మనదేశం గత 79 సంవత్సరాల కాలంలో శాస్త్ర, సాంకేతిక, ఐటీ, అంతరిక్ష, ఆర్థిక రంగాలతో సహా పలు రంగాలలో అబ్బురపరచే ప్రగతి సాధించినా క్రీడారంగంలో మాత్రం ఎంతగానో వెనుకబడి పోయింది. ఏ క్రీడ చూసినా ఏమున్నది గర్వకారణం అనుకొనేలా ప్రస్తుత పరిస్థితి తయారయ్యింది.

ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం ఓ దేశం పరిపూర్ణ అభివృద్ధి సాధించిన దేశంగా నిలవాలంటే మిగిలిన అన్నిరంగాలతో పాటు క్రీడారంగంలోనూ అభివృద్ధి సాధించి తీరవలసిందే. అయితే…జనాబా, ఆర్థిక వ్యవస్థల పరంగా ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన భారత్ క్రీడాపరంగా ఎంతగానో వెనుకబడి పోయింది. విశ్వక్రీడావేదిక ఒలింపిక్స్, ఆసియా ఖండ దేశాల క్రీడా వేదిక ఏషియాడ్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఫుట్ బాల్ …ఇలా ప్రపంచ మేటి ఏ క్రీడలని చూసినా భారత్ వెలవెలా పోతూనే ఉంది. అంతర్జాతీయ క్రీడల్లో మాత్రమే కాదు…క్రికెట్, చదరంగం, బిలియర్డ్స్- స్నూకర్ లాంటి క్రీడలు మినహా మిగిలిన క్రీడాంశాలలోనూ భారత్ నామమాత్రంగా మిగిలిపోతూ వస్తోంది.

ఇంట్లో ఈగల మోత…

భారత్ లో గత ఏడున్నర దశాబ్దాల కాలంగా పాలనా పగ్గాలు చేపట్టిన పలు ప్రభుత్వాలు రకరకాలుగా ప్రజలని మభ్యపెడుతూ…పబ్బం గడుపుకుంటూ వస్తున్నాయి. చేసేది తక్కువ, చెప్పుకొనేది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా విశ్వ దృష్టిని ఆకర్షిస్తున్నదేశం భారత్. ప్రపంచంలోని విఖ్యాత బహుళ జాతి కంపెనీల చూపంతా ఇప్పుడు భారత మార్కెట్ వైపే. అయితే…ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. ప్రతి విషయంలోనూ చైనాతోనే మన పోటీ అన్నది రాజకీయాలకు మాత్రమే వర్తిస్తుంది. చైనాతో పోల్చి చూస్తే ఆర్థిక రంగంలో మాత్రమే కాదు… క్రీడారంగంలోనూ భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లోనూ భారత వెనుకబాటుతనం కనిపిస్తోంది. జనాభాపరంగా ప్రపంచంలోనే చైనా అతిపెద్ద దేశం. దేశ జనాభాకు తగ్గట్టుగానే క్రీడారంగంలో చైనా కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అమెరికా లాంటి సూపర్ పవర్ కే సవాలు విసిరే పరిస్థితికి ఎదిగింది. అదే…జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్…పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టిక 71వ స్థానానికి దిగజారిపోయిందంటే మన పరిస్థితి ఎంత దయనీయమో మరి చెప్పాల్సిన పనిలేదు. చైనా మనకంటే పతకాల పట్టికలో 69 స్థానాలు ఎగువన ఉందన్నది కాదనలేని నిజం.

పేరుకే అత్యధిక యువజన జనాభా

ప్రపంచ జనాభాలో భారత్ స్థానం రెండు. అత్యధిక యువజన జనాభా ఉన్న దేశాలలో భారత్ దే అగ్రస్థానం. అయితే …క్రీడారంగంలో మాత్రం మన పరిస్థితి మిగిలిన దేశాలతో పోల్చిచూస్తే దిగదుడుపే. పారిస్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ స్థానాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది. ప్రపంచంలోని 204 దేశాలలో అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం భారత్. దేశ జనాభాలో 60 శాతం మంది యువజనులే. అయినా క్రీడలంటే ఏమాత్రం ఆసక్తి లేదు.

