లూసీని కాపాడే ప్రయత్నం రోజురోజుకీ మరింత కష్టంగా మారుతున్నది.
ప్రతి ఉదయం ఒకే విధంగా మొదలవుతున్నది.
మంచి వార్త వినాలనే ఆశతో ఆర్థర్ నిద్రలేస్తాడు.
డాక్టర్ సీవర్డ్ త్వరగా లూసీ ఇంటికి చేరుకుంటాడు.
కొద్దిసేపటికి ప్రొఫెసర్ వాన్ హెల్సింగ్ కూడా వస్తాడు.
ఈ రోజైనా పరిస్థితి మారాలని ముగ్గురూ మనసులో ప్రార్థిస్తారు.
కాని ప్రతి ఉదయం వారు చూసేది అదే హృదయ విదారక దృశ్యం.
లూసీ మళ్లీ బలహీనపడి ఉంటుంది.
ఆమె ముఖం మంచులా తెల్లగా మారిపోయింది.
చేతులు చల్లగా ఉంటున్నాయి.
కొద్ది సేపు మాట్లాడినా పూర్తిగా అలసిపోతున్నది.
ఆర్థర్ గదిలోకి వచ్చిన ప్రతిసారీ ఆమె చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తుంది.
కాని ఆ నవ్వు కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది.
మంచంపై కూర్చోవడానికే ఆమె శక్తినంతా కూడగట్టుకోవలసి వస్తున్నది.
ఆర్థర్‌కు ఏమీ అర్థం కావడం లేదు.
“నిన్న ఆమె ఎంతో బాగుంది,” అని బాధగా అంటాడు.
“ఒక్క రాత్రిలో ఇంత బలహీనంగా ఎలా మారిపోయింది?”
ఎవరూ సమాధానం చెప్పరు.
వాన్ హెల్సింగ్ మాత్రం పెరుగుతున్న ఆందోళనతో లూసీని చూస్తూ ఉంటాడు.
ఇలా జరగడం అతను చాలా సార్లు చూశాడు.
మరోసారి లూసీకి రక్తం ఎక్కించ వలసిన పరిస్థితి వచ్చింది.
ఆర్థర్ వెంటనే ముందుకు వచ్చాడు.
“మళ్లీ నా రక్తం తీసుకోండి,” అన్నాడు.
కానీ వాన్ హెల్సింగ్ అతనిని మెల్లగా ఆపాడు.
“నువ్వు ఇప్పటికే చాలా రక్తం ఇచ్చావు,” అన్నాడు.
“ఇప్పుడు నువ్వే బలహీనంగా ఉన్నావు.”
ఆర్థర్ వాదించాలనుకున్నాడు.
తన రక్తం లూసీని కాపాడగలిగితే, తనకు ఏమి జరిగినా పట్టించుకోనని చెప్పాలనుకున్నాడు.
కాని వాన్ హెల్సింగ్ గట్టిగా నిరాకరించాడు.
“నువ్వు కుప్పకూలిపోతే,” “ఆమెకు ఇక సహాయం చేయలేవు.”
ఆర్థర్ ఇష్టం లేకపోయినా వెనక్కి తగ్గాడు.
వాన్ హెల్సింగ్ డాక్టర్ సీవర్డ్ వైపు తిరిగాడు.
“నా మిత్రమా,” అని మెల్లగా అన్నాడు, “ఈరోజు నీ వంతు.”
సీవర్డ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
వెంటనే అంగీకరించాడు.
కొద్దిసేపటికే మరోసారి రక్త మార్పిడి ప్రారంభమైంది.
లూసీ శరీరంలోకి కొత్త రక్తం చేరుతుండగా అందరూ ఆందోళనగా చూస్తున్నారు.
నెమ్మదిగా…
చాలా నెమ్మదిగా…
ఆమె చెంపలపై కొద్దిగా రంగు తిరిగి వచ్చింది.
శ్వాస సరిగ్గా తీసుకోవడంతో
కనురెప్పలు తెరుచుకున్నాయి.
ఆమె గదిలో చుట్టూ చూసింది.
ఒక్క క్షణం…
ఆమె మళ్లీ పాత లూసీలా కనిపించింది.
ఆర్థర్ ఉపశమనంతో చిరునవ్వు నవ్వాడు.
సీవర్డ్ పూర్తిగా అలసిపోయినా, తాను సహాయం చేయగలిగినందుకు సంతోషించాడు.
వాన్ హెల్సింగ్ మాత్రం నిశ్శబ్దంగా గమనించాడు.
