ఆమె గళం మలయమారుతం. మలయాళ భాషకు చెందినా తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన గాయనీమణి పొరయత్ లీల అనే పి. లీల. కీలుగుర్రం, గుణసుందరి కథ, శ్రీలక్ష్మమ్మ కథ, పాతాళభైరవి, మాయాబజార్, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, అప్పుచేసి పప్పుకూడు, లవకుశ, రహస్యం, మర్మయోగి లాంటి ఎన్నో చిత్రాలు ఆమె నేపథ్య గాన ప్రస్థానంలో అపరూప మైలురాళ్లు. ముఖ్యంగా పాతాళభైరవి చిత్రంతో ఘంటసాల-లీల స్వరాలు విశేష ఆదరణ పొందాయి. వారితోనే పాడించాలని ప్రేక్షకులు, నిర్మాతలు అనుకునేంత స్థాయికి ఎదిగారు. అనంతర కాలంలో విఖ్యాత గీత రచయితగా ప్రసిద్ధులైన వేటూరి సుందర రామమూర్తి తొలి గీతం (‘భారతనారీ చరితం’…ఓ సీతకథ)ను లీల ఆలపించారు. తెలుగులో ఆమె పాడిన చివరి చిత్రం ’శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’. ‘నేను మలయాళీ అయినా వేదిక మీద పాడే అవకాశం కల్పించింది మాత్రం ‘ఆంధ్ర మహిళా సభ’ అందుకే తెలుగు భాష, తెలుగువారంటే ఎంతో ఇష్టం’ అని తరచూ చెప్పేవారు.

తండ్రే మార్గదర్శి

లీల తల్లిదండ్రులు మీనాక్షి కుట్టి, ఇ.కె. కుంజుమీనన్ సంగీత ప్రియులు. ముఖ్యంగా తండ్రికి సంగీతమంటే ప్రాణ సమానం. వివాహం చేసుకున్న తరువాత భార్యకు సంగీతం నేర్పించారు. కూతురు లీలకు సంగీతం నేర్పించాలనుకున్నారు. అప్పట్లో ఎర్నాకులంలో నైపుణ్య సంగీత కళాకారులు లేకపోవడంతో కూతురి సంగీతం కోసం ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మద్రాసు చేరారు. మణిభాగవతార్, చెంబై వైద్యనాథ్ భాగవతార్ వద్ద శాస్త్రీయ సంగీతం చెప్పించారు. కేవలం నాలుగో తరగతి చదవిన లీల తొమ్మిదవ ఏట తొలిసారిగా ‘ఆంధ్ర మహిళా సభ’లో కచేరి చేశారు. పదవ ఏట ఆకాశవాణిలో పాడారు. తెలుగులో సీ.ఆర్. సుబ్బరామన్ సంగీత దర్శకత్వం వహించిన ‘భక్త తులసీదాసు‘ (1946) చిత్రంలో తొలుత బృందగానంలో గొంతు కలిపారు. అలనాటి నటి, నిర్మాత తమ ‘మనదేశం’లో పాడే (బాలా త్రిపుర సుందరి’) అవకాశం ఇచ్చారు. దానికి ఘంటసాల సంగీత దర్శకుడు కాగా, ఎన్టీ రామారావుకు తొలి చిత్రం. తమిళ చిత్రం ‘కంకణం’ (1948)లో ఆ భాషా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆరంభంలో తెలుగు రాకపోవడంతో మలయాళంలో రాసుకుని పాడేవారు. తెలుగు సినిమాలలో పాడే అవకాశం రావడంతో `భాష తెలియకపోతే భావయుక్తంగా పాడలేవు’ అంటూ తండ్రి తెలుగు ట్యూషన్ పెట్టించారట. అప్పట్లో సినిమాల్లో భక్తి గీతాలను ఎక్కువగా స్త్రీల పైనే చిత్రీకరించేవారు. ‘శ్రీ తులసీ జయ తులసీ జయమునీయవే (గుణసుందరికథ), అమ్మా తులసీ…(సంసారం), జయ మంగళ గౌరీదేవి (ముద్దుబిడ్డ), శ్రీ లలితా శివజ్యోతి (రహస్యం)’ లాంటి మంగళ గీతాలను తెలుగునాట ముత్తయిదువులు నేటికీ పాడుకుంటారు. తేట తెలుగు మాటలతో తీయని గీతాలు రాయడంలో సిద్ధహస్తులు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గీతం ‘తెల్లవార వచ్చె తెలియక నా సామి ’(చిరంజీవులు) లీల గళం నుంచి జాలువారిన మేలుకొలుపు.

అరవయ్యో దశకం ఉత్తరార్థంలో తెలుగులో సుశీల, జానకిల ప్రభంజనంతో ఆమె కాస్త వెనుకబడ్డారు. అయినా వచ్చినా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, సంగీత కచేరీలు నిర్వహించారు.

