషల్ మీడియా విస్తరించింది. ఒకప్పటిలాగా ఏ పత్రికనో, ఛానల్ నో నమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ భావాలను, సమాచారాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. వీటితో అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చినట్లు అయింది. వాటిల్లో విశ్వసనీయత ఎంత అనేది ఎవరికి వారు తమ అవగాహన మేరకు అర్థం చేసుకోవాల్సిందే. అయినా ఇప్పుడు పత్రికలైనా, ఛానల్స్ అయినా, సోషల్ మీడియా అయినా ఏదీ కూడా విశ్వసనీయతకు పట్టం కట్టేవి కావు. అందుకే వాటిని మన విజ్ఞత మేరకు ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే అనుకోవాలి. ఇటు టీవీ ప్రసారాలు, అటు సోషల్ మీడియా చెలరేగడంతో పత్రికల పరిస్థితి సంకటంలో పడ్డట్టైంది. పత్రికలు చదివే పాఠకులు గణనీయంగా తగ్గిపోయారు. సర్కులేషన్లు దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు పులి మీద పుట్రలా కరోనా విరుచుకుపడి చాలా వరకు పత్రికలు మూతపడే స్థితికి నెట్టింది. పరిస్థితులు కాస్త కుదుటపడిన తర్వాత కూడా కరోనా సాకుతో పెద్ద పత్రికలు కూడా సిబ్బందిని గణనీయంగా తగ్గించేశాయి. నామమాత్రపు సెటిల్మెంట్ లతో బయటకు పంపించేశాయి. ఏ కొద్దిమందితోనో పని కానిచ్చేస్తున్నాయి. కంప్యూటర్స్ వాడకం పెరగడంతో అతి తక్కువ సిబ్బందితో పని చేయించుకునే వెసులుబాటు కలిగింది. ఇది యాజమాన్యానికి అనుకూల పరిణామం. నలుగురి పని ఒక్కళ్ళతో లాగించేస్తున్నారు. దీనివల్ల పత్రికలోనూ నాణ్యత కొరవడింది. ఫీల్డ్ వర్క్ కు వెళ్ళే రిపోర్టర్లను కూడా బాగా తగ్గించేయడంతో జాతీయ, రాష్ట్రస్థాయి సభలు, సమావేశాలకు తప్ప ఓ స్థాయి కార్యక్రమాల కవరేజీకి రిపోర్టర్లు వెళ్ళడమే లేదు. ఆయా సభలు, సమావేశాల నిర్వాహకులే ఆన్ లైన్ లో వారి వార్తలను పంపితే వాటిని ప్రచురిస్తే ప్రచురిస్తారు, లేదంటే లేదు. పత్రికల్లో పనిచేసే సిబ్బంది ముఖ్యంగా ఎడిటోరియల్ సెక్షన్లు, రిపోర్టింగ్ సెక్షన్ వాళ్ళకి కూడా విషయ పరిజ్ఞానం వుండాల్సినంతగా వుండటం లేదు. ఏతావాతా పత్రికల మనుగడ ఉనికిని చాటుకోవడానికే అన్నట్లుగా మిగిలింది.

ఇంచుమించు పత్రికలన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో అవన్నీ ఆయా యాజమాన్యాల అనుకూల వైఖరికి మారిపోయాయి. ఆయా యాజమాన్యాలు వారి వారి అనుకూల పార్టీలకు కొమ్ము కాయడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే ఎడిటర్ తో సహా ఎడిటోరియల్ సిబ్బందికి గానీ, రిపోర్టర్లకు గానీ స్వతంత్రంగా వార్తలను, సమాచారాలను అందించే వీలు లేకుండా పోయింది. దీంతో ఏ పేపరు తీరు ఎలా వుందో అక్షర జ్ఞానం ఉన్న సామాన్య పాఠకుడు కూడా చెప్పగలడు. ఇప్పుడు చర్చించిన అవస్థలతో పాటు అంతర్గతంగా కూడా పత్రికల మధ్య వార్ ఫేర్ నడుస్తోంది. ఒక్కో పేపరు ఒక్కో పార్టీకి సొంత పత్రికగా మారడంతో వాటి రాతలతో అవి పరస్పరం ఒకదానిపై మరొకటి దూషణల పర్వానికి తెరతీశాయి. ఈ ధోరణి ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా వ్యాపించింది.

ఎన్నికల సమయంలో ‘పెయిడ్ న్యూస్’ అనే దుష్ట సంస్కృతికి బాటలు వేయడం, జాతీయ మీడియాలో కూడా స్కాముల పర్వం నెలకొనడం ఇవన్నీ కూడా పత్రికల పట్ల పాఠకుల్లో చులకన భావం ఏర్పడేలా చేశాయి. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే ఉన్న గౌరవం లేకపోగా వారిని గురించి తేలికగా మాట్లాడే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎలా వుందంటే

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు

శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య

స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గం

గా కూలంకష! పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్

అన్న భర్తృహరి సుభాషితంలో పేర్కొన్నట్లు పత్రికల ప్రస్థానం కూడా అంచెలంచెలుగా పతనావస్థకు చేరింది. పాఠకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోవడంతో పాటు తెలుగేరాని కొత్తతరం రావడంతో మున్ముందు పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతుంది. విదేశాల్లో మాదిరిగా ప్రజాక్షేత్రంలోకి పంపిణీ కాకుండా పరిమిత ప్రదేశాల్లో స్టాండుల్లో మాత్రమే కనిపించే రోజులు కూడా వస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.

పత్రికా రంగం ఇంతటి సంక్షోభంలో కూరుకుపోతున్నా బాధ్యతాయుతమైన సంబంధిత వ్యవస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదనేది సందేహాలకు తావిస్తోంది. జాతీయస్థాయిలో ‘ప్రెస్ కౌన్సిల్’, ‘ఐజెయు’ వంటి సంస్థలు, ప్రాంతీయంగా ప్రెస్ అకాడమీలు, జర్నలిస్టు సంఘాలు పత్రికారంగ ప్రక్షాళనకు, జర్నలిస్టుల స్థితిగతుల మెరుగునకు, కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి నిలబెట్టేందుకు పూనుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలు ఎంత విస్తరించినా, విజృంభించినా పాఠకులను భౌతికంగాను, మానసికంగాను దగ్గర చేయగల శక్తి పత్రికలకే వుంది. కాబట్టి పత్రికారంగాన్ని పది కాలాలపాటు కాపాడుకోవడానికి ఎవరి పరిధిలో వారు కృషి చేయాలి. “పత్రిక వొకటున్నా చాలు పదివేల బలగంబు” అన్న నార్ల వారి మాట నిజం చేయాలి. పత్రికలు వుండడమే కాదు అవి పాత్రికేయ విలువలను పాటించేవిగా, సామాజిక బాధ్యతను నెరవేర్చేవిగా వుండడం ఎంతో అవసరం, శ్రేయస్కరం.