(తెలుగులో సులభంగా చదవదగిన కథ)

కౌంట్ డ్రాకులా ఇంగ్లాండ్ నుంచి పారిపోతున్నాడు. భయంకరమైన సంఘటనలు మొదలైన తరువాత…

మొదటిసారిగా వేటగాళ్లు అతనిని వెనక్కి తగ్గేలా చేశారు.

అతని ఇళ్లు బయటపడ్డాయి.

అతను తెచ్చుకున్న మట్టి పెట్టెలలో చాలా వరకు పనికి రాకుండా చేశారు.

అతని రహస్యాలు ఇక రహస్యాలు కావు.

జోనాథన్ హార్కర్, ప్రొఫెసర్ వాన్ హెల్సింగ్, డాక్టర్ సీవర్డ్, ఆర్థర్ హోల్మ్‌వుడ్, క్విన్సీ మోరిస్, మినా…

ఇప్పుడు డ్రాకులా ఎవరో తెలుసుకున్నారు.

అతని శక్తులు తెలుసుకున్నారు.

అతని బలహీనతల్లో చాలా వరకు తెలుసుకున్నారు.

అన్నింటి కంటే ముఖ్యంగా…

అతను సముద్ర మార్గంలో తప్పించుకుంటున్నాడని తెలుసుకున్నారు.

కాని …

’ డ్రాకులా ఇంకా ఓడిపోలేదు.’

అతను తిరిగి వెడుతున్నది తనకు బాగా శక్తి ఉన్న ప్రదేశానికి.

’ ట్రాన్సిల్వేనియాకు.’

తన స్వదేశానికి.

జోనాథన్ కు భయంకరమైన పీడకల మొదలైన ప్రదేశానికి.

డ్రాకులా సురక్షితంగా తన కోటకు చేరుకుంటే…

అతనిని నాశనం చేయడానికి వారికి దొరికిన ఉత్తమ అవకాశం చేజారిపోవచ్చు.

అంతేకాదు…

మినా జీవితం కూడా శాశ్వతంగా అతనితో ముడిపడి ఉండిపోవచ్చు.


అందరూ ఒకచోట చేరి తమకు తెలిసిన విషయాలు అన్నింటినీ పరిశీలించడం ప్రారంభించారు.

పటాలు తెరిచారు.

నౌకల సమాచారాన్ని చూశారు.

ప్రయాణ సమయాలు లెక్కించారు.

దూరాలు లెక్కించారు.

ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం.

డ్రాకులా సాధారణ ప్రయాణికుడిలా అందరి మధ్య ప్రయాణించలేడు.

ట్రాన్సిల్వేనియా నుంచి తెచ్చుకున్న చివరి మట్టి పెట్టెలో దాక్కునే ఉండాలి.

అంటే…

అతను ఇతరులపై ఆధారపడవలసిందే.

నావికులు.

ఓడ రేవుల్లో పనిచేసేవారు.

బండ్లపై సరుకులు తీసుకెళ్లేవారు.

తాము ఏమి మోస్తున్నామో కూడా తెలియని సాధారణ మనుషులు.

డ్రాకులాకు అతీంద్రియ శక్తులు ఉండవచ్చు.

కాని ఈ ప్రయాణంలో…

’ అతను కూడా ఒక సరుకే.’

ఆ విషయం వేటగాళ్లకు ఆశ కలిగించింది.


చివరకు డ్రాకులాను తీసుకు వెడుతున్న ఓడ ఏదో తెలుసుకున్నారు.

’ జరీనా కేథరిన్.’

ఆ ఓడ ’ వార్నా’ వైపు ప్రయాణిస్తున్నది.

ఆ పేరు వినగానే జోనాథన్‌కు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

తూర్పు యూరప్.

పర్వతాలు.

డ్రాకులా దేశానికి తీసుకెళ్లే మార్గాలు.

ఆ దారుల చివర ఏమి ఉన్నదో జోనాథన్‌కు తెలుసు.

ఒకప్పుడు…

తన కోసం ఎదురుచూస్తున్న చీకటి గురించి ఏమీ తెలియకుండా ఆ దిశగా ప్రయాణించాడు.

ఇప్పుడు…

అదే దారిలో మళ్లీ వెళ్ళవలసి రావచ్చు.

కాని ఈసారి…

అతను నిస్సహాయుడైన అతిథి కాదు.

