పడవ ప్రయాణం, కోనసీమ ఏటిగట్టు, దాని మీద కొబ్బరి చెట్లు, ఆకుపచ్చని పొలాలు, ప్రకృతి అందచందాలు, తెలుగుదనం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, తెలుగుభాష యాసల సొగసులు, ఆరుద్ర, సినారే, గుంటూరు శేషేంద్రశర్మల కావ్యస్థాయి గల గీతాలకు జనరంజకత్వమే కాదు, ఒక శాశ్వతత్వాన్ని, కాలాతీత విఖ్యాతి నిచ్చిన ‘మామ’ సంగీతం, సహజ నటనాభినయనమే అయినా, ముగ్ద మనోహరమూ, అద్భుతమనిపించే తీరులో తెనుగు చలనచిత్ర తెరమీద ముళ్లపూడి, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, ఇషాన్ ఆర్య , కె.వి. మహదేవన్ వంటి సహచరులతో కలిసి బాపు వేసిన అద్భుత హరివిల్లు—‘ముత్యాల ముగ్గు’. తెలుగు చలన చిత్రచరిత్రలో ఓ మహత్తర దృశ్యకావ్యం.

1975లో విడుదలైన ఈ ముత్యాలముగ్గు, కొన్ని దశాబ్దాల పాటు సినిమా ప్రేక్షకులనే కాక, సాహితీవేత్తల, విమర్శకుల మనస్సులను రాగరంజితం చేయటానికి ప్రధాన హేతువు దర్శకుని స్పష్టత, దార్శనికత…ప్రతిభ. ఉత్తర రామాయణాన్ని మనసులో నిలుపుకుని రమణ రూపొందించిన కథా ఇతివృత్తాన్ని దృశ్యాలుగా, షాట్లుగా విభజించుకొని, ప్రతి పాత్రకు తగిన నటీ–నటవర్గాన్ని ఎంపిక చేసుకుని, తనకు కావలసిన నటనను సున్నితంగా రాబట్టుకున్న దర్శకుడు—బాపు. రమణ ఊహాజనిత పాత్రలను, ఆ కల్పనా జగత్తులో నిలిపి, వాటికి అందమైన రూపానిచ్చి, జవజీవాలనిచ్చి, ప్రేక్షకుల హృదయాల్లో రసానుభూతి కలిగించే స్థాయికి తీసుకెళ్ళగలిగే దర్శక ప్రతిభాశాలి బాపు.

ఆ అద్భుత సినీకావ్య విశేషాలు, కొన్ని ముచ్చట్లు.

నటన:

కాంట్రాక్టర్‌:

ఈ పాత్ర పోషించింది రావు గోపాలరావు. రమణ ఊహశక్తి నుండి అక్షరాకృతి దాల్చిన కాంట్రాక్టర్ పాత్రను, రావుగోపాలరావు తన సుస్పష్టమైన ఉచ్ఛారణ, మాడ్యులేషన్, టైమింగ్ తో, చేవ గల డైలాగులతో, నటనా వైదుష్యంతో ప్రేక్షకుల ముందు నిలిపి దానికొక సజీవత్వాన్నిచ్చారు. అంతేకాదు. ఆ పాత్రకొక చిరంజీవత్వాన్ని ఇచ్చారు. ఆ విలక్షణమైన పాత్రలో రావు గోపాలరావు ఎంతో సలక్షణంగా నటించి సెహబాష్ అనిపించుకున్నారు. ఆపై మూడు దశాబ్దాలు ఆయన వేసిన పాత్రలలో ఆయన చూపిన వైవిధ్యాన్ని, నటనాకౌశలాన్ని, పరిణతిని చూసిన సినీ పండితులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఎక్కువ ప్రజాదరణ పొందినది పాటలా, సంభాషణలా అంటే చెప్పటం చాలా కష్టం. అంతటి ప్రజాదరణ పొందినవి పాటలు కాదు. సంభాషణలే అనేవారూ లేకపోలేదు. అయితే ఆ రెండూ అద్భుతాలే. ముఖ్యంగా రావుగోపాలరావు తూర్పు గోదావరి యాసలో డైలాగులు చెప్పిన తీరు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో సమ్మోహితులను చేసింది.

