మరుగున పడిన జానపద కళాకారిణి జీవితానికి వెండితెర నివాళి – ‘గరివిడి లక్ష్మి’
ఉత్తరాంధ్ర జానపద కళారంగంలో ఒకప్పుడు మారుమోగిన పేరు గరివిడి లక్ష్మి. ఆమె గొంతులోంచి జాలువారిన బుర్రకథలు, జానపద గీతాలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. 1990వ దశకంలో ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ‘నల్ల జీలకర్ర మొగ్గ’, ‘అత్తరు సాయిబో రారా’ వంటి పాటలు అప్పట్లో విశేష ప్రజాదరణ పొందాయి. ఆమెను అనుకరిస్తూ ఎన్నో జానపద కళాబృందాలు కూడా ఏర్పడ్డాయి.
అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గరివిడి లక్ష్మి జీవితం ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరిగింది. సినిమా అవకాశాల పేరుతో జరిగిన మోసాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘర్షణలు ఆమెను ప్రజాజీవితానికి దూరం చేశాయి. ఒకప్పుడు జానపద కళారంగాన్ని ఏలిన ఆ కళాకారిణి చివరకు ఎక్కడికి వెళ్లింది? ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ చిత్రం.
కష్టాల నుంచి కళాకారిణిగా…
గరివిడి లక్ష్మి అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. విజయనగరం జిల్లా గరివిడి మండలం గెడ్డపువలస ఆమె స్వస్థలం. చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన ఆమెకు బాల్యవివాహం, వైవాహిక జీవితంలోని సమస్యలు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టాయి. భర్త విడిచిపెట్టడంతో ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది.
అయితే పాటలపై ఉన్న ఆసక్తి ఆమెకు ధైర్యాన్నిచ్చింది. కుమ్మరి మాస్టర్ వద్ద బుర్రకథలో శిక్షణ పొందిన ఆమె 1994లో వేదికలపై ప్రదర్శనలు ప్రారంభించారు. అనతికాలంలోనే తన ప్రతిభతో ఉత్తరాంధ్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ‘నవ్వుల బండి’ వంటి కార్యక్రమాలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. మగవారి ఆధిపత్యం ఉన్న బుర్రకథా రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం.
కానీ కీర్తి శిఖరాలను అధిరోహించిన ఆమె జీవితంలో ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు విషాదకరమైనవి.
వెండితెరపై గరివిడి లక్ష్మి జీవితం
మరుగున పడిన ఈ జానపద కోయిలకు సినిమా రూపంలో గుర్తింపు కల్పించిన ప్రయత్నం అభినందనీయం. ఉత్తరాంధ్ర బుర్రకథా సంప్రదాయాన్ని, దాని వెనుక ఉన్న కళాకారుల జీవితాలను తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించారని చెప్పవచ్చు.
సినిమా కథ
ఒక యువ సినీ పరిశోధకుడు (అంకిత్ కొయ్య) గరివిడి లక్ష్మి ఆచూకీ కోసం అన్వేషించడంతో ప్రారంభమవుతుంది. ఆ అన్వేషణ క్రమంలో ఆమె జీవితంలోని వివిధ దశలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. రాంబాబు (వీకే నరేష్) ప్రోత్సాహం, సత్తిబాబు (రాగ్ మయూర్) సహకారంతో బుర్రకథా రంగంలో అడుగుపెట్టిన విజయలక్ష్మి, తన గ్రామం పేరుతోనే ‘గరివిడి లక్ష్మి’గా ప్రసిద్ధి చెందుతుంది. తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ అగ్రస్థానానికి చేరుకుంటుంది. అయితే ఆ తర్వాత ఎదురైన మోసాలు, కుట్రలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది కథలో కీలకాంశం.
దర్శకుడు స్వయంగా గరివిడి ప్రాంతానికి చెందినవారు కావడం ఈ కథకు మరింత సహజత్వాన్ని చేకూర్చింది. అనవసరమైన వాణిజ్య హంగులకు ప్రాధాన్యమివ్వకుండా, ఒక కళాకారిణి జీవితాన్ని, ఉత్తరాంధ్ర జానపద సంస్కృతిని తెరపైకి తీసుకురావడంలో ఆయన చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
ముఖ్యంగా బుర్రకథ వైభవం నుంచి ఆడియో క్యాసెట్ల కాలం, ఆ తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతి వరకు జానపద కళారంగంలో వచ్చిన మార్పులను చూపించిన తీరు ఆసక్తికరంగా ఉంది.
