ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ తన పేరుకి సార్థకత తెచ్చి, పదాలకు విలువనిచ్చే కవిగా, సాహిత్యవేత్తగా ప్రపంచ ఖ్యాతిని పొందాడు. ఆంగ్ల కవులలో ప్రకృతిని అత్యద్భుతంగా హృదయాలను తాకే పదాలతో వర్ణించే కవి వర్డ్స్ వర్త్. అందుకే ఆయనను ప్రకృతి కవి అంటారు. ఆయన మరణానికి ముందు ఏడు సంవత్సరాలు బ్రిటీష్ ప్రభుత్వం పొయట్ లారెట్ (ఆస్థానకవి)గా నియమించింది.

1770లో ఇంగ్లండ్ లోని ‘కాకర్ మౌత్’ అనే పట్టణంలో డెర్వెంట్ నది ఒడ్డున ఉన్న అందమైన భవంతిలో ఆయన జన్మించారు. తల్లి పేరు ఆన్ కుక్సన్, తండ్రి జాన్ వర్డ్స్ వర్త్ , న్యాయవాదిగా పనిచేశారు. వారి సంతానం, ఐదుగురు పిల్లల్లో వర్డ్స్ వర్త్ రెండోవాడు. ఆయన పుట్టిన ఏడాదిన్నరకి, ఆయన చెల్లెలు డొరొతీ వర్డ్స్ వర్త్ పుట్టింది. తల్లిదండ్రులు చిన్నపుడే మరణించడంతో, వాళ్లందరూ బంధువుల ఇళ్ళల్లో వేర్వేరుగా పెరిగారు.

వర్డ్స్ వర్త్ ప్రాథమిక విద్య ‘కాకర్ మౌత్’ లో పాఠశాలలో తర్వాత ‘పెన్రిత్’ పాఠశాలలో సాగింది. 1779 నుంచి 1787 వరకు ప్రసిద్ధ 'హాక్స్ హెడ్ గ్రామర్ హైస్కూల్’ లో చదివాడు. అక్కడే ఆయనకు ప్రకృతి కవిత్వం రాయాలనే అభిలాష కలిగింది. 1787లో అనగా 17వ యేట ఆయన తొలి కవిత (సానెట్) ‘యూరోపియన్ మ్యాగజైన్’ లో ప్రచురించబడింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ‘సెయింట్ జాన్స్ కాలేజ్’ లో బి.ఎ. 1791లో పూర్తి చేశారు. 1793 లో ఆయన రాసిన తొలి కవితా సంపుటాలు ‘యాన్ ఈవెనింగ్ వాక్’, ‘డిస్క్రిప్టివ్ స్కెచెస్’ ప్రచురింపబడ్డాయి.

చెల్లెలి ప్రేరణతోనే రచనలు…

వేరే చోట పెరగడం వలన, చెల్లెలు డొరొతీ తొమ్మిది ఏళ్లపాటు విలియం వర్డ్స్ వర్త్ ను కలవలేక పోయింది. డొరొతీ పెద్దయ్యాక 1795 లో అన్నయ్యకి తోడుగా వచ్చి ఉండిపోయింది. ఆయన చని పోయిన తర్వాత కూడా కుటుంబాన్ని కనిపెట్టుకుని, జీవితాంతం పెళ్లి చేసుకోకుండా వారితోనే ఉంది. ఆమె కూడా ఒక రచయిత్రే కానీ బతికినంత కాలం తన రచనలను బయటకు రానీయలేదు. వర్డ్స్ వర్త్ రచనలకు ముఖ్యంగా సోదరి డొరొతీ ప్రేరణే కారణం. ఆమె రాసిన డైరీలు, ఆమె గతించాక, ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధి పొందాయి. వర్డ్స్ వర్త్ రాసిన ప్రఖ్యాత రచన ‘డాఫోడిల్స్’ కవితలకు మూలం డొరొతీ డైరీలో రాసిన నోట్సే. ఆమె వర్ణన చదివి, స్పూర్తి పొంది ఆయన ఆ ‘డాఫోడిల్స్’ కవితలను రాశాడు.