’ ఈసారి అతను వేటగాడు.’


వాన్ హెల్సింగ్ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాడు.

“అతను ఎక్కడికి వెడుతున్నాడో మనకు తెలుసు,” అన్నాడు అతడు.

“అదే మనకు ఉన్న చక్కటి అవకాశం.”

వారు భూమార్గంలో ప్రయాణిస్తే…

డ్రాకులా ఓడ కంటే ముందే వార్నాకు చేరుకునే అవకాశం ఉన్నది.

ఓడ ప్రయాణం గాలి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.

కాని వీరు రైళ్లలోను వెళ్లగలరు.

ఒక పురాతన రాక్షసుడితో జరుగుతున్న ఈ పోరాటంలో…

ఆధునిక ప్రపంచం వారికి సహాయం చేస్తున్నది.

డ్రాకులాకు అతీంద్రియ బలం ఉన్నది.

కాని అతని శత్రువులకు…

రైల్వేలు ఉన్నాయి.

టెలిగ్రాఫ్ ఉన్నది.

నౌకల రికార్డులు ఉన్నాయి.

పటాలు ఉన్నాయి.

ప్రయాణ సమయ పట్టికలు ఉన్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా…

’ సమాచారం ఉన్నది.’

ఇది ఒక విచిత్రమైన పోటీ.

పురాతన ప్రపంచం…

ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతున్నది.


జోనాథన్ వెంటనే బయలుదేరాలని అనుకున్నాడు.

డ్రాకులా బతికి ఉన్న ప్రతి గంట…

మినాకు ప్రమాదంగా అనిపిస్తున్నది.

ఆ రాత్రి మినాపై జరిగిన దాడి అతని మనసులో నుంచి పోవడం లేదు.

ఆమె ముఖం.

రక్తం.

ఆమె నుదుటిపై కాలిన ఆ భయంకరమైన గుర్తు.

డ్రాకులా చెప్పిన మాటలు.

అన్నీ అతనికి గుర్తున్నాయి.

మినా ఇప్పుడు తనకు చెందినదని డ్రాకులా భావిస్తున్నాడు.

కాని జోనాథన్ మనసులో ఒక మాట చెప్పుకున్నాడు.

‘అది ఎప్పటికీ జరగదు.’


కాని వాన్ హెల్సింగ్ మిగిలిన వారిని హెచ్చరించాడు.

ఈ వేట అంత సులభంగా కాదు.

డ్రాకులా చాలా తెలివైనవాడు.

తనను వారు వెంబడిస్తున్నారని అతనికి తెలుసు.

అవసరమైతే తన ప్రణాళికను మార్చగలడు.

తనకు సహాయం చేస్తున్నామనే విషయం కూడా తెలియకుండా సాధారణ మనుషులను ఉపయోగించుకోగలడు.

ఆలస్యం జరిగేలా చేయగలడు.

అన్నింటి కంటే ముఖ్యంగా…

తన స్వదేశానికి చేరుకున్న తరువాత అతనికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.

ఆ ప్రాంతం అతనికి తెలుసు.

పర్వతాలు తెలుసు.

సాధారణ ప్రయాణికులు సులభంగా దారి తప్పిపోయే రహస్య మార్గాలు కూడా తెలుసు.

అతను వెనక్కి తగ్గుతున్నాడని, బలహీనుడని అనుకోవద్దని వాన్ హెల్సింగ్ హెచ్చరించాడు.

“వేటాడబడుతున్న పులే అత్యంత ప్రమాదకరమైనది.”

డ్రాకులా పారిపోతుండవచ్చు.

కాని …

ఎప్పుడైనా వెనక్కి తిరిగి దాడి చేయగలడు.


ఇంకో పెద్ద సమస్య ఉన్నది.

’ మినా.’

ఆమె పరిస్థితి అందరినీ కలవరపెడుతున్నది.

చూడటానికి ఆమె ఇంకా మునుపటి మినాలానే ఉన్నది.

స్పష్టంగా మాట్లాడుతున్నది.

ఆమె మనసు ఇంకా బలంగానే ఉన్నది.

కాని …

నుదుటిపై ఆ గుర్తు అలాగే ఉన్నది.

డ్రాకులాతో ఏర్పడిన బంధం కూడా ఇంకా తెగిపోలేదు.

కొన్నిసార్లు ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతున్నది.

