మచాడో డి అస్సిస్ ‘ఎపిటాఫ్ ఆఫ్ ఎ స్మాల్ విన్నర్’ పుస్తకంపై వ్యాసం
బ్రెజిల్ రచయిత మచాడో డి అస్సిస్ రాసిన ‘ఎపిటాఫ్ ఆఫ్ ఎ స్మాల్ విన్నర్’ (Epitaph of a Small Winner) నవలకు ఒక ప్రత్యేకమైన కథన శైలి ఉన్నది. 1881లో వెలువడిన ఈ నవల ‘ది పోస్ట్‌హుమస్ మెమోయిర్స్ ఆఫ్ బ్రాస్ కుబాస్’ (The Posthumous Memoirs of Brás Cubas) అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది.
బ్రాస్ కుబాస్ చనిపోయిన తర్వాత తన జ్ఞాపకాలను చెప్పుకునే ఈ కథ, పాఠకులతో ఒక విచిత్రమైన ఆట ఆడుతుంది. ఇందులో కుబాస్ తనను తాను “చనిపోయిన రచయితను కాను, చనిపోయాక రాస్తున్న రచయితను” అని పరిచయం చేసుకుంటాడు.
బాధలతో కూడిన అనుభవాలనే చిన్న చిన్న జ్ఞాపకాలుగా ఈ పుస్తకంలో చెబుతాడు. కొన్ని చోట్ల ఒక పేరా, లేదా ఒక్క పేజీ మాత్రమే ఒక అధ్యాయంగా ఉంటుంది.
ఈ నవలను లెర్మోంటోవ్ రాసిన ‘పెచోరిన్’, అలాగే ‘డాన్ క్విక్సోట్’ పాత్రలతో పోల్చి చూడవచ్చు. పెచోరిన్ లోని ప్రేమ తత్వం, డాన్ క్విక్సోట్ సాహస స్వభావం కలగలిసి కుబాస్‌లో కనిపిస్తాయి. అయితే, కుబాస్ ఒక ఆధునిక మానవుడు. తన ఓటములను అంగీకరిస్తూ, విశ్లేషించుకునే తత్వం అతనిది. అలాగే, ప్రాచీన సాహస యాత్రికుల వరుసలోకి కూడా వస్తాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా సాహిత్యంలో వచ్చిన నిరాశామయ ధోరణిని మచాడో అంతకంటే ముందే తన రచనలలోకి తీసుకొచ్చాడు.
కుబాస్ తన గతాన్ని పూర్తిగా వివరించడు. కేవలం తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను, జ్ఞాపకాలను మాత్రమే ముందుకు తెస్తాడు. నవల ముందు మాటలో అతను ఒక విచిత్రమైన వివరణ ఇస్తాడు:
"స్టెంధాల్ (Stendhal) తన పుస్తకాలను కేవలం వంద మంది పాఠకుల కోసమే రాశారని అంటారు. ఆయన పుస్తకానికి దక్కినట్లుగా ఈ నవలకు వంద మంది, ఏభై మంది, ఇరవై మంది, ఆఖరికి పది లేదా ఐదుగురు పాఠకులు కూడా దక్కకపోయినా ఈ ప్రపంచం ఆశ్చర్యపోదు, బాధపడదు.
రెండు వ్యతిరేక భావాల కలయికతో రచన
నేను ఈ పుస్తకాన్ని ‘సంతోషం’ అనే పెన్నుతో, ‘బాధ’ అనే సిరాతో రాశాను. ఈ రెండు వ్యతిరేక భావాల కలయిక నుండి ఎలాంటి రచన వస్తుందో ఎవరైనా ఊహించవచ్చు. గంభీరమైన స్వభావం ఉన్న వారు ఇందులో విపరీతమైన కల్పనలను చూస్తారు. అలాగే, కథనంలో వినోదాన్ని మాత్రమే కోరుకునే పాఠకులకు ఇది అసలు నచ్చకపోవచ్చు. కాబట్టి ఇరు వర్గాలకూ ఈ పుస్తకం నచ్చకపోవచ్చు.
ప్రియమైన పాఠకుడా, నీకు ఈ పుస్తకం నచ్చితే నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లే. ఒకవేళ నచ్చకపోతే, నీకు నా పీడ వదిలిందని సంతోషిస్తాను."
ఇక తన ప్రేమ జీవితం, దాని వల్ల కలిగిన సంతోషాలు, బాధల గురించి చాలా నిర్భయంగా రాస్తాడు:
"నా చేతకానితనాన్ని ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం చూసి పాఠకులకు ఆశ్చర్యం కలగవచ్చు. కాని వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేను చనిపోయినవాడిని. మరణించిన వ్యక్తికి ఉండవలసిన అతి పెద్ద లక్షణం ఈ నిష్కాపట్యమే. బతికి ఉన్నప్పుడు నాలుగు మాటలకు భయపడి చాలా విషయాలు దాచవలసి వస్తుంది. తన మనస్సాక్షికి మాత్రమే తెలిసిన నిజాలను కూడా లోకానికి చెప్పలేరు. కాని చనిపోయాక అలాంటి భయాలు ఉండవు. ఇక్కడ ఉన్న వారికి లోకంతో పనిలేదు, కాబట్టి ఏదైనా ధైర్యంగా రాయవచ్చు.
