శ్రీ చంద్రశేఖర అజాద్ కథ అవర్ణం …కళ, కళాకారుడు, విమర్శ — కళాకారుడి అంతర్మథనం…ఈ సంక్లిష్ట భావాలను గొప్పగా ఆవిష్కరించింది. ఇవి సామాన్య పాఠకుల, పండితుల, విమర్శకుల వారి వారి మేధ, ఆలోచనా స్థాయిల బట్టి వారి అవగాహనుభవంలోకి వస్తాయి. కథకుండే… చిన్న కాన్వాసును ఎంతో ప్రతిభావంతంగా, కథా శిల్పావిష్కరణకు వలసిన ప్రతి అంశాన్ని వాడవలసిన వాటిలో కచ్చితత్వాన్ని పాటిస్తూ; సమర్థ నిర్వహణతో, ప్రణాళికతో కథను చెప్పే కొద్దిపాటి రచయితల సంఖ్య వేళ్లమీదే! వారిలో ఈ రచయిత ఒకరు. చంద్రశేఖర్ ఆజాద్ కథలు… అన్న సంపుటిలోని ఈ అవర్ణం చిత్రకారులను, వారి చిత్రాలను, వాటిని కొనే ధనవంతులను, చిత్రకళా విమర్శకులను ఆలోచింపచేసి, వారిని అంతర్ముఖులను చేసే కథ.

సందర్భం 1

అవి జూబ్లీ హిల్స్ కొండలు…నల్లని చీకటి…కీచురాళ్ళ సంగీతం… నల్లటి రాళ్ళ మధ్య బద్రి, మూర్తి…. ప్లాస్టిక్ గ్లాసులో వున్న విస్కీ తాగాడు… ఇది చూస్తున్న మూర్తికి ఆశ్చర్యంగా వుంది. విశ్వవిఖ్యాతుడైన బద్రి ఇక్కడ…ఇలా…!!

వ్యాఖ్య

జాతీయ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, తన అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీలతో చిత్రకళా ప్రియులను, విమర్శకులను ఎంతో ఆనంద పరవశులను చేసిన బద్రి ఇక్కడ ఇలా అనామకుడిగా, ఏకాకిగా ఉండటం మూర్తినే కాదు, చిత్రకళా జగత్తు యావత్తునూ విస్తుపోయేలా చేయటం సహజమే. ఇక్కడ బద్రి, కళా విమర్శకుడు మూర్తి మధ్య జరిగిన సంభాషణలో రచయిత అజాద్ చిత్రకళ, దాని విమర్శ గురించి కొన్ని గొప్ప ఆలోచనలను చొప్పించారు.

ప్రతిభావంతుడైన సృజనశీలి ఎవరైనా… అంటే ఏ రంగానికి చెందినవాడైనా, తాను ఆవిష్కరించదలచుకున్న విషయపు లోతులను స్పృశించకుండా, అది చేరుకోగల ఎత్తులను అందుకోకుండా ఉండటం అసాధ్యం. ఇది కవిత్వ, కథా సృజనలలో సహజం. వారి ఆలోచన ఊహకు ఆవలి వైపే! అయితే, ఇలా చేసేటప్పుడు రచయిత తన సమతుల్యతను కోల్పోకూడదు. రచయిత తాను చేరుకున్న భావసామ్రాజ్యపు విస్తరణను స్పష్టమైన ఆలోచనతో, చక్కని అభివ్యక్తితో అక్షరబద్ధం చేయగల సమర్థుడై ఉండాలి. ఇది నిస్సందేహంగా ఒక అసిధారావ్రతమే. అయితే, ఇంతటి భావసాంద్రతలను, భావగాఢతలను చెప్పేందుకు భాషను సాధ్యమైనంత సరళంగా వాడగలగాలి. భావాలలోని చిక్కదనం వల్ల పాఠకులకు రచయిత చెప్పదలుచుకున్నది అర్థం కాకపోవచ్చేమో గాని, భాష వల్ల మాత్రం కాకూడదు. అయినా, పాఠకులు తన భావాలను అందుకోలేకపోతే? అన్న సంశయం రచయితకు రావచ్చు. అయినా సరే , రచయిత వెరవకూడదు. రచన ప్రధాన ఉద్దేశం పాఠకులకు అర్థం కావటమే. దీనిని ఎవరూ కాదనలేరు. అందుకే రచయిత తాను చెప్పేది చదువరులకు అందేటట్టే రాయాలి. కానీ, అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. రచయిత తన భావాల స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, తన భావాలను వ్యక్తం చేసే భాషను పాఠకుడికి అడ్డంకిగా కూడా మారకుండా చూసుకోవాలి . రచయిత భావాలను చేరుకోవాలంటే పాఠకుల స్థాయి పెరగాలి. అప్పుడే వారు రచయిత ఊహా వెంట సాగిపోగలరు. ఒకవేళ, ఆ తరంలో ఎవ్వరూ ఆ కవి ఆలోచనల వేగంతో పరుగెత్తలేనప్పుడు… భావితరాల వారు వాటిని పట్టుకోవచ్చు. అందుకే అక్షర సృజనశీలి తన అద్భుతమైన భావ మేఘాలను అక్షర జల్లులుగా, అవసరమైతే జడివానగా కురిపించటం అనివార్యం. ఎందుకంటే, నిజమైన సృజనశీలి తన కాలానికి మాత్రమే చెందినవాడు కాదు. తన ఆలోచనలను అందుకోగల భావితరాల కోసం కూడా అతడు రాస్తూనే ఉంటాడు. రాయాలి కూడ!

