ఇది స్కూల్ రోజుల్లో జరిగిన సంఘటనేమో అనుకుంటారేమో… కాదు. ముమ్మాటికీ కాదు. అదొక ఊహకందని శిక్ష.

నా ఉద్యోగ జీవితంలో నాతో చూచి రాత రాయించడానికి ఓ మాసపత్రిక యజమాని విధించిన శిక్ష. ఆ పిల్లల మాసపత్రిక పేరు బాలానందం. ఇది ఓ నలభై ఎనిమిదేళ్ళ క్రితం నాటి మాట.

మద్రాసులో కోడంబాక్కం రైల్వే స్టేషన్ సమీపంలో పద్మనాభ పిళ్ళయ్ అనే పేరుతో ఒక వీధి ఉంది. ఆ వీధిలో ఈ పిల్లల మాసపత్రిక ఉండేది. అక్కడ పని చేసింది స్వల్పకాలమే. సర్క్యులేషన్ చూసేవాడిని. ఆ పత్రికకు సంపాదకులు వడ్డాది బుచ్చి కూర్మనాథం గారు.

ప్రతీ నెల మాసపత్రిక తయారయ్యే ముందు ఏజెంట్లకు పోస్ట్ కార్డులు రాయాలి. సంచిక తయారైంది, మీ ఆర్డర్ తెలియజేయమని కోరుతూ ఓ మూడు వందల యాభైకి పైగానే ఉత్తరాలు రాయడం, ఏజెంట్ల నుంచి ఆర్డర్ అందుకున్న ప్రకారం కాపీలు పంపడం నా విధి నిర్వహణలో భాగం. అయితే ఓ నెల ఓ పది పదిహేను పోస్టుకార్డులు కుదురుగా రాసిన తర్వాత చేతి రాత దెబ్బతిని అక్షరాలు చెదిరిపోయేవి. చూడ్డానికి ఓ మోస్తరుగా ఉండేది దస్తూరి. ఆ దస్తూరీ చూసి యజమాని రంగారావు గారికి చిర్రెత్తుకొచ్చి పోస్టుకార్డులు అన్నింటినీ విసిరేసి కస్సుబుస్సులాడారు. ఇంతలో మధ్యాహ్నాం కావడంతో భోజనం చేసి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. అన్నం తినేసి మళ్ళీ ఆఫీసుకి వచ్చేసరికి నేను కూర్చునే టేబుల్ మీద తెలుగు చూచి రాత పుస్తకం ఉంది. నన్ను చూడటంతోనే రంగారావు గారి అమ్మాయి వచ్చి “నాన్నగారు మిమ్మల్ని చూచి రాత రాయమన్నారు అండి. మీ చేతిరాత నచ్చలేదన్నారు” అని చెప్పింది.

మరో దారి లేక చూచిరాత ఒక పేజీ పూర్తి చేసేసరికి ఎడిటర్ బుచ్చి కూర్మనాథం గారు వచ్చారు. ఆయన సీటు నా ఎదుటే ఉండేది.

నేను చూచి రాత రాయడం చూసి “ఏంటండీ? ఇది పాటశాలా చూచి రాత రాయడానికి. రాయకండి. ఆపండి. మరేవైనా పనులుంటే చేసుకోండి. రంగారావు గారికి నేను చెపుతానులెండి” అన్నట్లే బయటి నుంచి వచ్చిన రంగారావుగారితో మాట్లాడి నాకు శిక్ష తప్పించారు.

ఇంతకూ ఈ వడ్డాది బుచ్చి కూర్మనాథం మరెవరో కాదు…ఒకప్పుడు సినీ రచయిత.

ఎవరాస్త్రీ? అనేది కె.శంకర్ దర్శకత్వంలో 1966, మార్చి 26న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1958లో విడుదలైన అమెరికన్ సైకో థ్రిల్లర్ సినిమా వర్టిగో ఆధారంగా నిర్మించిన కలంగరై విలక్కం అనే తమిళ సినిమా దీనికి మూలం. ఇందులో పాటలన్నీ ఆయన రాసినవే.

అలాగే 1966లో విడుదలైన ‘పాదుకా పట్టాభిషేకా’నికీ ఆయన మాటలూ, పాటలూ రాశారు.

తెలుగు సినీ చరిత్రలో ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమా మొదటిసారిగా 1932లో నిర్మించారు. ఈ చిత్రంలో సురభి కమలాబాయి, అద్దంకి శ్రీరామమూర్తి ప్రధాన పాత్రలు పోషించారు. మరో పదమూడేళ్ళకు అనగా 1945లో శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై కడారు నాగభూషణం, ‘పాదుకా పట్టాభిషేకం’ చిత్రం రూపొందించారు. పుష్పవల్లి, సి.యస్‌.ఆర్., కన్నాంబ, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఆ తరువాత వసంత కుమార్‌రెడ్డి దర్శకత్వంలో 1966లో పాదుకా పట్టాభిషేకం మళ్ళీ తీసారు. వడ్డాదిగా పేరుపొందిన రచయిత బుచ్చి కూర్మనాథం ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. వాల్మికి రామాయణం ఆధారంగా ఈ చిత్రం తీశారు. ఈ చిత్రంలో సందర్భోచిత పద్యాలను ఘంటసాల, రాఘవులు, పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి ఆలపించారు.

కొంత కాలానికే ఇద్దరం బాలానందంలో ఉద్యోగాలు మానేసాం.

కొన్ని రోజుల తర్వాత నేను మద్రాసు ఆళ్వారుపేటలో శిల్పి దుకాణంలో అసిస్టెంటుగా చేరాను రెండు వందల యాభై రూపాయల జీతానికి. ఇక్కడ మధ్యాహ్నం మ భోజనాలు కానిచ్చుకుని తలుపులన్నీ మూసేసి ఓ రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకునేవాళ్ళం. ఆ సమయంలో షాపులో గ్రామ్ ఫోన్ రికార్డులు పెట్టుకుని పాటలు వినేవాళ్ళం. ఆ పాటలలో “చల్లని రాజా ఓ చందమామా…” ఒకటి.

ఆ తర్వాత చాలాకాలానికి బుచ్చి కూర్మనాథం గారిని హైదరాబాదులో ప్రముఖ పాత్రికేయులు జి. కృష్ణ గారి ఇంట్లో కలిశాను. ఆయనకు మా నాన్నగారు కూడా ఎరుకే.

ఆయన చాలా చాలా నిదానస్తులు. నెమ్మదిగా మాట్లాడేవారు. నుదుట తిలకం పెట్టుకునేవారు. ఖద్దరు లాల్చీ వేసుకునేవారు. మాటల మధ్యలో జోకులు వేసేవారు. విజయనగరానికి చెందిన వడ్డాదిగారు 1950 దశకంలో సినీ పరిశ్రమకి వచ్చారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలలో ఆయన పేరు కె. వడ్డాది అని వేశారు.