ఏడున్నర దశాబ్దాల సినీ జీవిత ప్రస్థానంలో ఎన్నో అనుభవాలను, విజయాలను పండించుకున్న దర్శక శ్రేష్ఠుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయంతో ఆ తరం దర్శక దిగ్గజ శకం ముగిసినట్లయింది. ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్క పంథా అని చెప్పుకోవలసి వస్తే ఆయన ప్రయోగాలకు పెద్దపీట వేశారు. నలభయ్యో ఏట దర్శకత్వం వహించిన ‘నీతి నిజాయతి’ నుంచి 94వ ఏట తీసిన చివరి చిత్రం (61) ‘సింగ్ గీతం’ వరకు దేనికదే ప్రత్యేకమైనది. ఆ వయసులోనూ దర్శకత్వం వహించడం భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే అపూర్వ ఘట్టం. ఆయన కేవలం దర్శకుడే కాదు. చిత్రానువాద (స్ర్కీన్ ప్లే) రచయితగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ప్రత్యేకతను చాటారు. సాధారణమైన కథలే కాకుండా భిన్నమైన ఇతివృత్తాలను తెరకెక్కించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడు ఆయనలా ప్రయోగాలు చేయలేదనడం అతిశయోక్తికాదు. తన విజయానికి దర్శక గురువు కేవీ రెడ్డి వద్ద శిష్యరికమే ప్రధాన కారణమని వినయంగా చెప్పేవారు.
61 చిత్రాలకు దర్శకత్వం
సింగీతం శ్రీనివాసరావు సుదీర్ఘ సినీ జీవితంలో తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 61 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఈ విషయంలో గురువు కేవీ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. ‘పెద్ద సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించే ఇతర దర్శకుల గురించి మాట్లాడను కానీ నా వరకు నాకు రాశి కంటే వాసి ముఖ్యం. ఎక్కువ చిత్రాలు చేయాలని అనుకోను.ఆయన శిష్యుడిగా జాగ్రత్త పడ్డాను. ఉన్నదానితో తృప్తి చెందుతున్నాను’ అని ఒక సందర్భంలో అన్నారు.
కె.వి. రెడ్డి వద్ద శిష్యరికం
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సెప్టెంబర్ 21,1931లో శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రామచంద్రరావు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆయన వారసత్వంలోనే సూళ్లూరుపేటలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వాయులీన విద్వాంసురాలైన తల్లి (శకుంతలాబాయి) సంగీత ప్రభావం ఆయనపై బాగా ఉన్నది. మదరాసు రాజధాని (ప్రెసిడెన్సీ) కళాశాల విద్యార్థిగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నాటకరంగ ప్రవేశం చేశారు. ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూనే తాను రాసిన నాటకాలను శిష్యులతో ప్రదర్శింప చేసేవారు. ఉపాధ్యాయ ఉద్యోగం మానేసి దిగ్దర్శకుడు కేవీరెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. చివరి దాకా ఆయన దగ్గరే పనిచేశారు. ఆయన క్రమశిక్షణ, పనిపట్ల అంకితభావం, నిరాడంబరత, పొదుపరి తనం…గురించి విన్న సింగీతం, చేస్తే ఆయన వద్దనే సహాయకుడిగా పని చేయాలనుకున్నారు? కానీ చేరడం ఎలా? అయితే అప్పటికే ‘స్వతంత్ర’లాంటి పత్రికలలో వ్యాసాలు రాస్తున్న తనకు, ఆ అర్హత చాలనుకున్నారు. అంతే…‘మీ దగ్గర సహాయకుడిగా చేరాలనుకుంటున్నాను’ అని సూటిగా చెప్పారట. దానికి ‘నా గురించి విన్నావా? చాలా పర్‌పెక్టుగా ఉంటాను’ అన్నది కేవీ స్పందన. ఇద్దరి మధ్య మరికొన్ని మాటలయ్యాక…ఆయన, ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన ‘షి స్టూప్స్ కాంకర’ హాస్య నాటకాన్ని సినిమాకు అనుగుణంగా రాసుకు రమ్మన్నారట. దాని చూసి సంతృప్తి చెందిన తరువాతే సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ‘కేవీ గారు బీఎస్సీ ఆనర్స్ చేసిన ప్రెసిడెన్సీ కళాశాలలోనే నేనూ చదివాను. ఆ బాదరాయణ సంబంధం కూడా మేలు చేసిందేమోనని అనుకున్నాను’ అని సింగీతం నవ్వుతూ అనేవారు. మొత్తం మీద ఆయన స్వయంగా దర్శకత్వం వహించేంత వరకు కేవీ రెడ్డి వద్ద మినహా మరో దర్శకుడి వద్ద పనిచేయలేదు.
