“కత్తి కన్నా కలం పదునైనది” అనే నానుడి సుప్రసిద్ధం. చాలా మంది రచయితలు, పాత్రికేయులు ఈ విషయాన్ని నిరూపించారు. లోకమాన్య బాల గంగాధర తిలక్ పత్రికా రచనల ద్వారా ప్రజలను స్వాతంత్రోద్యమం వైపు నడిపించారు. ఆ తరువాత కాలంలో మహాత్మా గాంధీ వంటి నాయకులు సైతం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పత్రికలను సాధనంగా చేసుకున్నారు.
తెలుగు పత్రికా రంగానికి మార్గ దర్శకుడుగా చెప్పదగిన వారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. పత్రికల ద్వారా సాంఘిక సంస్కరణలను, సాహిత్య సంస్కరణలను ఆయన తీసుకువచ్చారు. ఆ తరువాత కాలంలో తెలుగు వారిలో స్వాతంత్రోద్యమ స్పూర్తి కలిగించడంలో కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక ప్రముఖ పాత్ర పోషించాయి.
పత్రికలతో చైతన్యం కలిగించి వాటిని సక్రమ మార్గంలో నడిపించడానికి సంపాదకులలో అంకిత భావం ఎంతో అవసరం. అటువంటి అంకితభావం కలిగిన ఉత్తమ సంపాదకులలో దివంగత శ్రీ కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం అగ్రగణ్యులు. పత్రికా రచనను ఒక తపస్సుగా ఉపాసించిన సంపాదక ఋషి (తపస్వి) శ్రీ సుబ్రహ్మణ్యం. అందుకే చిన్న వయసులోనే సంపాదక బాధ్యతలు స్వీకరించి సుదీర్ఘ కాలం పాత్రికేయుడిగా ప్రజలను చైతన్య పరిచే అరుదైన అవకాశం ఆయనకు లభించింది.
సంపాదకులకు సంపాదకుడు
తన సుదీర్ఘ పాత్రికేయ వృత్తిలో ఎందరినో ఉత్తమ పాత్రికేయులుగా, సంపాదకులుగా, రచయితలుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ కూచిమంచికి దక్కుతుంది. ఉత్తమ సంపాదకులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ కె. రామచంద్రమూర్తి, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, శ్రీ వావిలాల వాసుదేవ దీక్షితులు ఒకప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యం సంపాదకత్వం కింద పని చేసిన వారే. ప్రసిద్ధ పాత్రికేయుడు శ్రీ అజంతా కూడా ఆయన వద్ద పని చేసిన వారే.
పాత్రికేయ బీజాలు
శ్రీ కూచిమంచికి చిన్న వయసులోనే పాత్రికేయ బీజాలు నాటుకున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యం 1928 జూలై 9 వ తేదీన అమలాపురంలో జన్మించారు. ఆయన హైస్కూల్ విద్యాభ్యాసం అక్కడే సాగింది. ఆ రోజులలో శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో నడిచిన కృష్ణా పత్రికను వారం వారం క్రమం తప్పకుండా ఆయన చదివే వారు. ఆ పత్రికలో శ్రీ కృష్ణారావు సంపాదకీయాలు శ్రీ సుబ్రహ్మణ్యం మనస్సును పాత్రికేయ వృత్తి వైపు నడిపించాయి. శ్రీ కృష్ణారావు రచనా నైపుణ్యం, వ్యక్తిత్వంలోని ధైర్య సాహసాలు శ్రీ సుబ్రహ్మణ్యం పై ప్రభావం చూపాయి.
