పిల్లలే సంపద, వారే మన సంపద అనే నినాదాలతో జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్త మవుతోంది. గతంలో జనాభా నియంత్రణ పథకాల వల్ల ప్రస్తుతం వృద్ధుల సంఖ్య పెరిగి పోయిందని, భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, కనుక జనాభాను పెంచవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. మూడవ బిడ్డ జన్మిస్తే 30 వేల రూపాయలు, నాలుగవ బిడ్డ జన్మిస్తే 40 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
జనాభా పెరగడం వల్ల కుటుంబ భారం పెరుగుతుందని, పిల్లలను పెంచడం కష్టం కాగలదని కొందరు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తున్నదని, పుస్తకాలు మొదలైనవి ఉచితంగా అందిస్తున్నదని, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నదని, ఉన్నత విద్యలో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నదని కనుక జనాభా పెరిగినా పరవాలేదని ఒక వాదన వినిపిస్తున్నది. కానీ జనాభా పెరిగిన కొద్దీ ప్రభుత్వంపై భారం పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులకు ఈ సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాగలదా? చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే కార్పొరేట్ విద్యా సంస్థలలో తమ పిల్లలను చేర్పించాడనికే ఇష్టపడు తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో చదివితే ప్రభుత్వ సౌకర్యాలు వర్తించవు. సంతానం పెరిగితే తల్లిదండ్రులపై భారం అధికం కాగలదు. మజ్జిగ పలచన చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు?
జనాభా పెరిగితే నిధులు వస్తాయా?
జనాభా పెరిగితే కేంద్రం నుండి నిధులు వస్తాయనే వాదన కూడా వినవస్తోంది. కానీ జనాభాకి కేంద్ర నిధులకు సంబంధం ఉంటుందా? రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర అవసరాలకు అనుగుణంగా కేంద్రాన్ని నిధులు అభ్యర్థించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. అంతేగాని జనాభా పెరిగినందుకు అధిక నిధులు కావాలని కోరే అవకాశం ఉండదు. ఒకవేళ అటువంటి సౌకర్యం ఉంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జనాభా పెంచడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కనుక ఈ వాదనలో కూడా పసలేదు.
ఆర్థిక శాస్త్రంలో అభిలషణీయ జనాభా సిద్ధాంతమని ఒకటి ఉంది. దాని ప్రకారం దేశంలో ఉన్న ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించు కోవడానికి తగినంత జనాభా లేనప్పుడు మాత్రమే జనాభా పెంచడానికి చర్యలు తీసుకోవాలి. కాని ప్రస్తుతం మన రాష్ట్రంలో గాని, దేశంలో గాని అటువంటి పరిస్థితి ఉందా? ప్రకృతి వనరులు పూర్తిగా వినియోగ పడుతున్నాయా ?
రాబోయే కాలంలో ఏర్పడబోయే మానవ వనరుల కొరత గురించి ఆలోచించే ముందు ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఆలోచించడం సమంజసం.
ప్రస్తుతం రాష్ట్రంలో (దేశంలో) ఉపాధి లేనివారు, ఒకవేళ ఉపాధి ఉన్నా తగినంత ఆదాయం లేనివారు, ప్రతిభకు తగిన ఉపాధి లభించని వాళ్ళు, తగిన ఉపాధి కోసం విదేశాలకు తరలి వెళుతున్న వారు అధికంగా ఉన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రతిభకు కొరత లేదు. దానికి ప్రోత్సాహమే కరవుగా ఉన్నది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అదే. అసాధారణ ప్రతిభ కలిగిన వారు అన్ని రంగాలలోనూ ఉన్నారు. కానీ వారిలో ఎంతమందికి తగిన ఉపాధి, ఆదాయం లభిస్తున్నాయని ప్రశ్నిస్తే సంతృప్తికరమైన సమాధానం లభించటం లేదు. తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఆదాయం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు లేకపోలేదు. తగిన ఆదాయం లభించక అవినీతికి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు కొందరు ఉన్నారు. మరికొందరు విదేశాలకు అమ్ముడు పోతున్నారు. విదేశీ పౌరులుగా నోబెల్ బహుమతులు అందుకున్న భారతీయ మేధావులు కొందరున్నారనే విషయాన్ని ఈ సందర్భంలో మరచిపోకూడదు. ఈ పరిస్థితుల వల్ల దేశానికి కలుగుతున్న నష్టం సామాన్యమైనది కాదు. కనుక ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి, దుర్వినియోగం కాకుండా కాపాడడానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం. మన మేధావులకు ఉపాధి కొరత, ఆర్థిక వనరుల కొరత లేకుండా చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించకుండా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందడం అర్ధరహితం. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం కేవలం ఒక రాష్ట్రానికి చెందిన సమస్య కాదు. దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది.
జనాకర్షణ పథకం?
కనుక కూడు, గుడ్డ, నీడ తదితర విషయాలలో ప్రజలందరూ సంతృప్తి చెందిన తరువాత జనాభా పెరుగుదల గురించి ఆలోచించడం మంచిది. అలా గాక ముందుగానే జనాభా పెరుగుదలపై దృష్టి పెడితే జనాభా అభివృద్ధి తప్ప దేశంలో మరే అభివృద్ధి కనిపించక పోవచ్చు. మూడవ బిడ్డ పుడితే 30 వేల రూపాయలు, నాలుగవ బిడ్డ పుడితే 40 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించడం కూడా ఒక రకమైన జనాకర్షణ పథకం. ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన వారు తమకు తప్పనిసరిగా ఓటు వేస్తారనే ఆశ ప్రభుత్వానికి లేదంటే నమ్మశక్యం కాదు. ఈ సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తే ఇప్పట్లో మానవ వనరుల కొరత ఏర్పడకపోవచ్చు. కనుక జనాభా అభివృద్ధి గురించి గాక మానవ వనరుల సద్వినియోగం గురించి రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తే ప్రయోజనం ఉంటుంది.

