పరాజయాలే సోపానాలుగా…
‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు…’అన్నారు సినీ కవి వేటూరి. ఎందరో మహనీయుల విషయంలో ఆ మాట రుజువైంది. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అనే మాటను నిజం చేశారు. ముఖ్యంగా అనంతర కాలంలో అనర్ఘ రత్నాలుగా వెలుగొందిన కళాకారులు అలా ఎదిగి వచ్చినవారే. వారిలో చాలామంది ఎదుగుదలతో పాటే ఒదిగే ఉండేవారు. వారి అంత ఉన్నతి వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, పట్టుదల ఉన్నాయి. ‘వారు మా వాళ్ళు’ అని ఇతరులు సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు. ఉదాహరణకు, అమరగాయకుడు ఘంటసాల, మహానటి సావిత్రి, మహానటులు ఎన్.టి. రామరావు, యస్.వి. రంగారావు, దర్శకరత్న దాసరి నారాయణరావు, ప్రఖ్యాత నర్తకి శోభానాయుడు తదితరులు లాంటి వారు ఆరంభంలో అవమానాలు ఎదుర్కొన్న వారే. అయినా ‘పోగొట్టుకున్న చోటనే వెదకాలి’ అనే సామెతకు సమాంతరంగా ‘కాదన్న వారితోనే ఔననిపించుకోవాలి’ అనే పట్టుదలే వారికి కీర్తిప్రతిష్ఠలు కట్టబెట్టాయి.
అమృతగళం
‘నీ గొంతు పాటకు సరిపోదు. అసలు నీవు గాయకుడివే కావు’ అనే ఛీత్కారాలూ ఎదుర్కొన్నారు అమరగాయకుడు ఘంటసాల. ఆ మాటలకు కుంగిపోలేదు. వాటిని సవాలుగా స్వీకరించారు. కచేరిలు చేస్తూ, సినిమాల్లో ‘బృందగానం’లో గొంతు కలిపారు. కాదన్న వారితోనే ‘శభాష్’ అనిపించుకొని తన గాన మాధుర్యంతో వారికి కాసులు కురిపించారు. సినీ నేపథ్యగానం గురించి చెప్పవలసి వస్తే ఘంటసాలకు ముందు, తరువాత అని విగడించుకోవాలి. సినీ నేపథ్య గానానికి ఆయన కొత్త ఒరవడి దిద్దారు. పద్యగానానికి మార్గం నిర్దేశించారు. నిజంగా-తాము చవిచూసిన చేదు అనుభవాలతో నిరాశతో మడమ తిప్పి ఉంటే అంత ‘మధురగాన సుధలు’ పోగుపడేవా? తమ పెదాల కదలికలకు ఆయన గాత్రం తోడయితే ఎంత అదృష్టం అని వర్ధమాన నటులు అనుకొనేవారట. ‘ఇంటికి ఒక ఘంటసాల’ అనే నానుడి పుట్టింది. ఘంటసాల వారు గాన‘యాత్ర’ ముగించిన తరువాత కొద్ది కాలానికి గీతకర్తగా రంగప్రవేశం చేసిన వేటూరి సుందరరామమూర్తి, ‘నా పాట ఒక్కటి కూడా ఘంటసాల గాత్రం నుంచి రాకపోవడం నా దురదృష్టం’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
నటనరాదన్న ఆమే ‘మహానటి’
ఒక చిత్రంలో ఒక సన్నివేశంలో నటించలేకపోయినపుడు, ‘నీకు నటన రాదు, తెలియదు’ అని ఈసడింపులు ఎదుర్కొన్న సావిత్రి ‘మహానటి’ మాటకు చిరునామాగా నిలిచారు. ఏ భాషా చిత్రంలో నటించినా, ఆ భాషకు చెందిన వ్యక్తిగా మన్ననలు అందుకున్నారు. ఆమె అచ్చమైన తెలుగు ఆడపడుచు అని చెప్పినా తెలుగేతర దక్షిణాది భాషల వారు అంగీకరించే వారు కారట. దానిని బట్టే ఆమె ప్రతిభా సామర్థ్యాలు, కఠోర శ్రమ అర్థమవుతాయి. సావిత్రి కాలం చేసిన దశాబ్దాల తరువాత పుట్టిన నటీమణులు కూడా ‘నటనలో సావిత్రి తమకు స్ఫూర్తి’ అని చెప్పుకోవడం ఆమె ఘనతకు గీటురాయి.