ఆయన చెప్పిన కొన్ని డైలాగులు …చూడండి

“సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!..సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ?”

“ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది? ”

“సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగిపోదు.’’

ఒక సినిమాలో డైలాగులు క్యాసెట్ల రూపంలో వచ్చి, ఆనాటి కాఫీ హోటళ్లలో, టీ దుకాణల్లో, కస్టమర్లను ఆకట్టుకునేందుకు వాటిని వినిపించడం బహుశా ఈ సినిమా నుండే మొదలైంది. (ఎంతసేపు విన్నా ఇంకా వినాలనిపించేటట్లు ఉన్న వాటిని వినేందుకు అక్కడే ఉండి, రెండు, మూడు సార్లు టీ తాగే వాళ్ళ సంఖ్య పెరగటం, హోటళ్ళ వారికి మంచి ఆదాయాన్ని ఇచ్చిందనటంలో సందేహమేమి అక్కరలేదు.) అంతటి ప్రజాదరణకు, విజయానికి కారణం రావుగోపాలారావు విలక్షణమైన గొంతు, డైలాగ్ డెలివరీ.

గుమాస్తా:

డబ్బు కోసం ఎంత తప్పునైనా చేయటానికి సంకోచించని వాడు ఆ ఎస్టేట్ గుమాస్తా. తన మేనల్లుడు శ్రీధర్ కి తన కూతుర్ని కట్టబెట్టాలని ఎస్టేట్ మేనేజర్ ఆశ, ఆలోచన. అది సాకారం చేసుకోవటానికి చేసే ఘోరాలలో, పాపాలలో ఎస్టేట్ గుమాస్తా అతనికి సహాయం చేసి, ఒక దశలో పిచ్చిపట్టి కోతిలా ప్రవర్తించే పాత్రను అల్లు రామలింగయ్య నభూతో నభవిష్యతి అన్నట్టు పోషించారు. సినిమాలో ఆయన కోతిని అనుకరిస్తూ చేసిన చేష్టలు చూసిన వారు కోతి ఆయనను చూసి నేర్చుకోవాలేమో అని ప్రశంసించకుండా ఉండలేక పోయారంటే ఆ పాత్రలో ఆయన ఎంతగా పరకాయ ప్రవేశం చేసారో, ఎంతటి పరిశీలన ఉన్న అద్భుత కళాకారుడో అన్నది తెలుస్తుంది. అల్లు రామలింగయ్య నటనా ప్రతిభా ప్రకాశంలోని కేవలం హాస్య కిరణాలను మాత్రమే కాక, ఆ నటుడి నటనా ప్రతిభా పార్శ్వాలను ఈ చిత్రం అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుల్లో బాపు, విశ్వనాథ్ లతో పాటు, కన్నెవయసు దర్శకుడు ఓ.ఎస్.ఆర్. ఆంజనేయులు వున్నారు. ఆ సినిమాలో కరుణారసాన్ని అత్యద్భుతంగా పోషించారు శ్రీ అల్లు.

మాడా వెంకటేశ్వర రావు:

ఈ సినిమాలో మెరుపు లాంటి వాడు. సిల్క్ చొక్కా, మెళ్ళో బంగారపు చైన్ , రెండువేళ్ల మధ్య సిగరెట్టు ఆహార్యంతో….అలో, ఆలో, అలో అంటూ…… సంభాషణారంభిస్తూ, మధ్య మధ్యలో, చెయ్యి పైకెత్తి వేళ్ళతో చిటెక వేస్తూ, గుక్క తిప్పుకోకుండా చెప్పిన మాటల్నే వెనకా, ముందు చెపుతూ ప్రేక్షకుల్ని కళ్ళు ఆర్పనీయకుండా మంత్రముగ్ధులను చేసే పాత్రను మాడా అసామాన్యరీతిలో పండించారు. ఆ సీన్ లో సీనే తానై, సినిమా అంతా తానే అయినా రావుగోపాలరావు పాత్రను సైతం మింగేసిన పాత్ర మాడాది.