కొన్నిసార్లు కారణం లేకుండానే అలసిపోతున్నది.

మరికొన్నిసార్లు…

తనకే అర్థం కాని ఏవో అనుభూతులు కలుగుతున్నాయి.

జోనాథన్ ఆమెలో కనిపించే ప్రతి చిన్న మార్పునూ గమనిస్తున్నాడు.

తన భయాన్ని బయటకు కనిపించనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.

కాని…

మినాకు అతని గురించి చాలా బాగా తెలుసు.

అతను ఎంతగా భయపడుతున్నాడో ఆమెకు అర్థమవుతున్నది.


ఒక రోజు సాయంత్రం…

జోనాథన్‌తో మినా ఒంటరిగా మాట్లాడింది.

అతను వినడానికి కూడా ఇష్టపడని ఒక విషయం చెప్పింది.

“నేను కూడా లూసీలా మారిపోతే…”

జోనాథన్ వెంటనే ఆమెను ఆపేశాడు.

“వద్దు.”

కాని మినా ఆగలేదు.

“నేను చెప్పేది విను.”

జోనాథన్ మౌనంగా ఆమె వైపు చూశాడు.

“నాకు అత్యంత భయంకరమైన పరిస్థితి ఎదురైతే…

" నేను ఇతరులకు హాని చేయకుండా నువ్వు ఆపాలి.”

జోనాథన్ ఆ ఆలోచననే అంగీకరించలేకపోయాడు.

మినా ఇంకా బతికే ఉన్నది.

వారు ఆమెను కాపాడతారు.

డ్రాకులాను నాశనం చేస్తారు.

కాని మినా పట్టుబట్టింది.

ఆమెకు లూసీ గుర్తుంది.

మంచి మనసు ఉన్న లూసీ.

అందరినీ ప్రేమించిన లూసీ.

ఒక చిన్న పిల్లవాడికి కూడా హాని చేయాలని ఎప్పుడూ అనుకోని లూసీ.

కాని…

చనిపోయిన తరువాత ఆమె ఏమి అయిందో మినాకు తెలుసు.

ఒక భయంకరమైన జీవిగా మారింది.

తనకూ అదే పరిస్థితి వస్తే…

తనపై ఉన్న ప్రేమ కారణంగా జోనాథన్ తాను కోరిన పనిని చేయకుండా ఉండకూడదని మినా కోరుకున్నది.

ఆ మాటలు జోనాథన్‌ను కదిలించాయి .

కాని …

మినాకు అతని మాట కావాలి.

చివరకు…

తీవ్రమైన బాధతో జోనాథన్ మాట ఇచ్చాడు.

అవసరమైతే…

చేయవలసిన పని చేస్తానని.

కాని తన మనసులో మరో మాట కూడా చెప్పుకున్నాడు.

’ ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు.’

దాని కంటే ముందే…

’ డ్రాకులా చనిపోతాడు.’


వాన్ హెల్సింగ్ కూడా మినా పరిస్థితి గురించి చాలా తీవ్రంగా మాట్లాడాడు.

మినా, డ్రాకులా మధ్య ఏర్పడిన బంధం ప్రమాదకరమైనది.

డ్రాకులా ఆమెపై ప్రభావం చూపగలడు.

ఆమెను నియంత్రించగలడు కూడా.

డ్రాకులా మళ్లీ బలపడితే…

ఆ ప్రమాదం మరింత పెరగవచ్చు.

అందుకే మినాకు చెప్పే సమాచారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆ నిర్ణయం అందరికీ బాధ కలిగించింది.

ఎందుకంటే…

వారి బృందంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో మినా ఒకరు.

వారి రికార్డులు అన్నింటినీ క్రమబద్ధీకరించింది.

ఎవరూ గమనించని సంఘటనల మధ్య సంబంధాలను గుర్తించింది.

అందరి అనుభవాలను కలిపి…

ఒక స్పష్టమైన కథగా మార్చింది.

కాని ఇప్పుడు…

వారి ప్రణాళికలోని కొన్ని విషయాలను ఆమెకు చెప్పకుండా దాచవలసి రావచ్చు.

మినాను నమ్మడం లేదని కాదు.

’ డ్రాకులాను నమ్మలేరు.’

అతను మినా మనసులోకి ప్రవేశించగలిగితే…

మినాకు చెప్పిన సమాచారం…

డ్రాకులాకు చెప్పినట్టే కావచ్చు.