‘పని నేర్చుకో. తెర మీద పేరు పడదు. మొదటి సినిమాకు జీతం ఇవ్వం. నీ పనితనం ఏమిటో తెలియాలి కదా? రెండో సినిమా నుంచి మాత్రమే పూర్తి స్థాయి అసిస్టెంట్‌గా తీసుకుంటా’ అనే షరతులతో కేవీరెడ్డి తమకు సహాయకుడిగా తీసుకున్నారు. ‘మాయాబజార్, దొంగరాముడు’ సినిమాలకు అసిస్టెంట్, పెళ్లినాటి ప్రమాణాలు నుంచి రెగ్యులర్ అసోసియేట్‌గా పనిచేశారు. సహాయకుడిగా తొలిచిత్రం ‘మాయాబజార్’కు మొదట సంగీత దర్శకత్వం వహించిన ఎస్.రాజేశ్వరరావు వద్ద కొంతకాలం శిష్యరికం చేశారు. ఆ అనుభవమే తాను సంగీత ప్రధానమైన సినిమాలను తీసేలా సహకరించిదని చెప్పేవారు. చాలా మంది దర్శకులతో పోలిస్తే తాను సాధించినది ఏమంత గొప్ప కాదని, ఈ తరం దర్శకుల నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని వినయంగా అనేవారు. ఏమైనా సాధించాననుకుంటే, అందుకు తమ గురువే స్ఫూర్తి అని, నటుడిలోని ప్రతిభను రాబట్టడం ఆయన వద్ద గ్రహించానని చెప్పేవారు. ‘ఒక చిత్రం రూపుదిద్దుకోవడం వెనుక వందలాది మంది ప్రయత్నం, కృషి ఉన్నప్పటికీ వారందరిని సవ్యదిశలో నడిపే చుక్కాని దర్శకుడి ఆలోచనా శక్తి. నటీనటుల్లోని ప్రతిభను గుర్తించి దానిని వెలికి తీసేందుకు దర్శకుడు ప్రయత్నించాలి. కొంతమేరకైనా అలా చేశాననే అనుకుంటాను. అదే నా విజయానికి కారణమని విశ్వసిస్తా’ అని ఒక ముఖాముఖీలో చెప్పారు.
విభిన్న కథాంశాలతో…
ఆయన, వ్యాపారాత్మక చిత్రాలే కాకుండా విభిన్న కథాంశాలతో రూపొందించిన చిత్రాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచాయి. టాకీ యుగంలోనూ మూకీగా వచ్చిన ‘పుష్పక విమానం’ భారతీయ సినిమా చరిత్రలోనే విలక్షణమైనది. ఒక్క సంభాషణ కూడా లేకుండా నటీనటుల హావభావాలు, నేపథ్యం సంగీతంతోనే అద్భుతమైన హాస్యాన్ని పండించడం ఒక ప్రయోగంగా సినీ విశ్లేషకులు అంటారు. ఈ చిత్రం రెండు జాతీయ పురస్కారాలతో పాటు అయిదు నంది పురస్కారాలను అందుకుంది. అలాగే సుమారు ఆరడుగులు ఎత్తుగల నటుడు కమల్ హాసన్ ను అందులో సగానికి కుదించి (మరుగుజ్జులా) నటింప చేసిన చిత్రం ‘విచిత్ర సోదరులు’ ప్రేక్షకులకు నేటికీ విచిత్రమే. ముఖ్యంగా…వీఎఫ్ ఎక్స్ లాంటి సాంకేతికలేని రోజుల్లో తీయడాన్ని విశేషంగా చెబుతారు. కమల్ హాసన్ కూడా నిజమైన మరుగుజ్జులా నటించారు.
ఆ తరంలో రచయిత పింగళి నాగేంద్రరావును ‘మాటల మాంత్రికుడు’అని చెప్పుకునేవారు. అలాంటి వారికే ‘మాట ‘సాయం’ అందించి గురువు ప్రశంసలను అందుకున్నారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో యతిగా వచ్చిన అర్జునుడికి మారు పేరు కావాలనుకున్నారు దర్శకుడు కేవీ. అదీ ‘హుందాగా, వినోదాత్మకం’గా ఉండాలని సూచించడంతో, అర్జునుడి పది పేర్లలోని మొదటి అక్షరాలను గుదిగుచ్చి ‘అజిభీదఫ పావిశ్వేసకి’ స్వామి కనిపెట్టారు.
