ప్రపంచాన్ని వణికిస్తున్న చమురు సంక్షోభం నేపథ్యంలో మన ప్రధాని మోదీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం ఉపదేశించడం అత్యావశ్యకమే. త్వరలో కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పడం గమనార్హం. మోదీ తెలంగాణ పర్యటనలో దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు పొదుపు నీతి సూత్రాలు వల్లించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన రాష్ట్రాలు ఇంధన పొదుపుపై దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభంతో ప్రపంచం విలవిలలాడుతోంది. క్రూడాయిల్ ధరలు ఆకాశానికి అంటుతున్న దశలో పెట్రోల్, డిజిల్ ధరలు ఎప్పుడు మండాలా అని ఎదురుచూస్తున్నాయి. మోదీ పొదుపు సూత్రాలు పెట్రో ధరలు పెంచే ముందు సుతి మెత్తని సూచనలని విశ్లేషకులు ఊహిస్తున్నారు.

మన దేశంలో లభిస్తున్న చమురు వినియోగానికి కావలసినంత మేర సరఫరా కావడం లేదు. ఫలితంగా గల్ఫ్, ఇరాన్, రష్యాపై ఆధారపడడం వల్లనే మన అవసరాలు తీరుతున్నాయి. ఇప్పుడు యుద్ధం వల్ల చమురు నౌకల రాకపోకలు స్తంభించడంతో ముడి చమురు కొరత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారకద్రవ్యం అత్యధికంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు ఖర్చు అవుతున్నది. అది రోజురోజుకూ తరిగిపోతున్న దశలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం యుద్ధం ముగిసి సాధారణ స్థాయి చేరుకునే వరకూ ఇంధన పొదుపు పాటించాల్సి ఉంది. అదే మాట ప్రధానిగా మోదీ నోటి వెంట వచ్చింది. మాటతో పాటు వెంటనే స్వయంగా పాటించడం అభినందనీయం. స్వయంగా మోదీ కాన్వాయ్ రెండు వాహనాలకు తగ్గించుకోవడం స్ఫూర్తిదాయకం. పొదుపు పాఠంలో భాగంగా పలు సూచనలు చేసారు. వీలయినంతవరకూ స్వదేశీ, స్థానిక ఉత్పత్తులు వాడాలన్నారు. అన్ని రంగాల్లోనూ స్థానిక వస్తువులను ప్రొత్సహించాలన్నారు. ఫలితంగా స్థానికంగా మార్కెట్లు, రైతులు బాగుపడతారు. ప్రతి ప్రభుత్వ రంగంలోనూ ఖర్చు తగ్గించాలి. ఈనాటి చమురు సంక్షోభ సందర్భంలో “వోకల్ ఫర్ లోకల్” నినాదం పలకడం హర్షదాయకం.

ఎన్డీఏ, బీజేపీ రాష్ట్రాల సీఎంలు కూడా కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కనీసం 50 శాతం తగ్గించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే వీలయినంత వరకూ కరెంట్ వాహనాలను వాడాలని సూచించారు. దీని కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని ఎస్పీజీని ఆదేశించారు. ప్రభుత్వాలు కూడా వాహనాల వినియోగం తగ్గించాలన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్ 12 వాహనాలను నాలుగుకు తగ్గించారు. అలాగే, అధికారులు ఒక వాహనాన్ని మినహా ఎక్కువ వాహనాలు ఉపయోగించడం నిషేధించారు. ఢిల్లీ ప్రభుత్వం మంత్రులను, అధికారులను మెట్రోలో ప్రయాణం చేయాలని ఆదేశించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించే యోచనలో ఉన్నారు.

