ఇదివరలో ‘నేములోనేమున్నది?’ అనేవారు కానీ అసలు ఉన్నదంతా నేములోనే అని మనం సోదాహరణంగా, విపులంగా చెప్పుకోవచ్చు.
పిల్లలకి వెరైటీగా ఉండాలనీ, వేరే వారెవ్వరూ పెట్టని పేరు తామే పెట్టాలన్న తపనతో మరీ దారుణంగా మూషిక్, బిడాల్ లాంటి పేర్లు పెట్టేస్తున్న రోజులివి. పూర్వకాలంలో పుట్టిన పిల్లలంతా వరసగా పోతుంటే, దేవుడికో/ అమ్మవారికో మొక్కుకొని పిచ్చమ్మ, పిచ్చయ్య ఇలాంటి పేర్లు పెడితే వాళ్లు బతికేవాళ్ళట. కొన్ని పల్లెటూర్లలో మంచోడు, చక్కనోడు లాంటి పేర్లు సర్వసాధారణం.
పేర్ల వరకూ బానే ఉంటుంది కానీ, పెళ్లిళ్లకొచ్చేసరికి సమస్యలు మొదలు. ఈ మంచోడికి ఆ పిచ్చమ్మతో పెళ్లి కుదిరితే శుభలేఖల్లో ఏం వేయాలో సమస్య. ఇలాంటి పేర్ల సంగతి పక్కన పెడితే కీర్తి అనే అమ్మాయితో శేషు అనే అబ్బాయికి పెళ్లయితే మంటపం బయట ‘కీర్తిశేషుల పెళ్లి’ అని బేనర్ కట్టించారంటే కొంపమునిగినట్లే.
“మీ ఊళ్లో పేరున్న వాళ్ళు ఎవరన్నా పుట్టారటోయ్?”, అడిగాడో పెద్ద మనిషి. “లేదండీ! అందరికీ పుట్టాకే పేర్లు పెడతారు మా ఊళ్ళో”, అని జవాబు ఇచ్చాట్ట ఆ కుర్రాడు. “పేరుకి పులిరాజే కానీ మనిషి మాత్రం పిల్లికూనండీ ఆయన”, అని కొందరి గురించి పబ్లిగ్గా చెప్పుకోవడం కద్దు. “నువ్వు పెద్దయ్యాక మీ నాన్న పేరు నిలబెట్టాలిరా”, అన్నారట ఓ కుర్రాడితో పెద్దలు. “అసలాయన పేరే ‘శేషతల్పశాయి’ - లేపడమే కష్టం. ఇంక దాన్నేం నిలబెడతాను చెప్పండి?”, అంటూ ఎదురుప్రశ్న వేశాడట ఆ గుంటడు. ఇలా ఉంటాయి పేర్లతో తంటాలు.
చమత్కారం అంతాఇంతానా?
ఈ పేరుతో ఉన్న చమత్కారం అంతా ఇంతా కాదండోయ్! ఫలానావాడు మంచివాడు అయితే మంచివాడిగా పేరు పొందాడు / పేరెత్తాడు అనీ, అదే ఏ దొంగో అయితే వాడో పెద్ద దొంగగా పేరు పడ్డాడనీ అంటారు. అటుదిటైతే కష్టమే మరి! సకారార్థంలో అయితే పేరెన్నికగన్నవాడనీ, పేరొందిన వాడనీ అంటూ ఉంటారు. నకారార్థంలో అయితే పేరుమోసిన గజదొంగ అనీ, ఫలానా పేరుకే కళంకం తెచ్చాడని అనటం లోక సహజం. అందుకే ఈ పేరు అనే దాన్ని కాసులపేరు లాగా చాలా జాగ్రత్తగా ఆచితూచి వాడకపోతే అది మధురవాణి కంటెలా ఏకు మేకై కూర్చుంటుంది.
