గలాట్జ్ నుంచి వచ్చిన వార్త…
వారి ప్రణాళిక మొత్తాన్ని మార్చేసింది.
డ్రాకులా కంటే ముందే చేరుకుని అతనిని పట్టుకోవచ్చుననే ఆశతో వేటగాళ్లు వార్నాకు వచ్చారు.
వారి ప్రణాళిక చాలా సులభంగా కనిపించింది.
డ్రాకులా తన చివరి మట్టి పెట్టెలో దాక్కుని ’ జరీనా కేథరిన్ ’ అనే ఓడలో ప్రయాణిస్తున్నాడు.
ఆ ఓడ వార్నాకు రావాలి.
జోనాథన్, వాన్ హెల్సింగ్, సీవర్డ్, ఆర్థర్, క్విన్సీ, మినా…
అక్కడ అతని కోసం ఎదురుచూడాలి.
ఈసారి…
డ్రాకులా కంటే తామే ఒక అడుగు ముందు ఉండాలని అనుకున్నారు.
కాని …
’ డ్రాకులా వారి ఉచ్చు నుంచి తప్పించుకున్నాడు.’
జరీనా కేథరిన్ వార్నాకు రాలేదు.
అది ’ గలాట్జ్ 'చేరుకున్నది.
ఇప్పుడు డ్రాకులా తన స్వదేశానికి మరింత దగ్గర అయ్యాడు.
ట్రాన్సిల్వేనియాకు దగ్గరగా.
పర్వతాలకు దగ్గరగా.
తన కోటకు దగ్గరగా.
అతను తన కోట వైపు ప్రయాణించే ప్రతి మైలు…
అతనిని మరింత ప్రమాదంలో పడవేస్తున్నది
కొంతసేపు అందరిలోనూ ఓటమి భావన కనిపించింది.
వారు యూరప్ అంతా ప్రయాణించారు.
ఓడ ప్రయాణ సమయాన్ని లెక్కించారు.
ఎంతో ఓపికగా ఎదురు చూశారు.
అయినా…
డ్రాకులా మరోసారి వారిని మోసం చేశాడు.
జోనాథన్‌కు మరింత కోపం వచ్చింది.
అతనికి మినా గుర్తొచ్చింది.
ఆమె నుదుటిపై ఉన్న గుర్తు మదిలో మెదిలింది .
డ్రాకులా తన రక్తాన్ని ఆమెతో బలవంతంగా తాగించిన ఆ భయంకరమైన రాత్రి గుర్తొచ్చింది.
మినా అతని వల్ల బాధపడుతూనే ఉన్నది.
కాని డ్రాకులా మాత్రం తప్పించుకుంటున్నాడు.
ఆ ఆలోచనను జోనాథన్ భరించలేకపోయాడు.
“వెంటనే బయలుదేరాలి,” అన్నాడు.
ఒక్క క్షణం కూడా వృథా చేయడానికి అతను సిద్ధంగా లేడు.
వాన్ హెల్సింగ్ కూడా అంగీకరించాడు.
ఇక వార్నాలో ఉండటానికి కారణం లేదు.
’ వారు గలాట్జ్‌కు వెళ్లాలి. ’
వెంటనే ఏర్పాట్లు మొదలయ్యాయి.
మరోసారి సామాన్లు సర్దుకున్నారు.
మరోసారి రైళ్ల సమయాలు చూశారు.
పటాలు తెరిచారు.
మరోసారి…
వేట ప్రారంభమైనది.
కాని ఇప్పుడు పరిస్థితి వేరు.
ఇంగ్లాండ్‌లో డ్రాకులానే పరాయి వ్యక్తి.
అతను వారి ప్రపంచంలోకి వచ్చాడు.
వారి నగరాలలో దాక్కున్నాడు.
వారి ఇళ్ల మధ్య నివసించాడు.
కాని ఇప్పుడు…
’ వేటగాళ్లే డ్రాకులా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నారు. ’
తూర్పు వైపు ప్రయాణించే ప్రతి మైలు…
డ్రాకులాకు మరింత అవకాశం ఇస్తున్నది.
వాన్ హెల్సింగ్‌కు అది తెలుసు.
జోనాథన్‌కు…
అందరి కంటే బాగా తెలుసు.
ప్రయాణంలో మినాను జోనాథన్ జాగ్రత్తగా గమనిస్తున్నాడు.
ఆమె ధైర్యంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రశాంతంగా మాట్లాడుతున్నది.
తాన చేయగలిగినంత సహాయం చేస్తున్నది.
కాని …
జోనాథన్‌కు ఆమెలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి.
ఆమె అలసిపోయినట్టుగా కనిపిస్తున్నది.
కొన్నిసార్లు అసాధారణంగా నిశ్శబ్దంగా మారిపోతున్నది.
మరికొన్నిసార్లు…
ఎవరికీ వినిపించని ఏదో శబ్దాన్ని తాను అనుభూతి పొందుతున్నట్లుగా దూరంగా చూస్తున్నది.