బతికి ఉన్న మనుషులారా, నన్ను నమ్మండి! ఈ లోకంలో నిర్లక్ష్యాన్ని మించిన గొప్ప పని మరొకటి లేదు. జీవితంలో నేను కాస్త పొగరుగానే తిరిగాను. నేను మొగతనం ఉన్న కుర్రాడినో, లేక చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న పెద్దవాడినో చెప్పడం కష్టం. నేను ఎంతో అందంగా, ధైర్యంగా ఉండేవాడిని. పాత కాలపు జానపద కథలలోని వీరుడిలా గుర్రం ఎక్కి జీవితంలోకి దూసుకెళ్లాను."
నవల పొడవునా బ్రాస్ కుబాస్ తనలోని వైరాగ్యాన్ని, ఒంటరితనాన్ని, ఊహలను, కోరికలను, విచిత్రమైన అనుభవాలను పంచుకుంటాడు. అందులో శృంగారం, రాజకీయం, తత్త్వం, మంచి చెడుల గురించిన ఆలోచనలు అన్నీ ఉంటాయి. నూరు సంవత్సరాల కిందట రాసిన పుస్తకం అంటే నమ్మలేనంత కొత్తగా, కవితాత్మక భాషలో సాగుతుంది.
సీతాకోకచిలుకపై అద్భుత కల్పన
ఈ కథలో ‘నల్లటి సీతాకోకచిలుక’ ఘట్టం ఎప్పటికీ మరచిపోలేము. కుబాస్ ఊరికి ప్రయాణమయ్యే సమయంలో ఒక సీతాకోకచిలుక గదిలోకి ఎగిరి వస్తుంది. కాసేపు అతని చుట్టూ తిరిగి, చివరికి అతని నుదుటిపై వాలుతుంది. కుబాస్ దాన్ని వేలితో పక్కకు నెడతాడు.
ఆ నల్లటి సీతాకోకచిలుక నేరుగా కిటికీ అద్దం వైపు వెడుతుంది. దానిని బయటకు తోలడానికి చూస్తే, అది గోడపై ఉన్న అతని తండ్రి ఫోటో మీద వాలి మెల్లగా రెక్కలు ఆడిస్తుంది.
ఆ చర్య తనను గేలి చేస్తున్నట్లు అనిపించి, కుబాస్ కోపంతో బయటకు వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత తిరిగొచ్చి చూస్తే అది ఇంకా ఆ ఫోటో పైనే ఉంటుంది.
కోపం పట్టలేక ఒక తువ్వాలు తీసుకుని గట్టిగా కొడతాడు. ఆ సీతాకోకచిలుక కింద పడి విలవిలలాడుతుంది, కాని చనిపోదు. అది చూసి అతనికి జాలి వేసి, దానిని చేతులలోకి తీసుకుని కిటికీ పక్కన పెడతాడు. కాని అంతలోనే అది ప్రాణాలు విడుస్తుంది. ఈ సంఘటన అతని మనసును తీవ్రంగా కలచివేస్తుంది.
తన తొందరపాటుతనాన్ని నిందించుకుంటూనే, ఆ సీతాకోకచిలుక తన దగ్గరకు ఎందుకు వచ్చిందో ఒక విచిత్రమైన కారణం చెబుతాడు:
"ఆ సీతాకోకచిలుక ఎన్నో అడవులలో తిరిగి, తేనె తాగి, ఉదయం పూట సూర్యకాంతిలో సంతోషంగా ఎగురుతూ వచ్చి ఉంటుంది. విశాలమైన నీలి ఆకాశం కింద తన అందాన్ని చూసుకుని మురిసిపోతూ, తెరిచి ఉన్న కిటికీ గుండా గదిలోకి వచ్చి ఉంటుంది.
అక్కడ కుబాస్ కనిపిస్తాడు. దానికి మనుషులంటే ఏమిటో తెలియదు. అతని చుట్టూ తిరుగుతూ, అతని కళ్ళు, చేతులు, కాళ్ళు, అందమైన రూపాన్ని చూస్తుంది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ‘ఈయనే సీతాకోక చిలుకలను సృష్టించిన దేవుడు కాబోలు’ అని అనుకుని ఉంటుంది. ఆ ఆలోచన రాగానే దానికి భయం వేసి ఉంటుంది. తనను సృష్టించిన దేవుడి ముందు ఎలా ఉండాలో దానికి అర్థం కాలేదు.
అందుకే దేవుడిని మెప్పించడానికి ఆయన నుదుటిపై ముద్దు పెట్టుకోవడమే సరియైన మార్గం అని అనుకుని ముద్దు పెట్టుకుని ఉంటుంది.