వర్డ్స్ వర్త్ వివాహానికి ముందు ఫ్రాన్స్ లో 1791లో పర్యటించారు. అపుడు ఒక ఫ్రెంచి యువతి ప్రేమలో పడ్డాడు. 1792లో వారికి ‘కారోలిన్’ అనే కుమార్తె జన్మించింది. ఫ్రాన్స్ విప్లవం కారణంగా, తగినంత డబ్బు లేక బ్రిటన్ లో తను ఉన్న చోటికి వారిని తీసుకు రాలేక పోయాడు. 1802లో తన చిన్ననాటి స్నేహితురాలు ‘మేరీ హచిన్సన్’ ని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా శాంత స్వభావి. ఆయన రాసిన కవితలను కాపీ చేసి ఇచ్చేది. వారిది అన్యోన్య దాంపత్యం. వారికి ముగ్గురు పిల్లలు. తన ఫ్రెంచి కూతురు ‘కారోలిన్’ పెద్దయ్యాక, వర్డ్స్ వర్త్ ఫ్రాన్స్ వెళ్లి, ఆమె పెళ్లి ఘనంగా దగ్గరుండి జరిపాడు.

ఆయన ఇంటి వెనుక పెద్ద తోట, పక్కనే ప్రవహించే డెర్వెంట్ నది మధురమైన ప్రవాహ ధ్వని తన మొదటి గురువని తన ‘ది ప్రిల్యూడ్’ (ఆత్మకథా) కావ్యంలో రాసుకున్నాడు. చదువు కోసం ఆయన లేక్ డిస్ట్రిక్ట్, ‘హేక్స్ హెడ్’ అనే చిన్న గ్రామానికి మారారు. అక్కడ చుట్టూ అందమైన పర్వతాలు, సరస్సులు, ఎంతో ఆకర్షణీయమైన ప్రకృతి ఆయనలోని కవిని నిద్రలేపి, కవితలకు స్పూర్తిని ఇచ్చింది. ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఆ తర్వాత ఫ్రెంచి విప్లవం జరుగుతున్నపుడు, యూరప్ లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాలలో పర్యటించారు.

1797లో తన సోదరి డొరొతీతో కలిసి ‘సోమర్ సెట్’ లోని ‘ఆల్ ఫాక్స్ డెన్’ ఇంటికి మారినపుడు, ప్రసిద్ధ కవి ‘ఎస్.టి. కోల్ రిడ్జ్’ తో బలమైన స్నేహం ఏర్పడింది. తర్వాత తనకి బాగా ఇష్టమైన ‘లేక్ డిస్ట్రిక్ట్’ వచ్చి, తన ‘డోవ్ కాటేజ్’ లో ఉంటూ తన కవితా ప్రస్థానంలో ‘డాఫోడిల్స్’ లాంటి కవితలు రాశాడు. నేడు అది ‘వర్డ్స్ వర్త్ గ్రేస్మియర్’ మ్యూజియంగా పర్యాటకులకు కనువిందు చేస్తోంది. 37 ఏళ్ల వయస్సులో తన కుటుంబం పెద్దది కావడంతో రైబిల్ మౌంట్, ‘అంబిల్ సైడ్’ లో, విశాలమైన భవంతిలోకి మారాడు. అద్భుతమైన తోటల మధ్య ఈ భవనం ఉంది. వర్డ్స్ వర్త్, చెల్లి, భార్య, పిల్లలతో, రచనలు చేస్తూ తుది శ్వాస వరకు ఇక్కడే ప్రకృతిని ఆరాధిస్తూ, ఆస్వాదిస్తూ అక్కడే స్థిరపడ్డాడు.

ఆయన ప్రసిద్ధ గ్రంథాలు ఎస్.టి. కోల్ రిడ్జ్ తో కలిసి రాసిన ‘లిరికల్ బాలడ్స్” ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ యుగానికి పునాది వేసిందని చెప్పవచ్చు. దానిలో వర్డ్స్ వర్త్ రాసిన “టింటర్న్ అబ్బే” కవిత ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇందులో ప్రకృతి గొప్పతనాన్ని, మానవాళిపై దానికున్న అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ప్రేమించే హృదయాన్ని, అది ఎప్పటికీ మోసగించదని, మనలోని ప్రశాంతత ద్వారా ప్రకృతిలోని అంతరార్థాన్ని గ్రహించవచ్చు అని వర్డ్స్ వర్త్ తన కవితలో తెలియచేశాడు.