అన్నింటి కంటే…
ఆమె నుదుటిపై ఆ గుర్తు ఇంకా అలాగే ఉన్నది.
జోనాథన్‌కు ఆ గుర్తు అంటే ద్వేషం.
అది డ్రాకులా సంతకంలా అనిపిస్తున్నది.
వారి జీవితాలలోకి వచ్చి…
ఏదో భయంకరమైన దానిని వదిలి వెళ్లాడని గుర్తు చేసే ముద్రలా ఉన్నది.
జోనాథన్ తనను గమనిస్తున్నాడని మినాకు తెలుసు.
ఎందుకు గమనిస్తున్నాడో కూడా తెలుసు.
ఒక రోజు సాయంత్రం…
ఆమె అతనితో మెల్లగా మాట్లాడింది.
“నీ భయాన్ని నా దగ్గర దాచకు.”
అన్నీ సవ్యంగా జరుగుతాయని జోనాథన్ చెప్పడానికి ప్రయత్నించాడు.
మినా బాధగా నవ్వింది.
ఆమె కూడా అది నిజం కావాలని కోరుకుంటున్నది.
కాని …
అది నిజం కాగలదని ఇద్దరిలో ఎవరూ చెప్పలేరు.
వారు పోరాడుతున్నది…
అసలు ఈ ప్రపంచంలో ఉండకూడని ఒక దుష్టశక్తితో.
ఇక్కడ ఎలాంటి హామీలు లేవు.
అందుకే…
జోనాథన్ ఇంతకు ముందు ఇచ్చిన మాటను మినా మరోసారి గుర్తు చేసింది.
“డ్రాకులాను నాశనం చేయకముందే నేను చనిపోతే…
నేను కూడా అన్‌డెడ్‌గా మారితే…”
జోనాథన్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది.
“మినా… వద్దు.”
అతను మళ్లీ ఆ మాటలు వినాలనుకోలేదు.
కాని మినా ఆగలేదు.
లూసీని గుర్తు చేసింది.
బతికి ఉన్నప్పుడు లూసీ ఎంతో మంచిది.
ఎంతో సున్నితమైన మనసు ఉన్న అమ్మాయి.
కాని చనిపోయిన తరువాత…
చిన్న పిల్లలను వేటాడే భయంకరమైన జీవిగా మారింది.
“నేను కూడా అలా మారితే…”
జోనాథన్ చేతులను మినా పట్టుకున్నది.
“నన్ను అలాగే ఉండనివ్వకు.”
తన ఆత్మను కూడా లూసీకి మాదిరిగా విముక్తి చేయాలని కోరింది.
జోనాథన్ ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు.
“అది జరగదు.”
అతని గొంతులో పట్టుదల ఉన్నది.
“అంత కంటే ముందే డ్రాకులా చనిపోతాడు.”
కాని …
అతని మనసులోని భయం మాత్రం పోలేదు.
వాన్ హెల్సింగ్‌ను మరో విషయం కలవరపెడుతున్నది.
" మినా, డ్రాకులా మధ్య ఉన్న బంధం."
మొదట్లో ఆ బంధం అనుకోకుండా తమకు దొరికిన ఒక మార్గంగా కనిపించింది.
హిప్నోటిక్ స్థితిలో…
డ్రాకులా చుట్టూ ఉన్న కొన్ని విషయాలను మినా అనుభూతి చెందగలిగింది.
నీటి శబ్దం.
అలలు.
ఓడ చెక్కలు కిర్రుమనే శబ్దం.
ఆ ఆధారాల వల్ల డ్రాకులా సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నాడని వారు తెలుసుకున్నారు.
కాని ఇప్పుడు…
వాన్ హెల్సింగ్‌కు ఆ బంధంలోని మరో కోణం కనిపిస్తున్నది.
డ్రాకులాను మినా అనుభూతి చెందగలిగినట్లే…
“డ్రాకులా కూడా మినాను అనుభూతి చెందగలడా?”
ఆ బంధం ద్వారా ఆమె మనసులోకి డ్రాకులాచేరగలిగితే…
వేటగాళ్ల గురించి కూడా తెలుసుకోగలడా?
వార్నాలో తాము ఎదురు చూస్తున్నామని అతనికి తెలిసింది ఇలాగేనా?
దానికి ఆధారం లేదు.
కాని …
ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయలేరు.
దానితో వారికి ఒక బాధాకరమైన సమస్య ఎదురైనది.
వారి బృందంలో అత్యంత తెలివైన వ్యక్తులలో మినా ఒకరు.
అందరి డైరీలను క్రమబద్ధీకరించింది.
సీవర్డ్ రికార్డింగులను టైప్ చేసింది.
ఉత్తరాలు, పత్రికా వార్తలు, నౌకల సమాచారం, జోనాథన్ డైరీ…
అన్నింటినీ ఒకచోట చేర్చింది.
మినా లేకపోతే…
డ్రాకులా కదలికలను ఇంత స్పష్టంగా వారు అర్థం చేసుకోలేకపోయేవారు.