కాని తన దేవుడికి ఆ ముద్దు నచ్చలేదని గ్రహించి, పక్కనే ఉన్న దేవుడి తండ్రి ఫోటో దగ్గరకు వెళ్ళి దయ చూపమని వేడుకుంటుంది.
చివరికి దేవుడి కోపానికి బలై దెబ్బతిని ప్రాణాలు కోల్పోతుంది."
సీతాకోకచిలుక ఆనందాన్ని, బాధను మచాడో ఎంతో అద్భుతంగా వర్ణించాడు. అది మనిషిని దేవుడిగా భావించిందనే ఊహ నిజంగా అమోఘం.
కాళ్ళ గొప్పతనం…
పుస్తకంలోని మరొక భాగంలో కుబాస్ తన కాళ్ళ గురించి నవ్వు తెప్పించేలా రాస్తాడు:
"ఈ రోజు నా కాళ్ళు నన్ను నాకే ఆశ్చర్యం కలిగేలా ‘ఫారూక్స్’ (Pharoux) హోటల్ ముందు నిలబెట్టాయి. సాధారణంగా నేను అక్కడే భోజనం చేస్తాను. కాని ఈసారి అక్కడికి వెళ్ళాలని నేను అనుకోలేదు. నన్ను అక్కడికి చేర్చిన ఘనత నా కాళ్ళదే!
నా ప్రియమైన కాళ్ళలారా! కొందరు మిమ్ములను ఎంత చులకనగా చూస్తారు! నేను కూడా ఒకప్పుడు మిమ్ములను తక్కువగా అంచనా వేశాను. మీరు నడిచి నడిచి అలసిపోయినప్పుడు, ముందుకు సాగలేక ఆగిపోయినప్పుడు మీపై కోప్పడ్డాను.
అయినా మీరు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నాకు సాయం చేశారు.
‘వీడి మనసులో ఏదో ఆలోచన నడుస్తున్నది, పైగా రాత్రి భోజనం చేసే సమయం అయింది. కాబట్టి వీడిని ఫారూక్స్ హోటల్‌కు తీసుకు వెళదాము’ అని నా కాళ్ళే నిర్ణయించుకున్నాయి.
నా ముద్దుల కాళ్ళలారా! మీరు వేసుకున్న ప్రణాళికను చాలా చక్కగా నెరవేర్చారు. మీరు చేసిన ఈ సహాయానికి గుర్తుగానే నా రచనల ద్వారా మీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను."
ముక్కు కొనతో ధ్యానం….
మరొక చోట ముక్కు ప్రాధాన్యత గురించి పరిహాసంగా రాస్తాడు:
“ప్రియమైన పాఠకుడా, ముక్కు వల్ల ఉపయోగాలు ఏమిటి? కళ్ళజోడు పెట్టుకోవడానికి మాత్రమే ముక్కు ఉపయోగపడుతుందని నేను అనుకునేవాడిని. అది నిజమే కావచ్చు. కాని సూఫీ సాధువుల అలవాట్లను చూస్తే ముక్కు గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. వారు తమ ముక్కు కొనను చాలాసేపు అలాగే చూస్తూ ఉంటారు. అదొక రకమైన ధ్యానం. దానివల్ల బయటి ప్రపంచాన్ని మరచిపోయి, తమ మనసులో ఒక అందమైన రూపాన్ని ఊహించుకుంటారు. కంటికి కనిపించని దాన్ని పట్టుకుని, ప్రాపంచిక బంధాలను తెంచుకుని, అందులోనే కరిగిపోతారు. ముక్కు కొన ద్వారా ఒకరి ఉనికి అంత ఉన్నతంగా మారగలిగితే, ముక్కు గొప్పతనం ఎంతటిదో మీరే అర్థం చేసుకోండి.”
ఈ కథలో ఏ ఆశయాలూ నెరవేరవు. ఒక్క ప్రేమలో తప్ప కుబాస్ దేనిలోనూ గెలవడు. అతని బాధలన్నీ అతడు స్వయంగా కొని తెచ్చుకున్నవే.
ఈ నవల గురించి వచ్చిన ఒక విమర్శలో, “మచాడోను పూర్తిగా తిరస్కరించడం, లేదా మచాడోతో కలిసి ఈ ప్రపంచాన్ని తిరస్కరించడం… ఈ రెండే మార్గాలు ఉన్నాయి” అని రాశారు. అది నిజమే అనిపిస్తుంది.
కథ సాగుతున్నంత సేపు పాఠకుడు ఏమనుకుంటున్నాడో కుబాస్ ముందే చెప్పేస్తాడు. పాఠకుడి ఆలోచనలతో ఏకీభవిస్తూ, విభేదిస్తూ సంభాషిస్తాడు. ఆ రకంగా ఈ నవలలో పాఠకుడే ఒక ముఖ్యమైన పాత్రగా మారతాడు.
“ఈ పుస్తకంలో ఉన్న పెద్ద సమస్య మీరే, పాఠకులారా!” అని అతను అనడం కేవలం తమాషా కోసం అన్నమాట కాదు.