ఈ విజయం తాత్కాలికమని అతనికి తెలుసు.
ఆ మధ్యాహ్నం ఆర్థర్‌ను తన పక్కన కూర్చోమని లూసి కోరింది.
అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది.
“అంత ఆందోళనగా చూడకు,” అని మెల్లగా చెప్పింది.
“నేను త్వరలోనే కోలుకుంటాను.”
ఆర్థర్ నవ్వడానికి ప్రయత్నించాడు.
“నువ్వు తప్పకుండా కోలుకుంటావు,” అన్నాడు.
కాని అతని మనసులో భయం రోజురోజుకీ పెరుగుతున్నది. ఆందోళనను దాచుకోలేకపోతున్నాడు.
ఏదో ఒకటి లూసీని తన నుంచి నెమ్మదిగా దూరం చేస్తున్నది.
ఏ వైద్యుడూ వివరించలేనిది ఏదో.
ఆ సాయంత్రం వాన్ హెల్సింగ్ ఇల్లు అంతా నెమ్మదిగా తిరిగాడు.
ప్రతి కిటికీని చూశాడు.
ప్రతి తలుపును పరిశీలించాడు.
ప్రతి తాళాన్ని పరీక్షించాడు.
పాత వెల్లుల్లి పువ్వులను తీసేసి, వాటి స్థానంలో తాజా పువ్వులను పెట్టాడు.
లూసీ గది చుట్టూ పువ్వులను జాగ్రత్తగా వేలాడదీశాడు.
కిటికీల కింద మరిన్ని పువ్వులను ఉంచాడు.
తర్వాత ఇంట్లో ఉన్న అందరి వైపు తిరిగాడు.
అతని స్వరం ప్రశాంతంగా ఉంది.
కాని ప్రతి మాటలోనూ గంభీరమైన హెచ్చరిక ఉంది.
“ఈ రాత్రి ఏం జరిగినా…”
“ఈ పువ్వులను ఎవరూ తీసేయకూడదు.”
“కిటికీలు తెరవకూడదు.”
“లూసీని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలి పెట్టకూడదు.”
అందరూ సరేనని మాట ఇచ్చారు.
వాన్ హెల్సింగ్ కొంత సంతృప్తిగా కనిపించాడు.
అయినా ఇంటి నుంచి బయలు దేరేటప్పుడు చివరిసారి వెనక్కి తిరిగి చూశాడు.
అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపించింది.
మళ్లీ లూసీని ప్రాణాలతో చూడలేనేమోననే భయం అతన్ని వెంటాడుతున్నట్లుగా.
ఆ రాత్రి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.
బయట గాలి మెల్లగా వీస్తున్నది .
మేఘాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
చూడటానికి అంతా ప్రశాంతంగానే ఉన్నది.
తన గదిలో లూసీ నిద్రపోతున్నది.
ఆమె తల్లి దగ్గరే కూర్చుని కూతురిని కాపాడుతోంది.
చాలాసేపు అలాగే గడిచింది.
అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికి…
విచిత్రమైన శబ్దం . ఏదో గీస్తున్నట్లుగా వినిపించింది.
చాలా మెల్లగా.
వినిపించనంత నెమ్మదిగా.
లూసీ తల్లి కిటికీ వైపు చూసింది.
మళ్లీ అదే శబ్దం.
గర్ర్…
గర్ర్…
గర్ర్…
“గాలికి చెట్టు కొమ్మలు కిటికీని తాకుతున్నాయేమో,” అని తనకు తానే చెప్పుకుంది.
కాని ఆ శబ్దం ఆగలేదు.
నెమ్మదిగా.
ఓపికగా.
బయట ఉన్న ఏదో లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నట్లుగా.
లూసీ నిద్రలో అసహనంగా కదలడం ప్రారంభించింది.
ఆమె శ్వాస వేగంగా మారింది.
ముఖంలో భయం కనిపించింది.
ఏదో మెల్లగా మాట్లాడుతున్నది.
ఆమె తల్లికి ఆ మాటలు అర్థం కాలేదు.
అప్పుడు లూసీ ఒక్కసారిగా కళ్లు తెరిచింది.
కిటికీ వైపు చూస్తూ ఉండిపోయింది.
ఆమె ముఖం భయంతో నిండిపోయింది.
వారిద్దరిలో ఎవరైనా మాట్లాడేలోపే—
ఒక భారీ శబ్దం గదిని కుదిపేసింది.
కిటికీ అద్దం ముక్కలు అయింది.
