‘ఒక అవకాశం జీవితాన్నే మార్చేస్తుంది, అద్భుతాలకు దారితీస్తుంది’ అనడానికి నిదర్శనం అలనాటి నటి సుబ్బమ్మ శాంతకుమారిగా మారడం, అత్యద్భుత నటనతో అలరించడం. కేవలం సంగీతం నేర్చుకోవాలనుకున్న ఆమె వెండితెరపై మృదుమధుర గాత్రంతో పాటలు పండిస్తానని తానే ఊహించలేదు. ఆమె చిత్రసీమ రంగ ప్రవేశం యాధృచ్ఛికమే. కడప జిల్లా ప్రొద్దుటూరులో 1920 మార్చి 17న పుట్టిన సుబ్బమ్మను మంచి నటిగా తీర్చిదిద్దాలన్నది తండ్రి వెల్లాల శ్రీనివాస రావు ఆశ. ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ. కాని కూతురు సుబ్బమ్మ, తల్లి నరసమ్మ, అమ్మమ్మ అందుకు వ్యతిరేకం. సంగీత విద్వాంసురాలైన తల్లి` తన కూతురుకు కేవలం సంగీతం చెప్పించా లనుకుంది తప్ప మరో ఏ ఇతర ఆశలు, లక్ష్యాలు లేవు.
చిన్నతనం నుంచే సంగీతం అంటే మక్కువ గల సుబ్బమ్మకు మామూలు చదువుపై దృష్టి నిలిచేది కాదు. అయితే సంగీతంలో ఉన్నతంగా ఎదగాలంటే కనీసం థర్డ్ ఫారం(8వ తరగతి) విద్యార్హత అవసరమనుకొని, అంతటితో చదువు సరిపెట్టేశారు. నాటి మదరాసులో ప్రముఖ సంగీత విద్వాంసులు ప్రొఫెసర్ పి.సాంబమూర్తి వద్ద గాత్రం నేర్చుకొన్నారు. ఫిడేల్ విన్యాసంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. గురువుతో కలసి తిరుచ్చి, తంజావూరు, మధురై ప్రాంతాల్లో చాలా కచేరీలు చేశారు. సహాధ్యాయి డీ.కే. పట్టమ్మాళ్, వసంత కోకిలం, విశ్వేశ్వరమ్మల కచేరీలకు ఫిడల్ వాయిద్య సహకారం అందించారు. గురువు తన సిఫారసుతో ఆమెకు ఒక పాఠశాలలో సంగీత ఉపాధ్యాయిని ఉద్యోగం ఇప్పించగా, మొదట ఆమె ఇష్టపడలేదు.
‘శశిరేఖ’గా సినీప్రస్థానం
మదరాసులో ఒక ఇంట్లో కచేరి చేస్తున్న సుబ్బమ్మను చూసిన వేల్సు పిక్చర్స్ అధినేత పీ.వీ. దాసు తన ‘మాయా శశిరేఖ’ చిత్రంలో నాయికి పాత్రకు ప్రతిపాదించారు. అందుకోసం ఆమె కుటుంబ సభ్యులను అతి కష్టం మీద ఒప్పించగలిగారు. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే, స్టార్ కంబైన్స్ సంస్థ బందా కనకలింగేశ్వరరావు నాయకుడిగా తీసే ‘సారంగధర’లో చిత్రాంగి పాత్రకి ఎన్నుకుంది. ఆ చిత్ర నిర్మాతలతో ఒకరు, దాని దర్శకుడు అయిన పోలదాసు పుల్లయ్యతో పరిచయం ప్రేమకు దారితీసి ‘సప్తపది’ వేయించింది. ఇది ఆమె కుటుంబం ఇష్టపడని పెళ్లి. పుల్లయ్యగారికి ప్రథమ కోపమని, కాస్త కఠినంగా మాట్లాడటం అలవాటని తెలిసినా, ఇష్టపడి చేసుకున్నారు. ‘మీ జీవితంలో మరపురాని సంఘటన ఏదీ’ అనే ప్రశ్నకు ‘మా ఆయనను పెళ్లి చేసుకోవడమే…’అని శాంతకుమారి నిండుగా నవ్వేవారు. ‘దర్శకుడు నటిని పెళ్లాడడం