హైస్కూల్ విద్య పూర్తి చేసిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. కళాశాలలో చదువుతున్న రోజులలో ఆయనకు పత్రికా రంగంపై ఆసక్తి పెరిగింది. ఆయన లేఖలు, వ్యాసాలు ‘స్వతంత్ర’ అనే ఇంగ్లీషు పత్రికలో ప్రచురితమయ్యాయి. ‘స్వతంత్ర’ పత్రికా సంపాదకుడు శ్రీ ఖాసా సుబ్బారావుకు ఏకలవ్య శిష్యుడిగా మారిపోయారు శ్రీ సుబ్రహ్మణ్యం. శ్రీ సుబ్రహ్మణ్యం రచనలను, మాటలను పరిశీలించిన చాలా మంది అధ్యాపకులు విద్యార్థులు శ్రీ సుబ్రహ్మణ్యంలోని పాత్రికేయుడిని ప్రోత్సహించారు. అప్పటి నుండి పాత్రికేయుడు కావాలన్న పట్టుదల ఆయనలో పెరిగింది.
పత్రికా రంగ ప్రవేశం
రాజమండ్రిలో డిగ్రీ పూర్తి చేసిన శ్రీ సుబ్రహ్మణ్యం ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. 1949 లో యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా (యు. పి. ఐ) అనే న్యూస్ ఏజెన్సీ సంస్థలో ఆయనకు రిపోర్టర్ గా ఉద్యోగం లభించింది. ఒక న్యూస్ ఏజెన్సీలో రిపోర్టర్ గా ఉద్యోగం చేయడం అంత సులభం కాదు. జంట నగరాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు సంబంధించిన వార్తలను ఒక చేతి మీదుగా అందించాలి. ఈ బాధ్యతను శ్రీ సుబ్రహ్మణ్యం సమర్థవంతంగా నిర్వహించారు. అక్కడ చేరిన కొత్తలోనే షోయబుల్లా ఖాన్ హత్య కేసులో రజాకార్ ఉద్యమ నాయకుడు ఖాసిం రజ్వీ పై జరిగిన విచారణను రిపోర్టు చేసే బాధ్యతను శ్రీ కూచిమంచికి అప్పగించడం జరిగింది. ఆ కేసు విచారణను సమర్థవంతంగా రిపోర్టు చేయడంతో శ్రీ కూచిమంచికి మంచి గుర్తింపు లభించింది. శ్రీ కూచిమంచి భవిష్యత్తులో ఉత్తమ పాత్రికేయుడిగా రాణించగలడని పై అధికారులు గుర్తించారు. క్రమం తప్పకుండా పత్రికలను చదవడం, వాటిలోని వార్తలను పూర్తిగా అవగాహన చేసుకోవడం మొదలైన సుగుణాల వల్లనే ఖాసిం రజ్వి కేసును శ్రీ సుబ్రహ్మణ్యం అంత సమర్థవంతంగా రిపోర్టు చేయగలిగారనడం నిర్వివాదాంశం.
కొంతకాలం యు. పి .ఐ. లో పని చేసిన అనంతరం మద్రాసులోని ‘విజయ ప్రభ’ పత్రికకు రిపోర్టర్ గా పనిచేశారు శ్రీ సుబ్రహ్మణ్యం. అక్కడ పని చేసిన కాలంలో పత్రికా వర్గాలలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ రోజులలోనే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారితో ఆయనకు సన్నిహిత పరిచయం ఏర్పడింది.
విజయ ప్రభలో కొంత కాలం పని చేసిన అనంతరం ఆయన మళ్లీ హైదరాబాదుకు వచ్చారు. తిరిగి యు.పి.ఐ. లో చేరి కొంతకాలం పనిచేశారు. అనంతరం ‘అసోసియేటెడ్ న్యూస్ సర్వీస్’ అనే సంస్థలో పనిచేశారు.
దక్కన్ క్రానికల్ లో ఉద్యోగం
అనంతరం డెక్కన్ క్రానికల్ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా చేరారు శ్రీ సుబ్రహ్మణ్యం. అక్కడ పనిచేస్తున్న రోజులలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో ఆయన ఎన్నో పరిశోధనాత్మక రచనలు చేశారు. దీని వల్ల వృత్తిలో గౌరవించదగిన స్థాయికి శ్రీ సుబ్రహ్మణ్యం ఎదిగారు.
