పాటభావం, సన్నివేశం, నటి స్వర స్థాయిని దృష్టిలో పెట్టుకొని వాయిద్యాల గమనానికి తగినట్టుగా కొత్త కొత్త మెళకువలను పలికించే ఇద్దరు సమకాలీన గాయనీమణులు పి. సుశీల, ఎస్. జానకి. వీరిద్దరిలో శిష్ట్లా జానకిదే పైచేయి అనేందుకు సుశీలమ్మ అనుభవమే నిదర్శనం. సావిత్రి, జెమినీ గణేశన్ నటించిన ‘కొంజాం సలంగై’ చిత్రంలోని ‘సింగార వేలదె దేవా…’ పాట (తెలుగులో ‘మురిపించే మువ్వలు’ చిత్రంలోని నీ లీల పాడెద దేవా…) సన్నాయికి దీటుగా నిలిచింది. మొదట అనుకున్న ప్రకారం, ఈ పాటను సుశీల పాడవలసి ఉంది. నాదస్వరంతో సమాంతరంగా పాడడం ఆమెకు కొంత అసౌకర్యంగా అనిపించిందట. దాంతో అవకాశం జానకిని వరించగా, ఆమె తన గాత్రంతో ఆ గీతాన్ని చిరస్మరణీయం చేశారు. నేటికి దక్షిణాది భాషా టీవీ ఛానల్స్ నిర్వహించే సంగీత సంబంధిత కార్యక్రమాల్లో ఔత్సాహిక గాయనీ గాయకులు దీనిని ఆలపించడాన్ని గమనించవచ్చు. నాదస్వరం, షహనాయ్, వయోలిన్ వాద్యాలతో దీటుగా పాడగలిగిన దేశంలోనే ఏకైక గాయనిగా జానకి మన్ననలు అందుకున్నారు. దీని అనువాద చిత్రం సావిత్రికి నూరో చిత్రం. దక్షిణ భారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి పూర్తిస్థాయి టెక్నికలర్ సినిమా.

ఎలాంటి పాటనైనా పాడగలరన్న నమ్మకం కలిగించిన గాయని ఆమె. సంగీత దర్శకులు చేసిన విన్యాసాలను ఆకళింపు చేసుకొని పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. తెలుగులో మొదటి పాటగా ‘నీ ఆశ అడియాశ…నీదారే మణిపూస’ (ఎం.ఎల్.ఎ. 1957) పాటతో ఘంటసాలతో గొంతు కలిపిన ఆమె పి.బి. శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఇతర భాషా గాయకులతోనూ స్వరాన్ని పంచుకొన్నారు. అలనాటి హాస్యనటుడు రాజబాబుతో పాడిన ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా…’ (ఇల్లు ఇల్లాలు) హాస్య గీతం విశేషంగా అలరించింది. జానకి పాటల్లో ధ్వన్యనుకరణను మేళవించి పాడి శ్రోతలను అలరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్మం ఆమె బాటనే అనుసరించారని అనిపిస్తుంది.

‘లతామంగేష్కర్, పి.లీల, పి.సుశీల,జిక్కి పాడిన పాటలను సంగీత విభావరుల్లో ఆలపించిన నేను పలు భాషల్లో ఇన్ని వేల పాటలు పాడతానని, పాడగలనని ఊహించలేదు. అంతా త్యాగరాజు, రాఘవేంద్రస్వామి దయ. సంగీత దర్శకుల నమ్మకం, శ్రోతల ఆదరణ’ అని చెప్పేవారు. గాయనీమణులు రావు బాల సరస్వతి, లీల, జిక్కి, కె.రాణి, ఏపీ కోమల…నేపథ్యగానంలో ఒకరి తరువాత ఒకరు వెనుకబడుతుండగా, పి.సుశీలతో సమాంతరంగా నిలదొక్కుకున్న గాయనిగా జానకి (అయిదేళ్ల ఆలస్యంగా ప్రవేశించి) ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా 1980వ దశకంలో నేపథ్యగానంలో వస్తున్న మార్పులు, నాయికల హావభావాలకు అనుగుణంగా గళాన్ని సిద్ధపరచుకున్నారు.