కేవీ రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన తాను, గురువు కాలం చేసిన సంవత్సరంలోనే దర్శకుడు కావడం యాదృచ్ఛికం అనే వారు. తన తొలిచిత్రం (నీతి నిజాయతి) విడుదలైన (జూలై 20,1972) రెండు నెలలలోపే కేవీ అస్తమించారని (సెప్టెంబర్ 15, 1972), గురువు సజీవంగా ఉండగానే సినిమా విడుదల కావడం కొంత తృప్తి కలిగించిన అంశం అనేవారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా వాణిజ్యపరంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ నిరాశ నిస్పృహతో వెనుకడుగు వేస్తే ‘పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, అమావాస్య చంద్రుడు, జమీందారు గారి అమ్మాయి, సొమ్మొకడిది సోకొకడిది, పంతులమ్మ, విచిత్ర సోదరులు…’లాంటి విభిన్న చిత్రాలు వచ్చేవి కావు. ఆర్థికంగా నష్టం వచ్చినా, తొలిచిత్రం ఆయన విజయవంతమైన దర్శక ప్రస్థానానికి అతి ముఖ్యమైన ఆరంభంగా చెబుతారు. ‘ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘మయూరి’ సింగీతంలోని మేధాశక్తికి తార్కాణం. ఈ చిత్రాన్ని తొలి బయోపిక్‌గా చెబుతారు. రహదారి ప్రమాదంలో కాలు కోల్పోయిన నర్తకి సుధాచంద్రన్ జీవిత కథను ఆమెనే ప్రధాన పాత్రగా (కథానాయికగా) రూపొందించారు. ప్రయోగాలపై మమకారంతో 94వ ఏట దర్శకత్వం వహించిన, పర్యావరణ ఆధారిత చిత్రం ‘సింగ్ గీతం’ ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది.
ఆయన చలనచిత్ర ప్రస్థానంలో రెండుసార్లు జాతీయ పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు మూడు, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవిత సాఫల్య పురస్కారం (2011) లాంటివి అందుకున్నారు. ‘మయూరి’ 14 నంది పురస్కారాలను గెలుచుకుంది.
శ్రీమతి తోడునీడగా…
‘ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ప్రమేయం ఉంటుంది’ అనే మాటకు సింగీతం వారు మినహాయింపు కాదు. ఆయన ధర్మపత్ని లక్ష్మీ కల్యాణి గృహిణిగానే కాదు…సినిమా స్క్రిప్ట్ రచనలోనూ పాలుపంచుకొనేవారు. ‘పుష్పకవిమానం’ తదితర చిత్రాల రూపకల్పనలో ఎంతో సహకారం అందించారు. ఆమె భౌతికంగా దూరం కావడం (2022) విషాదమే. అయినా ఆయన కుంగిపోలేదు. ‘భర్త ముందే తాను వెళ్లి పోవాల’ని సగటు భారత స్త్రీ కోరుకోవడం సహజం. అందుకు భిన్నంగా ‘తను ఉండగానే భార్య కన్నుమూయాల’ని భర్త కోరుకోవడం విడ్డూరంగా ఉండవచ్చు. కానీ, ‘నేను లేని తన పరిస్థితిని కలలో కూడా ఊహించలేను. అందుకే దేవుడిని అలా వేడుకుంటున్నాను’ అని ఒక ముఖాముఖీలో చెప్పారు.
సింగీతం నిత్య సంతోషి. వయస్సు శరీరానికే కాని మనసుకు కాదని గట్టిగా నమ్మేవారు. అందుకు గుర్తుగానేమో…చివరి వరకు టీషర్టు ధారణతోనే కనిపించేవారు. కొందరు ఊరికే అలా వచ్చి వెళ్లినట్లు కాకుండా తమ తమ రంగాలలో తమ ‘ప్రత్యేకత’ ఇది అని నిరూపించుకుంటారు. అలా వెండితెరపై చెరగని సంతకం చేసి సెలవంటూ వెళ్లిపోయిన సింగీతం శ్రీనివాసరావుకు నివాళులు.