ఆ తరువాత ‘డైలీ న్యూస్’ అనే పత్రికలో డెస్క్ లో పనిచేసే అవకాశం శ్రీ కూచిమంచికి లభించింది. ఈ సంస్థలో పని చేస్తున్న రోజులలో ఆయన పలు శీర్షికలు నిర్వహించారు. అంతేగాక, సంపాదకీయాలు కూడా వ్రాశారు. ఇలా యు.పి .ఐ., విజయప్రభ, దక్కన్ క్రానికల్, డైలీ న్యూస్ పత్రికలలో చూపిన ప్రతిభ ద్వారా శ్రీ సుబ్రహ్మణ్యం పత్రిక రంగంలో అంచలంచెలుగా ఎదిగారు.
సంపాదకత్వ బాధ్యతలు
1955లో కాంగ్రెస్ నాయకుడు శ్రీ వల్లూరి బసవరాజు నేతృత్వంలో ఏర్పాటైన ‘ఆంధ్ర జనత’ తెలుగు దినపత్రికకు శ్రీ సుబ్రహ్మణ్యం సంపాదకులుగా నియమితులయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 28 సంవత్సరాలు. ఇంత చిన్న వయస్సులో సంపాదకులైన పాత్రికేయులు అరుదుగా ఉంటారు. ఇటువంటి అవకాశం లభించటానికి ఆయన ప్రతిభ ఒక్కటే కారణమనడంలో సందేహం లేదు.
లక్ష్యమే ముఖ్యం
‘విశాలాంధ్ర’ ఏర్పాటు కోసమే ఈ పత్రిక ప్రారంభిస్తున్నాం. “ఆరు నెలల్లో విశాలాంధ్ర ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ పత్రిక ఉండదు.” అని శ్రీ బసవరాజు ముందుగానే శ్రీ కూచిమంచికి తెలిపారు. ఈ ఆరు నెలల బాగోతానికి సంపాదకత్వ భాధ్యతలు చేపట్టటం ఎందుకని శ్రీ సుబ్రహ్మణ్యం భావించ లేదు. ఉద్యోగం కంటే, సంపాదన కంటే లక్ష్య సాధనమే ముఖ్యమని భావించడం వల్లనే శ్రీ కూచిమంచి ఈ పత్రిక సంపాద బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన ఆదర్శ వ్యక్తిత్వానికి, నిస్వార్థ స్వభావానికి సంకేతం.
ఈ సందర్భంలో “విశాలాంధ్ర” అంటే ఏమిటి ? అనే సందేహం చాలా మందికి కలుగవచ్చు. కనుక ‘విశాలాంధ్ర’ ఉద్యమం గురించి ఇక్కడ వివరించటం అవసరం. 1953లో ఆంధ్ర, రాయలసీమ జిల్లాలను కలిపి ‘ఆంధ్ర రాష్ట్రాన్ని’ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ తెలుగు వారు అధికంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపకపోవడం చాలా మంది నాయకులకు అసంతృప్తి కలిగించింది. ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలన్న లక్ష్యం నెరవేరలేదని చాలా మంది భావించారు. తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుతూ విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకులు ఉద్యమం ప్రారంభించారు. తమ ఉద్యమం ఫలితంగా ఆరు నెలలలోనే విశాలాంధ్ర ఏర్పడుతుందనే నమ్మకం శ్రీ బసవరాజుకి ఉన్నది. కనుకనే తమ పత్రిక ఆరు నెలలు మాత్రమే ఉంటుందని శ్రీ బసవరాజు అన్నారు. అయినా శ్రీ సుబ్రహ్మణ్యం సంపాదకత్వ పగ్గాలు చేపట్టారు. అయితే, విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించే వారు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నారు. విశాలాంధ్రకు మద్దతుగా శ్రీ సుబ్రహ్మణ్యం వ్రాసిన సంపాదకీయాలు వారికి నచ్చ లేదు. "విశాలాంధ్రను సమర్థిస్తే ఖబడ్దార్’ అనే ధోరణిలో ఆయనకు బెదిరింపులు వచ్చేవి. అయినా శ్రీ సుబ్రహ్మణ్యం సంపాదకీయాల జోరు తగ్గ లేదు. సమర్థత, నిజాయితీ అనే రెండు సుగుణాలు పుష్కలంగా ఉన్న చోట భయం ఉండదు. శ్రీ సుబ్రహ్మణ్యం సంపాదకీయాలు నిర్భయంగా సాగడానికి ఇదే కారణం.