గాజు ముక్కలు నేలంతా చెల్లాచెదురయ్యాయి.
పగిలిన కిటికీ నుంచి ఒక భారీ తోడేలు గదిలోకి దూకింది.
చీకటిలో దాని కళ్లు మెరుస్తున్నాయి.
చంద్రకాంతిలో దాని పళ్లు భయంకరంగా కనిపిస్తున్నాయి.
ఒక్క క్షణం పాటు అది గదిలో నిలబడి ఉంది.
లూసీ తల్లి గట్టిగా అరచింది.
ఆ దృశ్యాన్నిచూసి ఆమె తట్టుకోలేకపోయింది.
ఒక్కసారిగా తన ఛాతిని పట్టుకుంది.
తర్వాత నేలపై ఆమె కుప్ప కూలింది.
ఆమె మళ్లీ కదల లేదు.
విపరీతమైన భయంతో ఆమె గుండె ఆగిపోయింది. లూసీ భయంతో కేకలు వేసింది. ఇతరులు గదిలోకి చేరుకునే లోపే ఆ తోడేలు వచ్చినంత వేగంగా మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయింది .ఇల్లు మరోసారి నిశ్శబ్దంగా మారింది.
అది నిజంగా వచ్చిందని చెప్పడానికి నేలపై పగిలిన గాజు ముక్కలు మాత్రమే సాక్ష్యంగా ఉన్నాయి .
కేకలు విని పనివాళ్లు పైకి పరుగెత్తుకుంటూ వచ్చారు.
వారికి కనిపించిన దృశ్యం భయంకరంగా ఉన్నది.
లూసీ తల్లి నేలపై ప్రాణం లేకుండా పడి ఉంది.
లూసీ స్పృహలో ఉందో లేదో తెలియని స్థితి.
గది మొత్తం అస్తవ్యస్తంగా మారింది.
కిటికీ పగిలిపోయింది.
చల్లని గాలి గదిలోకి దూసుకొస్తోంది.
వెల్లుల్లి పువ్వులు చెల్లాచెదురయ్యాయి.
కొన్ని వెల్లుల్లి పువ్వులు కిటికీ బయట పడిపోయాయి.
మరికొన్ని గాజు ముక్కల కింద నలిగిపోయాయి.
వాన్ హెల్సింగ్ ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేసిన రక్షణ పూర్తిగా నాశనమైంది.
పనివాళ్లు భయంతో గందరగోళానికి గురయ్యారు.
కొంతమంది ఏడవడం ప్రారంభించారు.
మరికొందరు ఇల్లంతా పరుగెత్తుతూ కేకలు వేస్తున్నారు.
ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు.
అందరి భయాన్ని తగ్గించడానికి ఏదైనా ఇవ్వాలని ఒక పనిమనిషి అనుకుంది.
మందు కలిపిన పానీయాలు తయారు చేసింది.
కొద్దిసేపటికే భయంతో వణికిన పని వాళ్లు ఒక్కొక్కరుగా గాఢ నిద్రలోకి జారిపోయారు.
లూసీకి సహాయం చేయావలసిన వారందరూ స్పృహ కోల్పోయారు.
ఇల్లు మరోసారి నిశ్శబ్దంలో మునిగిపోయింది.
లూసీ దాదాపు పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది.
లూసీ కదలలేనంత బలహీనంగా ఉంది.
సహాయం కోసం పిలవడానికి ప్రయత్నించింది.
కాని ఆమె గొంతు నుంచి వచ్చిన శబ్దం గుసగుసలా మాత్రమే ఉంది.
ఎవరూ సమాధానం ఇవ్వలేదు.
పని వాళ్లందరూ నిద్రలో ఉన్నారు.
ఆమె తల్లి చనిపోయింది.
లూసీని రక్షించాల్సిన ఇల్లు ఇప్పుడు బావురు మంటున్నది.
లూసీ మెలకువగా ఉండటానికి ప్రయత్నించింది.
కాని ఆమె శక్తి నెమ్మదిగా తగ్గిపోతోంది.
కొద్దిసేపటి తర్వాత పగిలిన కిటికీ దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది.
మొదట అది గాలికి కదులుతున్న తెరలేమో అనుకుంది.
కాని తర్వాత స్పష్టంగా చూసింది.
తెల్లటి పలుచని పొగమంచు నెమ్మదిగా గదిలోకి ప్రవేశిస్తోంది.
అది సాధారణ పొగమంచులా కదలడం లేదు.
నేలపై నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది.
