పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానించడం సంతోషించదగిన విషయం. మహిళలు కేవలం లబ్ధిదారులుగా ఉండకూడదు. విధాన నిర్ణేతలు కావాలి అనే తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష హర్షించదగినది.

మహిళలలో మేధావులు , ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వారు, వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించ గలిగిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి మహిళలకు అవకాశాలు ఇవ్వాలి.

భర్త చాటు భార్యలు సానుభూతి పవనాలలో తేలిపోయి గట్టెక్కే వాళ్ళు, పార్టీ ప్రభంజనంలో కొట్టుకు వచ్చే వాళ్లు, వినతి పత్రాలు ఇస్తే తప్ప ప్రజా సమస్యలు గ్రహించలేని వాళ్ళు నాయకు (లు) రాళ్లు కాగలరా? ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఈ విషయంలో రాజకీయాలు చోటు చేసుకుంటే మహిళా సాధికారికత దెబ్బతింటుంది.

అయితే, ఇందుకు సంబంధించిన బిల్లును ఎన్.డి.ఎ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు అభ్యంతరం పెట్టిన విషయాన్ని మరచిపోకూడదు. ప్రతిపక్షాలు లేవదీసిన అంశాలు అతి సున్నితమైనవి. కొన్ని వర్గాలకు భావోద్వేగాలు కలిగించేవి. తెలుగుదేశం పార్టీ ఈ రిజర్వేషన్లను అమలు చేస్తే ఆ వివాదం రాజుకొనే అవకాశం ఉంది. ఆ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే అది చట్టబద్ధం అవుతుంది. అప్పుడు ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ప్రయోజనం ఉండదు. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే దాకా తెలుగుదేశం పార్టీ వేచి ఉండడం ఉత్తమం.

గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగుపడింది. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు. రాజకీయ రంగంలో కూడా వారు ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారు. వారిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. గతంలో అల్లుళ్లను దశమ గ్రహంతో పోల్చేవారు. ప్రస్తుత కాలంలో అల్లుళ్లకు అలాంటి పరిస్థితి లేదు. వరకట్నాల సమస్య చాలా వరకు తగ్గింది. కట్నాలు ఇవ్వనిదే ఆడపిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితి ఈనాడు లేదు. పైగా ఈనాటి పెళ్లిళ్లు ఆడపిల్లల తల్లిదండ్రులదే పై చేయిగా ఉంటున్నది. మహిళల రక్షణ కోసం చాలా చట్టాలు రూపొందాయి. వాటిని సక్రమంగా అమలు చేయగలిగితే మహిళలకు మరింత మేలు జరుగుతుంది.

ఏ పరిస్థితుల దృష్ట్యా చూసినా చట్ట సభలలో సీట్ల రిజర్వేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ తొందరపడటం మంచిది కాదు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతనే అంటే చట్టబద్ధత లభించిన తర్వాతనే అమలు చేయడానికి ప్రయత్నించడం మంచిది. అప్పుడు ఏ వివాదాలు తల ఎత్తకపోవచ్చు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేయడం ఉత్తమం. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నం సాగించాలి.