చదరంగ క్రీడలో భారత్ ‘విశ్వగురువు’ హోదాకు మరింత చేరువయ్యింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రపంచస్థాయిలో అత్యుత్తమ చదరంగ దేశంగా నిలకడగా రాణిస్తూ వస్తున్న భారత్ టీమ్, వ్యక్తిగత విభాగాలలో అవార్డుల పంట పండించుకుంది… ఇతిహాస క్రీడ చదరంగానికి…భారత్ కు విడదీయరాని అనుబంధమే ఉంది. చదరంగ క్రీడ లేని భారత్ ను ఊహించడం అసాధ్యం. కాలానుగుణంగా మారుతూ కొత్తపుంతలు తొక్కతోన్న ఈ మేధో క్రీడలో సైతం భారత్ తన ప్రత్యేకతను చాటుకొంటూ నీరాజనాలు అందుకొంటోంది.

200 దేశాలలో నిత్యనూతనంగా…

క్రీడలు ఎన్నిఉన్నా మేధోక్రీడ చదరంగం తరువాతే ఏదైనా. అత్యంత పురాతన క్రీడలలో ఒకటైన చదరంగం ఉనికి వేల సంవత్సరాల నాటిదని భారత ఇతిహాసాలు చెప్పకనే చెబుతున్నాయి. యుగాలు, శతాబ్దాలుగా తన ఉనికిని కాపాడుకొంటూ, కాలపరీక్షకు తట్టుకుంటూ, కాలానుగుణంగా మారుతూ నిత్యనూతనంగా తయారైన 64 గడుల ఆటకు ఆధునిక రూపమే చెస్ లేదా చదరంగం. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలకు విస్తరించిన ఈ మేథో క్రీడ ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో 1969 నుంచి ప్రతి ఏటా జులై 20వ తేదీని ‘అంతర్జాతీయ చదరంగ క్రీడాదినోత్సవంగా’ పరిగణిస్తూ వస్తోంది. భారత ఇతిహాసాల నుంచి విశ్వవ్యాప్తమైన ఆధునిక చదరంగానికి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. 1960 దశకం నుంచి చదరంగ క్రీడలో అలనాటి సోవియెట్ యూనియన్, దాని మాజీ రిపబ్లిక్ లు, చైనా, అమెరికా లాంటి దేశాలు ఆధిపత్యం చలాయిస్తూ వచ్చాయి. అయితే రష్యా, ఇతర అగ్రగామి దేశాల ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడటమే కాదు. ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ లాంటి గొప్ప సూపర్ గ్రాండ్ మాస్టర్ ను అందించడం ద్వారా భారత్ ఓ మహాశక్తిగా అవతరించింది.