అచిర కాలంలోనే ‘ఆంధ్ర జనత’ ఆశించిన విధంగా విశాలాంధ్ర ఏర్పడింది. అయితే, దానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టడం జరిగింది. అనుకున్న లక్ష్యం నెరవేరినా ‘ఆంధ్ర జనత’ పత్రికకు ప్రజాదరణ తగ్గలేదు. సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది. ఆరు నెలల లో ఆగి పోతుందనుకున్న పత్రిక పదేళ్లు కొనసాగింది. నిజాయితీతో పాటు నిస్వార్థం, నిరాడంబరత్వం, నిష్కపటం అనే సుగుణాలు కూడా శ్రీ సుబ్రహ్మణ్యం వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి. పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆయన ప్రతిష్ట విస్తరించడానికి ఇదే కారణం.
ఒక దశాబ్దం పాటు విజయవంతంగా నడిచిన అనంతరం ‘ఆంధ్ర జనత’ పత్రిక కష్టాలలో పడింది. యాజమాన్యం ఆ పత్రికను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి విక్రయించింది. పార్టీ పత్రికకు పనిచేయడం ఇష్టం లేని శ్రీ సుబ్రహ్మణ్యం ఉద్యోగానికి రాజీనామా చేశారు. విలువల విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యం ఎన్నడూ రాజీ పడరనడానికి ఈ సంఘటన చక్కని ఉదాహరణ.

పంచాయతీరాజ్ పత్రికకు సంపాదకుడిగా…
అనంతరం ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ పంచాయతీరాజ్ నిర్వహించే పంచాయతీరాజ్ పత్రికకు సంపాదకుడిగా శ్రీ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ పత్రిక ద్వారా రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగుదలకు శ్రీ సుబ్రహ్మణ్యం అనేక సూచనలు చేశారు. సుమారు పది సంవత్సరాలు ఆయన ఆ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు.
వృత్తిలో అత్యున్నత శిఖరం
1975లో శ్రీ సుబ్రహ్మణ్యం తన వృత్తిలో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. ఆంధ్రప్రభ సంపాదకులుగా శ్రీ సుబ్రహ్మణ్యం విశ్వరూపం చూపించారు. ఆ రోజులలోనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఇందిరాగాంధీ అనేక ఆంక్షలు విధించారు. ఆ అంశాలను పాటిస్తూనే తన అభిప్రాయాలను నిర్భయంగా ప్రజలకు అందించారు శ్రీ సుబ్రహ్మణ్యం. కత్తి మీద సాములాంటి పనిని అత్యంత చాకచక్యంగా ఆయన నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యం సారధ్యంలో ఆంధ్రప్రభ సర్కులేషన్ అత్యున్నత స్థాయికి చేరుకుంది.