‘దైవ’నటుడు
సాంఘిక చిత్రాలలో నటుడిగా ప్రవేశించి ‘దైవ’ నటుడు అయ్యారు ఎన్.టి. రామారావు. ఒక సాంఘిక సినిమా అంతర్నాటకంలో ఆయన కృష్ణ పాత్ర ధరించడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదట. నిరసనల వెల్లువ. అలాంటి పాత్రలకు తాను పనికి రాను అనుకుంటున్న సమయంలో, దిగ్దర్శకుడు కే.వీ. రెడ్డి తమ ‘మాయాబజార్’కు ఆయనను కృష్ణుడి పాత్రకు ఎంపిక చేశారు. ఈసారి విమర్శలు ఎదుర్కోవడం కే.వీ. వంతైంది. ‘ఎన్టీఆర్ ను ఆ పాత్రకు ఎన్నుకొని ఏం సాదిద్దామనుకుంటున్నారు’ అన్న శ్రేయోభిలాషులకు మౌనమే సమాధానమైంది. ఆ చిత్రంతో ఎన్టీఆర్ వెనుదిరిగి చూడలేదు. పురాణ పురుషులు ఎలా ఉంటారు? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ కళ్ళముందు ప్రత్యక్షమయ్యేంత విస్పష్టమైన జవాబు.
‘యశస్వీ ఎస్.వి. ఆర్’
రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చిన ఎస్.వి. రంగారావు తొలి చిత్రం ‘వరూధిని’ పరాజయంతో వెనుకంజ వేయలేదు. అనంతర కాలంలో తమ నటనా వైదుష్యంతో ‘యశస్వీ’గా నిలిచారు. ఆయన ప్రతిభను పట్టి చూపడానికి ‘సింహబలుడు’ (కీచక)పాత్ర చాలు. ఆ చిత్రం అప్పట్లోనే జకార్తా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఎన్నో చిత్రాల్లో లెక్కకు మిక్కిలి మాటలను ముఖకవళికలతో అభినయించిన మేటి నటుడు.
‘దర్శకరత్న’
దర్శకుడిగా ‘గిన్నిస్ బుక్’ రికార్డుకు ఎక్కిన దాసరి నారాయణరావు నటుడిగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘దర్శక నిర్మాతలు ఒక ప్రధాన పాత్రకు పిలిచి, నామమాత్రపు పాత్ర ఇచ్చేవారు’ అని తరచూ చెప్పేవారు. దాంతో సంభాషణల రచయితగా మారి, రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు, పత్రికాధినేతగా బహుముఖ పాత్రలు పోషించారు.
కూచిపూడి‘శోభ’
ఆమెకు నాట్యమంటే ప్రాణం. అయినా తగు ప్రోత్సాహం లేదు. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. పోనీ, ఏదో విధంగా నేర్చుకుందామంటే, ‘నీకు నృత్యం ఏమిటి? ఎప్పుడైనా నీ నడకను చూసుకున్నావా? వెళ్ళి అంట్లుతోముకో’ అని తిరస్కారం. దానిని సవాల్‌గా తీసుకున్నారు. ఆమే శోభానాయుడు. ఆర్థిక ఇబ్బందులు, పస్తులు లక్ష్య సాధనకు అడ్డురాలేదు. నాట్యమే శ్వాసగా, ధ్యాసగా కడదాకా నటరాజును అర్చించిన ‘నాట్య తపస్విని’ ఆమె. నాటి అగ్రనటులు ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సహా బీ.ఎన్. రెడ్డి లాంటి దిగ్దర్శకులు ఇవ్వజూపిన సినిమా అవకాశాలను మృదువుగా తిరస్కరించారు. నాట్యం పట్ల ఆమె అంకిత భావానికి ముగ్ధులైన అంతటి వారు ఆమె నిబద్ధతకు చేతులు జోడించి అభినందించకుండా ఉండలేకపోయారు. ‘నా సినిమాలో నటించ నన్నందుకు మొదట ఏమో అనుకున్నా కానీ అమె నిర్ణయమే సరైనది. లేకపోతే ఒక అంతర్జాతీయ నాట్యకళారిణిని కోల్పోయే వాళ్ళం’ అని కళాతపస్వి కె. విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. అలా చలనచిత్ర అవకాశాలు వదులుకోవడం వల్ల ఆమె ఆర్థికంగా నష్టపోయి ఉండవచ్చు కానీ హార్దికంగా కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. భరతనాట్యానికి నెలవు నేటి చెన్నై, నాటి మదరాసులో కూచిపూడి నాట్య వైభవాన్ని చాటారు. అక్కడి ప్రతిష్ఠాత్మక ‘కృష్ణగాన’ సభ నుంచి కూచిపూడి సంప్రదాయానికి తొలిసారిగా ‘నృత్య చూడామణి’ పురస్కారం సంపాదించి పెట్టారు.