అదే మొదలు కావచ్చు. ‘దర్శకుడు నటీమణిని వివాహమాడడంలో పెద్ద విశేషం లేదు. కానీ ఆ బంధం చివరి వరకు కొనసాగదనే ప్రచారం ఉండేది. అయితే అందుకు భిన్నంగా వారి దాంపత్యం పది కాలాల పాటు వర్ధిల్లి మాకు ఆదర్శమైంది’ అని ప్రముఖ నటీమణి అంజలీదేవి ఒక సందర్భంలో అన్నారు. ఆ జంట ‘ఆది దంపతులు’ లాంటిదే కాదు…సినీ ప్రముఖులు చాలా మందికి ‘అమ్మా`నాన్న’. ఆ అన్యోన్య జంటకు ఇద్దరు కూతుళ్లు (పద్మ,రాధ).‘ మీకు మగ పిల్లలు లేనందుకు బాధపడలేదా’ అన్న ప్రశ్నకు ‘మాకు మగపిల్లలు లేకేం! రామారావు, నాగేశ్వరరావు, జగ్గయ్య, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్…ఇలా వీళ్లంతా బిడ్డలే. వాళ్లూ మమ్మల్ని ‘మమ్మీ డాడీ’ అని పిలిచేవారు. నా కూతుర్లిద్దరినీ వాళ్ళు భుజాలకెత్తుకొని ఆడించే వారు’ అని సమాధానం ఇచ్చారు.
సొంత నిర్మాణ సంస్థ
పుల్లయ్య,శాంతకుమారి దంపతులు, మరికొందరు భాగస్వాములుగా ‘రాగిణీ సంస్థ’ (1947) స్థాపించి మొదట ‘భక్తజన’ చిత్రం నిర్మించారు. హోనప్ప భాగవతార్ అనే సంగీత విద్వాంసుడు అందులో పాండురంగడి పాత్ర ధరించాడు. అయితే, చిత్రం ఆర్థికంగా అపజయాన్ని చవిచూసినా సంగీత పరంగా ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత ‘రాగిణి’ ధర్మదేవత, తిరుగుబాటు, వీటుక్కారి, అర్థాంగి మొదలైన చిత్రాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకొంది. ఆ తర్వాత వారు ‘పద్మశ్రీ’ సంస్థ స్థాపించి మంచి కుటుంబ కథాచిత్రాలు ఎన్నో నిర్మించారు. వాటికి ఆమె సోదరుడు శ్రీ వేంకటేశ్వర్లు (అబ్బి) నిర్మాతగా వ్యవహరించారు.
‘సారంగధర’(1937)లో చిత్రాంగి పాత్రను అతి సమర్థవంతంగా పోషించిన శాంతకుమారి, జూపిటర్ వారి ‘సారంగధర’లో (1957)లో రత్నాంగిగా కరుణరసాన్ని పండించారు. (ఇందులో చిత్రాంగి పాత్రను పి. భానుమతి ధరించారు.). భర్త పుల్లయ్య రెండుసార్లు తీసిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ మొదటి చిత్రంలో పద్మావతిగాను (1949 పెళ్లయిన తరువాత నటించిన మొదటి చిత్రం), రెండవ చిత్రంలో వకుళమాత (1960)గా నటించారు. చిలకలపూడి సీతారామాం జనేయులు (సీఎస్సార్) శ్రీనివాసుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. పల్లెల నుంచి ప్రేక్షకులు బండ్లు కట్టుకొని వచ్చేవారట. సినిమాహాళ్ల వద్ద వేంకటేశ్వరస్వామి నిలువెత్తు చిత్రపటాలు పెట్టి పూజలు చేసి మొక్కు చెల్లించుకొనేవారట. రెండవ చిత్రంలో మధుర గాయకుడు ఘంటసాల ‘శేషశైలావాసుడి’ పవళింపు సేవ గీతాలాపనతో తెరమీద కనిపించడం విశేషం.