కాంతారావు:

జమిందారుకు తరగని ఆస్తి, ఆడదిక్కులేని సంసారం, కొడుకు శ్రీధర్ కంటిదీపం. అనుకోని పరిస్థితులలో కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఇంటికొచ్చి మీ కోడలని పరిచయం చేసిన క్షణాన అంగీకరించ లేకపోయినా, ఆమె గుణగణాలు చూసి పొంగిపోతాడు. తరువాత కోడలు ఇంటినుండి వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతతను కోల్పోయి, పూజారి ఇంట తల దాచుకున్న కోడలిని, మనవణ్ణి, మనవరాలిని చూసి, ప్రశాంతతను పొందుతాడు. గొప్ప స్థితప్రజ్ఞత గల పాత్రలో గొప్ప సాత్వికమైన నటనను ప్రదర్శించారు.

శ్రీధర్, సంగీత…

ఈ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. శ్రీధర్ చక్కని ఉచ్ఛారణతో, చాలా సహజంగా నటించే నటుడు. షటిల్ ఆడే పాత్రలో ఆ చలాకీతనాన్ని, తండ్రి చేసిన దానం వల్లనే తన స్నేహితుడి చెల్లెలు రసాభాస అయిందని ఎవరో తండ్రిని, ఆయన చేసిన సహాయాన్ని, చులకనగా మాట్లాడటంతో భరించలేక, ఆ పెళ్ళికూతురి మెళ్ళో తాళి కట్టిన అభిమానవంతుడుగా, సరస శృంగారాన్ని చూపిన భర్తగా, భార్య శీలాన్ని అనుమానించి ఆమెను బయటకు పంపే వేళ బాధాతప్త హృదయుడిగా, చివరకు నిజానిజాల నిగ్గుకు సిగ్గుపడిన పశ్చాతప్త హృదయుడిగా శ్రీధర్ నటన ప్రశంసార్హం. ఇక ఇతని భార్యగా నటించిన సంగీతకు ఈ సినిమా తొలిచిత్రం. ఆ సహజమైన భయం, జంకు, బెరుకు, సంకోచం అవన్నీ ఆ పల్లెటూరి యువతి పాత్రకు అన్నివిధాలా సరిపోయాయి. అందువల్ల ఆమె నటించలేదు. సహజంగా వర్తించింది. సంగీత మొదటి చిత్రంతోనే రాష్ట్రపతి అవార్డును పొందటానికి నిస్సందేహంగా బాపు దిశ, దశ, నిర్దేశనమే.

పూజారి:

ఈ పాత్ర చిత్రం ముందు కొద్దిసేపే కనిపించినా, తరువాత ఎక్కువసేపు కనిపిస్తుంది.ఈ పాత్రను పోషించిన శ్రీ పీసపాటి వెంకటేశ్వరరావు (తేనె మనసులు, సుడిగుండాలు) మొదటి భాగంలో దేవుడి నగలు అపహరించాడనే ఆరోపణతో జమిందారు కొలువు వీడి వెళ్లే వేళ పరితాపంతో చెప్పే డైలాగ్ వారి నాటాకానుభవానికి ప్రతీక. నదీ తీరాన, ఒక కుటీరంలో ఉన్న ఆయన దగ్గర భర్త వదలి వేసిన, గర్భవతి అయిన సంగీత ఆశ్రయం పొంది, ఒక ఆడపిల్ల, మగ పిల్లవాణ్ని కంటుంది. వారు లవకుశల వంటి వారు. ఆ పూజారి వాల్మీకీ. ఇక సీత….సంగీతే పాత్రే కదా! పీసపాటి చక్కని నటులు.

ముక్కామల:

హలం వలలో చిక్కిన పాత్రలో ముక్కామల…ముఖ్యంగా….ఎంతటి రసికుడివో తెలిసెరా….అన్న పాట చిత్రీకరణలో…. ఆమెను శృంగార భావనతో చూస్తూ చిన్నగా డ్యాన్స్ చేయటంలో… విచిత్రమైన నటనను ప్రదర్శించారు. ముక్కామల డైలాగులు, హావభావాలు గొప్ప హాస్యాన్ని సృష్టిస్తాయి.