9 కవితా సంపుటాలు

ఆయన మొత్తం తొమ్మిది కవితా సంపుటాలు వ్రాశారు. ‘లిరికల్ బాలడ్స్’(1798 ), ‘పోయమ్స్, ఇన్ టూ వాల్యూమ్స్’ ఇది రెండవ అతిపెద్ద కవితా సంపుటి. ఇందులో ప్రసిద్ధ లఘు కవితలు ‘డాఫోడిల్స్’, ‘ది సోలిటరీ రీపర్’ , ’ఓడ్: ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటి’ లాంటివి ఉన్నాయి. 1804లో రాసి 1807లో ప్రచురించిన ‘ది డాఫోడిల్స్’ కవితలో “నేను కొండల్లో, లోయల్లో, ఒంటరి మేఘంలా తిరుగుతూ, చుట్టంలా చెట్ల కింద గాలిలో నేను నాట్యం చేస్తుండగా, సరస్సు ఒడ్డున అంతులేని ప్రదేశంలో పదివేల సువర్ణ కాంతితో నిండిన ‘డాఫోడిల్’ పూలు సుతారంగా తలలూపుతూ, వయ్యారంగా నాట్యమాడుతూ నెమ్మదిగా కదులుతున్నాయి. పక్కన సరస్సులో అలలు నర్తిస్తున్నాయి. కానీ వాటిని ఈ పువ్వులు, తమ నవ్వులతో వెనక్కి తోస్తున్నాయి. వాటిని ఒక కవి తన మనసుతో మాత్రమే చూడగలడు. నేను అలా చూస్తూ ఉండిపోయా. నా మనసులో ఒక ఉల్లాస ఊహా తరంగం మెదిలింది. ఆ సన్నివేశ దృశ్యం నాకు ఏ నిధిని బహూకరించిందో చెప్పాలనే చిన్ని కోరిక మిగిలింది, నేను వెల్లికిలా పడుకుని బాధలో, ఆకాశం కేసి చూస్తున్నపుడు నా మనోనేత్రంలో, ఆ ‘డాఫోడిల్’ పూవులు తళుకుమని మెరుస్తాయి, ఆ ఒంటరి సమయంలో అవి దివ్యమైన ఆశీర్వచనాలు ఇస్తాయి. అపుడు నా మనసు ఆనంద పరవశమై ఆ వేలాది ‘డాఫోడిల్స్’ తో నాట్యం చేస్తుంది.” ఇక్కడ వర్డ్స్ వర్త్ ప్రకృతి అద్భుత అందాన్ని తద్వారా ఒంటరి మనసుకి ఇచ్చే శాశ్వత ఆనందాన్ని వర్ణించాడు. మనిషికి ప్రకృతి దేవుడిచ్చిన వరమని తెలియచెప్పాడు.

అలాగే, ‘ది సొలిటరీ రీపర్’( పంట కోస్తున్న ఒంటరి యువతి)గురించి….

"స్కాట్లాండ్ కొండ ప్రాంతాల్లో ఉన్న పండిన పంటను కోసే ఒక ఒంటరి యువతి పాటను పాడుకుంటూ కోత కోసుకుంటుండగా, ఆ దారిలో వెళుతున్న కవి ఆమె గానానికి ముగ్ధుడయ్యాడు. ఆయనకు ఆమె ఏ భాషలో పాడుతున్నదో తెలియక పోయినా, శ్రావ్యమైన ఆమె గొంతు లోని మాధుర్యం నైటింగేల్, కోకిలల కంటే గొప్పగా భావించాడు కవి. సముద్ర అలల కన్నా, అరేబియన్ ఎడారి ఇసుక ధ్వనుల కన్నా బాగుందని భావించాడు. బహుశ ఆమె పాట యుద్ధ జ్ఞాపకాలదైనా, లేక జీవిత బాధల గురించినదైనా కావచ్చు, కానీ ఆ పాట ఆపకుండా నిరంతరాయంగా పాడటం చూశానని కవి అన్నాడు. కవి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమె పాట అతని హృదయాన్ని తొలిచి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి పోయింది. " పై కవిత ఇంగ్లీష్ లో…… “Behold her, Single in the feild, Yon solitary Highland lass!, Reeping and singing by herself stop here, or gently pass!, Alone she cuts and binds the grain, And singing a melancholy Strain,O listen! for the vale profound is overflowing with sound. No Nightingale did ever Chaunt, More welcome notes the weary bonds, Of travellers in some shady hunt among Arabian sands, A voice so thrilling ne’er was hard in spring time from Cuckoo-bird, Breaking the silence of the seas ,Among the farthest Hebrides. Will no one tell me what she sings?, Perhaps the plaintive numbers flow, For old , unhappy, far-off things, And a battle long ago: Or is it some more humble lay, Familiar matter of today?, Some natural sorrow, loss, or Pain, and may be again?, Wheth’er the theme, the Maiden sang, As if her song could have no ending, I saw her singing at her work, And o’ver the sickle bending:- I listened , motionless, and still, And I mounted up the hill, The music in my heart bore, Long after it was heard no more.”

