అత్యధిక సంఖ్యాకులు అత్యంత ఆసక్తితో వీక్షించే క్రీడలలో క్రికెట్ కు అగ్ర స్థానం దక్కుతుంది. పూర్వ టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఉన్న కాలంలో టీవీలు లేకపోయినా చాలా మంది రేడియోలకు అతుక్కుపోయి క్రికెట్ కామెంటరీ వినేవారు . వన్డే మ్యాచ్ లు వచ్చిన తర్వాత క్రికెట్ మ్యాచ్ లకు మరింత ఆదరణ పెరిగింది. ఒక రోజులో ఫలితం తేలిపోయే పరిస్థితి ఏర్పడడంతో ఈ మ్యాచ్ లు మరింత ఉత్కంఠ భరితంగా మారాయి. టీవీలు, స్మార్ట్ ఫోన్లు పెరిగాక క్రికెట్ మ్యాచ్ లకు వీక్షకుల సంఖ్య మరింత పెరిగిపోయింది. టి 20 లో ఆటగాళ్లు మరింత వేగం పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. స్ట్రైక్ రేట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కువసేపు క్రేజ్ లో ఉండటం కంటే త్వరితంగా స్కోరు పెంచడానికి ఆటగాళ్లు కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 3-30 గంటలలో ఈ మ్యాచ్ ముగిసిపోతుంది. కనుక దీని కోసం ప్రేక్షకులు ఎక్కువ సమయాన్ని వినియోగించవలసిన అగత్యం లేదు.
ఐపీఎల్ టీ ట్వంటీ 2026 మ్యాచ్ లు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ఏ సినిమాలలోనూ, సీరియల్స్ లోను కనిపించని ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ట్విస్టులు ఈ టోర్నమెంట్ లో చోటు చేసుకున్నాయి.
లీగ్ దశలో చెరో 9 మ్యాచ్ లలో విజయం సాధించి చేరో 18 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్.సి.బి), గుజరాత్ టైటాన్స్ (జి.టి) జట్లు ఇంచుమించు సమ ఉజ్జీలుగా కనిపించాయి. కానీ క్వాలిఫయర్ వన్ లో ట్విస్ట్ కనిపించింది. ఈ మ్యాచ్ లో 92 పరుగుల తేడాతో జి.టి ని చిత్తుగా ఓడించింది ఆర్.సి.బి. కెప్టెన్ రజత్ పటేదార్ 33 బంతులలో 93 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
మళ్లీ మే 31వ తేదీన జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా జీ.టి ని ఆర్.సి.బి ఓడించింది. ఈ మ్యాచ్ ఇంచుమించు ఏకపక్షంగా సాగింది. మొదట 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి జి టి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు జరిగిన క్వాలిఫయర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ పై శతకం కొట్టిన జి.టి కెప్టెన్ గిల్ ఫైనల్స్ లో చతికిల పడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ పై 104 పరుగులు చేసిన గిల్ ఆ వెంటనే జరిగిన ఫైనల్స్ లో పది పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. గిల్ ను అవుట్ చేసిన ఘనత హేజెల్ వుడ్ కు దక్కింది. లెజెండ్ స్థాయికి చేరిన కింగ్ కోహ్లీ ఫైనల్స్ లో 75 పరుగులు చేసి అజేయంగా (నాట్ అవుట్) గా నిలిచాడు. మరొక ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ మెరుపు వేగంతో 16 బంతులలో 32 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి 62 పరుగులు చేసి తమ విజయానికి బాట వేశారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రజత్ పటేదార్ రెండు అద్భుతమైన క్యాచ్ లు పట్టి తన సత్తా చూపించాడు.
ఈ టోర్నమెంట్ మొత్తం మీద జరిగిన మ్యాచ్ లలో అత్యంత నిలకడగా ఆట సాగించిన విరాట్ కోహ్లీ తాను లెజెండ్ నని నిరూపించుకున్నాడు. రెండు మ్యాచ్ లలో విఫలమైనా విరాట్ బ్యాటింగ్ నైపుణ్యం జట్టు విజయానికి తోడ్పడిందనడంలో సందేహం లేదు. జట్టుకు వరుసగా రెండుసార్లు ఛాంపియన్షిప్ సాధించి పెట్టిన కెప్టెన్ గా రజత్ పటేదార్ గుర్తింపు పొందారు. డిపెండబుల్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్.సి.బి తన స్థానాన్ని దక్కించుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రవేశించిన వెంకటేష్ అయ్యర్ పరువు దక్కించాడు.
ఆర్.సి.బి తో పోల్చితే ప్లే ఆఫ్ లో 2,3,4 స్థానాలు దక్కించుకున్న జి.టి సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) రాజస్థాన్ రాయల్స్ జట్లు నిలకడ విషయంలో అంత బలంగా లేవని చెప్పవచ్చు. ఈ మూడు జట్లు ఒడిదుడుకులకు లోనై ప్లే ఆఫ్ చేరాయి. ఆర్.సి.బి కి లభించినంత సునాయాసంగా వారికి ప్లే ఆఫ్ బర్త్ దక్కలేదు. ఈ జట్లలో ఆటగాళ్లు కొన్ని మ్యాచ్ లలో విజృంభించినా మరి కొన్నింటిలో తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో మొదటి ఓవర్ లో మూడు వికెట్లు తీసిన ప్రపుల్ హింగ్ తర్వాత మ్యాచ్ లలో అంతటి ప్రభావం చూపలేదు.