మినాకు అది అర్థమైనది.

బాధగా అనిపించినా…

ఆమె అంగీకరించింది.


కాని …

ఆ బంధం రెండు వైపులా పనిచేస్తున్నది.

అదే ఇప్పుడు వారికి ఉన్న అతి పెద్ద ఆశ.

ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో…

మినాను వాన్ హెల్సింగ్ హిప్నోటిక్ స్థితిలోకి తీసుకు వెళ్లగలుగుతున్నాడు.

అప్పుడు…

డ్రాకులా ఆలోచనలు ఆమెకు తెలియవు.

అతని ప్రణాళికలు కూడా తెలియవు.

కాని …

అతని చుట్టూ ఉన్న కొన్ని శబ్దాలు వినగలుగుతున్నది.

కదలికలు అనుభూతి చెందగలుగుతున్నది.

డ్రాకులా దాక్కున్న చీకటిలోకి…

ఒక చిన్న రంధ్రం ద్వారా చూస్తున్నట్టుగా.


వాన్ హెల్సింగ్ మరోసారి ప్రయత్నించాడు.

అందరూ మినా చుట్టూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.

జోనాథన్ ఆమె పక్కనే ఉన్నాడు.

వాన్ హెల్సింగ్ మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు.

మినా శ్వాస నెమ్మదించింది.

కళ్లు మూసుకున్నది.

శరీరం పూర్తిగా ప్రశాంతంగా మారింది.

కొన్ని క్షణాల తరువాత…

వాన్ హెల్సింగ్ అడిగాడు.

“నీకు ఏం వినిపిస్తున్నది?”

మినా ఏమీ మాట్లాడలేదు.

అందరూ ఎదురుచూశారు.

తరువాత…

ఆమె మెల్లగా చెప్పింది.

“ నీరు…”

అందరూ ఒకరినొకరు చూసుకున్నారు.

“ ఇంకా?”

మినా శ్రద్ధగా వింటున్నట్టుగా కనిపించింది.

“ అలల శబ్దం…”

కొద్దిసేపు నిశ్శబ్దం.

“చెక్క కిర్రుమంటున్నది…”

ఓడలోని చెక్క కదులుతున్న శబ్దం.

వారికి అర్థమైనది.

’ డ్రాకులా ఇంకా సముద్రంలోనే ఉన్నాడు.’


ఆ సమాచారం వారికి ఆశ కలిగించింది.

మినాకు సముద్రపు శబ్దం వినిపిస్తున్నంత కాలం…

డ్రాకులా ఇంకా భూమిపైకి చేరలేదని వారికి స్పష్టం కాగలదు .

అతను ఓడలో గడిపే ప్రతి రోజు…

వారికి మరింత సమయం లభించగలదు.

వార్నాకు ముందే చేరవచ్చు.

అక్కడ అతని కోసం ఎదురు చూడవచ్చు.

అతని పెట్టెను ఓడ నుంచి దించే సమయంలోనే పట్టుకోవచ్చు.

సరైన సమయంలో అతనిని పట్టుకోగలిగితే…

కోటకు చేరకముందే డ్రాకులాను నాశనం చేయవచ్చు.

ప్రణాళిక రూపుదిద్దుకున్నది.

‘వారు తూర్పు వైపు ప్రయాణించాలి.’

డ్రాకులా ఓడ కంటే ముందే వార్నాకు చేరాలి.

ఓడరేవు దగ్గర ఎదురుచూడాలి.

డ్రాకులా వచ్చిన క్షణంలోనే…

దాడి చేయాలి.


వెంటనే ఏర్పాట్లు మొదలయ్యాయి.

టికెట్లు.

డబ్బు.

అవసరమైన పత్రాలు.

ఆయుధాలు.

పవిత్రమైన వస్తువులు.

పటాలు.

ప్రయాణంలో అవసరమయ్యే ప్రతిదీ సిద్ధం చేశారు.

క్విన్సీ ఆయుధాలు, ఇతర సామగ్రిని పరిశీలించాడు.

ఆర్థర్ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకున్నాడు.

సీవర్డ్ ముఖ్యమైన విషయాలన్నీ రాసుకుంటున్నాడు.

జోనాథన్ ప్రయాణ మార్గాన్ని పరిశీలిస్తున్నాడు.

