“ ఒకసారి ఇటొచ్చి ఉల్లిపాయలైనా తరిగిస్తావా ? ఎంతసేపలా ఫోను పట్టుకు కూర్చుంటావ్ ?” అన్నాడు రాజేష్ ఉల్లి తాలూకు కళ్ళ నీళ్ళు మోచేతితో తుడుచుకుంటూ.
“బాబోయ్! ఆ ఉల్లిపాయలు తరగడం మాత్రం నాకు పెట్టకండి. జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు కానీ ఆ వెధవ ఉల్లిపాయలు మాత్రం ఏడిపించి పారేస్తాయి. అది సరే, ఫోన్ చూస్తూ కూర్చున్నానంటున్నారు! మీ సుపుత్రుడిని స్కూల్ దగ్గర దించి ఇప్పుడే వచ్చాను. వాడిని తీసుకురావడం, హోంవర్క్ చేయించడం, రోజంతా నా పనులు నాకూ ఉంటాయి. కాస్త వంటలో సాయం చేస్తే మీ చేతులేమీ అరిగిపోవులెండి…” అంది చిత్ర అభ్యర్థనగా.
“వారంలో ఐదు రోజులు ఆఫీసు పని. శని, ఆదివారాలైనా కాస్త ఆలస్యంగా పడుకుందామనుకుంటే వంటగదే నా ఆఫీసుగా మారిపోయింది. నీ వంట నచ్చలేదని ఒక్కసారి అన్నానని వంటింటినంతా నాకప్పగించడం న్యాయమా? అసలు పెళ్లినాడు అగ్ని చుట్టూ తిరుగుతూ చేయించే ప్రమాణాల్లో ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, వంటేచతో పాటు ” నాతిచరామి”ని చేర్చడం మర్చిపోయారేమో!” అన్నాడు రాజేష్ ముక్కు ఎగపీలుస్తూ.
“ఈ గొడవ రోజూ ఉండేదేగా! చూస్తుంటే ఈరోజు ఆఫీసుకెళ్లే ఉద్దేశమే కనిపించడం లేదు?” అంది చిత్ర.
“ఎక్కడ ఆఫీసూ నా మొహం! రోజూ ఇలాగే వంటలు చేస్తూ కూర్చుంటే ఉద్యోగం పోయి ఇంట్లోనూ, బయటా వంటలు చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. ఈ రోజుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను. కానీ రేపటి నుంచైనా నువ్వే వండాలి. ఎంత చండాలంగా ఉన్నా తినేయడం అలవాటు చేసుకుంటాను…” అన్నాడు రాజేష్.
“అబ్బా! ఎంత ఆశ? మీ వంటకు నేను పూర్తిగా అడిక్ట్ అయిపోయాను. కొత్త బాధ్యతలు పెట్టకండి. మన అబ్బాయి ఇంకొంచెం పెద్దవాడయ్యే వరకు నన్ను కాస్త ఫ్రీగా వదిలేయండి. అన్నట్టు మీ ఆఫీసు క్యాంటీన్‌లో భోజనం చాలా బాగుంటుందని చెప్పారుగా! ఉదయం నన్ను లేపి బాధ పెట్టడం కంటే మీరు అక్కడే తినేస్తే డబ్బూ మిగులుతుంది, పనీ తగ్గుతుంది. నాకూ, చంటాడికీ ఏదో ఒకటి చేసుకుని తినేస్తాం. పైగా వాడికి నా వంట బాగోలేదని చెప్పే వయసూ ఇంకా రాలేదు కదా!” అంది చిత్ర నవ్వుతూ.
“ప్రతిదానికీ ఒక జవాబు నీ దగ్గర రెడీగా ఉంటుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే భర్తలు వంటలో సాయం చేయడం చూశాం. కానీ నువ్వు ఇంట్లోనే ఉంటూ కూడా ఇలా బాధ్యతను పూర్తిగా పక్కన పెట్టేయడం నాకు నచ్చడం లేదు…” అని చెప్పి ఆఫీసు నుంచి వచ్చిన ఫోన్ ఎత్తుకుంటూ వెళ్లిపోయాడు.
గంట తర్వాత చిత్ర ఉన్న గదిలోకి వచ్చాడు రాజేష్.
“ఇంకో ముప్పావు గంటలో మీటింగ్ ఉంది. అప్పటివరకు రిలాక్స్ అవుదాం. ఇందాక మనం ఎక్కడ ఆపామో గుర్తుందా? నీకు నా వంటలు బాగా అలవాటైపోయాయి. కానీ నిజం చెప్పాలంటే, ఒకసారి నువ్వు చేసిన కూర తినకుండానే నేను చేతులు కడిగేసి వెళ్లిపోయినప్పటి నుంచి నువ్వు భయపడి వంటింటినే నాకు అప్పగించేశావు. పట్టుదలగా నేర్చుకోవాలన్న ఆలోచన నీకు రాలేదు.