తల్లి పాత్రలో
పెళ్లయిన తరువాత నాయికగా చేయడం ఒక ఎత్తయితే, అగ్రశ్రేణి నాయకిగా ఉంటూ, తల్లి పాత్రలకు మళ్లడం విశేషంగా చెప్పుకొనేవారు. తన 27వ ఏట, తమిళి చిత్రం(అమ్మ-1947)లో ఆ పాత్ర వేశారు. అనంతరం కాలంలో ప్రముఖ నటి జి.వరలక్ష్మి ‘కన్నతల్లి’లో అమ్మ పాత్ర వేయడానికి శాంతకుమారే స్ఫూర్తిగా చెప్పుకొనేవారు. తెలుగు, తమిళ చిత్రాల ’అమ్మ’ పాత్రలో మేటిగా నటించడమే కాదు…నిజ జీవితంలోనూ అమ్మగా పిలిపించుకొన్నారు. ‘నేను ధరించిన ఫ్రతి పాత్ర గొప్ప అనుభవం నేర్పింది. అయితే, అన్ని రకాల పాత్రలు ధరించినా కొన్నింటిని మాత్రం భరించాను’ అని నిర్వేదం వ్యక్త పరిచిన సందర్భాలూ ఉన్నాయి. అదే సమయంలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘చిన్ననాటి స్నేహితులు’ లోని హాస్యంతో కూడిన తల్లి పాత్రను, ఆ పాత్ర పలికే వచ్చీరాని ఇంగ్లీషు భాషను మురిపెంగా చెప్పుకొనేవారు. వయసులో నాలుగు నుంచి ఎనిమిదేళ్లు పెద్దయిన వారితో (‘మాయాలోకం’లో అక్కినేనితో, ‘అర్థాంగి’లో గుమ్మడి, ‘రాముడు భీముడు’లో రాజనాలతో) జోడిగా నటించారు.
విద్మణిగా…
తమ పాటలను తామే పాడుకున్న గాయని త్రయంలో ఒకరు శాంతకుమారి.(మరో ఇద్దరు భానుమతి, ఎస్. వరలక్ష్మి). టాకీ చిత్రాలు పుట్టిన దశకం ఉత్తరార్థంలో ఆమె చిత్రసీమలో అడుగుపెట్టిన సమయంలో నేపథ్యగానం ప్రక్రియ లేకపోవడం, ఆమె స్వతః సంగీత విద్వాంసురాలు కావడంతో తన పాటలు తాను పాడుకోవడం ఆరంభించారు. కానీ ఆమె సంగీత పరిజ్ఞానాన్ని చిత్రసీమ సరైన రీతిలో ఉపయోగించు కోలేదన్న అభిప్రాయం ఉండేది. ‘రచ్చగెలిచిన తాను ఇంట గెలవ లేకపోయాను’ అన్న భావన ఆమెలో ఉండేది. ‘ఇతర చిత్రాలలో పాడినా, సొంత సంస్థ చిత్రాలలో అవకాశాలు తక్కువే. భర్త దర్శకుడిగా వేషాలు వేయించినా, గాయినిగా ప్రోత్సాహం తక్కువ’ అని ఆవేదనతో చెప్పేవారు. ఆమె నటిగా స్థిరపడినా, సంగీతం పట్ల అభిరుచి తగ్గలేదు. ఆమె ‘ఆండాళ’పై పాడారు. ఆమె రాసి స్వరపరచిన భక్తిగీతాలను ‘రామరసం’ పేరిట మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆలపించారు. 1981లో భర్త పుల్లయ్యను, 1999లో శాంతకుమారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారంతో సత్కరించింది.