ఇతర నటులు:

ఈ సినిమాతోనే నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ నిత్య పెళ్లి కొడుకుగా నటించి బాగా పేరు తెచ్చుకున్నాడు. సంగీతకు పుట్టిన ఇద్దరు పిల్లలు గా నటించిన బేబీ రాధ, మాస్టర్ మురళి తమ నటనతో మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటారు. బేబీ రాధ లంగా, జాకెట్టుతో తన పెద్ద కళ్ళను గుండ్రంగా తిప్పుతూ మాట్లాడే తీరు భలే ముచ్చటగా ఉంటుంది. మురళి బొద్దుగా, బూరెల్లాంటి బుగ్గలతో, భుజం మీద కోతితో మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాడు. కాంట్రాక్టర్ ని ఒక ఆట పట్టిస్తాడు.

అక్షరం:

ముళ్లపూడి మాటలు ఒక చెయ్యి తిరిగిన శిల్పి ఉలిని రాతి మీద పెట్టి, సుత్తితో కొట్టినప్పుడు రాలిపడే ముక్కలలాంటివి. ఎంత పరిమాణంలో తెగే ముక్క వుండాలో అంతే. రవ్వంత ఎక్కువ ఉండదూ, తక్కువా ఉండదు. పదాలు అంత పదునుగా, భావగర్భితంగా ఉంటాయి. పాత్రల ఆంతరంగాన్ని చూపుతాయి. హాస్యం బహిరంగం. వ్యంగ్యం అంతర్లీనం. అవసరమైన చోట ఆయన మాటలు జీవనసత్యాలు. వేదాంత సారాలు. చమక్కులు, చమత్కారాలు చెప్పనే అక్కర లేదు. భాషా ఆడంబరత్వం ఉండదు. మన మనసుల్లో నిలిచే చిన్న చిన్న వాక్యాలు. ముళ్లపూడి వెంకటరమణ చక్కని కథను సిద్ధం చేసుకుని, తక్కువ మాటలతో ఎంతో అర్ధాన్ని ఇవ్వగల మాటలను వాడుతూ, వాటిని తన పాత్రధారులకు సంభాషణలుగా చేస్తూ కథనం చాలా వేగంగా నడపగల అద్భుత రచయిత. రావు గోపాలరావు, మాడా డైలాగులు పైన చూసారు కదా! ఇప్పుడు రమణ చెప్పిన ఈ జీవన సత్యాలను చూడండి…. *వాడికి స్త్రీజాతి మీద నమ్మకం పోయింది. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది. (కాంతారావు ముక్కామలతో) *సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. (సంగీత కాంతారావుతో) ఇంకా…ఇలా అనేకం!

దృశ్యం:

ప్రకృతి అంద చందాలను, చీకటి వెలుగులను వాడుకుని ప్రతి షాట్ ని ఎంతో సహజాతి సహజంగా కెమెరాలో బంధించారు ఇషాన్ ఆర్య. 1976 సంవత్సరానికి ఉత్తమ ఛాయాగ్రాహకుడి అవార్డు పొందారు. చిత్రమంతా కెమెరా సామ్రాజ్యమే.

గీతకారులు:

ఆరుద్ర, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ లు రాసిన గీతాలు ఒక గొప్ప కావ్యార్హత ఉన్నవి. అంటే.? ఆరుద్రలోని తెలుగుదనం, నారాయణరెడ్డి పదసౌష్ఠవం, లలిత శృంగార భావన, శేషేంద్ర తాత్విక దృష్టి…ఇవి త్రివేణి సంగమమై ఈ చిత్రం ఒక అద్భుత దృశ్య కావ్య వాహినిలా సాగటానికి ఎంతగానో దోహదం చేసాయి. ఒక గీతం భాష, కథన, వాక్య నిర్మాణ స్థాయిలను దాటి, కవిత్వ స్థాయికి చేరుకునే ఒక ఉన్నతమైన స్థితిని అత్యుత్తమ శిల్పంగా చెప్పవచ్చు. ఆ సంయోజనం కళాత్మకంగా, హృద్యంగా, రసప్రపూర్ణంగా మారే శుభ ఘడియ అది. అప్పుడే ఆ అక్షర సృజనలో కవి ప్రజ్ఞ, నైపుణ్యం, భావ సౌందర్యం, గాంభీర్యం కావ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళతాయి. ఈ చలన చిత్రాన్ని ఒక దృశ్య కావ్యంగా భావన చేస్తే, ఆరుద్ర, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మలు అద్భుత గీతాకారులు, శిల్పులు.