కాని ఇప్పుడు…
ఆమె నుంచి కొన్ని విషయాలు దాచవలసి రావచ్చు.
ఆమెను నమ్మడం లేదని కాదు.
" ఆమె ద్వారా డ్రాకులా వింటున్నాడేమోనని భయం. "
మినా వెంటనే అర్థం చేసుకున్నది.
ఆమె బాధపడలేదు .
“నాకు చెప్పడం వల్ల ప్రమాదం ఉంటే…
నాకు చెప్పకండి.”
జోనాథన్‌కు ఆ మాట వినడం చాలా బాధగా అనిపించింది.
డ్రాకులా అక్కడ లేకుండానే…
మినాను తమ నుంచి దూరం చేస్తున్నట్టుగా అనిపించింది.
కాని వాన్ హెల్సింగ్‌కు తెలుసు.
జాగ్రత్త తప్పదు.
ఇక నుంచి మినాకు అవసరమైన విషయాలు మాత్రమే చెబుతారు.
వారి ప్రణాళికలోని కొన్ని ముఖ్యమైన వివరాలు…
మిగతా వారి మధ్యే ఉంటాయి.
వారు గలాట్జ్ వైపు ప్రయాణం కొనసాగించారు.
ప్రయాణం చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది.
ప్రతి స్టేషన్ లో రైలు ఆగుతున్న ప్రతిసారి ఏదో ఆలస్యం జరుగుతున్న భావన. అంతేగాక
డ్రాకులా పెట్టె తమ కంటే మరింత ముందుకు వెళ్లిపోతున్నదని జోనాథన్ ఊహిస్తున్నాడు.
డ్రాకులా ఇప్పటికే గలాట్జ్ నుంచి వెళ్లిపోయి ఉంటే?
ఇప్పటికే దేశం లోపలికి ప్రయాణిస్తూ ఉంటే?
తమ కంటే ముందే కోటకు చేరుకుంటే?
డ్రాకులా కోటకు చేరుకోవడం ఎంత కష్టమో జోనాథన్‌కు తెలుసు.
ఆ పర్వతాలు గుర్తున్నాయి.
అడవులు గుర్తున్నాయి.
ఇరుకైన దారులు గుర్తున్నాయి.
ఆ నిర్మానుష్యమైన ప్రాంతం గుర్తున్నది.
" తోడేళ్లు గుర్తున్నాయి."
డ్రాకులా తన కోటకు చేరుకుంటే…
అతనిని పట్టుకోవడానికి వీరు పూర్తిగా అతని ప్రపంచంలోకి ప్రవేశించవలసిందే.
చివరకు…
వారు “గలాట్జ్” చేరుకున్నారు.
విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు.
వెంటనే విచారణ ప్రారంభించారు.
డ్రాకులా మరోసారి తన వెనుక…
మనుషులకు సంబంధించిన ఆధారాలను వదిలి వెళ్లాడు.
ఒక పెద్ద చెక్క పెట్టె…
ఓడరేవులో తనంతట తాను కదలదు.
ఎవరో దానిని ఓడ నుంచి దించి ఉండాలి.
ఎవరో దానిని ముట్టుకుని ఉండాలి.
ఎవరో దానిని మరో ప్రదేశానికి పంపే ఏర్పాట్లు చేసి ఉండాలి.
ఎక్కడో…
ఏదో ఒక రికార్డు ఉండాలి.
వారు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.
చివరకు వారికి ఒక విషయం తెలిసింది.
డ్రాకులా పెట్టెను నిజంగానే ఓడ నుంచి దించారు.
కాని …
అది గలాట్జ్‌లో ఎక్కువ సేపు లేదు.
ఎవరో వచ్చి దానిని తీసుకు వెళ్లారు.
మరో ప్రదేశానికి పంపించారు.
" డ్రాకులా వారి కంటే ముందు ఉన్నాడు."
ఆ విషయం నిరాశ కలిగించినా…
వాన్ హెల్సింగ్ అందులో కూడా ఆశను చూశాడు.
ఆ పెట్టెను తాకిన ప్రతి వ్యక్తి…
ఒక సాక్షి.
ప్రతి చేతి మార్పు…
మరో ఆధారం.
డ్రాకులా సూర్యకాంతి నుంచి దాక్కోగలడు.
పొగమంచులా మారగలడు.
జంతువులను నియంత్రించగలడు.
కాని …
" అతని పెట్టె చాలా బరువైనది."
దానిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు…
అతను సాధారణ మనుషుల సహాయంపై ఆధార పడవలసిందే.
అదే అతని బలహీనత.
అదే…
అతని వెనుక ఒక దారిని వదిలిపెడుతున్నది.
వారు చేయవలసింది…
ఆ దారిని అనుసరించడమే.
వారి ప్రశ్నలు చివరకు ఒక వ్యక్తి దగ్గరకు తీసుకు వెళ్లాయి.
