“నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాటా వినిపించునీవేళా” అంటూ ఆరుద్ర గారు ఆనాడు రాసిన మధుర గీతం జానకమ్మని ఉద్దేశించే రాశారా అని అనిపించని తెలుగువారుంటారా? నిజంగా ఏ పూర్వ పుణ్యమో జానకమ్మ పొందుగా మారి శ్రోతల అంతరంగాలలో అపురూపంగా నిలిచిపోయింది. అందుకోజాలని ఆ ఆనందం ఎందుకో మనందరి హృదయాలకు చేరువై దూరమైపోయిందీనాడు… అట్టి ఆపాత మధురాన్ని ఆత్మీయమైన ఉరకలెత్తే జానకమ్మ స్వరంలో వింటుంటే చెమర్చని కళ్ళు, ద్రవించని హృదయం ఉండవనటంలో అతిశయోక్తి లేదు.
అదేమిటో విచిత్రం! తెలుగులో జానకమ్మ పాడిన తొలి పాట 1957లో విడుదలైన ఎంఎల్ఏ చిత్రంలోని “నీ ఆశా… అడియాసా… చేజారే మణిపూస” నుంచి ఆవిడ ఏ భాషలో పాడిన తొలిపాటైనా విషాదగీతమే కావటం ‘యాదృచ్ఛికమేనా?’ అన్న అనుమానం కలిగిస్తుంది. తొలి పాట పాడిన మొట్టమొదటి సంవత్సరంలోనే 100కి పైగా పాటలు పాడటం ఒక్క జానకమ్మకే చెల్లింది.
ఆమె కేవలం ఒక్క గాయని మాత్రమే కాదు. తన గానంతో కోట్లాది శ్రోతల గుండెల్లో అనేక భావోద్వేగాలకు ప్రాణం పోసిన మనీషి. ప్రేమ, విషాదం, మాతృత్వం, జానపదం, శృంగారం, అల్లరి…ఇలా ప్రతి భావానికి జీవం పోసిన గంధర్వగాయని జానకమ్మ.
తన గాత్రంతో పాత్ర స్వభావానికి ప్రాణం పోసి, రచయిత రాసిన దానికి అర్థవంతమైన భావ ప్రకటన చేయడానికి గొంతుని రకరకాలుగా మార్చి, సంగీత దర్శకుడు కోరుకున్న దానికి పదింతలు గొప్పగా రాగాన్ని, సంగతులను మేళవించి, పాత్ర స్వరూప స్వభావాలకు అనుగుణంగా తనకున్న మిమిక్రీ విద్యని మిక్స్ చేసి మొత్తంగా పాటకు పరిపూర్ణ న్యాయం చేసి సంగీత ప్రపంచాన్ని తన గాన మాధుర్యంలో ఓలలాడించిన గాన సరస్వతి మన జానకమ్మ.
మచ్చుకి కొన్ని పాటలు పరిశీలిద్దాం.
“పదహారేళ్ళ వయసు” చిత్రంలోని ‘కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే’ పాటలోనూ; “శ్రీవారి శోభనం” చిత్రంలోని ‘అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరింకా’ పాటలోనూ పండు ముసలమ్మ గొంతుని అద్భుతంగా పలికించడం; “సప్తపది” చిత్రంలోని ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పాటలోనూ; “స్వాతిముత్యం” చిత్రంలోని ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ పాటలోనూ పసివాడి గొంతుతో పాటు, పెద్ద వాళ్ల గొంతును ఏకకాలంలో మార్చడం వంటివి ఆమె గొంతులోని వైవిధ్యానికి తార్కాణాలు.
ఇంకా “మేఘమా దేహమా” పాటలో ఆమె గొంతులో పలికిన ఆర్ద్రత; “ఆకాశం ఏనాటిదో”, “అరె ఏమైందీ… ఒక మనసుకు” పాటల్లో పలికించిన ప్రేమతత్వంలోని జీవం; “వెన్నెల్లో గోదారి అందం”, “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో” వంటి పాటల్లో ఆమె గళంలో పలికించిన ఆవేదన; “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” లాంటి పాటల్లో ఆ గొంతులోని అల్లరీ; “కళ్ళలో ఉన్న నీరూ కన్నులకే తెలుసు” లాంటి పాటల్లో వినిపించిన విషాదం; “ఇందువదన కుందరదన”, “సందెపొద్దుల కాడ” లాంటి పాటల్లో ఉరకలెత్తిన పరువపు ప్రవాహం; ఇంక “సిరిమల్లె పువ్వల్లె నవ్వు”, “నవ్వింది మల్లెచెండూ” లాంటి పాటల్లోని హాయైన నవ్వుల దొంతరలు, కిలకిలలు, గలగలలు…, ఇలా రాసుకుంటూ పోతే ఈ ప్రవాహానికి అంత ఉంటుందా?
10 నందులు, అనేక జాతీయ అవార్డులు జానకమ్మని అలంకరించి వాటి గౌరవాన్ని నిలబెట్టుకున్నాయి. ఆలస్యంగా వచ్చిన "పద్మభూషణ్"ని స్వల్పంగా భావించి తృణప్రాయంగా తిరస్కరించిన ఘనమైన వ్యక్తిత్వం ఆ మహానుభావురాలిది. లోకంలో ఎంతమందికి ఇది సాధ్యమవుతుంది?
ఫన్ డాక్టర్ చంద్రశేఖరం వంటి గొప్ప వ్యక్తికి కోడలై, భర్త రాంప్రసాద్ ని దైవంగా భావించి, గొప్ప దాంపత్య జీవితాన్ని అనుభవించి భర్త మరణానంతరం ధవళ వస్త్రాలను మాత్రమే ధరించి రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టుని ముచ్చటైన విబూది రేఖలుగా మార్చుకొని కొడుకు మురళీకృష్ణ మరణంతో కృంగిపోయి, ఆరు నెలలు తిరగకుండా కొడుకుని వెతుక్కుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన జానకమ్మ జీవితంలో ఏనాడూ అతిశయాన్ని, అహంభావాన్ని ప్రదర్శించిన క్షణం లేదు. అణకువ, ఒద్దికలకి నిలువెత్తు రూపం మన జానకమ్మ.
ఎప్పుడు పుట్టినా, ఎక్కడ పుట్టినా ప్రజల హృదయాల్లో జానకమ్మ చిరంజీవి. ఈ ఏప్రిల్ 23, జూలై 11 లు జయంతులు, వర్ధంతులు జరుపుకుని మరోసారి ఆ మహాతల్లిని స్మరించుకునే తేదీలే తప్ప ఇటువంటి మహామనీషులకి జరామరణాలు ఎప్పటికీ ఉండవు.
పగలే వెన్నెల కురిపించి జగాన్ని ఊయలలూపావు…
కదిలించావు మా మదిలో ఎన్నెన్నో కథలు…
ఇకపై చిగురులు ముట్టదా చిన్నారి కోయిల?
చిలుక ఊగదా కొమ్మ ఊయల??
కాదు కాదు… లేదు లేదు…
సిరిమల్లె పువ్వల్లె నువ్వు… చిన్నారి పాపల్లె నీ నవ్వు
చిరకాలముంటావు… చిగురిస్తు ఉంటావు మా నువ్వు…