ఇదిలా ఉంటే, కొంతమంది పైకి డంబాలు పోతూ ఉంటారు కానీ లోపల సరుకేం ఉండదు. అలాంటి వాళ్ళని - “ఆ… పేరు గొప్ప ఊరు దిబ్బ”, అని తీసి పారేస్తారు. అదే లోకానికి నిజంగా మేలు చేస్తే, అలాంటి వాళ్ళని “ఆహా! చాలా గొప్ప పేరు గడించాడు”, అంటారన్నమాట. అలా సంఘంలో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా సంబోధించాలి. తొందరపడ్డామో, “ఆ! అంతటి పెద్దాయనని పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు?”, అంటారు. “ఇంకొకళ్ల పేరుతో కాదుగా! ఆయన పేరుతోనేగా పిలిచింది”, అని నువ్వు ఎంత చెప్పినా నీదే తప్పంటారు. తస్మాత్ జాగ్రత్త!
కొందరీ పేర్లగోల పడలేక పిల్లలకి ఏకంగా పుణ్యక్షేత్రాల పేర్లే పెట్టేస్తూ ఉంటారు మొక్కుల పేరుతో - సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, తిరుపతి వగైరాల్లాంటివి అన్నమాట. మన సినిమా వాళ్ళు అవే పేర్లు సినిమా హీరోలకు పెట్టి హిట్లు కూడా కొట్టేస్తూ ఉంటారు.
ఇదోరకం అయితే కొంతమందికి దేవుళ్ళ పేర్లు పెట్టడం అంటే ద్వేషం. విప్లవ్, క్రాంతి, ప్రగతి ఇలా పెడుతూ ఉంటారు. అసలు మన గోరా గారి పిల్లలకి విద్య, సమరం, లవణం, విజయం, నియంత వగైరా పేర్లు చూశాం కదా! మరొకడు వాళ్ళ అమ్మాయిలకి శ్రద్ధ, అంజలి అనే పేర్లు పెట్టాడు. ఇద్దరూ కవలలు. MD చదివాక హాస్పటల్ కట్టి ‘శ్రద్ధాంజలి హాస్పిటల్’ అని పేరు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? వెనకటికి మన ముళ్ళపూడి వారు చెప్పినట్లు - ఓ డాక్టర్ ఫస్ట్ ఫ్లోర్లో హాస్పటల్ కట్టి, క్రింద బోర్డు పెట్టాడట ‘పైకి దారి’ అని - అలా ఉంటుంది.
విచిత్రమైన సమస్యలు
కొన్ని రకాల పేర్లతో విచిత్రమైన సమస్యలు వస్తాయి. కొంతమంది పిల్లలకి దుర్యోధనరావు, రావణమూర్తి లాంటి పేర్లు పెట్టుకున్న అతివాదులూ ఉన్నారు. అలాంటప్పుడు వచ్చే సమస్యలేమిటంటే, పొరపాటున ద్రౌపది అనే పెళ్లి కూతురికి దుర్యోధనరావుతో పెళ్లి కుదిరినా లేక రావణమూర్తికి జానకి అనే అమ్మాయితో పెళ్లి కుదిరినా జీవితాంతం గోలే కదా! లేకపోతే పేర్లయినా మార్చుకోవాలి - పెళ్లన్నా వదులుకోవాలి.
అలాంటి పేర్లనే అనుకోనక్కరలేదు. సోకాల్డ్ మంచి పేర్లు అనుకునే వాటిలో కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి. సుభద్ర అనే పేరు గల అమ్మాయికి మిగిలినవన్నీ ఎంత బ్రహ్మాండంగా కుదిరినా, పెళ్ళికొడుకు పేరు గనక ఏ బలరామ్ లేదా శ్రీకృష్ణ అనో తగిలిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా! శ్రీరామ్ అనే పెళ్ళికొడుక్కి ఏ ఊర్మిళ అనే అమ్మాయితో పెళ్లికుదిరినా లేక సౌమిత్రికి జానకితో పెళ్లి కుదిరినా ఆ పెళ్లి శుభలేఖలు వగైరాలన్నీ పంటికింద రాయిలానే ఉంటాయి కదా!