" ఇమ్మాన్యుయేల్ హిల్డెషైమ్. "
డ్రాకులా పెట్టెను మరో ప్రదేశానికి తరలించే ఏర్పాట్లలో అతను భాగమయ్యాడు.
మొదట్లో అతను చెప్పిన సమాచారం కొంచెం గందరగోళంగా అనిపించింది.
పెట్టెను వేర్వేరు వ్యక్తులు వేర్వేరు దశల్లో తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో
కొన్ని పేర్లు బయటకు వచ్చాయి.
ఎవరో సూచనలు ఇచ్చారు.
డబ్బు చేతులు మారింది.
జోనాథన్ ప్రతి మాటను జాగ్రత్తగా వింటున్నాడు.
ఇలాంటి విచారణ అతనికి బాగా అర్థమవుతుంది.
డ్రాకులాకు ఎంతటి అతీంద్రియ శక్తులు ఉన్నా…
" వ్యాపార లావాదేవీలను మాయ చేయలేడు."
వారు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
నెమ్మదిగా…
విషయం పూర్తిగా అవగతం అయింది .
పెట్టెను మరో వ్యక్తికి అప్పగించారు.
అతను ఒక స్లోవాక్.
అతని పేరు…
" పెట్రోఫ్ స్కిన్స్కీ."
ఇప్పుడు వారికి మరో పేరు దొరికింది.
మరో ఆధారం.
డ్రాకులాను పట్టుకోవడానికి మరో అవకాశం.
వెంటనే స్కిన్స్కీ కోసం వెతకడం ప్రారంభించారు.
కాని …
మరోసారి డ్రాకులా వారి కంటే ముందే ఉన్నట్టుగా అనిపించింది.
స్కిన్స్కీని కనుగొని…
“పెట్టెను ఎక్కడికి పంపావు?” అని అడిగే అవకాశం వారికి లేదు.
ఎందుకంటే…
" స్కిన్స్కీ చనిపోయాడు."
అతని మృతదేహం దొరికింది.
అతని మరణం కూడా అనుమానాస్పదంగానే ఉన్నది.
వేటగాళ్లకు వెంటనే డ్రాకులాపై అనుమానం వచ్చింది.
బహుశా స్కిన్స్కీకి అవసరానికి మించి విషయాలు తెలిసి ఉండవచ్చు.
లేదా…
తన పని పూర్తయిన తరువాత డ్రాకులాకు అతని అవసరం లేకపోయి ఉండవచ్చు.
ఏమి జరిగిందో తెలియదు.
కాని ఒక విషయం స్పష్టంగా తెలిసింది.
" వారిని డ్రాకులా దగ్గరకు తీసుకెళ్లే దారిలోని ఒక సాక్షి తొలగించబడ్డాడు."
ఇప్పుడు వేటగాళ్లు మరోసారి చిక్కుకుపోయారు.
పెట్టె గలాట్జ్ నుంచి వెళ్లిపోయిందని తెలుసు.
దానిని తరలించడానికి మనుషులకు డబ్బు ఇచ్చారని తెలుసు.
డ్రాకులా తన స్వదేశం వైపు వెడుతున్నాడని తెలుసు.
కాని …
అతని పెట్టె ఏ దారిలో వెడుతున్నదో తెలియదు.
ఎన్నో మార్గాలు ఉన్నాయి.
రోడ్లు.
నదులు.
బండ్లు.
పడవలు.
డ్రాకులా ఏ మార్గంలోనైనా ప్రయాణిస్తూ ఉండవచ్చు.
వారికి మరో ఆధారం కావాలి.
వాన్ హెల్సింగ్ మళ్లీ మినా వైపు చూశాడు.
వారిని భయపెడుతున్న అదే బంధం…
ఇప్పుడు వారిని కాపాడగల ఏకైక మార్గం కావచ్చు.
సరైన సమయం రాగానే…
అతను మినాను మళ్లీ హిప్నోటిక్ స్థితిలోకి తీసుకు వెళ్లాడు.
అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
జోనాథన్ ఆమె ముఖాన్ని చూస్తున్నాడు.
వాన్ హెల్సింగ్ మెల్లగా అడిగాడు.
“నీకు ఏమైనా వినిపిస్తున్నదా?”
మినా కొద్దిసేపు మౌనంగా ఉన్నది.
కొద్దిసేపటికి…
“నీరు…”
అన్నది.
అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.
వాన్ హెల్సింగ్ ఆమెను కొనసాగించమన్నాడు.
మినా చాలా దూరంలో ఉన్న ఏదో శబ్దాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించింది.
చెక్కకు తగులుతున్న నీటి శబ్దం.
కాని …
ఇది ఇంతకుముందు విన్న సముద్రపు అలల శబ్దంలా లేదు.
అంత దూరంగా లేదు.
మరింత దగ్గరగా ఉన్నది.
ఇరుకైన ప్రదేశంలో నీరు కదులుతున్నట్టుగా ఉన్నది.
ఇంకా కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి.
మినా చెబుతున్న సమాచారం అంత స్పష్టంగా లేదు.