ఆనంది నటన… చిత్రానికి ప్రాణం
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది అద్భుతంగా నటించారు. బాల్యం నుంచి కళాకారిణిగా ఎదిగే క్రమం, వేదికపై ఆమె చూపించే ఉత్సాహం, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు… ఇలా పాత్రలోని భిన్న కోణాలను సహజంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా బుర్రకథలు చెప్పే సన్నివేశాల్లో ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. చివరి భాగంలోని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకుల మనసును తాకుతుంది.
సత్తిబాబు పాత్రలో రాగ్ మయూర్ మంచి నటన కనబరిచారు. వీకే నరేష్ తన పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చారు. రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక విభాగాలు
చరణ్ అర్జున్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జానపద గీతాలు, బుర్రకథ ప్రదర్శనలు కథకు ప్రత్యేకమైన మట్టి వాసనను అద్దాయి. పాటలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, గరివిడి లక్ష్మి కళాప్రపంచాన్ని ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయి.
జె. ఆదిత్య సినిమాటోగ్రఫీ పల్లె వాతావరణాన్ని, వేదికలపై జరిగే ప్రదర్శనలను సహజంగా చిత్రీకరించింది. ఉత్తరాంధ్ర యాసను పలికించడంలో సంభాషణల రచన కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సాంకేతిక నిపుణులు
- నిర్మాతలు: కృతి ప్రసాద్, టీజీ విశ్వ ప్రసాద్
- దర్శకుడు: గౌరీ నాయుడు జమ్ము
- సినిమాటోగ్రఫీ: జె. ఆదిత్య
- సంగీతం: చరణ్ అర్జున్
- గాయనీగాయకులు: అనన్య భట్, గౌరీ నాయుడు జమ్ము, చరణ్ అర్జున్, జానకీరామ్
పాటలు
- గణ గణ నాయక వినాయక
- నల్ల జీలకర్ర మొగ్గ
- కోసింది కోయగూర
- నాధ కలిపోతుంది
- ఘల్ ఘల్ గజ్జల మోత
- చందమామ చందమామ
- అలగలగే అలగలగే
- బలె బలె బంగారు రమణమ్మ
- డిమితా సుందరి
నటీనటులు
ఆనంది, రాగ్ మయూర్, వీకే నరేష్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, ఎల్.బి. శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, షకలక శంకర్, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ తదితరులు.
కొసమెరుపు
మరుగున పడిన ఒక జానపద కళాకారిణి జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడం ఈ చిత్రంలోని ప్రధాన విశేషం. ఆనంది అద్భుత నటన, జానపద సంగీతం, పల్లెటూరి నేపథ్యం, ముఖ్యంగా చివరి 35–40 నిమిషాల్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు చిత్రానికి బలంగా నిలుస్తాయి.
అయితే ఫస్టాఫ్‌లో లక్ష్మి బాల్యం, కుటుంబ నేపథ్యానికి ఎక్కువ సమయం కేటాయించడంతో కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. ఆమె ఎదుర్కొన్న మోసాలు, జీవితంలోని కీలక సంఘటనలను మరింత బలంగా చూపించి ఉంటే కథలో సంఘర్షణ మరింత ప్రభావవంతంగా ఉండేది. అక్కడక్కడా ‘మహానటి’ ఛాయలు కూడా కనిపిస్తాయి.
మొత్తానికి, ‘గరివిడి లక్ష్మి’ ఒక మరుగున పడిన జానపద కళాకారిణి జీవితానికి ఇచ్చిన నిజాయితీతో కూడిన వెండితెర నివాళి. ఒకప్పుడు తన గాత్రంతో వేలాది మందిని అలరించిన కళాకారిణి జీవితంలోని విషాదాన్ని, ఆమె కళా వైభవాన్ని గుర్తుచేసే ప్రయత్నం ఇది. బయోపిక్‌లు, జానపద కళల నేపథ్యంలోని సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. వేగవంతమైన కథనాన్ని ఆశించే ప్రేక్షకులకు కొంత నెమ్మదిగా అనిపించినా, ఒక కళాకారిణికి దక్కాల్సిన గుర్తింపును తెరపైకి తీసుకురావడంలో ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుంది.