విశ్వనాథన్ ఆనంద్ తో చదరంగ విప్లవం…

సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తో మొదలైన భారత ఆధునిక చదరంగ చరిత్ర, గ్రాండ్‌మాస్టర్ల పరంపర మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి వరకూ వచ్చి ఆగింది. ప్రస్తుత భారత చదరంగంలో 93 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు ఉంటే… వీరిలో ముగ్గురంటే ముగ్గురు మాత్రమే (కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్ బాబు) మహిళా గ్రాండ్‌మాస్టర్లు కావడం విశేషం. మన తెలుగు రాష్ట్ర్రాల నుంచి పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరగేసీ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్ మాత్రమే గ్రాండ్ మాస్టర్ హోదాతో పాటు భారత జట్లలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఒక్కరు కాదు…నలుగురు!.. భారత చదరంగం అనగానే ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే గుర్తుకు వస్తాడు. అయితే… 54 ఏళ్ల సూపర్ గ్రాండ్ మాస్టర్ ఆనంద్ వారసులుగా ఒకరు కాదు… ఇద్దరు కాదు… ఏకంగా మెరికల్లాంటి నలుగురు కుర్ర గ్రాండ్ మాస్టర్లు దూసుకొచ్చారు. తెలుగుతేజాలు పెంటేల హరికృష్ణ, అర్జున్ ఇరగేసిలతో పాటు గుకేశ్, ప్రజ్ఞానంద్, విధిత్ గుజరాతీ భారత పురుషుల జట్టులో సభ్యులుగా ఉంటే… మహిళల జట్టుకు గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక, తాన్యా సచ్ దేవ్, వైశాలీ, దివ్య దేశ్ ముఖ్, వాటికా అగర్వాల్ ప్రాతినిథ్యం వహించారు. టీమ్ స్వర్ణ పతకం కోసం మొత్తం 11 ప్రపంచ మేటి జట్లు తలపడితే భారత్ తిరుగులేని విజేతగా అవతరించింది. 2024 నుంచి 2026 చదరంగ ఒలింపియాడ్ వరకూ టీమ్, వ్యక్తిగత విభాగాలలో భారత్ నిలకడగా రాణిస్తూ వచ్చింది. స్వర్ణాలతో పాటు పురుషుల ప్రపంచ టైటిల్ ను సైతం భారత్ కైవసం చేసుకోడం ద్వారా ప్రపంచ చదరంగ సరికొత్త ‘సూపర్ పవర్’ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. హంగరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా 2024లో ముగిసిన 45వ విశ్వ చదరంగ ఒలింపియాడ్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ తొలిసారిగా బంగారు పతకాలు గెలుచుకోవడం ద్వారా చైనా, రష్యా, అమెరికా, కజకిస్థాన్, ఉక్రెయిన్ జట్ల ఆధిపత్యానికి తెరదించగలిగింది. ఒలింపిక్స్ తరహాలోనే చదరంగంలోనూ ప్రపంచ దేశాల నడుమ ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి ఒలింపియాడ్ ను నిర్వహిస్తారు. పురుషుల, మహిళల టీమ్ విభాగాలతో పాటు…వ్యక్తిగత విభాగాలలో సైతం స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం అంతర్జాతీయ చదరంగ సమాఖ్య పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. భారత్ మాత్రం 2022 చదరంగ ఒలింపియాడ్ వరకూ పురుషుల టీమ్ విభాగంలో రెండంటే రెండు మాత్రమే కాంస్య పతకాలు సాధించగలిగింది. ట్రోమ్సో వేదికగా జరిగిన 2014 ఒలింపియాడ్ , 2022 చెన్నై చదరంగ ఒలింపియాడ్ పోటీలలో భారత పురుషుల జట్టు కంచు పతకాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే…2024 ఒలింపియాడ్ లో అంచనాలకు మించి రాణించడం ద్వారా భారత్ పురుషుల, మహిళల విభాగాలలో విశ్వవిజేతగా అవతరించింది.

అమెరికాపై గెలుపుతో స్వర్ణోదయం…

టీమ్ విభాగంలో బంగారు పతకం సాధించాలంటే జట్టులో ఒకరో ఇద్దరో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటే ఏమాత్రం సరిపోదు. జట్టులోని ఐదుగురు సభ్యులు ఒకేస్థాయి ప్రతిభ కలవారైతేనే విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. భారత పురుషుల జట్టు తొలిరౌండ్ లో మొరాకోను 4-0తోనూ, రెండవ రౌండ్ లో ఐస్ లాండ్ ను 4-0తోను చిత్తు చేయడం ద్వారా శుభారంభం చేసింది. మూడవ రౌండ్ లో ఆతిథ్య హంగెరీ-బీ జట్టును 3.5- 0.5, నాలుగవ రౌండ్ లో సెర్బియా, 5వ రౌండ్ లో అజర్ బెజాన్, 6వ రౌండ్ లో హంగెరీ ప్రధాన జట్టును, 7వ రౌండ్ లో చైనాను 2.5- 1.5తోను, 8వ రౌండ్ లో ఇరాన్ ను సైతం 3.5- 0.5 పాయింట్లతోను అధిగమించింది. కీలక 9వ రౌండ్ లో ఉజ్బెకిస్థాన్ తో పోరును 2-2తో సమం చేయడంతో పాటు 10వ రౌండ్ లో పవర్ ఫుల్ అమెరికాను సైతం 2.5- 1.5 పాయింట్లతో కంగు తినిపించడం ద్వారా బంగారు పతకానికి చేరువయ్యింది. నిర్ణయాత్మక ఆఖరి, 11వ రౌండ్ పోరులో స్లవేనియాపై 3.5- 0.5తో నెగ్గడం ద్వారా విశ్వవిజేతగా భారత్ తొలిసారి స్వర్ణపతకం అందుకోగలిగింది. భారత విజయాలలో తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్ , తమిళనాడు గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రధానపాత్ర పోషించారు. మొత్తం 22 పాయింట్లకు భారత జట్టు 21 పాయింట్లు సంపాదించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది.