కాని …
వాన్ హెల్సింగ్‌కు ఒక విషయం అర్థమైనది.
" డ్రాకులా ఇప్పుడు నది మార్గంలో ప్రయాణిస్తూ ఉండవచ్చు."
మళ్లీ పటాలు బయటకు వచ్చాయి.
డ్రాకులా స్వదేశం వైపు వెళ్లే నదులను పరిశీలించారు.
కొత్త మార్గం కనిపించింది.
డ్రాకులా పెట్టెను ఒక పడవలో నది పై తీసుకు వెడుతుంటే…
అతను వెళ్లే దారిని ముందుగానే ఊహించవచ్చు.
అతని దారి అదే అని తెలిస్తే…
“అతని కంటే ముందే చేరవచ్చు.”
వేట మళ్లీ ఊపందుకున్నది.
వాన్ హెల్సింగ్ చాలాసేపు పటాన్ని పరిశీలించాడు.
తరువాత…
వారు ఏం చేయాలో చెప్పడం ప్రారంభించాడు.
అందరూ ఒకే బృందంగా డ్రాకులాను వెంబడిస్తే…
చాలా ఆలస్యం కావచ్చు.
డ్రాకులా తన కోటకు చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
వారు తప్పు మార్గాన్ని ఎంచుకుంటే…
అతను తప్పించుకుంటాడు.
అందుకే…
’ వారు విడిపోవాలి.’
వేర్వేరు బృందాలు…
వేర్వేరు మార్గాలను అనుసరించాలి.అయితే
అది ప్రమాదకరమే.
అందరూ కలిసి ఉంటే బలంగా ఉంటారు.
విడిపోతే…
ప్రతి ఒక్కరూ మరింత ప్రమాదంలో పడతారు.
కాని …
ఇప్పుడు వారికి మరో మార్గం కనిపించడం లేదు.
జోనాథన్ వెంటనే అంగీకరించాడు.
డ్రాకులా ఎక్కడికి వెళ్లినా…
తాను వెంబడిస్తానని అన్నాడు.
క్విన్సీ కూడా సిద్ధమే.
ఆర్థర్ సిద్ధమే.
సీవర్డ్ కూడా ఒక్క క్షణం వెనుకాడలేదు.
ఇంత దూరం వచ్చాక…
ఇప్పుడు వెనక్కి తగ్గే వారు లేరు.
వాన్ హెల్సింగ్ వారిని చూశాడు.
అతని కళ్లలో గర్వం కనిపించింది.
ఒకప్పుడు వీరంతా పరాయి వ్యక్తులు.
వారిని కలిపింది…
’ లూసీ.’
ఇప్పుడు…
ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉన్నది.
వారు అందరు కలిసి భయాన్ని చూశారు.
మరణాన్ని చూశారు.
దుఃఖాన్ని అనుభవించారు.
నమ్మడానికి కూడా కష్టమైన నిజాలను తెలుసుకున్నారు.
ఇప్పుడు ఒకే లక్ష్యం కోసం తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
" డ్రాకులా తన కోటకు చేరకూడదు."
కాని…
మినా విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు.
ఆమె కూడా వారితో రావాలా?
జోనాథన్ ఆమెను తన దగ్గరే ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు.
ఆమెను ఒంటరిగా వదిలి పెట్టడం అసాధ్యం.
అదే సమయంలో…
డ్రాకులా కోట వైపు ఆమెను తీసుకెళ్లడం కూడా ప్రమాదకరమే.
డ్రాకులా స్వదేశానికి దగ్గరవుతున్న కొద్దీ…
మినాపై అతని ప్రభావం మరింత బలపడవచ్చు.
వాన్ హెల్సింగ్ చాలాసేపు ఆలోచించాడు.
కాని …
మినాకు డ్రాకులాతో ఉన్న బంధం వారికి చాలా అవసరం కావచ్చు.
ఆమె లేకపోతే…
డ్రాకులా దారిని తెలుసుకోలేకపోవచ్చు .
అంతేకాదు…
మరో కారణం కూడా ఉన్నది.
డ్రాకులాను నాశనం చేసినప్పుడు…
అతని శాపం నుంచి వచ్చే విముక్తి మినాకు కూడా అందాలి.
అందుకే…
" మినా కూడా వారితోనే ప్రయాణం కొనసాగిస్తుంది."
ఆ రాత్రి…
విడిపోవడానికి ముందు మినా అందరినీ తన దగ్గరకు రమ్మనమని అడిగింది.
ఆమె ఒక విషయం చెప్పాలి.
అందరూ నిశ్శబ్దంగా ఆమె వైపు చూశారు.
మినా ఒక్కొక్కరి ముఖం చూసింది.
వాళ్ళు అఃదరు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని ఆమెకు తెలుసు.
తనను కాపాడటానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారని తెలుసు.
అందుకే…
తాను కూడా వారిని ప్రేమిస్తున్నందుకే…
ఒక కష్టమైన మాట అడగాలని మినా అన్నది.