ఇహ అసలు స్వభావాల విషయానికి వస్తే, పుట్టగానే తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ, నాన్న, పూర్వీకుల పేర్లతోపాటు తమ ఇష్టదైవాల పేర్లు కూడా కలిపి పిల్లలకి పేర్లు పెట్టుకునేవారు పూర్వకాలంలో. కొంతమంది తమకి ఇష్టమైన దేశ నాయకుల/ దేశభక్తుల పేర్లు వగైరాలు (వాళ్లంత వాళ్ళు కావాలనే ఆశతో) పెట్టుకునేవాళ్ళు… గాంధీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి పేర్లు. ఆ పేర్లు పెట్టుకున్న వాళ్లు అనేక నేరాలు, ఘోరాలకు పాల్పడి జైళ్లల్లో మగ్గుతుంటే చాలా బాధాకరంగా ఉంటుంది కదా!
కన్యాశుల్కం లో ‘నువ్వు ఇలాంటివాడివి అవుతావని పుట్టగానే ఊహించి మరీ పెట్టుంటారు నీ పేరు’ అంటాడు రామప్పంతులు లుబ్దావధాన్లని. అలా కొంతమందికి పెట్టిన పేర్లు బాగా సూట్ అవుతాయి అరుదుగా. సినీ నటి సూర్యకాంతం తాను ధరించిన గయ్యాళి పాత్రలను ఎంతో అద్భుతంగా పోషించి అంత మంచి పేరును మరెవ్వరూ పెట్టుకోకుండా చేసిందని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యానించారు సరదాగా. నిజమే కదా! సినిమా ప్రభావం తెలుగువాడి జీవితం మీద బాగా ఉండటంతో రాజబాబు, రమణారెడ్డి లాంటి పేర్లు ఉన్న వాళ్ళు లావుగా ఉంటే మాలావు ఆశ్చర్యపడిపోతారు మన తెలుగువారు. సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి లాంటి పేర్లు ఉన్న వాళ్ళు కచ్చితంగా అందంగా ఉండాలని మనసులోనే ఫిక్స్ అయిపోయారు.
సార్థకం కాని పేర్లు
మరో విచిత్రమైన పరిస్థితిని కూడా మనం సమాజంలోని పేర్లలో చూడవచ్చు. ఈ సినిమాలూ, ప్రభావాలూ పక్కన పెడితే, మామూలు పేర్లలోనే విచిత్రాలు కొన్ని గమనించండి. చిరంజీవి/ మృత్యుంజయరావు అన్న పేర్లు ఉన్నవారు ముప్ఫయ్యేళ్లు నిండకుండానే కాలం చేయడం; మహారాజు / చక్రవర్తి లాంటి పేర్లున్నవాళ్ళు కడు పేదరికంలో మగ్గడం; కుటుంబరావు అన్న పేరున్నవాడికి పిల్లలే లేకపోవడం; భీమారావు / రామ్మూర్తి లాంటి పేర్లున్నవాళ్ళు బక్కగా, బలహీనంగా ఉండటం; సీతారాం అన్న పేరున్న వాడు పరమ నాస్తికుడు కావడం (మన ఏచూరి గారిలా); నియంత అనే పేరు పెట్టినవాడు ఎంతో గొప్ప మానవతావాది కావడం; సద్గుణరావు అనే పేరున్నవాడు ఎన్నో అవగణాలతో అనేక పాపాలు చేయడం; సౌభాగ్యరావులు, ధన భాగ్యరావులు చాలామంది నిర్భాగ్యులవడం; పల్లవి /చరణ్ / శృతి లాంటి పేర్లున్నవాళ్ళకి సంగీతంలో ఓనమాలు రాకపోవడం; గంభీర్రావు అనే పేరున్నవాడు పరమ పిరికివాడు కావడం; శారద /వాణి / వాగ్దేవి లాంటి పేర్లున్నవాళ్ళకి అక్షరం ముక్క రాకపోవడం… ఇలా ఎన్నో చెప్పుకోవచ్చునన్నమాట.
పూర్వకాలంలో “పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా?” అనేవారు పెద్దలు. ఇప్పుడు మనం దాన్ని ఇలా మార్చి, “పిల్లలకి పేర్లు పెట్టగలం కానీ - వాటి అర్ధాన్ని సాకారం చేయగలమా?” అని మార్చుకోవాల్సిన పరిస్థితి. అందుకనే మనుషులందరికీ పెద్దయ్యాక వారి వారి గుణాలనిబట్టి ‘పునః నామకరణం’ చేస్తే ఎలా ఉంటుందంటారు? మీరే చెప్పండి!