ఘంటసాలగారి చలవే

తాను సినిమా రంగంలో నిలదొక్కుకోగలిగానంటే ఘంటసాల గారి పుణ్యమేనని, ఆయనే లేకపోతే నాకింత పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కావని చెప్పేవారు. ఘంటసాల గారు అప్పటికే సంగీత దర్శకుడిగా పేరున్న సీ.ఆర్. సుబ్బరామన్ గారికి సహాయకులుగా ఉండేవారు. ‘అలా ఆయనతో కలిగిన పరిచయంతో ఘంటసాల గారు సంగీత దర్శకుడు అయిన వెంటనే అవకాశం ఇచ్చారు. పాడటంలో మెళకువలు నేర్పారు.‘ చెలియలేదు…చెలిమిలేదు’ వారితో పాడిన తొలి యుగళ గీతం. ఘంటసాల గారి దంపతులు కుటుంబ సభ్యురాలిగా చూసుకొనేవారు. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘పాతాళభైరవి, పెళ్లి చేసి చూడు, లవకుశ, రహస్యం’ తదితర చిత్రాల్లోని పాటలు నేపథ్యగాయనికిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఘంటసాల గారు లీలను ప్రోత్సహించారని ఆయన సతీమణి సావిత్రమ్మ గారు కూడా చెబుతారు.

మరపురాని ఘట్టాలు

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు త్యాగరాజ భాగవతార్, ఎం.ఎల్. వసంత కుమారితో గొంతు కలపడం, నట గాయనీమణులు శాంతకుమారి, రుష్యేంద్రమణి, జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, పుష్పవల్లికి పాడడం మరుపురాని మధురానుభూతులుగా చెప్పేవారు లీల. లతా మంగేష్కర్ తమ ఇంట ఆతిథ్యం తీసుకోవడం తీపి జ్ఞాపకం. ‘లతా మంగేష్కర్ మద్రాసులోని ఒక హోటల్ లో బస చేసినప్పుడు (1958) ఆమెను కలసి ఆటోగ్రాఫ్ తీసుకోవడంతో పాటు ‘మా ఇంటికి వస్తారా లతాజీ’ అని అడిగాను. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. కానీ ఆమె రాకపై నాకే సందేహం. కానీ హేమంత్ కుమార్ తో కలసి వచ్చారు. అలాగే… హైదరాబాద్ లో ఘంటసాల గానసభ తరపున స్వర్ణ కంకణం ప్రదానం (2003) చేశారు. శ్రీలంక జాతీయగీతాన్ని తాను ముఖ్యగాయనిగా పాడడం అత్యంత ఆనందం కలిగించిన అంశం‘ అంటూ ఒక ముఖాముఖిలో తమ మధురజ్ఞాపకాలను మురిపెంగా చెప్పారు. తాను మద్రాసు వచ్చిన కొత్తల్లో త్యాగరాజ భాగవతార్ కారులో వెళుతుంటే అత్తరు పరిమళాలు గుబాళిస్తుంటే అలా చూస్తూ నిలుచుండి పోయేవారట. ఆ తరువాత ఆయనతో కలసి పాడారు. ఆమె శాస్త్రీయ సంగీతాన్ని మరింత ఇష్టపడేందుకు ఒక విధంగా ఆయనే స్ఫూర్తి. సినిమాలకు పాడుతూనే శాస్త్రీయ సంగీత కచేరీలు చేసేవారు. మాతృభాషతో మలయాళం సహా తెలుగు, తమిళ, కన్నడ, సింహళ భాషల్లో వేలాది పాటలు పాడినా శాస్త్రీయ సంగీతమంటే మక్కువ చూపేవారు. సినిమాలకు పాడుతూ శాస్త్రీయ సంగీత కచేరీలు చేసేవారు.

సంగీత దర్శకత్వం

మహానటి సావిత్రి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రానికి లీల సంగీత దర్శకత్వం వహించారు. వాస్తవానికి అది ఆమెకు ఇష్టం లేకపోయినా అన్నివిభాగాలకు స్త్రీలే పనిచేయడం వల్ల అంగీకరించారు. పైగా ఆమె, సావిత్రి మంచి స్నేహితులు. అయితే సంగీత దర్శకత్వంలో తన పాత్ర నామమాత్రమేనని, ఆ చిత్రంలో సంగీతానికి ఏమైనా ప్రత్యేకత ఉంటే సహాయ సహకారాలు అందించిన సంగీత దర్శకుడు కోదండపాణిగారికే దక్కుతుందని నిజాయతీగా, వినయంగా చెప్పేవారు. ‘మా తరం గాయనీలం అక్కాచెల్లెళ్లలా ఉండేవారం. పాటలు కూడా పంచు కునేవారం. కలసి షాఫింగ్ చేసేవాళ్లం. ఒకరి చీరలు ఒకరం మార్చుకునేవారం. గొప్పా చిన్న భేదాలు తేడాలు ఉండేవి కావుఅని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జిక్కీ, జమునారాణిలతో విదేశాలలో సంగీత విభావరులలో పాల్గొన్నారు. ఏపీ కోమలతో కలసి కేరళలో సంగీత కచేరీలు చేశారు. కేరళ ప్రభుత్వ పురస్కారం (1969),తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమా మణి పురస్కారం (1992) అందుకున్నారు. 1933 మే 19వ తేదీన పుట్టిన లీల స్వరప్రస్థానం 72వ ఏట ముగిసింది. నవ్వుల నదిలో పువ్వుల పడవ`కు నివాళులతో…