“డ్రాకులా ప్రభావం చివరకు నన్ను పూర్తిగా మార్చేస్తే…”
ఆమె మెల్లగా చెప్పింది.
“చేయవలసిన పని చేయడానికి వెనుకాడకండి.”
ఆర్థర్ చూపు తిప్పుకున్నాడు.
అతనికి లూసీ గుర్తొచ్చింది.
సీవర్డ్ ముఖం బిగుసుకుపోయింది.
క్విన్సీ ఏమీ మాట్లాడలేదు.
జోనాథన్ ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది.
వాన్ హెల్సింగ్‌కు మాత్రం…
మినా ఏమి అడుగుతున్నదో పూర్తిగా అర్థమైనది.
మినాకు వారి జాలి అవసరం లేదు.
ఆమెకు ఒక మాట కావాలి.
తాను వాంపైర్‌గా మారితే…
ఒకప్పుడు మినా ఎలా ఉండేదో గుర్తుచేసుకుని…
చేయాల్సిన పనిని ఆపవద్దని అడిగింది.
లూసీని ఎలా విముక్తి చేశారో…
తనను కూడా అలాగే విముక్తి చేయాలి.
తాను మారిపోయిన తరువాత…
ఇతరులకు హాని చేయకుండా ఆపాలి.
గదిలో నిశ్శబ్దం అలుముకున్నది.
చివరకు…
వారందరూ ఆమెకు మాట ఇచ్చారు.
అది వారందరు జీవితంలో ఇచ్చిన అత్యంత కష్టమైన మాటల్లో ఒకటి.
అప్పుడు మినా ఊహించని మరో విషయం అడిగింది.
వాన్ హెల్సింగ్ వైపు చూసి…
"తన కోసం అంత్యక్రియల ప్రార్థన చదవమని కోరింది. "
అందరూ ఆశ్చర్యపోయారు.
ఆమె చనిపోలేదు.
ఇంకా బతికే ఉన్నది.
కాని …
తాను జీవించి ఉన్నప్పుడు ఆ మాటలను వినాలని మినా కోరుకున్నది.
జోనాథన్ భయంతో ఆమె వైపు చూశాడు.
అతనికి అది భరించలేనిదిగా అనిపించింది.
కాని మినా ప్రశాంతంగానే ఉన్నది.
మరణం రాదని నటిస్తూ భయపడటం ఆమెకు ఇష్టం లేదు.
అది జరిగే అవకాశం ఉన్నదని అంగీకరించి…
దానిని ఎదుర్కోవాలని కోరుకున్నది.
చివరకు…
వాన్ హెల్సింగ్ ప్రార్థన చదవడం ప్రారంభించాడు.
భావోద్వేగంతో అతని గొంతు బరువెక్కింది.
ఎవరూ కదల్లేదు.
మినా పక్కనే జోనాథన్ నిలబడ్డాడు.
అతని గుండె పగిలి పోతున్నట్టుగా ఉన్నది.
ఆర్థర్‌కు లూసీ అంత్యక్రియలు గుర్తొచ్చాయి.
సీవర్డ్‌కు డ్రాకులా కారణంగా జరిగిన మరణాలన్నీ గుర్తొచ్చాయి.
క్విన్సీ నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
మినా మాత్రం వింటున్నది.
ఆమె బతికే ఉన్నది.
ఇంకా మనిషిగానే ఉన్నది.
అయినా…
ఏదో ఒక రోజు తన సమాధి దగ్గర వినిపించవచ్చునని భావిస్తున్న మాటలను…
ఇప్పుడే వింటున్నది.
ప్రార్థన పూర్తయింది.
గదిలో నిశ్శబ్దం అలాగే ఉన్నది.
ఎవరికి ఏమి మాట్లాడాలో తెలియలేదు.
కాని …
మినా ఆశ వదిలేసిందని దాని అర్థం కాదు.
కొద్దిసేపటి తరువాత జోనాథన్‌కు అది అర్థమైనది.
తాను చనిపోతానని నిర్ణయించుకుని మినా సిద్ధపడటం లేదు.
" భయం తనను నియంత్రించకూడదని ఆమె నిర్ణయించుకున్నది."
అత్యంత భయంకరమైన పరిస్థితిని నేరుగా ఎదుర్కొన్నది.
ఇప్పుడు…
మళ్లీ పోరాడగలదు.
మినా అంత ధైర్యంగా ఉండగలిగితే…
తాను నిరాశకు లోనవ్వకూడదని జోనాథన్ అనుకున్నాడు.
అతనిలో కూడా మళ్లీ ధైర్యం పెరిగింది.
భవిష్యత్ ప్రణాళిక ఖరారైనది.
’ వారు విడిపోతారు.’
జోనాథన్, ఆర్థర్ ఒక మార్గంలో వెడతారు.
సీవర్డ్, క్విన్సీ మరో మార్గంలో వెడతారు.
మినాతో కలిసి వాన్ హెల్సింగ్
ప్రయాణిస్తాడు.