ఒక పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని సహజంగా చెప్పేమాట. అందుకు భిన్నంగా తమ ఉన్నతి వెనుక జీవిత భాగస్వామి చేయూత ఉందని చెప్పుకొనే అరుదైన వారిలో ఎస్.జానకి ఒకరు. తాను నేపథ్య గాయని కావడానికి మామగారు ఫన్ (విచిత్ర వేషధారి) డాక్టర్ చంద్రశేఖరం, భర్త రాంప్రసాద్ గార్లని చెప్పేవారు. వేదికపై గాంధీ, నెహ్రూ, జాకీర్ హుస్సేన్ తదితరులను అనుకరించే చంద్రశేఖరం ఒకటి, రెండు నిమిషాల్లోనే ఆహార్యం మార్చుకొని వచ్చేవారు. ఈ వ్యవధిలో జానకి పాటలు పాడేవారు. ఆమె ప్రతిభను గుర్తించిన భర్త, మామగార్ల ప్రోత్సాహంతో మద్రాసుకు మకాం మార్చి, రెండు తమిళ సినిమాలకు పాడారు. ఆ వెంటనే దర్శక నిర్మాత కే.బీ. తిలక్ ‘అనుపమ పిక్చర్స్’ పతాకంపై నిర్మించిన ‘ఎం.ఎల్.ఎ’లో అవకాశం వచ్చింది. మొదటి పాటే అగ్రగాయకుడు ఘంటసాలతో పాడడాన్ని అదృష్టంగా భావించారు. తొలి గీతమే విషాదభరితం అయినప్పటికీ ఆమె నేపథ్య సంగీతానికి అదే గట్టి పునాది వేసింది.

వేలాది పాటలు పాడిన ఆమెకు అత్యధికం ఇష్టమైనవే. కానీ ‘బంగారు పంజరం’లో తాను మిగతా పాటలు పాడినా ‘పదములు చాలును రామా’ అనే ఒక్క గీతాన్ని పాడలేక పోవడాన్ని లోటుగానే భావించేవారు. దానిని పాడిన గాయని ఏపీ కోమలిని ఎంతో మెచ్చుకొనేవారు.

త్యాగరాజస్వామి పట్ల గల ఆరాధనతో ఆయన కృతులను ‘నాదప్రవాహం’ పేరుతో క్యాసెట్లుగా తెచ్చారు. కృష్ణ భక్తురాలైన ఆమె, మీరాపై భక్తి గీతాల క్యాసెట్లు విడుదల చేశారు. తమ అక్క కుమారుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు (దివంగత) గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌తో కలసి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఇతరత్రా అనేక పురస్కారాలు స్వీకరించిన జానకి కేంద్ర ప్రభుత్వ పురస్కారం ‘పద్మ భూషణ్’ను తిరస్కరించారు.

ఆరు తరాల కథా నాయికులకు పాడిన గాయనిగా రికార్డు నమోదు చేసుకున్నారు. నేపథ్యగాన రంగంలో సుదీర్ఘ ప్రస్థానంలో ప్రతి పాటను సవాల్‌గా స్వీకరించి, వేలాది గీతాలు ఆలపించి మెప్పించిన జానకి, ఇక మీదట సినిమాల్లోను, సంగీత విభావరుల్లోనూ పాడనని దశాబ్దం క్రితం ప్రకటించారు (సాంస్కృతి కార్యక్రమాల్లో మాత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో, వర్ధమాన గాయనులతో గొంతు కలిపేవారు). కానీ మలయాళ నిర్మాత, దర్శకుల విన్నపం మేరకు రెండేళ్ల తరువాత (2018) ‘పతినాన్నమ’ సినిమాకు పాడారు.

జానకి ఏ భాషలో పాడినా ఆ భాషీయులు ఆమెను ‘తమ’ మనిషిగా భావించే వారు. ‘ఒక తమిళ ప్రేమికురాలిగా, మా జీవితాలతో మమేకమైన పాటల రాణివైన నీకు మరణమా?’ అన్న తమిళ సినీ రచయిత వైరిముత్తు నివాళి అందుకు మచ్చు తునక. కంటి రెప్పలా కాచిన జీవిత భాగస్వామి సుమారు దశాబ్దాల క్రితం కనుమరుగైతే తట్టుకున్న ఆమె గుండె, ఆరు నెలల క్రితం కుమారుడిని (మురళీకృష్ణ)ను కోల్పోయి బలహీనపడింది. ఎంతో మానసిక వేదన చెందారు. దానికి వృద్ధాప్య సమస్యలు తోడుకావడంతో 88వ ఏట (జులై 11,2026) సంగీత గగనానికి చేరుకున్నారు.