చిన్న పత్రికలకు ఒరవడి
ఆంధ్రప్రభలో పని చేసిన అనంతరం రాజమండ్రిలో కోస్తావాణి అనే దినపత్రికకు సంపాదకత్వం వహించారు శ్రీ సుబ్రహ్మణ్యం. పేజీల విషయంలోనూ, సర్కులేషన్ పరిధిలోనూ చిన్నదే అయినా పెద్ద పత్రికలకు తీసిపోని విధంగా శ్రీ సుబ్రహ్మణ్యం కోస్తావాణి పత్రికను నిర్వహించారు. ఈ చిన్న పత్రికలో శ్రీ సుబ్రహ్మణ్యం వ్రాసిన సంపాదకీయాలు పెద్ద పత్రికలలో సంపాదకీయాలకు ధీటుగా ఉన్నాయనే ప్రశంసలు లభించాయి. కోస్తావాణి సంపాదకీయాలకు పెద్ద పత్రికలలో సంపాదకీయాలు సాటి రావనే అభిప్రాయాన్ని కూడా కొందరు పెద్దలు వ్యక్తం చేశారు. చిన్న పత్రికలలో ఇంత ఘాటు సంపాదకీయాలు వ్రాసిన వారు అరుదు. మొత్తం మీద చిన్న పత్రికలకు కొత్త ఒరవడి ఏర్పరచిన పెద్ద సంపాదకుడిగా శ్రీ సుబ్రహ్మణ్యం గుర్తింపు పొందారు.
ఐదేళ్లు కోస్తావాణి పత్రికను అత్యంత విలువలతో నిర్వహించిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యం విజయవాడలో కుమార్తెల వద్దకు చేరుకున్నారు. అక్కడ 10 ఏళ్లపాటు ‘ప్లెడ్జ్’ అనే ఆంగ్ల పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరించారు.
గౌరవాలు, పురస్కారాలు
దాదాపు 50 సంవత్సరాల పైగా పత్రికా రంగానికి సేవలందించిన శ్రీ కూచిమంచికి గౌరవాలు, పురస్కారాలు లభించడంలో ఆశ్చర్యం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ‘ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు’ తో సత్కరించింది.
జర్నలిస్టుల ఉద్యమంలో కూడా శ్రీ సుబ్రహ్మణ్యం ప్రముఖ పాత్ర పోషించారు. ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్’ వ్యవస్థాపకులలో శ్రీ సుబ్రహ్మణ్యం ఒకరు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఉపాధ్యక్ష పదవికి ఆయన ఒక విడత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ న్యూస్ పేపర్స్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్ష పదవికి ఆయన రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమర్థవంతంగా పనిచేయడానికి నిర్మాణాత్మక సూచన చేస్తూ ఇండియన్ ఎక్స్ప్ ప్రెస్ దినపత్రికలో ఆయన వ్రాసిన వ్యాసానికి మాలతీ ట్రస్ట్ అవార్డు లభించింది. శ్రీ సుబ్రహ్మణ్యం పత్రికా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా రాజమండ్రిలోని ఆంధ్ర కేసరి యువజన సేవా సమితి ఘనంగా సత్కరించింది. శ్రీ కందుకూరి వీరేశలింగం 150వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రికి చెందిన హితకారిణి సమాజం శ్రీ కూచిమంచిని ఉచిత రీతిన సన్మానించింది.
ఆంధ్రప్రదేశ్ లో సమాచార పౌర సంబంధాల శాఖ పునర్వ్యవస్థీకరణకు సూచనలు చేసేందుకు శ్రీ సంజీవరెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో ఆయన ఒక సభ్యుడుగా నియమితులయ్యారు.
ఆంగ్ల, తెలుగు పత్రికా రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా విజయవాడలోని గీతా విజన్ ట్రస్ట్ ఆయనను ‘సంపాదక సవ్య సాచి’ అనే బిరుదుతో సత్కరించింది.
పుస్తక రచనలో కూడా శ్రీ సుబ్రహ్మణ్యం తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఒక ఆధ్యాత్మిక గురువు జీవిత చరిత్రను తెలియజేస్తూ ‘విధి విన్యాసం’ పేరుతో ఆయన వ్రాసిన పుస్తకం ఇందుకు ఉదాహరణ. డిసెంబర్ 4వ తేదీ 2002 సంవత్సరంలో ఆయన భౌతిక దేహాన్ని విడిచారు.
పత్రికా రంగానికి నిస్వార్ధంగా సేవలు అందించిన శ్రీ కూచి మంచిని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం ముదావహం.