వారందరి లక్ష్యం ఒక్కటే.
’ డ్రాకులా కోట.’
డ్రాకులా పెట్టె కోటకు చేరక ముందే…
మధ్యలోనే పట్టుకోవడానికి మిగతావారు ప్రయత్నిస్తారు.
కాని వాన్ హెల్సింగ్‌కు మరో పని కూడా ఉన్నది.
డ్రాకులా కోటలో ఇంకా ఇతర జీవులు ఉన్నాయని అతనికి తెలుసు.
చాలా కాలం క్రితమే జోనాథన్ వాటి గురించి చెప్పాడు.
" ఆ ముగ్గురు వాంపైర్ మహిళలు. "
వాళ్లు ఇంకా అక్కడే ఉండవచ్చు.
డ్రాకులాను నాశనం చేసినా…
వారిని అలాగే వదిలేయలేరు.
అవసరమైతే…
వాన్ హెల్సింగ్ స్వయంగా వారిని ఎదుర్కోవాలి.
ఆ మాట వినగానే జోనాథన్‌కు ఒళ్లు జలదరించింది.
ఆ ముగ్గురు మహిళలు అతనికి ఇప్పటికీ బాగా గుర్తున్నారు.
వారి అందం.
వారి గొంతులు.
వారి భయంకరమైన ఆకలి.
కోటలో బందీగా ఉన్నప్పుడు…
వాళ్లు తన దగ్గరకు వచ్చిన ఆ రాత్రి గుర్తొచ్చింది.
వారిలో ఒకరు తన గొంతు వైపు వంగినప్పుడు…
తాను కదలలేకపోయిన ఆ నిస్సహాయ స్థితి గుర్తొచ్చింది.
ఇప్పుడు…
మినాను తీసుకుని వాన్ హెల్సింగ్ అదే కోట వైపు వెడుతున్నాడు.
ఆ మహిళలు ఎదురైతే?
జోనాథన్ అభ్యంతరం చెప్పాలనుకున్నాడు.
కాని …
అందరికీ తెలిసిన నిజం ఒక్కటే.
‘ఇప్పుడు వారు ఎంచుకునే ప్రతి దారిలోనూ ప్రమాదం ఉన్నది.’
విడిపోవడానికి ముందు వాన్ హెల్సింగ్ మరోసారి హెచ్చరించాడు.
డ్రాకులాను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదు.
ఇప్పుడు వారు అతని స్వదేశానికి చాలా దగ్గరగా ఉన్నారు.
అక్కడ అతనికి సేవకులు ఉండవచ్చు.
భయంతోనో…
విధేయతతోనో…
అతని మాట వినే మనుషులు ఉండవచ్చు.
జంతువులను నియంత్రించగలడు.
వాతావరణాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు.
మినాపై ప్రభావం చూపగలడు.
అన్నింటి కంటే…
సూర్యాస్తమయానికి ముందే డ్రాకులా తన కోటకు చేరుకుంటే…
’ పరిస్థితి పూర్తిగా అతనికి అనుకూలంగా మారవచ్చు.’
అందుకే…
వారు చాలా వేగంగా కదలాలి.
వేర్వేరు బృందాలుగా బయలుదేరడానికి సిద్ధమయ్యాయి.
మినాను జోనాథన్ కౌగిలించుకున్నాడు.
చాలాసేపు…
ఇద్దరిలో ఎవరూ ఒకరినొకరు వదలాలని అనుకోలేదు.
మినాను కాపాడటానికి వాన్ హెల్సింగ్ తన ప్రాణాన్ని కూడా ఇస్తాడని జోనాథన్‌కు తెలుసు.
కాని …
ఆమెను వదిలి వెళ్లడం మాత్రం సులభం కాలేదు.
జోనాథన్ ముఖంలోకి మినా చూసింది.
“వెళ్లు,” అన్నది.
కొద్దిసేపు ఆగి…
“అతనిని కనుగొను.”
జోనాథన్ తల ఊపాడు.
ఇక చెప్పడానికి మాటలు లేవు.
కొద్దిసేపటికే…
వేటగాళ్లు వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నారు.
ఇప్పుడు వేట దేశమంతా విస్తరించింది.
కొందరు రోడ్ల వెంట వెడుతున్నారు.
మరికొందరు నది మార్గాన్ని అనుసరిస్తున్నారు.
వాన్ హెల్సింగ్, మినా…
పర్వతాల వైపు ప్రయాణిస్తున్నారు.
అందరి లక్ష్యం ఒక్కటే.
’ డ్రాకులా కోట.’
ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ…
జోనాథన్‌కు చుట్టూ ఉన్న ప్రకృతి తెలిసినట్టుగా అనిపిస్తున్నది.
ప్రతి రోడ్డు గుర్తుందని కాదు.
ఆ ప్రాంతం కలిగించే అనుభూతి అతనికి గుర్తుంది.
దూరంగా కనిపించే పర్వతాలు.
దట్టమైన అడవులు.