మా అమ్మ ఏ లోకంలో ఉందో కానీ, మా ఇంట్లో అందరికీ రుచికరమైన వంటలు చేయడం నేర్పేసి వెళ్లిపోయింది. ఆవిడ మన పెళ్లైన రెండేళ్లకే పోకపోయి ఉంటే నీకు కూడా నేర్పి ఉండేది. అసలు ఇన్ని వంటలు నేను ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలన్న ఆసక్తి నీకు ఎప్పుడూ కలగలేదా?”
రాజేష్ మాటలు చిత్రను కాసేపు మౌనంలోకి నెట్టాయి. నిజమే. అతడు ఎప్పుడూ గొడవపడలేదు. తన కోసం ఇష్టంగా వంట చేశాడు. కానీ తాను మాత్రం అతని మంచితనాన్ని సుఖపడడానికి మార్చుకుందేమో అనిపించింది. ఆ ఆలోచన మొదటిసారి ఆమె మనసులో చిన్న పశ్చాత్తాపాన్ని రేకెత్తించింది.
అయితే బయటకు మాత్రం అలా చెప్పలేదు.
“ఎన్నిసార్లు చెప్పాలి? మా ఇంట్లో ఎవరికీ వంటల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. పల్చటి చారు, ఏదో ఒక పచ్చడితో భోజనం ముగించేస్తాము. మీ ఇంట్లో మాత్రం పొద్దున్నే భోజనం చేస్తూ రాత్రి మెనూ గురించి మాట్లాడుకుంటారు. ఏ హోటల్‌లో టిఫిన్ బాగుంటుందో, ఎక్కడ కొత్త హోటల్ తెరిచారో చర్చించుకుంటూ ఉంటారు. జీవితం అంటే కేవలం తిండేనా?
సరే, ఇక ఈ గొడవ ఎందుకు? రేపటి నుంచీ నాకు మీరు వండక్కర్లేదు. నాకూ, నా కొడుక్కూ ఏదో ఒకటి చేసుకుని తినేస్తాం. మీ మీటింగ్‌కి టైమ్ అయింది. నాకు కూడా గ్రూపులో అడ్మిన్‌గా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకో పది నిమిషాల్లో వీడియో కాల్ చేస్తారు…” అంటూ లేచి వెళ్లిపోయింది.
ఆ రోజు రాజేష్ , చిత్రలు నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధమవుతున్నారు.
“అవునోయ్ . నీతో చెప్పడం మర్చిపోయాను . అప్పుడెప్పుడో మీ అమ్మా, నాన్నగారు మన వూరు వస్తానని ప్లాన్ చేసుకోవడం, అది కుదరక పోవడం ,అందుకు నువ్వు గంటల కొద్దీ వీడియో ఛాట్లో గగ్గోలు పెట్టడం చూశాక నువ్వు ఎక్కడ బెంగ పెట్టుకుని పోతున్నావో అని ఈ సారి వాళ్ళు వాళ్ళ ఇతర ప్రోగ్రాములన్నీ రద్దు చేసుకుని మనింటికి వచ్చేయడానికి సిద్ధమైనట్టు ఫోన్ చేసి చెప్పాడు మీ నాన్న. అయితే నా ఆందోళన అంతా ఒకటే . వాళ్ళ కళ్ళ ముందు నేను వంటగదిలో పనిచేస్తుంటే ఏం బాగుంటుంది ? అలా అని హోటల్ నుండి భోజనం తెప్పిస్తే బాగోదు. ఏం చేద్దాం అంటావ్ ?” అంటూ భార్యను బలవంతాన రెక్క పట్టుకుని కుదిపేసి కూర్చునేటట్టు చేసాడు.
తల్లితండ్రులు వస్తున్నారు అన్న వార్త వినగానే చిత్ర ఎక్కడ నిద్ర అక్కడ ఎగిరిపోయింది.
“వస్తున్నారా ? చాలా మంచి వార్త చెప్పారండీ.? మా వాళ్ళను కించపరచాలని నాకు ఉద్దేశ్యం లేదు కానీ వాళ్ళు ఏది ఉంటే అదే తినేస్తారు. అసలు మా అమ్మ తనే వంటింట్లో దూరి తనకు చేతనైన పద్ధతిలో చేస్తుంది. ఆ వంట తంటా మీకూ ఉండదు. నాకూ ఉండదు. ఇక మీరు నిశ్చింతగా పడుకోండి …” అంది చిత్ర విచిత్రమైన భావోద్వేగానికి గురవుతూ.
ఆ రోజు చిత్ర తల్లిదండ్రులు వచ్చారు. చిత్ర రాజేష్ ను వంటగదిలోకి వెళ్ళనీయకుండా చూసుకుంది . తన మామగారు, అత్తగార్లతో పాటు ఈ రోజు చారు, బజారునుండి తెచ్చిన పచ్చళ్లతో భోజనం తప్పదు అనుకున్నాడు రాజేష్.
ఒక గంటలో చిత్ర విచిత్రంగా టేబుల్ మీద అందరికీ ప్లేట్లు పెట్టి కూరలు వడ్డిస్తూ ఉంటే రాజేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. భోజనాలయ్యాక “వంటలు అద్భుతంగా ఉన్నాయమ్మా. ఇంత రుచిగా ఈ మధ్య కాలంలో మేము ఎక్కడా తినలేదు …” అంటూ వేళ్ళు నాక్కుంటూ గర్వంగా కూతురి మొహంలోకి చూసి అన్నాడు చిత్ర తండ్రి సుబ్బారావు.