అందుకే గొప్ప రచనలు కొన్ని తమ కాలంలో పూర్తిగా అర్థం కాకపోయినా, కాలం గడిచే కొద్దీ కొత్త తరాల చేతుల్లో కొత్త అర్థాలను, కొత్త వెలుగులను పొందుతాయి. వీటిని ఎలా, ఎంత సమర్థంగా శ్రీ చంద్రశేఖర అజాద్ నిర్వహించారో చూద్దాం.

ఇప్పుడు మూర్తి, బద్రిల మాటలను వినండి…. రోడ్డు మీద మీరు వేసింది బొమ్మ కావచ్చు.దాన్ని ‘ఆర్ట్’ అంటారా? మీరేమంటారు ? అది చిత్రం కావచ్చు. ఇంకేదైనా కావచ్చు. ఇలా ఆవిర్భవించి అలా అదృశ్యమయ్యేది ‘కళ’ అవుతుందా ? అది శతాబ్దాలలోకి ప్రయాణం చేయాలి కదా అనుకుంటున్నప్పుడు… ‘ఆర్ట్’ కి నిర్వచనం వుందా ? ఎందుకు లేదు ? మీరు ఇంతకు ముందు ఆర్ట్ ను నిర్వచిస్తూ దాని లక్షణాలను వివరిస్తూ రాసిన ఆర్టికల్స్ నా దగ్గర వున్నాయి.

వ్యాఖ్య

కళా విమర్శకుడిగా మూర్తి ఉద్దేశం ప్రకారం రోడ్డు మీద కళాకారులు వేసేవి కేవలం బొమ్మలు మాత్రమే కావచ్చు. వాటిని వెంటనే ‘ఆర్ట్’ అని పిలవచ్చా? అన్న సంశయం మూర్తికి కలిగింది. ‘కళ’కు ఒక శాశ్వతత్వం ఉండాలని మూర్తి భావన. అది ఎలా?కళ కాలాన్ని తట్టుకుని నిలవాలి. ఒక తరం నుండి మరో తరానికి, అక్కడి నుండి భావితరాలకు ప్రయాణించాలి. శతాబ్దాలను దాటి కూడా తన ఉనికిని చాటుకుంటూ, మనిషి మనసుతో సంభాషించగలగాలి. అప్పుడే అది నిజమైన ‘కళ’ అవుతుందన్నది మూర్తి అభిప్రాయం. ఈ రోజే జీవం పోసుకుని, కొద్దిసేపటికే అదృశ్యమైపోయేది కళ అవుతుందా? రోడ్డు మీద వేసే కొన్ని అద్భుతమైన చిత్రాలను భద్రపరచగలిగితే, వాటిని తరువాతి తరాల వారు కూడా చూడగలరు. వాటి కళాత్మక విలువను ఆస్వాదించగలరు. కానీ, రోడ్డు మీద ఆవిష్కరించబడే కళారూపాల విషయంలో అది సాధ్యం కాదు. అయితే… అంతమాత్రాన రోడ్డు మీద బొమ్మలు వేసే చిత్రకారులలో అద్భుతమైన కళాకారులు లేరా? వారి చిత్రాలను ఆ క్షణంలోనే వీక్షించి, ఆనందపరవశులైనవారు ఉండరా? ఆ అద్భుత చిత్రకారుడి సృజనాత్మకత, ఊహాశక్తి, కల్పనాశక్తి, చేతివేళ్ల చురుకుదనం—అన్నీ కలిసి అతడు వేసే చిత్రంలోకి ప్రవహిస్తున్నప్పుడు… ఆ చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులలో ఒకరిద్దరైనా— “ఓహ్… సెబాస్!” అని ఆశ్చర్యపోయి ఉండరా? ఆ క్షణంలో ఆ చిత్రకారుడు సృష్టించిన కళకు విలువ లేదా? ఆ చిత్రం కొద్దిసేపటికే చెరిగిపోవచ్చు. కాలంతో పాటు అదృశ్యమైపోవచ్చు. కానీ… అది వీక్షకుడి మనసులో రేపిన ఆనందం కూడా అదృశ్యమైపోతుందా? యోచించండి.