చుట్టూ ఉన్న ఒంటరితనం.
నాగరిక ప్రపంచం నెమ్మదిగా మాయమవుతున్నదనే అనుభూతి.
కాలం వెనక్కి తిరుగుతున్నట్టుగా ఉన్నది.
మరోసారి…
అతను డ్రాకులా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాడు.
కాని ఈసారి…
అతని దగ్గర ఆయుధం ఉన్నది.
నిజం తెలుసు.
తనకు సహాయం చేసే స్నేహితులు దగ్గరలోనే ఉన్నారు.
అన్నింటి కంటే ముఖ్యంగా…
" ఈసారి వేటాడబడుతున్నది జోనాథన్ కాదు."
" డ్రాకులా."
అయినా…
కౌంట్ ఇంకా వారి కంటే ముందే ఉన్నాడు.
ఎక్కడో…
అతని పెట్టె దేశం లోపలికి ప్రయాణిస్తున్నది.
బహుశా పడవలో.
లేదా…
ఇప్పటికే బండిపైకి మారి ఉండవచ్చు.
లోపల ఏమి ఉన్నదో కూడా తెలియని మనుషులు…
ఆ పెట్టెను మోస్తూ ఉండవచ్చు.
సూర్యుడు ఉదయిస్తున్నాడు.
అస్తమిస్తున్నాడు.
ప్రతి రోజుతో…
డ్రాకులా కోటకు దూరం తగ్గుతున్నది.
అదే సమయంలో…
’ మినా కూడా మారుతున్నది.’
వాన్ హెల్సింగ్ అది గమనించాడు.
డ్రాకులా దేశంలోకి వెడుతున్న కొద్దీ…
మినా మరింత అలసిపోతున్నట్టుగా కనిపిస్తున్నది.
కొన్నిసార్లు విచిత్రంగా నిశ్శబ్దంగా మారుతున్నది.
కొన్నిసార్లు చాలా గాఢంగా నిద్రపోతున్నది.
మరికొన్నిసార్లు…
మాట్లాడటానికే ఇష్టపడనట్టుగా కనిపిస్తున్నది.
వాన్ హెల్సింగ్ ఆందోళన మరింత పెరిగింది.
డ్రాకులాకు దగ్గరవుతున్న కొద్దీ…
మినాపై అతని శక్తి కూడా పెరుగుతున్నదా?
ఇప్పటి వరకు డ్రాకులాను వెతకడానికి సహాయం చేసిన అదే బంధం…
ఇప్పుడు మినాను అతని వైపు లాగుతున్నదా?
ఆ ఆలోచన వాన్ హెల్సింగ్‌ను భయపెట్టింది.
సూర్యాస్తమయం సమయంలో…
మినాను వాన్ హెల్సింగ్ మరోసారి హిప్నోటిక్ స్థితిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.
“నీకు ఏమైనా వినిపిస్తున్నదా?” అని అడిగాడు.
మినా సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది.
కాని …
ఈసారి ఆమెకు చాలా కష్టంగా అనిపిస్తున్నది.
ఇంతకు ముందులా స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నది.
వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధం…
ఇప్పుడు వారికి అంతగా ఉపయోగపడటం లేదు.
ఎందుకు?
డ్రాకులా దానిని అడ్డుకోవడం నేర్చుకున్నాడా?
లేక…
అతను చాలా దగ్గరకు వచ్చేశాడా?
లేదా…
" ఇంకా భయంకరమైనది ఏదైనా జరుగుతున్నదా?"
వాన్ హెల్సింగ్‌కు తెలియదు.
కాని .
ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు.
’ వారు త్వరపడాలి.’
పర్వతాలపై చీకటి నెమ్మదిగా కమ్ముకుంటున్నది.
దారులు మరింత చీకటిగా మారుతున్నాయి.
చలి పెరుగుతున్నది.
ఎక్కడో వారి ముందుగా…
డ్రాకులా కోట ఉన్నది.
వేటగాళ్లకు, ఆ కోటకు మధ్య…
చివరి మట్టి పెట్టె ప్రయాణిస్తున్నది.
దాని లోపల…
" కౌంట్ డ్రాకులా ఉన్నాడు."
ఆ పెట్టె వారికంటే ముందే కోటకు చేరుకుంటే…
డ్రాకులా తన పురాతన ఇంటి రక్షణలోకి వెళ్లిపోవచ్చు.
కాని…
వేటగాళ్లు ముందుగా దానిని పట్టుకోగలిగితే…
ఇన్ని రోజులుగా వారిని వెంటాడుతున్న ఈ భయంకరమైన పీడకల…
చివరకు ముగియవచ్చు.
వారి మధ్య దూరం తగ్గుతున్నది.
డ్రాకులా కోట దగ్గర పడుతున్నది.
చీకటి మరింత గాఢమవుతున్నది.
" చివరి వేట ప్రారంభమైనది."
మరి ఈసారి…
“వారికి రెండో అవకాశం ఉండకపోవచ్చు.”