వాన్ హెల్సింగ్ నిరంతరం డ్రాకులా గురించి ఆలోచిస్తున్నాడు. డ్రాకులా ఏమి చేయగలడో అంచనా వేస్తున్నాడు.

మినాకు ఎంత సమాచారం చెప్పవచ్చో…

అంతవరకూ ఆమె కూడా దానిని క్రమబద్ధీకరిస్తున్నది.

ఒకప్పుడు లూసీ కారణంగా కలిసిన ఈ బృందం…

ఇప్పుడు ఆమెను నాశనం చేసిన రాక్షసుడిని వెంబడిస్తూ యూరప్ దాటడానికి సిద్ధపడుతున్నది.


ఇంగ్లాండ్ నుంచి బయలుదేరే ముందు…

వాన్ హెల్సింగ్ అందరినీ ఒకచోట చేర్చాడు.

తాము ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నామో అందరికీ పూర్తిగా అర్థం కావాలని అతను కోరుకున్నాడు.

డ్రాకులా ప్రమాదకరమైనవాడు. కేవలం మనుషులను చంపుతాడని కాదు.

’ అతని దుష్టశక్తి వ్యాపిస్తుంది.’

అతని బాధితుడు…

మరో వాంపైర్‌గా మారవచ్చు.

ఆ కొత్త వాంపైర్…

మరింత మంది బాధితులను సృష్టించవచ్చు.

డ్రాకులాను స్వేచ్ఛగా వదిలేస్తే…

ఈ భయంకరమైన శాపం ఒక ఇల్లు, ఒక కుటుంబం, ఒక నగరంతో ఆగకపోవచ్చు.

లూసీనే అందుకు నిదర్శనం.

ఇప్పుడు…

మినా కూడా మరో నిదర్శనంగా మారే ప్రమాదం ఉన్నది.

అందుకే వారు కేవలం ప్రతీకారం కోసం వెళ్లడం లేదు.

‘ఇంకా వ్యాపించగల ఒక భయంకరమైన దుష్టశక్తిని ఆపడానికి వెడుతున్నారు.’


ఆర్థర్ నిశ్శబ్దంగా వింటున్నాడు.

ప్రతి రోజూ అతనికి లూసీ గుర్తొస్తూనే ఉన్నది.

అనారోగ్యానికి ముందు ఉన్న లూసీ.

ఆమె ఆనందం.

ఆమె నవ్వు.

వారి పెళ్లి గురించి ఆమెకున్న ఉత్సాహం.

అన్నీ గుర్తొస్తున్నాయి.

అదే సమయంలో…

ఆమె తరువాత మారిన భయంకరమైన రూపం కూడా గుర్తొస్తున్నది.

స్మశానం.

ఆమె చేతుల్లో ఉన్న చిన్న పిల్లవాడు.

ఆమె కళ్లలో కనిపించిన క్రూరత్వం.

చివరకు శాపం నుంచి విముక్తి పొందిన తరువాత…

ఆమె ముఖంలో తిరిగి కనిపించిన ప్రశాంతత.

డ్రాకులాను ఎందుకు నాశనం చేయాలో…

ఆర్థర్‌కు ఎవ్వరూ వివరించవలసిన అవసరం లేదు.


సీవర్డ్‌కు రెన్‌ఫీల్డ్ గుర్తొచ్చాడు.

నెలల తరబడి అతనిని ఒక ఆసక్తికరమైన వైద్య కేసుగా చూశాడు.

ఒక విచిత్రమైన రోగి.

పరిశీలించవలసిన ఒక పజిల్.

కాని చాలా ఆలస్యంగా…

డ్రాకులా ప్రభావంలో రెన్ ఫీల్డ్ చిక్కుకున్నాడని అర్థమైనది.

చివరికి …

డ్రాకులాను రెన్ ఫీల్డ్ ఎదిరించాడు.

మినాను కాపాడటానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో రెన్ ఫీల్డ్ ను డ్రాకులా చంపేశాడు. ఈ సంఘటనను…

’ సీవర్డ్ ఎప్పటికీ మర్చిపోడు.’


క్విన్సీ ఎక్కువగా మాట్లాడలేదు.

అతనికి పెద్ద పెద్ద మాటలు చెప్పే అలవాటు లేదు.

అతని స్నేహితులు వెడుతున్నారు.