రాజస్థాన్ రాయల్స్ విజయాలు కూడా అధిక భాగం ఓపెనర్స్ మీద ఆధారపడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. అందరిని ఆకర్షించిన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. అతడు చిచ్చర పిడుగులా ప్రత్యర్థుల మీద చెలరేగిపోయాడు. తక్కువ బంతులతో ఎక్కువ పరుగులు చేసి జట్టుకు గుర్తింపు తెచ్చాడు సూర్యవంశీ. ఈ టోర్నమెంట్ లో 72 సిక్సులు బాది ఇది వరలో క్రిస్ గేల్ రికార్డును చెరిపి వేశాడు సూర్యవంశీ.
అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు (776) సాధించిన ఘనత కూడా సూర్యవంశీ కే దక్కింది. ఎస్.ఆర్.హెచ్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 28 బంతులకు 97 పరుగులు చేశాడు. 30 బంతులలో సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డును ఈ మ్యాచ్ లో సూర్యవంశీ బద్దలు చేస్తాడని అందరూ ఆశించారు. కానీ 29వ ఈ బంతికి అవుట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో 28 బంతులకు 97 పరుగులు చేసిన సూర్యవంశీ క్వాలిఫయర్ - 2 లో 50 పరుగులు చేయడానికి 30 బంతులు ఆడవలసి వచ్చింది. ఇది బౌలర్ల గొప్పతనం కావచ్చు. ఈ మ్యాచ్ లో 50 బంతులకు 96 పరుగులు చేసి సూర్యవంశీ అవుట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ లో మూడుసార్లు సూర్యవంశం సెంచరీ మిస్ కావడం విశేషం. ఇంతటి సంచలనం సృష్టించటం వల్లనే సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది.
ఈ టోర్నమెంట్ లో అత్యంత దూకుడుగా ముందుకు దూసుకు వెళ్లిన జట్టు పంజాబ్ కింగ్స్. ఈ జట్టు వరుసగా ఆరు విజయాలు సాధించడంతో తప్పకుండా ప్లే ఆఫ్ కు చేరుకోగలదని అందరూ భావించారు. కానీ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పంజాబ్ కింగ్స్ కు ఒక పాయింట్ మాత్రమే దక్కింది. ఆ తరువాత వరుసగా 6 మ్యాచులలో పంజాబ్ కింగ్స్ పరాజయం చెందింది. చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది కానీ అప్పటికే రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరుకోవడంతో పంజాబ్ కు అడియాస మిగిలింది. ఒక మ్యాచ్ లో నాలుగు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ ఘనత సాధించగలిగింది.
పంజాబ్ కింగ్స్ కు వ్యతిరేక దశలో కోల్ కతా నైట్ రైడర్స్ ఆట సాగింది. మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పరాజయం చెందింది. పంజాబ్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది. తరువాత వరుసగా విజయాలు సాధించింది. కానీ ఆఖరి మ్యాచ్ లో ఓడిపోయింది. వర్షం దెబ్బతిన్న రెండు జట్లు పంజాబ్ కింగ్స్, కే.కే.ఆర్. ప్లే ఆఫ్ కు చేరుకోలేక పోవడం ఒక విశేషం.
రోహిత్ శర్మ,రికెల్టన్,తిలక్ వర్మ,సూర్య కుమార్ యాదవ్,హార్డిక్ పాండ్యా వంటి హేమాహేమీలు ఉన్న జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోలేకపోవడం మరో విడ్డూరం. ఈ జట్టుకు ప్లే ఆఫ్ లో తొమ్మిదవ స్థానం మాత్రమే దక్కడం ఇంకొక వింత. రికెల్టన్,తిలక్ వర్మ సెంచరీలు వ్యక్తిగత రికార్డులకు మాత్రమే తోడ్పడ్డాయి.
ఈ టోర్నమెంటులోని ఒక మ్యాచ్ లో అత్యధిక వ్యక్తి గత స్కోరు సాధించిన ఘనత ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఎల్. రాహుల్ కు దక్కింది. ఈ మ్యాచ్ లో రాహుల్ 152 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచినా డి సి కి విజయం దక్కకపోవడం ఒక విశేషం. ఇంతటి ఆటగాడు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో ఆరో స్థానంలో మిగిలిపోవడం ఒక విశేషం.
ఎక్కువసార్లు ఐపీఎల్ ఛాంపియన్షిప్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి 8వ స్థానంలో నిలిచి పోవడం విచారకరం. ఆటగాళ్ల తీరులో నిలకడ లేకపోవడం విజయానికి ప్రతి బంధకం అయింది. ఈ జట్టు ఓపెనర్ సంజూ శ్యామ్ సన్ రెండు మ్యాచ్ లలో సెంచరీలు సాధించినా జట్టు తగినంతగా పుంజుకోలేదు. జట్టు కెప్టెన్ ఋతురాజు గైక్వాడ్ చెప్పుకోదగినంతగా రాణించలేదు. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఒక దశలో ప్లే ఆఫ్ అవకాశాలు కనిపించాయి. కానీ ప్రత్యర్థుల తాకిడికి అవి తట్టుకోలేక అవకాశాలను చేజార్చుకున్నాయి.
ప్రపుల్ల కింగ్,జోఫ్రా ఆర్చర్,భువనేశ్వర కుమార్,శార్దూ ఠాకూర్,పాట్ కమిన్స్ వంటి బౌలర్లు కొన్ని సందర్భాలలో మాత్రమే రాణించారు.
ఇలా అడుగడుగునా ట్విస్టులతో సాగడమే టి20 ప్రత్యేకత. అందుకే లక్షలాది మంది అభిమానులు టి20 ఫైనల్స్ చూడడానికి తరలివచ్చారు. 19 సంవత్సరాలుగా సాగుతున్న ఐపీఎల్ టి20 చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