క్రికెట్ మర్రి నీడన…

భారత్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే అనుకొనే పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. ప్రపంచీకరణ పుణ్యమా అంటూ అంతర్జాతీయ మార్కెట్లో భారత క్రికెట్ పరిస్థితి మూడుపువ్వులూ ఆరుకాయలుగా విలసిల్లుతోంది. ఒలింపిక్స్ లో ఎనిమిది బంగారు పతకాలు అందించిన సాంప్రదాయ హాకీ క్రీడను క్రీడాభిమానులు మాత్రమే కాదు…ప్రభుత్వాలు సైతం చూసిచూడనట్లు వదిలేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్రికెట్ మర్రి నీడన మిగిలిన ప్రధాన క్రీడలన్నీ కునారిల్లిపోతున్నాయి. క్రీడలంటే ఒకప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలు మాత్రమే. అయితే వ్యాపార ప్రచారానికి వాహకంగా పనిచేస్తున్న క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ లాంటి టీవీ ఫ్రెండ్లీ ఆటలతో…క్రీడారంగం కూడా బహుళజాతి సంస్థల, బడాబాబుల ఘరానా వ్యాపారంగా మారిపోయింది. క్రికెట్ అంటే ఇప్పుడు పరుగులు, వికెట్లు, క్యాచ్ లు, రికార్డులు ఏమాత్రం కాదు. ప్రసారహక్కులు, కిట్ బ్యాగులు, లోగో హక్కులు, ఇన్ స్టేడియా హక్కులు, జట్టు, క్రీడాకారుల వ్యక్తిగత ఎండార్స్ మెంట్లు…ఇలా ఏది చూసినా కోట్ల రూపాయల వ్యాపారమే. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ నుంచి దేశవాళీస్థాయి క్రికెటర్లు సైతం ఇప్పుడు ఐపీఎల్ తో కోట్లకు పడగలెత్తినవారే. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు…ఆటతో కోట్ల కోటలు దాటినవారే. బహళజాతి సంస్థల అండదండలు, మీడియా ఫ్రెండ్లీగా ఉండే…క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఒకటి రెండు క్రీడల దెబ్బకు…మిగిలిన క్రీడలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు సైతం తమకు ఆదాయం, ప్రచారం తెచ్చిపెట్టే క్రీడలని, క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ…మిగిలిన క్రీడలను, క్రీడాకారులను చిన్నచూపు చూస్తున్నాయి.

అరకొర నిధులతో క్రీడారంగ ఉన్నతి సాధ్యమేనా?

కేంద్రంలోను, తెలుగు రాష్ట్రాలలోనూ వార్షిక బడ్జెట్ల సమర్పణ తంతు చూస్తే మన ప్రభుత్వాలకు క్రీడలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎప్పటిలానే క్రీడారంగానికి అరకొర మొత్తాలను మాత్రమే ఆర్థిక మంత్రులు విదిల్చి… క్రీడలకు తాము ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ పోతూ ఉన్నా…క్రీడారంగానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అరకొర కేటాయింపులతో, విదిలింపులతోనే సరిపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు…నిధులు మిక్కుటంగా ఉన్న తెలంగాణా, నిధులో రామచంద్రా అంటూ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ తమ తమ ప్రాధమ్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకొంటున్నాయి. పతకాలు, దేశానికి, రాష్ట్ర్రాలకు తమ ఆటతీరు, రికార్జులతో గుర్తింపు తెచ్చిన క్రీడాకారులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ నానా హడావిడీ చేస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకుండా ఓట్లాట ఆడుతున్నాయి. గత ఒలింపిక్స్ పతకాల పట్టిక 71వ స్థానంలో భారత్ నిలిస్తే…జాతీయ క్రీడల పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ 18, తెలంగాణా 26 స్థానాలతో తలదించుకున్నాయి. ప్రస్తుతం జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. గత ఆసియా క్రీడల్లో సాధించిన మొత్తం 107 పతకాలు, 28 బంగారు పతకాలలో సగమైనా సాధించడం అనుమానమే.