మహిళల విభాగంలోనూ అదేజోరు…

మహిళల విభాగంలో నిలకడగా రాణిస్తూ వచ్చిన భారత్ కు ఆఖరి రౌండ్ లో కాస్త అదృష్టం కూడా కలసి వచ్చింది. జమైకా, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ , కజకిస్థాన్, ఆర్మేనియా, జార్జియా, పోలెండ్, అమెరికా, చైనా జట్లను ఓడించిన భారత్ ఆఖరి, 11వ రౌండ్ లో అజర్ బేజాన్ ను 3.5-0.5 పాయింట్లతో చిత్తు చేసి తొలిసారిగా బంగారు పతకం అందుకోగలిగింది. నిర్ణయాత్మక 11వ రౌండ్ పోరులో టైటిల్ ఫేవరెట్ కజకిస్థాన్ ను అమెరికా నిలువరించడంతో భారత మహిళలకు బంగారు పతకం ఖాయమయ్యింది.

సమర్ ఖండ్ ఒలింపియాడ్ లో… ఉజ్బెక్ నగరం సమర్ ఖండ్ వేదికగా 12 రోజులపాటు జరిగిన 46వ చదరంగ ఒలింపియాడ్ లో సైతం భారత్ పురుషుల, మహిళల విభాగాలలో పతకాలతో మెరిసి మురిసింది. భారత జట్లు విశ్వ విజేతలుగా తమ హోదాను నిలుపుకోలేకపోయినా ప్రపంచ మొదటి మూడు అత్యుత్తమ జట్లలో నిలువగలిగాయి. పురుషుల టీమ్ విభాగంలో గత ఒలింపియాడ్ లో బంగారు పతకం సాధించిన భారత జట్టు సభ్యులు ఈసారి మాత్రం రజత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ప్రస్తుత విజేతగా మహిళల బరిలో నిలిచిన భారతజట్టు కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మొత్తం 11 రౌండ్ల పోరులో ఐదుగురు సభ్యుల (గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరగేసి, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ , గుకేశ్ దొమ్మరాజు, విధిత్ గుజరాతీ ) భారత జట్టు రజత విజేతగా నిలిచింది. మహిళల టీమ్ టైటిల్ కోసం జరిగిన పోరులో కోనేరు హంపి, దివ్యదేశ్ ముఖ్, సవిత శ్రీ, వైశాలి సభ్యులుగా పోటీకి దిగిన భారత్ కు కాంస్య పతకం మాత్రమే దక్కింది. టీమ్ విభాగాలలో రెండు పతకాలు సాధించిన భారత్ కు పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలతో పాటు అత్యుత్తమ చదరంగ దేశం అవార్డులు లభించాయి. అత్యుత్తమ క్రీడాకారులకు ఇచ్చే అవార్డులను భారత గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, సవిత గెలుచుకొన్నారు.

ప్రపంచ అత్యుత్తమ చదరంగ దేశంగా భారత్…

గత మూడేళ్లుగా ప్రపంచ చదరంగంలో నిలకడగా రాణిస్తున్న భారత్ కు పురుషుల అత్యుత్తమ జట్టుకు ఇచ్చే నోనా గప్రిన్ దష్ విలీ ట్రోఫీని, అత్యుత్తమ చదరంగ సమాఖ్య అవార్డులను ఇచ్చి గౌరవించారు. 2024 బుడాపెస్ట్, 2022 చెన్నై చదరంగ ఒలింపియాడ్ లతో పాటు ప్రస్తుత ఒలింపియాడ్ లోనూ మొదటి మూడు అత్యుత్తమ జట్లలో నిలిచినందుకు భారత్ కు ఈ గౌరవం దక్కింది. రష్యా, ఉజ్బెకిస్థాన్, చైనా, కజకిస్థాన్, జర్మనీ, అమెరికా, స్పెయిన్, హంగెరీ లాంటి మేటిజట్లను భారత్ అధిగమించి ప్రపంచ చదరంగ సరికొత్త శక్తిగా గుర్తింపు సంపాదించుకొంది.