తర్వాత మంచం పక్కన నెమ్మదిగా చేరడం ప్రారంభించింది.
లూసీ ఏమీ చేయలేక చూస్తూ ఉంది.
ఆ పొగమంచు మరింత దట్టంగా మారింది.
ఒక్క క్షణం…
దానికి ప్రాణం ఉన్నట్లుగా అనిపించింది. అది ఏదో రూపాన్ని దాల్చుతున్నట్లుగా కనిపించింది.
లూసీ మనసు భయంతో నిండిపోయింది.
అరవడానికి ప్రయత్నించింది.
కాని శబ్దం రాలేదు.
కదలడానికి ప్రయత్నించింది.
శరీరం సహకరించలేదు.
ఆమె కేవలం చూస్తూ ఉండిపోయింది.
గది మరింత చల్లబడింది.
పొగమంచు ఇంకా దగ్గరకు వచ్చింది.
మరింత దగ్గరకు.
ఆ తర్వాత…
అంతా చీకటిలో కలిసిపోయింది.
మరుసటి రోజు ఉదయం వాన్ హెల్సింగ్, డాక్టర్ సీవర్డ్ ఇంటికి చేరుకున్నారు.
లోపలికి అడుగు పెట్టిన క్షణంలోనే ఏదో ఘోరమైన సంఘటన జరిగిందని వారికి అర్థమైంది.
పనివాళ్లు ఆ మత్తు నుంచి అప్పుడే బయటపడుతున్నారు.
పగిలిన కిటికీ నుంచి చల్లని గాలి గదిలోకి వస్తోంది.
వెల్లుల్లి పువ్వులు కనిపించడం లేదు.
లూసీ తల్లి చనిపోయింది.
లూసీ మంచంపై కదలకుండా పడుకుని ఉన్నది.
ఇంకా ప్రాణాలతోనే ఉంది… లూసీ బలహీనంగా ఉన్నది.
వాన్ హెల్సింగ్ కళ్లు మూసుకున్నాడు.
చాలా సేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఏం జరిగిందో అతనికి పూర్తిగా అర్థమైంది.
శత్రువు మళ్లీ దాడి చేశాడు.
ఈసారి తిరుగులేని విజయాన్ని సాధించాడు.
కొద్దిసేపటికి ఆర్థర్ కూడా వచ్చాడు.
లూసీ తల్లి మరణవార్త అతనిని కుదిపేసింది.
కాని అతని అసలు ఆందోళన లూసీ గురించే.
అతను వెంటనే ఆమె మంచం దగ్గరకు పరుగెత్తాడు.
లూసీ బలహీనంగా కళ్లు తెరిచింది.
ఆర్థర్‌ను చూసిన క్షణం ఆమెకు ఉపశమనం కలిగింది.
మెల్లగా చిరునవ్వు నవ్వింది.
“నా ప్రియమైనవాడా…” అని గుసగుసలాడింది.
ఆర్థర్ ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాడు.
ఆమె తప్పకుండా కోలుకుంటుందని చెప్పాడు.
తమ పెళ్లి తప్పకుండా జరుగుతుందని చెప్పాడు.
అన్నీ సజావుగా సాగుతాయని మాట ఇచ్చాడు.
లూసీ నిశ్శబ్దంగా అతని మాటలు విన్నది.
అతనిని నమ్మాలని అనుకుంది.
కాని ఆమెకు అసలు నిజం తెలుసు.
జీవితం తన నుంచి నెమ్మదిగా జారిపోతోందని ఆమెకు అనిపిస్తున్నది.
వాన్ హెల్సింగ్ ఆ ఇద్దరినీ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు.
అతని హృదయం భారంగా ఉన్నది.
తనకు తెలిసిన ప్రతి మార్గంతో పోరాడాడు.
వైద్యాన్ని ఉపయోగించాడు.
శాస్త్రాన్ని ఉపయోగించాడు.
ఇప్పుడు చాలామంది నమ్మని పురాతన జ్ఞానాన్ని కూడా ఉపయోగించాడు.
అయినా…
డ్రాకులా గెలుస్తూనే ఉన్నాడు.
యుద్ధం ఇంకా ముగియలేదు.
కాని సమయం వేగంగా ముగిసిపోతున్నదని వాన్ హెల్సింగ్ గ్రహించాడు.
త్వరలోనే లూసీ భవితవ్యం నిర్ణయించబడబోతోంది.
ఇప్పుడు వారు విఫలమైతే…
దాని ఫలితం మరణం కంటే కూడా భయంకరంగా ఉంటుంది.