ఎందుకీ దుస్థితి…

క్రీడారంగంలో భారత వెనుకబాటుతనానికి ఇటు కేంద్రం, అటు రాష్ట్ర్రాల విధానాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో క్రీడలు ఎన్నిరకాలు ఉన్నా…సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్థాయిలో జాతీయ పోటీలు నిర్వహించడం ఓ సాంప్రదాయంగా ఉండేది. ఈ పోటీల నిర్వహణ కోసం జాతీయ ఒలింపిక్ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలు సహాయ సహకారాలు అందచేస్తూ ఉండేవి. అయితే…లాభసాటి లీగ్ వ్యాపారం భారత క్రీడారంగంలోకి చొరబడటంతో…జాతీయ పోటీల నిర్వహణ తూతూమంత్రంగా మారింది. భారత క్రీడారంగ మూలాలే బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది. దీనికితోడు…క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో… ఓ స్పష్టమైన క్రీడా విధానం అంటూ లేకపోడం భారత క్రీడా రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీచాలదన్నట్లుగా…ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎలాంటి విధానాలు లేవని మాజీ క్రీడా దిగ్గజాలు అంటున్నారు. దశాబ్దాలనాటి క్రీడామౌలిక సదుపాయాలతో భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఏవిధంగా రాణించగలరని భారత హాకీ మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఎం.పీ. గణేశ్ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్నెట్ సంస్కృతి, స్మార్ట్ ఫోన్ విషకౌగిలి, పశ్చిమ దేశాల అనుకరణలో ముందున్న మన దేశంలో…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకుంటే…క్రీడా సంస్కృతి ఎండమావిగానే మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మైదానాలు లేని పాఠశాలలు…

పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్నమాట…నేటి తరం పాఠశాలలకు ఇది ఏమాత్రం వర్తించదు. చిన్నచిన్న నగరాలు, పట్టణాలలో సింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్, ట్రిపుల్ బెడ్ రూం కళాశాలలను చూస్తుంటే క్రీడా రంగంలో భారత్ ఏగతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు. దేశంలోని క్రీడా రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నిపుణుల సంఘాలలో సభ్యుడిగా ఉన్న భారత హాకీ మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ సైతం…ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలు, పాఠశాలలు, కళాశాలలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస క్రీడాసౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత మాజీ క్రీడా దిగ్గజాలు, అర్జున అవార్డీలు వాపోతున్నారు. క్రీడలను సైతం నిర్భంద పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడా వ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పురానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం గత పుష్కరకాలంగా క్రీడల అభివృద్ధి కోసం సమూల మార్పులు చేస్తూ…ఖేలో ఇండియా క్రీడలతో తనవంతు ప్రయత్నం చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడంలేదు.

ఏకీకృత క్రీడావిధానంతోనే…

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన ఫెడరల్ వ్యవస్థ, మన రాజ్యాంగంలో…క్రీడలు ఉమ్మడి జాబితా అంశంగా ఉండటం కూడా దేశ క్రీడాభివృద్ధికి ప్రతిబంధకంగా తయారయ్యింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ ఓ క్రీడా విధానాన్ని రూపొందిస్తే…రాష్ట్రాల స్థాయిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేక క్రీడా విధానం ఏర్పాటు చేసుకోవడం క్రీడా ప్రగతిలో అసమానతలకు తావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించి…దేశమంతటికీ ఓ సమగ్ర క్రీడా విధానం సిద్ధం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించినా ఒరిగిందేమీ లేదు. క్రీడలని ప్రస్తుత ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితా అంశంగా మార్చే ఆలోచన కూడా ఉందని ప్రకటించారు. అయితే ఇదంతా దశలవారీగా జరుగుతుందని చెప్పటంలోనే చిత్తశుద్ధి ఏపాటిదో గమనించవచ్చు. ఒలింపిక్స్ పతకాల పట్టికలో 71వ స్థానం, ప్రపంచ ఫుట్ బాల్ లో 101, కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక 4వ స్థానానికి పరిమితమైన భారత్ ప్రస్తుత ఆసియా క్రీడల పతకాల పట్టిక మొదటి ఐదు స్థానాలలో నిలిచినా అది గొప్ప ఘనతగానే మిగిలిపోతుంది. క్రికెట్, చదరంగం, హాకీ లాంటి క్రీడల్లో మాత్రమే ప్రపంచమేటి జట్లలో ఒకటిగా కొనసాగుతున్న భారత్ మిగిలిన క్రీడలకూ తగిన ప్రాధాన్యం ఇచ్చితీరాలి. క్రీడల అభివృద్ధి లేకుండా, పతకాలు సాధించే సత్తా లేకుండా ఒలింపిక్స్ నిర్వహణకు అర్రులు చాచడం కేవలం పాలక, కార్పొరేట్ వ్యవస్థల రాజకీయ పటాటోపం కాక మరేమిటి. ఏదిఏమైనా…భారత జనజీవితంలో క్రీడా సంస్కృతి ఓ ప్రధాన భాగం కానంత వరకూ…జాతీయ గీతం, జాతీయ పతాకంతో సమానంగా జాతీయ క్రీడాదినోత్సవానికి ప్రాధాన్యం ఇవ్వనంత వరకూ…భారత క్రీడారంగ ప్రగతి ఓ అందమైన కలగానే ఉండిపోతుంది.