కానీ బద్రి మాటలు ఇక్కడ మరో కోణాన్ని కూడా మన ముందుంచుతున్నాయి. రోడ్డు మీద వేసినది బొమ్మ కావచ్చు, చిత్రం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది క్షణికమైనదై ఉండవచ్చు. ఆవిర్భవించి అలా అదృశ్యమైపోవచ్చు. అంతమాత్రాన అది కళ కాదా? కళకు శాశ్వతత్వమే ఏకైక కొలమానమా? ‘ఆర్ట్’కి నిర్వచనం ఉందా? అని ప్రశ్నించిన బద్రికే—ఎందుకు లేదు? మీరు ఇంతకు ముందు ఆర్ట్‌ను నిర్వచిస్తూ, దాని లక్షణాలను వివరిస్తూ రాసిన వ్యాసాలు నా దగ్గర ఉన్నాయి కదా—అని గుర్తుచేయడం ద్వారా, కళను ఒకే నిర్వచనంలో బంధించడం ఎంత కష్టమో కూడా సూచిస్తున్నాడు. అంటే, మూర్తి దృష్టిలో కళ కాలాన్ని జయించి, తరాలను దాటి ప్రయాణించేదైతేనే ‘ఆర్ట్’. కానీ బద్రి ప్రశ్న మాత్రం—కాలపరిమితి కళ విలువను నిర్ణయిస్తుందా? క్షణికమైన సృజనలో కళ ఉండదా?—అన్న ఆలోచనను మనలో రేకెత్తిస్తుంది.

సందర్భం 2

వారిరువురి ఇంకో సంభాషణ వినండి… ఆర్ట్ గురించి నేనేమన్నా అజ్ఞానంతో రాస్తే, దాన్నుంచి నేను బయటపడకూడదా ? మీరు నిజంగా అజ్ఞానంతో రాసారా? అందుకే అన్నాను… ఆర్ట్ కి నిర్వచనం వుందా అని, ఈ కళారూపాన్నైనా ఎవరు నిర్వచించాలి. మీకో అబ్బాయో, అమ్మాయో వుండొచ్చు.అయిదు సంవత్సరాల వయస్సు ఉండచ్చు.వాళ్లు వేసేది బొమ్మే కదా ? అవుతుంది… కానీ… అదే బొమ్మ నేను వేసి కింద… బద్రి…అని సంతకం పెడితే ఎన్ని లక్షలకు కొంటారు ?

వ్యాఖ్య

ఇక్కడ కూడా వారి సంభాషణ ఎంత సహజంగా సాగుతుందో చూడండి. కళ గురించి తాను అజ్ఞానంతో ఏమైనా రాసి ఉంటే, దాని నుంచి బయటపడకూడదా? అని అడుగుతాడు. అందుకు వచ్చిన సమాధానం కూడా ప్రశ్నగానే ఉంటుంది—“మీరు నిజంగా అజ్ఞానంతో రాసారా?” అసలు విషయం అక్కడే ఉంది. కళ గురించి మాట్లాడుతున్నప్పుడు, దానికి ఒక నిర్వచనం ఉండాలా? అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు ఈ కళారూపాన్ని అయినా ఎవరు నిర్వచించాలి? అన్న ప్రశ్నను ముందుకు తెస్తాడు. మీకొక అయిదేళ్ల అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. వాళ్లు వేసేది బొమ్మే కదా? అవును… బొమ్మే. కానీ… ఆ ‘కానీ’ దగ్గరే అసలు విషయం మొదలవుతుంది. అదే బొమ్మను ఒక ప్రసిద్ధ చిత్రకారుడు వేసి, దాని కింద తన పేరు సంతకం పెడితే? దాని విలువ ఎంత మారిపోతుంది! అంటే, బొమ్మ బొమ్మగానే ఉన్నా, దాన్ని వేసిన వ్యక్తి ఎవరు అన్నది కూడా దాని విలువను నిర్ణయిస్తుందా? కళాఖండాన్ని మనం చూస్తున్నామా? లేక…. కళాకారుడి పేరునా? ఇంత చిన్న ప్రశ్నలో ఎంత పెద్ద విషయాన్ని శ్రీ అజాద్ ఎలా ఇమిడ్చారో చూడండి ! శ్రీ చంద్రశేఖర అజాద్ ఎంత అలతి అలతి పదాలతో, చిన్న వాక్యాలలో కళ నిర్వచనాన్ని, దాని విభిన్న పార్శ్వాలు, వాటి భావనలను మన అనుభవంలోకి తెచ్చారో

