తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి నిఖార్సయిన ప్రతినిధి కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు. మాతృభాషలో విద్యాబోధన ప్రయోజన కరమని, సొంత భాషలో పాఠ్య గ్రంథ రచన, శాస్త్ర గ్రంథ ప్రచురణ జాతిని విజ్ఞానవంతులను చేస్తుందని విశ్వసించారు. ‘తల్లి భాషను గౌరవించు, పరభాషను ప్రేమించు’ అనే సూత్రంతో తెలుగును ఆరాధిస్తూనే వివిధ భాషలను నేర్చారు. సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల, మరాఠా, హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషలలో పండితులు. తత్త్వశాస్త్రం ఆయన అభిమాన అంశం అయినప్పటికీ, అనేక సాహిత్యాలలో, శాస్త్రాలలో పాండిత్యం ఆర్జించారు. నిజాం పాలనలో మసకబారిన తెలుగు భాషా సాహిత్యాలకు విశిష్ట సేవలందిస్తూ, ముఖ్యంగా ఆ ఏలుబడిలో సాంస్కృతిక, సంఘ చైతన్యానికి, ఆంధ్రోద్యమానికి దోహదం చేసిన మనీషి. హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం (1901) అలా ఆవిర్భవించినదే. తెలుగులో తొలితరం కథా రచయిత్రిగా ప్రసిద్ధి పొందిన బండారు అచ్చమాంబ ఆయనకు రెండేళ్ల తేడాతో అక్కగారు. బడికి వెళ్లని ఆమెకు ఆయనే గురువయ్యారు. ఇద్దరూ కలసి చదువుకున్నారు. నాగపూర్ లో ఉండే బావ (అక్క భర్త కూడా) మాధవరావు తెప్పించే తెలుగు పత్రికలను చదివి పరస్పరం ప్రేరణ పొందేవారు. ప్లేగు వ్యాధితో 31 ఏళ్ల పిన్నవయసులో అక్క అకాల మరణంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. ఆమె అంటే వల్లమాలిన ప్రేమానురాగాలు గల ఆయన తన కుమార్తెకు అక్కగారి పేరు (కొమఱ్ఱాజు అచ్బమాంబ) పెట్టుకున్నారు. కొమఱ్ఱాజు అచ్బమాంబ వైద్యురాలిగా ప్రజాసేవ అందించారు. ఆమె విజయవాడ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో పుట్టిన లక్ష్మణరావు నాగపూర్ లో బీ.ఏ. పట్టా పుచ్చుకున్న తరువాత కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ గా ఎం.ఏ. ఉత్తీర్ణులయ్యారు. తండ్రి వేంకటప్పయ్య కృష్ణాజిల్లా మునగాల పరగణాన దివాను. తన కుమారుడు లక్ష్మణరావు భర్త మాదిరిగానే ఆ హోదాలో ఉండాలన్నది తల్లి గంగమ్మ కోరిక. అలా ఆయన నాగపూర్ నుంచి మునగాల చేరుకున్నారు. ఆ సంస్థానం యువరాజా (మైనర్) రాజా నాయని వేంకట రంగారావుతో స్నేహం కుదిరింది. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో ఆ బంధం మరింత బలపడింది. ఆ యువరాజావారు దేశభక్తుడు. ఇతర సంస్థానాధీశుల మాదిరిగా పరపాలకుల పట్ల భయభక్తులు ప్రదర్శించే వారు కాదట. పాల్, లాల్, బాల్ త్రయంలో ఒకరు బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనకు మునగాల రాజా ఏర్పాట్లు చేయగా, కొమఱ్ఱాజు దానిని నిర్వహించారు. బెజవాడ సభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడిగా వ్యవహరించారు. అఖిల భాతర కాంగ్రెస్ సభలకు వీరిద్దరూ హాజరయ్యేవారు.
విజ్ఞాన చంద్రికా మండలి
మాతృభాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలన్న ధ్యేయంతోనూ, ప్రజలలో ఆధునిక విజ్ఞాన వికాసాల కోసం విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి (1906)ని హైదరాబాద్ లో నెలకొల్పారు. రాజా నాయని వేంకట రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి, కొమఱ్ఱాజు సభ్యులు కాగా, ఆదిరాజు వీరభద్రరావు కార్యనిర్వాహక సహాయకులు. మూసీ నది వరదలు (1908), రాజకీయ ఉద్యమాల కారణంగా విజ్ఞానచంద్రికా మండలిని మదరాసుకు మార్చారు. ఆ రోజుల్లోనే ఈ సంస్థకు ఆరు వేలమంది పైచిలుకు చందాదారులుగా ఉండేవారు. మూసీ వరదల సమయంలో విజ్ఞాన చంద్రిక సంస్థ పరిస్థితిపై ఆందోళన చెందుతూ వారు ఉత్తరాల ద్వారా దాని గురించి ఆరా తీయడంలోనే తెలుగు వారు ఆ సంస్థను ఎంతగా ఆరాధించేవారో అర్థమవుతుంది. తెలుగు సైన్స్ గ్రంథాల కొరత తీర్చడానికి జరిగిన తొలి ప్రయత్నమే విజ్ఞానచంద్రిక. ఈ సంస్థ 30 గ్రంథాలు ప్రచురించగా, అందులో సగం, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలే. గురుతుల్యులు కందుకూరి వీరేశలింగం పంతులు స్వీయచరిత్రతో పాటు అనేక చారిత్రక నవలలను ఈ సంస్థ ప్రచురించింది. ‘విజ్ఞానచంద్రికా మండలి సంస్థాపనముతో ఆంధ్రదేశమున సాంస్కృతికముగా ఒక నూతన శకమే ప్రవృత్త మయినది’ అని సుప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రశంసించారు. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలలో కొన్ని పాఠ్య పుస్తకాలుగా ఉండేవి. వాటిలో ఉత్తమశ్రేణి సాధించిన వారికి స్వర్ణ, రజత పతకాలు, నగదు బహమతులు, యోగ్యతా పత్రాలు అంద చేసేవారు. కందుకూరి వీరశలింగం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, పనప్పాకం శ్రీనివాసాచార్యులు విజేతల ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా ఉండేవారు. అలా బహుమతులు అందుకొన్న వారిలో- అనంతర కాలంలో పరిశోధన పరమేశ్వర బిరుదాంకితులు నిడదవోలు వేంకటరావు తదితర ప్రముఖులు ఉన్నారు. చారిత్రక నవలలకు రూ.500 బహుమతులుగా నిర్ణయించగా, భోగరాజు నారాయణమూర్తి ‘విమలాదేవి’, వేంకటశాస్త్రి ‘రాయచూరు యుద్ధం’ ఆ బహుమతులు గెలుచుకొన్నాయి.
విజ్ఞాన సర్వస్వం