అందుకే…

అతను కూడా వెడుతున్నాడు.

ట్రాన్సిల్వేనియాలో ఏమి ఎదురైనా…

’ అందరూ కలిసి ఎదుర్కొంటారు. ’


జోనాథన్ మాత్రం డ్రాకులా కోట గురించి ఆలోచిస్తున్నాడు.

ఒంటరిగా అక్కడికి చేరుకున్న రోజు గుర్తొచ్చింది.

ఆ భారీ తలుపు తెరిచిన డ్రాకులా గుర్తొచ్చాడు.

కౌంట్ చల్లటి చేయి.

తాళం వేసిన గదులు.

ఆ ముగ్గురు వాంపైర్ మహిళలు.

తోడేళ్లు.

మట్టి పెట్టెలు.

ప్రాణాలు కాపాడుకోవడానికి కోట గోడపై నుంచి దిగడానికి చేసిన ప్రయత్నం.

అక్కడే తాను చనిపోతానని అనుకున్న క్షణాలు.

అన్నీ గుర్తొచ్చాయి.

ఇప్పుడు…

విచిత్రంగా…

మళ్లీ అదే ప్రదేశానికి తిరిగి వెడుతున్నాడు.

ఆ ఆలోచన ఇప్పటికీ అతనిని భయపెడుతున్నది.

కాని …

’ ఇప్పుడు అతను నిస్సహాయుడు కాదు. ’


వారి ప్రయాణం ప్రారంభమైనది.

ఇంగ్లాండ్ నెమ్మదిగా వెనుకబడిపోతున్నది.

ఒక రైలు తరువాత మరో రైలు…

వారిని యూరప్ మీదుగా తూర్పు వైపు తీసుకు వెడుతున్నది.

కిటికీల బయట నగరాలు దాటిపోతున్నాయి.

స్టేషన్లు వచ్చి మాయమవుతున్నాయి.

భాషలు మారుతున్నాయి.

ప్రకృతి దృశ్యాలు మారుతున్నాయి.

ప్రతి మైలు గడుస్తున్న కొద్దీ…

ఒకప్పుడు తాను తప్పించుకున్న ప్రపంచానికి మళ్లీ దగ్గరవుతున్నాననే భావన జోనాథన్‌లో పెరుగుతున్నది.

మినా అతని పక్కనే ఉన్నది.

కొన్నిసార్లు ఇద్దరూ మెల్లగా మాట్లాడుకుంటున్నారు.

మరికొన్నిసార్లు…

ఏమీ మాట్లాడకుండా ఒకరి చేయి మరొకరు పట్టుకుని కూర్చుంటున్నారు.

డ్రాకులా దేశానికి చేరుకున్న తరువాత ఏం జరుగుతుందో…

ఎవరికి తెలియదు.


ప్రతి సూర్యోదయం…

ప్రతి సూర్యాస్తమయం…

ఇప్పుడు వారికి చాలా ముఖ్యం.

వీలైనప్పుడల్లా మినాను వాన్ హెల్సింగ్ హిప్నోటిక్ స్థితిలోకి తీసుకువెడుతున్నాడు.

ప్రతిసారీ అదే ప్రశ్న.

“నీకు ఏమి వినిపిస్తున్నది?”

మళ్లీ అదే సమాధానం.

“నీరు…”

“అలలు…”

“ఓడ కదులుతున్న శబ్దం…”

" డ్రాకులా ఇంకా సముద్రంలోనే ఉన్నాడు. "

ఆ వార్త వారికి ధైర్యాన్ని ఇస్తున్నది.

వారు అతనికంటే వేగంగా ముందుకు వెడుతున్నారు.


చివరకు…

వారు ‘వార్నా’ చేరుకున్నారు.

ఇప్పుడు వారి ప్రణాళిక దాదాపు పూర్తిగా పనిచేసినట్టే అనిపించింది.

డ్రాకులా కంటే ముందే వచ్చేశారు.

’ జరీనా కేథరిన్ 'ఇంకా ఓడరేవుకు చేరలేదు.

ఇప్పుడు చేయవలసింది ఒక్కటే.

ఎదురుచూడటం.

ఓడ గురించి వచ్చే ప్రతి సమాచారాన్ని పరిశీలించారు.

సందేశాలు చూశారు.

ఓడరేవుకు వచ్చే నౌకల వివరాలు గమనించారు.