సందర్భం 3

అవి జూబ్లీ హిల్స్ కొండలు… బద్రి, మూర్తి తమ సంభాషణ కొనసాగిస్తున్నారు

బద్రి మాట్లాడుతున్నాడు… నేను చాలా మంది ఆర్టిస్టులను చూసాను. ఆర్ట్ క్రిటిక్స్ లనూ చూసాను. నాలోనే ఆర్టిస్టు, క్రిటిక్ వున్నారు. ఒకప్పుడు నా చిత్రాల్ని విమర్శిస్తే రగిలిపోయేవాణ్ని. నాలో ఆశాంతి. వాళ్లకి వర్ణాల గురించి, చిత్ర కళారీతుల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారనిపించేది. వారిని కవ్వించటం కోసం వర్ణాల్ని ఇష్టమొచ్చిన రీతిలో ఉపయోగిస్తూ మరింత నైరూప్యంగా చిత్రించేవాణ్ని. మూర్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

వ్యాఖ్య

Through the character of Badri, is Azad, the writer, stripping away the masks, veils and layers of his inner self and placing his mind before us in the mirror of his story? If so, what is it? నా దృష్టికి వచ్చినవి ఇక్కడ పొందుపరిచాను. పరిశీలించండి.

1. సృజనాత్మక దశ

రచయిత తన కథా ఇతివృత్తాన్ని సంఘటనలుగా, సన్నివేశాలుగా మలుచుకుంటూ, పాత్రల ద్వారా కథను చెబుతాడు. ఆ సమయంలో అతని ఏకాగ్రత అంతా కథనం మీదే ఉంటుంది. కథ ఎలా ముందుకు సాగాలి? పాత్రలు ఎలా ప్రవర్తించాలి? సంఘటనలు ఏ క్రమంలో రావాలి?—అన్నదే అతని ప్రధాన ధ్యాస. ఇది సృజనలోని మొదటి దశ.

2. విమర్శనాత్మక దశ:

రచన పూర్తయిన తరువాత రచయిత మళ్లీ ఆ రచనను చదువుతాడు. కానీ ఇప్పుడు రచయితగా కాదు—ఒక పరిణతి చెందిన పాఠకుడిగా, కొన్నిసార్లు విమర్శకుడిగా చదువుతాడు.

చిత్రకారుడి మనోస్థితి కూడా దాదాపు అంతే. తన చిత్రాన్ని పూర్తిచేసిన తరువాత కొంత దూరం నుంచి దానిని పరిశీలిస్తాడు. అప్పుడే తాను ఆవిష్కరించిన అందచందాలతో పాటు, అందులోని లోపాలు కూడా అతని దృష్టికి వస్తాయి. ఇక్కడ సృష్టికర్తలోని విమర్శకుడు మేల్కొంటాడు. తప్పులను సరిదిద్దుకుంటూ తన కళారూపానికి మరింత సంపూర్ణత చేకూర్చడానికి ప్రయత్నిస్తాడు.

3. విమర్శను ఎదుర్కొనే కళాకారుడు

“ఒకప్పుడు నా చిత్రాల్ని విమర్శిస్తే రగిలిపోయేవాణ్ని.”

This is quite natural with almost every artist, particularly in the early stages of his or her artistic career. The young artist can’t tolerate criticism. So, he dares to say these words… How are they qualified to make such sweeping remarks about my work?—

ఈ ప్రశ్న సహజంగానే కళాకారుడి మనసులో మెదులుతుంది. Perhaps, it is their immaturity that makes them think and behave in that manner.

బద్రి మాటల్లో కనిపించే ఒక కోణం ఇది. కానీ, దీనికి మరో కోణం కూడా ఉంది. మీరు నాతో ఏకీభవిస్తారో లేదో తెలియదు గానీ— Talent and age are not necessarily related.