సంగీతం:

గీతాలలోని పదాలు స్పష్టంగా శ్రోతకు వినబడాలి అనే ఈ మామ, పదాల ధ్వనిని పట్టుకోవటంలో గొప్పవాడు. పాటను ప్రజల పెదాల మీద నిలిచే విధంగా వారి మనస్సులను తట్టేటట్టు పాటకు సంగీతాన్ని కూర్చగల స్వర మాంత్రికుడు. ఈ ముత్యాల ముగ్గు సాధించిన ఘనవిజయంలో మామకు ముఖ్య స్థానము ఇవ్వాల్సిందే.

ఆరుద్ర రాసిన…ఏదో ఏదో అన్నది, ఈ మసక వెలుతురు, గూటిపడవలో ఉన్నది, కొత్త పెళ్ళికూతురు… రామకృష్ణ గొంతులో ఎంతో మత్తుగా, మంద్రస్థాయిలో ఉన్నా, శేషంద్ర శర్మ అద్భుత గీతం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులలో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది…… పి. సుశీల గొంతులో ఆ పాటకు వలసిన ఆర్తి, ప్రతి పదంలో పలికినా; నారాయణరెడ్డి ….ఎంతటి రసికుడవో తెలిసెరా… ఎంతసేపు నీ తుంటరి చూపు… గీతంలోని రసికత, శృంగార భావన, సుశీల గొంతులో పదపదానా ప్రతి ధ్వనించినా ఆ ఘనత మామదే. ఆయనకు జేజేలు.

ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా, ముత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా… ఆరుద్ర రచించిన ఈ గీతంలోని తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలను సుశీల మధురమైన గొంతులో ఎంతో వినసొంపుగా పాడారు!

ఆరుద్ర రాసిన శ్రీరామ జయరామ సీతా రామ గీతాన్ని ఒక గాంభీర్యమైన గాత్రం మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేత పాడించటం ఆ గీత సార్ధకతను చాటుతుంది. ఈ పాటను టైటిల్స్ వేసేటప్పుడు చిత్రీకరించటం కథా ఇతివృత్తానికి గొప్ప పరిపుష్టి నిచ్చింది.

గోగులు పూచే గోగులు కాచే ఓలచ్చ గుమ్మడి,… అన్న నారాయణ రెడ్డి రచనలోని జానపద సొబగులను మామ, సుశీల సుస్పష్టమైన స్వరంలో మాధుర్యాన్ని మేళవిస్తూ, పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంతో కలిపి, పాటను స్వర పరచిన వైనం అద్భుతం.

శ్రీరామచిత్ర పతాకంపై మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహం ఈ సినిమాను నిర్మించారు. అనంతర కాలంలో ఈయన ఎమ్వీయల్ పేరుతో గొప్ప సాహితీవేత్తగా, వక్తగా, వ్యాఖ్యాతగా ప్రసిద్ధుడయ్యారు. మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు రూపొందిన ఈ చిత్రం బోలెడు రికార్డులను నెలకొల్పింది. ఎన్నో అవార్డులను పొందింది. 12 కేంద్రాలలో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకుంది. ఉత్తమ చిత్ర నిర్మాతగా రాష్ట్రపతి నుండి రజత కమలం స్వీకరించారు. ఈ చలన చిత్రం స్మరణం ఓ పరవశం. ఓ మధురం. అక్షరం, నటనం, ఛాయాగ్రహణం, గీతం, సంగీతం, దర్శకత్వంల అపూర్వ సంగమం. తెలుగువారి ఎద కనుమలలో నిక్షిప్తమైన నిధి. అమూల్యమైనది. జాతి సంపదలో భాగం. యాభై వసంతాలు నిండిన ఈ చిత్రానికి నిత్య వసంతమే.