మొత్తం మీద, స్వచ్ఛమైన గానం, కళలకు భాషా హద్దులు ఉండవు. ఆ మధుర అనుభూతి మనసుల్లో కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమై నిలుస్తుందని ఈ కవిత చెప్తుంది. ఆయన రాసిన కవితల్లో ‘ది ఎక్స్కర్షన్‘ ఆయన పూర్తి చేయలేక పోయిన ‘ది రిక్లూజ్’ అనే తాత్విక మహాకావ్యంలో ప్రధానమైన భాగం. ఇది తొమ్మిది వాల్యూమ్స్ రూపంలో సుదీర్ఘంగా ఉంటుంది. ‘ది వైట్ డో ఆఫ్ రిల్ స్టోన్’ ఇది ఇంగ్లాండు దేశ చరిత్ర, మతం, యుద్ధాల సంబంధిత కథతో వున్న కవితా సంపుటి. ‘పీటర్ బెల్ అండ్ ది వెగోనర్’ రెండు కథా ప్రధాన కవితా సంపుటాలుగా పాత వాటిని 1819 లో వెలుగులోకి తెచ్చారు. ‘రివర్ డడ్డన్ ‘సానెట్స్’ ఇందులో ‘డడ్డన్’ నదీ ప్రాంతం కొండలు, ప్రకృతి అందాలను అద్భుత వర్ణనల 34 సానెట్లు (14 లైన్ల కవితలు) ఉన్నాయి. ‘ఎక్లియాస్టికల్ స్కెచెస్’ బ్రిటన్ చర్చి సంబంధిత మతపరమైన చరిత్రను తెలిపే కవితా సంపుటి. ‘యారో రీవిజిటెడ్ అండ్ అదర్ పోయమ్స్’ స్కాట్లాండ్ నదులు, ప్రకృతి అందాల జ్ఞాపకాలను, కవితలుగా మలచినవి. ‘ది ప్రిల్యూడ్’ 14 భాగాలుగా వ్రాసిన మహా కావ్యం. అది ఆయన ఆత్మకథ. ఆయన మరణానంతరం భార్య మేరీ హచిన్సన్ ప్రచురించింది.

73వ యేట పొయట్ లారెట్ పదవి

1843లో బ్రిటన్ (రాజకవిగా) ‘పొయట్ లారెట్’ పదవి ఆయనను వరించింది. బ్రిటీషు పాలకురాలు విక్టోరియా మహారాణి అప్పటి ప్రధాని ‘సర్ రాబర్ట్ పీల్’ అధికారికంగా, సాహిత్యంలో అగ్రశ్రేణి కవిగా ఉన్న 73 ఏళ్ల వర్డ్స్ వర్త్ కి ఇచ్చారు. వర్డ్స్ వర్త్ తాను ముసలివాడినని, తానింక ఏమి వ్రాయలేనని, తనకు ఆ పదవి వద్దని చెప్పాడు. మేము మీరు అత్యుత్తమంగా రాసిన కావ్యాలకు, సాహిత్యసేవకు గౌరవంతో ఇచ్చామనీ, మీరు ఇంకా రాయవలసిన అవసరం లేదని నచ్చ చెప్పి ప్రధానమంత్రి ఆ గౌరవాన్ని ఇచ్చారు. అలా ఏ కవితా రాయకుండా ఉన్న ఏకైక ‘పొయట్ లారెట్’ గా (ఆస్థాన కవిగా) ఏడు సంవత్సరాలు (మరణించేవరకు) ఆ పదవిలో ఆయన ఉన్నారు.

1850 లో తీవ్ర అనారోగ్యంతో వర్డ్స్ వర్త్ చాలా ఇబ్బందులకు గురై 80వ ఏట తుది శ్వాస విడిచారు. అన్న చనిపోయిన ఐదేళ్లకు చెల్లి డొరొతీ కూడా చనిపోయింది. గ్రేస్మియర్ లోని సెయింట్ ఓస్వాల్డ్ చర్చి మైదానంలో వర్డ్స్ వర్త్ సమాధి పక్కనే డొరొతీ సమాధి కట్టారు. వర్డ్స్ వర్త్ కవితలున్నంతవరకూ చిరంజీవే.