వయస్సుకూ ప్రతిభకూ ఎప్పుడూ ప్రత్యక్ష సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిభ కొత్తగా మొలకెత్తుతున్న కళాకారుడిలో కూడా కనిపించవచ్చు కదా? Can’t genuine talent be seen in budding artists too? Can a work of art not sometimes go beyond the ken of even seasoned art critics? శ్రీ చంద్రశేఖర ఆజాద్ ఈ అభిప్రాయాన్నే సమర్థిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది.

ఈ వాక్యాన్ని గమనించండి—

“వారిని కవ్వించటం కోసం వర్ణాల్ని ఇష్టమొచ్చిన రీతిలో ఉపయోగిస్తూ మరింత నైరూప్యంగా చిత్రించేవాణ్ని.” ఇదో కోణం.

ఇక్కడ రచయిత “నైరూప్యంగా” అన్న పదాన్ని ఉపయోగించడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. అది కేవలం చిత్రకళా శైలిని సూచించడానికే పరిమితం కాలేదు. బద్రి అనే అద్భుత చిత్రకారుడి అంతరంగ చిత్రణకు కూడా అది ఒక ప్రతీకగా మారింది.

4. అతివిమర్శ—అతిప్రశంస

“ఇంకొంతమంది వున్నారు. ‘బద్రి’ అంటే వెర్రి అభిమానం. నా ప్రతి రేఖలోనూ అద్భుతాల్ని వెతకటమే. నేను ఒక చిత్రాన్ని ఎందుకు గీస్తానో నాకు తెలుసు. దానిలోని సారం నాకు తెలుసు. వాటిమీద వచ్చే విశ్లేషణలు చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యేవాణ్ని.నా చిత్రాల్ని చూసి వారు చూసినంత అద్భుతం ఏదీ లేదని తెలిసినా, మాట్లాడేవాణ్ని కాదు. ఎంత వివాదం సృష్టిస్తే అంత ఆనందం కలిగేది.”

Through the mouthpiece of Badri, Mr. Chandrasekhara Azad seems to be fearlessly and openly expressing his views and opinions—not only on art and artists, but also on criticism and critics in every field. How can did he is!

I appeal to you, my reader-friends: Mr. Azad has not penned these words merely to create a sensation. He is laying bare what he believes to be the naked truth.

అదే ఆయన నిర్భయత. అదే ఆయన నిష్కపటత్వం. రచయిత గా ఆయన చూపిన నిబద్ధత, బాధ్యత.

కొసమెరుపు

పుట్టుకతో వచ్చిన అమోఘమైన ప్రజ్ఞను, తనకు లభించిన అద్భుత గురువుల శిష్యరికంలో మరింత సానపెట్టుకుని, తన అక్షర సృజనాత్మక శక్తిని ప్రతిభా–వ్యుత్పత్తులతో వృద్ధి చేసుకుని, అపూర్వమైన స్థాయిలో రచనలు చేసిన ఒక కవి దిగ్గజం తన కొన్ని రచనల్లో వ్యాకరణపరమైన దోషాలు చేశారు. వ్యాకరణం అప్పుడే నేర్చుకుంటున్న విద్యార్థి నుంచి వ్యాకరణ పండితుల వరకూ—ఆ విషయం స్పష్టంగానే తెలుసు. అయితే, ఎవరైనా సాహసించి ఆ దోషాలను ఎత్తిచూపితే…? ఆ కవి సార్వభౌమ ఆరాధకులు వెంటనే రంగంలోకి దిగుతారు. “ఆయన ఏదో ఒక అద్భుత భావావేశంలో దొర్లిన చిన్నచిన్న పొరపాట్లు. అంతే! నిజానికి, ఆయనకు ఉన్న వ్యాకరణ పట్టు మరెవరికైనా ఉందా?” అంటూ వాటిని త్రోసిరాజనడాన్ని ఏమనాలి…? ఏ విధంగా అర్థం చేసుకోవాలి…? Adoration, when it crosses its limits, becomes fanaticism. ఈ నాలుగో భాగం మన ముందుకు తెచ్చే నగ్నసత్యం ఇదే.

చివరగా బద్రి చెప్పిన మాటలతో ఈ భాగాన్ని ముగిస్తాను. నేనేమి దానిని వ్యాఖ్యానించను. మీరే అర్థు చేసుకోండి. అజాద్ ఏం చెపుతున్నారో గ్రహించండి. “ ప్రశంసలకు అలవాటు పడ్డాక, మన హృదయాన్ని ఆవిష్కరిస్తే, అవన్నీ అదృశ్యమవుతాయానే భయం…… ”

పాఠక, రచయిత, విమర్శక, కళాకార మిత్రులారా… ఏమంటారు…!?