ప్రతి గంట…

ఆ ఓడ కనిపించిందనే వార్త వస్తుందని ఎదురుచూశారు.

ప్రతి గంట…

డ్రాకులాను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.

జోనాథన్ తన మనసులో ఆ దృశ్యాన్ని ఊహించుకున్నాడు.

ఓడ నుంచి ఆ పెట్టెను దింపుతారు.

వారు దానిని తెరుస్తారు.

లోపల…

నిస్సహాయంగా పడుకుని ఉన్న డ్రాకులా కనిపిస్తాడు.

బహుశా…

ఇక్కడే ఈ భయంకరమైన పీడకల ముగిసిపోవచ్చు.


కాని .

ఓడ రాలేదు.

ఒక రోజు గడిచింది.

తరువాత మరో రోజు.

‘జరీనా కేథరిన్ కనిపించలేదు.’

అందరిలో ఆందోళన మొదలైనది.

బహుశా చెడు వాతావరణం కారణంగా ఆలస్యం అయి ఉండవచ్చు.

గాలి దిశ మారి ఉండవచ్చు.

ఊహించిన దాని కంటే నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉండవచ్చు.

వారు ఎదురుచూశారు.

మినాను మళ్లీ హిప్నోటిక్ స్థితిలోకి తీసుకెళ్లారు.

ఆమెకు ఇంకా…

నీటి శబ్దమే వినిపిస్తున్నది.

అంటే…

డ్రాకులా ఇంకా ఓడలోనే ఉన్నాడు.

కాని…

’ ఏదో సరిగా లేదనే భావన పెరుగుతున్నది.’


వాన్ హెల్సింగ్ లో ఆందోళన మరింత పెరిగింది.

తనను వేటాడుతున్నారని డ్రాకులాకు తెలుసు.

అయితే…

వారి ప్రణాళిక గురించి కూడా అతనికి తెలిసిపోయిందా?

వార్నాలో వారు ఎదురుచూస్తున్నారని అతనికి తెలుసా?

మినాతో ఉన్న బంధం ద్వారా…

వారు ఊహించిన దాని కంటే ఎక్కువ సమాచారం డ్రాకులాకు చేరిందా?

ఆ ఆలోచన చాలా భయంకరంగా ఉన్నది.

ఎందుకంటే…

మినా ద్వారా తాము డ్రాకులాను వెంబడిస్తున్నామని అనుకున్నారు.

కాని …

అదే సమయంలో…

’ డ్రాకులా కూడా మినా ద్వారా వారిని గమనిస్తూ ఉండవచ్చు.’


వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.

చివరకు…

ఒక వార్త వచ్చింది.

కాని…

వారు ఎదురుచూసిన వార్త అది కాదు.

'‘జరీనా కేథరిన్ ఒక ఓడరేవుకు చేరుకున్నది.’

కాని …

అది వార్నా కాదు.

“గలాట్జ్.”

డ్రాకులా తన మార్గాన్ని మార్చుకున్నాడు.

గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం కమ్ముకున్నది.

ఎవరూ మాట్లాడలేదు.

వారి ప్రణాళిక మొత్తం విఫలమైనది.

యూరప్ అంతా ప్రయాణించారు.

డ్రాకులా కంటే ముందే వార్నాకు చేరుకున్నారు.

ఓడరేవు దగ్గర ఎదురుచూశారు.

అతనిని ఉచ్చులో పట్టుకున్నామని అనుకున్నారు.

కాని …

‘’ డ్రాకులా మరో ప్రదేశానికి వెళ్లిపోయాడు.’


జోనాథన్‌లో మళ్లీ కోపం పెరిగింది.

కౌంట్ మరోసారి వారిని మోసం చేశాడు.

కాని వాన్ హెల్సింగ్ నిరాశకు లోనవ్వలేదు.

డ్రాకులా తన గమ్యాన్ని మార్చుకున్నాడు.

అది నిజమే.

కాని…

దాని ద్వారా అతను మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు.

‘అతను భయపడుతున్నాడు.’

వారిని తప్పించుకోవడానికి తన ప్రయాణ మార్గాన్నే మార్చుకున్నాడు.

అంటే…

వేటగాళ్లు అతనికి నిజమైన ప్రమాదంగా మారారు.

ఇప్పుడు…

అతను ఎక్కడ దిగాడో వారికి తెలుసు.