ప్రపంచ క్యాండిడేట్స్ సమరంలోనూ…

చదరంగ ఒలింపియాడ్ లో మాత్రమే కాదు…వ్యక్తిగత విభాగం పురుషుల, మహిళల విభాగాలలో సైతం భారత గ్రాండ్ మాస్టర్లు తమ సత్తా చాటుకుంటూ దేశానికే గర్వకారణంగా నిలుస్తూ వస్తున్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో భారత్ తరపున క్యాండిడేట్స్ టోర్నీకి విశ్వనాథన్ ఒక్కడే అర్హత సాధించగలిగితే…2024 క్యాండిడేట్స్ టోర్నీకి రికార్డు స్థాయిలో ముగ్గురు భారత గ్రాండ్ మాస్టర్లు అర్హత సాధించడం, ప్రపంచ చదరంగ టైటిల్ సమరంలో చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లి రెన్ ను మన కుర్ర గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కంగు తినిపించడంతో భారత్ విశ్వ చదరంగ సరికొత్త శక్తిగా అవతరించగలిగింది. విశ్వ చదరంగ విజేత టైటిల్ కోసం రెండేళ్ల క్రితం నిర్వహించిన 2024 ప్రపంచ క్యాండిడేట్స్ పురుషుల, మహిళల విభాగాలలో నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు తొలిసారిగా అర్హత సాధించడం ఓ అరుదైన ఘనతగా, అసాధారణ రికార్డుగా మిగిలిపోతుంది. పురుషుల క్యాండిడేట్స్ టోర్నీలో యువగ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానంద్, విధిత్ గుజరాతీతో పాటు మహిళల విభాగంలో కోనేరు హంపి, వైశాలీ భారత్ కు ప్రాతినిథ్యం వహించారు.

తెలుగు వెలుగుల భారత చదరంగం…

భారత చదరంగానికి దక్షిణ భారత రాష్ట్ర్రాలు ( తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ) ఆయువుపట్టుగా నిలుస్తూ వస్తున్నాయి. విశ్వనాథన్ ఆనంద్ లాంటి జగజ్జేతను అందించిన తమిళనాడుకు ప్రస్తుతం తెలుగు మూలాలున్న సూపర్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చాంపియన్ గుకేశ్ తోపాటు గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద్, వైశాలీ ప్రాతినిథ్యం వహిస్తుంటే… తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన గ్రాండ్ మాస్టర్ల త్రయం పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారికతో పాటు యువకెరటం సవిత ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కాగా…తెలంగాణాకు చెందిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి భారత పురుషుల జట్టు కీలక ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. భారత పురుషుల, మహిళల జట్ల సభ్యుల్లో తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు, ఓ ఇంటర్నేషనల్ మాస్టర్ సభ్యులుగా ఉండటం ఉభయరాష్ట్ర్రాలకు గర్వకారణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

చదరంగ విజేతలకు భారీ ప్రోత్సాహకాలు…

చదరంగ క్రీడలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో టీమ్, వ్యక్తిగత విభాగాలలో ఖ్యాతి తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సాహక నగదు బహుమతులతో సత్కరించడానికి కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. 2024 చదరంగ ఒలింపియాడ్ బంగారు పతక విజేతలపై భారత క్రీడా మంత్రిత్వశాఖతో పాటు… భారత చదరంగ సమాఖ్య, తమిళనాడు, తెలంగాణా రాష్ట్ర్ర ప్రభుత్వాలు ప్రోత్సాహక నగదు బహుమతుల వర్షం కురిపించాయి. భారత జట్టులోని ఒక్కో సభ్యుడికి 25 లక్షల రూపాయల చొప్పున జాతీయ చెస్ సమాఖ్య అందచేసింది. శిక్షకులు, సహాయ శిక్షకులకు సైతం నగదు బహుమతులు ప్రకటించింది. యువగ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు 70 లక్షలు, ప్రజ్ఞానందకు 70 లక్షలు, అర్జున్ ఇరగేసికి 45, విదిత్ గుజరాతీకి 45, హరికృష్ణకు 45 లక్షలు, ద్రోణవల్లి హారికకు 45 లక్షలు, వైశాలీకి 70 లక్షలు, దివ్యదేశ్ ముఖ్ కు 45 లక్షలు, వంటికా అగర్వాల్ కు 45 లక్షలు, తాన్యా సచ్ దేవకు 45 లక్షల చొప్పున నగదు దక్కింది. తెలుగు రాష్ట్ర్రాల గ్రాండ్ మాస్టర్లు అర్జున్, హారికలకు తెలంగాణా ముఖ్యమంత్రి 25 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. ప్రపంచ చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ వ్యక్తిగత విభాగంలో ఐదు ప్రపంచ టైటిల్స్ తో అతిగొప్ప విజయాలతో దేశానికే గర్వకారణంగా నిలిస్తే…ఇప్పుడు గుకేశ్ సాధించిన ప్రపంచ టైటిల్ తో పాటు… ఒలింపియాడ్ లో భారత పురుషుల, మహిళల జట్లు సాధించిన విజయాలు అపూర్వ విజయాలుగా మిగిలిపోతాయి. ప్రపంచంలోనే అత్యధిక క్రికెట్ అభిమానులున్న భారత్ చదరంగ క్రీడలో సైతం ప్రపంచ మేటిగా నిలవడం ఆశ్చర్యం కాక మరేమిటి. !