ప్రతి వాహనదారుడు కార్ పూలింగ్ పాటించాలి. వస్తు రవాణాలో రైలు సేవలు ఉపయోగించుకోవాలి. రైళ్లు విద్యుత్ తో నడుస్తాయి కాబట్టి నిత్యావసరాల ధరలపై చమురు ధరల పెంపు ప్రభావం తగ్గుతుంది. వంటనూనె వాడకం తగ్గిస్తే దేశ సేవతో పాటు దేహ సేవ కూడా పెరుగుతుందని మోదీ పేర్కొనడం గమనార్హం.

అనవసర విదేశీ ప్రయాణాలు వద్దు

అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని ,వీలయినంత వర్చువల్ (ఆన్ లైన్) సమావేశాలలో పాల్గొనాలన్నది ప్రధాని పొదుపు సూత్రాలలో ముఖ్యమైనది. ఇటీవల కాలంలో మంత్రులు, అధికారులు ఏదో ఒక కార్యక్రమం సృష్టించుకుని విదేశీ పర్యటనలు చేయడం పరిపాటి అయింది. దాన్ని పూర్తిగా ఆపివేయాలని ప్రధాని సూచించారు. ప్రజలు పర్యాటక పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడం వాయిదా వేసుకోవాలి. మనదేశంలో ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ పర్యటించి ఈ రంగాన్ని పటిష్టం చేయాలని సూచించారు.

విదేశీ పర్యాటకం, విదేశాల్లో పెళ్లిళ్లు ఏడాది పాటు వాయిదా వేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొనడం అవసరమే. సెలబ్రిటీలు, నాయకుల సంతానం పెళ్లిళ్లు విదేశాల్లో చేయడం గొప్పగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో మోదీ సూచన పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మనదేశంలో ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ప్రొత్సహించాలి. ఉదాహరణకు ఏపీలో ముఖ్యంగా కాశ్మీర్ ను తలదన్నే అరకు వ్యాలీ ఉంది. మన రాష్ట్రంలో ఇటువంటి సుందర ప్రదేశాలు చాలా ఉన్నాయి. గోవాను మించిన సూర్యలంక, గోదావరిలోని పాపికొండలు తదితరాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అన్ని రాష్ట్రాలోనూ ఇలాంటి సుందర పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది.

బంగారం కొనుగోలు తగ్గించాలి

బంగారం కొనుగోలును ప్రజలు తగ్గించాలని, సంవత్సరం పాటు వాయిదా వేయాలని మోదీ సూచించారు. ఇది మహిళలకు నచ్చని విషయమైనా తప్పనిసరిగా పాటించాల్సిన అంశమే. ధర ఇంకా పెరుగుతుందని ఎంతోమంది అప్పుచేసి బంగారం కొంటున్నారు. కొనుగోళ్లు ఆగితేనే బంగారం దిగుమతి చేసుకునే పరిస్థితి తప్పుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అభిమానం, పిచ్చి కూడా. కొంతమంది మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే కొనకుండా ఉండలేరు. వారివద్ద డబ్బు ఉంది కాబట్టి కొనుక్కుంటారు, మనకి వచ్చే నష్టం ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. కాని ఈ బంగారం పిచ్చితో దిగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. స్వదేశీ గనుల్లో ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గత ఆర్ధిక సంవత్సరంలో మన దేశం బంగారం, వెండి దిగుమతుల విలువ 9.74 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఒకప్పుడు మన దేశం రాగి లోహాన్ని ఎగుమతి చేసేది. కాని నేడు దానిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బంగారంలో రాగి కలిపితేనే ఆభరణాలు తయారీ సులభం అవుతుంది. అందువల్లనే బంగారంతో పాటు రాగిని కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బంగారం వినియోగం ప్రతి ఏడాది దాదాపు 14 శాతం పెరుగుతోంది. బంగారం వ్యాపారం దెబ్బతినకుండా స్వదేశీ ఉత్పత్తి వరకు అమ్మకాలు జరిగేలా కేంద్రం చర్యలు చేపడితే అభిలషణీయమే.

సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యం

ఇంధన పొదుపులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి పొలంలోనూ, ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ అమర్చి ఉత్పత్తి పెంచాలి. వ్యవసాయంలో డీజిల్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాలి. వీలయినంతవరకూ ప్రజలు ప్రజా రవాణా ఉపయోగించా లన్నది ప్రధాని పొదుపు సూచనలలో ప్రధానమైనది.

సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రం హోం పాటిస్తామని ప్రధాని ప్రకటించడం గమనార్హం. వారంలో రెండు రోజులు ప్రభుత్వ అధికారులు వర్క్ ఫ్రం హోం పాటించడం మంచి నిర్ణయమే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై నిర్ణయం తీసుకుంటే ట్రాఫిక్, కాలుష్య సమస్యలు చాలావరకు తగ్గుతాయి.

అన్నింటికీ విదేశాలపై ఆధారపడకుండా స్వయం సంవృద్ధి సాధించాలి. అంతరిక్ష పరిశోధన, రాకెట్ నిర్మాణంలో సాధించినట్లు భారత్ స్వయం సంవృద్ధి అన్ని రంగాలలో సాగాలి. అందుకు ప్రభుత్వాలు పరిశోధనలను ప్రొత్సహించాలి. పక్కదేశం చైనా అభివృద్ధి చూసైనా పరిశోధనలు పెంచి అన్ని రంగాల్లో స్వయంసంవృద్ధికి బాటలు వేయాలి. మన దేశంలో అన్ని వనరులు ఉన్నా సాంకేతికత కొరవడటం వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక పోతున్నాం. ‘బ్రెయిన్ డ్రెయిన్’ ఒకప్పటి సమస్య గానీ నేడు సాంకేతికత సమస్య కానే కాదు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ప్రధాని చేసిన మరో సూచన రసాయనిక ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం ప్రొత్సహించాలని. మన దిగుమతులలో రసాయనిక ఎరువులు ప్రధానమైనవి. అందుకే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి స్వదేశీ సాంప్రదాయ ఎరువులను వినియోగించాలి. అందుకు ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేలా స్థానిక అధికారులు తరచూ సూచనలిచ్చి ఉత్పత్తి తగ్గకుండా చూడాలి. నేడు ఆహారధాన్యాలు రసాయనాలతో విషపూరితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ వ్యవసాయాన్ని పునరుద్ధరణ చేయడం ద్వారా ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను అందించడం ఎంత అయినా అవసరం.

ఏదిఏమైనా ప్రధాని మోదీ పొదుపు మంత్రంతో ఒక రకంగా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకూ ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పేర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ, పన్నుల రూపేణా వసూలైన ప్రజా ధనాన్ని నీళ్ల లాగా ఖర్చు చేస్తున్నారు. రాజకీయ నాయకుడు తాను ప్రజా సేవకుడినంటూ చెప్పి అధికారంలోకి రావడంతో జీతాలు, అలవెన్సులు పెంచుకుని మహారాజుల్లా బతుకుతున్నారు. దేని ధర పెరిగినా, కొరత వచ్చినా వారికి అందుబాటులో ఉండేలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వానికి ఆదాయం లేదంటూనే అప్పులు చేసైనా తమ సౌకర్యాల విషయంలో రాజీపడడం లేదు. వీరిని చూసి అధికారులు కూడా సౌకర్యాలు పేరుతో ప్రజా ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు.

ప్రస్తుత ఇంధన సంక్షోభ సమయంలో తగ్గించుకున్న సౌకర్యాలు శాశ్వతంగా కొనసాగించి నాయకులు బాధ్యత గల ప్రజా సేవకులుగా మారాలని ప్రజలు కోరుకుంటున్నారు.“యథా రాజా తథా ప్రజా” అన్నట్లు నాయకులను చూసి ప్రజలు కూడా పొదుపు మంత్రం పాటించే అవకాశం పెరుగుతుంది. ఈ పొదుపే ఒక విధంగా అభివృద్ధిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.