గలాట్జ్.

అందుకే వెంటనే మళ్లీ బయలుదేరాలి.

ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు.


మినా పటాన్ని చూసింది.

డ్రాకులా ఇప్పుడు తన స్వదేశానికి మరింత దగ్గరయ్యాడు.

ట్రాన్సిల్వేనియాకు దగ్గరగా.

పర్వతాలకు దగ్గరగా.

అతను భూమార్గంలో ప్రయాణించే ప్రతి మైలు…

వారి వేటను మరింత కష్టంగా చేస్తున్నది.

వారి కంటే ముందే డ్రాకులా తన కోటకు చేరుకుంటే…

ఇంత కష్టపడి సంపాదించిన సమాచారం, కష్టం వృధాగా పోవచ్చు.

ఇక…

‘ఎదురుచూడటానికి సమయం లేదు.’


అందరూ వార్నా నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యారు.

పోటీ మళ్లీ మొదలైంది.

కాని …

ఇప్పుడు ప్రమాదం మరింత పెరిగింది.

డ్రాకులా భూమిపైకి చేరుకున్నాడు.

ఇక ఓడపై ఆధారపడవలసిన అవసరం లేదు.

తనకు బాగా తెలిసిన ప్రాంతాల గుండా ప్రయాణించగలడు.

వేటగాళ్లకు తెలియని మార్గాలను ఉపయోగించగలడు.

అతనికి సహాయం చేసే సేవకులు లేదా ఇతరులు అక్కడ ఎదురుచూస్తూ ఉండవచ్చు.

ఆ మార్గాలన్నింటి చివర…

ఒక ప్రదేశం ఉంది.

‘డ్రాకులా కోట.’

అతని కోట.

అతని ఇల్లు.

అతనికి మిగిలిన చివరి సురక్షిత ప్రదేశం.


మినా వైపు చూశాడు వాన్ హెల్సింగ్ .

ఆమె నుదుటిపై ఆ గుర్తు ఇంకా అలాగే ఉన్నది.

వారు వేగంగా కదలడానికి మరో కారణం అదే.

ప్రతి సూర్యాస్తమయం…

మినాపై డ్రాకులా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నది.

డ్రాకులాను నాశనం చేయకుండా గడిచే ప్రతి రోజు…

మినా అన్‌డెడ్‌తో ముడిపడి ఉండే మరో రోజు.

ఇప్పుడు సమయం కేవలం ముఖ్యమైనది మాత్రమే కాదు.

’ సమయమే వారి శత్రువు కూడా ’


ఆ రాత్రి జోనాథన్ తూర్పు వైపు చూశాడు.

ఎక్కడో వారి ముందుగా…

డ్రాకులా పర్వతాల వైపు కదులుతున్నాడు.

ఒకప్పుడు జోనాథన్ ఇదే ప్రాంతంలో ఒక అమాయక యువ న్యాయవాదిగా ప్రయాణించాడు.

తన కోసం ఎలాంటి ప్రమాదం ఎదురు చూస్తున్నదో అతనికి తెలియదు.

కాని ఇప్పుడు…

’ అతను వేటగాడిగా తిరిగి వస్తున్నాడు.’

అతని పక్కన శత్రువు గురించి పూర్తిగా తెలిసిన మనుషులు ఉన్నారు.

వారి వెనుక…

లూసీ, రెన్‌ఫీల్డ్ సమాధులు ఉన్నాయి.

అతని పక్కన…

డ్రాకులా భయంకరమైన గుర్తును మోస్తున్న మినా ఉన్నది.

వారి ముందు…

కౌంట్ డ్రాకులా ఉన్నాడు.

వారిద్దరి మధ్య దూరం నెమ్మదిగా తగ్గుతున్నది.

డ్రాకులా లండన్ నుంచి తప్పించుకున్నాడు.

సముద్రాన్ని దాటాడు.

వార్నాలో వారిని మోసం చేశాడు.

కాని …

’ వేట నుంచి మాత్రం ఇంకా తప్పించుకోలేదు.’

ఇప్పుడు ఆ వేట…

డ్రాకులా స్వదేశంలోకి ప్రవేశిస్తున్నది.

చీకటి అడవులు…

ఎత్తైన పర్వతాలు…

వాటి అవతల ఎక్కడో…

’ డ్రాకులా కోట ఎదురు చూస్తున్నది.’