ఆ రోజు రాత్రి భార్యను పక్కకు పిలిచి అడిగాడు రాజేష్ “ఏమిటి నువ్వేనా ఆ వంటలు చేసినది అని నా కనిపిస్తోంది. మీ అమ్మ కూడా వంటింట్లో సాయం చేసినట్టు కనిపించలేదు. . ఎలా మేనేజ్ చేశావో నిజంగా నేను నమ్మలేకపోతున్నాను…” అన్నాడు విస్మయంగా చూస్తూ.
“ ఏం అనుమానమా ! హండ్రెడ్ పర్సెంట్ నేనే చేశాను. . ఇన్నాళ్ల నుండి మీరు వంటలు చేస్తూ ఉంటే కూర్చుని తినడమే తప్ప నేను నేర్చుకోలేదు అని ఎలా అనుకున్నారు? చాలాకాలం నుంచి యూట్యూబ్లో ఆయనెవరో పళని స్వామి గారి వంటలు ఒక అరగంటసేపు చూడటం మొదలు పెట్టాను. ఆ విషయం చెపితే నన్ను మీరు బలవంతంగా వంట చేయిస్తారని చెప్పలేదు. నాకు కూడా చాలా మంది లాగానే మహా ఒళ్ళు బద్దకం . పూర్వం అంత దరిద్రంగా నా వంటలు ఉండవు లెండి. రేపటినుండి ఇక మీరు రెస్ట్ తీసుకోండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధపెట్టాను. … “ అంటూంటే ఆమె చెంపల మీద నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జలజలా రాలాయి.
“అబ్బా. ఎంత మంచి వార్త చెప్పావ్ ? నాకది చాలు. అనుకోకుండా ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నాకు ఆఫీసు పని ఎక్కువగా ఉన్నప్పుడు , బద్ధకం అనిపించినప్పుడు వంట నువ్వే చెయ్యి. ఇప్పటికిప్పుడు హైరానా పడాల్సిన అవసరం లేదు. పిల్లాడిని స్కూలుకు తీసుకెళ్లడం, తీసుకురావడం, హోం వర్క్ చేయించడం లాంటి బాధ్యతలు నీకెలాగూ ఉన్నాయి. ఇంట్లో ఉదయం పదిగంటల వరకు నేను ప్రత్యేకంగా విరగపడేది ఏముంది ? పైగా నాకు కావలసిన పద్ధతిలో అన్ని రుచులను చేసుకోగలుగుతున్నాను. వాటిని చక్కగా నువ్వూ ఆస్వాదిస్తూ తింటున్నావు. నీకు ఖాళీ వుంటే కూరలు తరిగిపెట్టడం, అన్నం వండటం మాత్రం చెయ్యి చాలు…వీలైతే నేను చేస్తున్నప్పుడు నన్ను ఫాలో అవ్వు. మధ్య మధ్యలో వంటలు నేర్చుకోమని నిన్ను కవ్విస్తూ నేను మాట్లాడిన మాటలను నువ్వు సీరియస్ గా తీసుకోకు. కొన్నాళ్ళు ఇలాగే కానియ్యి తర్వాత చూద్దాం. మన ఇద్దరిలో ఎవరు ఒకరి బాధ్యతను మరొకరు మోసినా అది మన ఇంటి కోసమే కదా. ఇందులో నామోషీ పడవలసింది ఏముంది?” అన్నాడు రాజేష్ ఆత్మవిశ్వాసంతో .
భర్త మాటల్లోని నిజాయితీకి ఆమె మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. అప్పటివరకు ఆమెలో ఎక్కడో పేరుకుపోయిన అభద్రతాభావం అతని మాటలతో పటాపంచలయ్యింది. ఇప్పుడు వారి మధ్య ఎటువంటి అపోహలు లేవు.
“లేదండీ. నాకు ఒక పక్క పిల్లాడి బాధ్యత ఉన్నా కూడా, ఏమాత్రం సమయం దొరికినా సమయాన్ని వంట కోసం కేటాయిస్తాను. మీరు ఆఫీసులో ప్రశాంతంగా పనిచేసుకోవడానికి మీ సహధర్మచారిణిగా నా వంతు కర్తవ్యాన్ని నేను పాటిస్తాను. మీ మంచితనంతో నాకు నా బాధ్యత గుర్తు వచ్చేటట్టు చేసారు. ఇక నా జీవితంలో మిమ్మల్ని పొరపాటున కూడా బాధపెట్ట దల్చుకోలేదు. మీది సముద్రమంత పెద్ద మనసు. దాన్ని నా స్వార్థానికి, బలహీనతకు వాడుకోదల్చుకోలేదు” అంటూంటే గుండెల్లోనుండి తన్నుకువస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ అతని భుజాలమీద అనునయంగా వాలిపోయింది

