రాము, రాము నీ కోసం ఏమిటి తెచ్చానో చూడు అని పిలిచాడు రాముని వాళ్ళ నాన్న వీరేంద్ర. వస్తున్నా నాన్న అని రాము వచ్చి, నా కోసం ఏమిటి తెచ్చావు? అని అడిగాడు. నువ్వే చూడు అన్నాడు వీరేంద్ర. అయ్ “గేర్ సైకిల్” అని అన్నాడు రాము. అవును కన్నా నువ్వు రెండు నెలల నుంచి అడుగుతున్నావు కదాని తెచ్చాను అన్నాడు వీరేంద్ర.థ్యాంక్స్ నాన్న కొనిచ్చినందుకు అన్నాడు రాము. “నాకు థ్యాంక్స్ ఎందుకురా. నీ కోసం ఏమైనా చేస్తాడు, ఏదైనా తెచ్చి ఇస్తాడు ఈ నాన్న” అని అన్నాడు వీరేంద్ర. మా మంచి నాన్న అని కౌగిలించుకున్నాడు రాము. ఇవన్నీ తర్వాత, ముందు నువ్వు సైకిల్ పైన అలా తిరిగిరా అన్నాడు వీరేంద్ర. సరే నాన్న అని రాము సైకిల్ పైన బయటకు వెళ్ళాడు.

“ఇప్పటికిప్పుడే ఈ సైకిల్ కొనడానికి అంత డబ్బు ఎక్కడిది?” అని రాము తాత అంజయ్య అడిగాడు.

“ఈ.ఎం.ఐ.లో తీసుకున్నాను” అన్నాడు వీరేంద్ర.

“మొన్నే కదా వాడు అడిగాడని ఖరీదైన వీడియో గేమ్ కొనిచ్చావు. మళ్ళీ ఈ గేర్ సైకిల్ ఏమిటి? ఇలా వాడు అడిగిన ప్రతిదీ ఈ.ఎం.ఐ.లో కొంటూ పోతుంటే నువ్వు అప్పుల పాలైపోతావు. వాడికి డబ్బు విలువ, వస్తువుల విలువ తెలియకుండా పోతుంది, అప్పుడు నువ్వే బాధపడతావు” అన్నాడు అంజయ్య.

“ఊరుకో నాన్న, ఈ.ఎం.ఐ.ల వల్ల అప్పుల పాలు కాము. మన సరదాలు తీరుతాయి, అంతే” అన్నాడు వీరేంద్ర. “పైగా, వాడి కోరికలు తీర్చకపోతే వాడు బాధపడతాడు, వాడు బాధపడితే నేను తట్టుకోలేనని” చెప్పి వీరేంద్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు.

“సరేలే, వెళ్ళు. నేను చెప్పేది నీకిప్పుడు అర్థం కాదులే, తరువాత నీకే తెలిసొస్తుంది,” అని అంజయ్య కొడుకుపై కోపగించుకున్నాడు. కొద్దిసేపటి తరువాత రాము ఎంతో ఆనందంగా ఇంటికొచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశారు.

రెండేళ్ల తర్వాత వీరేంద్రకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. జీతం పెరిగింది. జీతం పెరగడంతో, ఈఎంఐ పద్ధతిలో ఒక కారు కొందామని తన భార్య మంజులకి చెప్పాడు. మంజుల, “ఇప్పుడేమీ కారు వద్దు,” మనకున్న బండి చాలు. ఇప్పుడు రాము పదో తరగతికి వచ్చాడు. వచ్చే ఏడాది వాడిని మంచి కళాశాలలో చేర్పించాలి. వాడికి ఇష్టమైన చదువు చదివించాలంటే బోలెడు ఖర్చవుతుంది. ఇప్పుడు మనం ఈఎంఐ పెట్టుకుంటే వాడి భవిష్యత్తు పాడవుతుందని మంజుల తన భర్త వీరేంద్రతో చెప్పింది. అందుకు వీరేంద్ర, “ఫీజు ఏమీ ఒకేసారి కట్టనవసరం లేదు. ఇప్పుడన్నీ ఈ.ఎం.ఐలే కదా” అన్నాడు.

“ఏదైనా అప్పే కదండీ?” అని మంజుల అంది. “ఇది అప్పు కాదు” అని వీరేంద్ర ఇలా వివరించాడు: “అప్పంటే తీసుకున్న డబ్బుకు వడ్డీ మాత్రమే కట్టి, అసలు ఒకేసారి తిరిగి ఇవ్వాలి. కానీ ఈఎంఐ అంటే వడ్డీతో పాటు అసలు కూడా ప్రతినెలా కొంత చెల్లిస్తూ పోతాం. ఇది అప్పు లాంటిది కాదు,” అని చెప్పాడు. “నిజమే, కానీ ప్రతిదానికీ ఈ.ఎం.ఐ పెడితే రేపు మనకు ఆస్తేమీ లేకుండా పోతుంది” అంది మంజుల.

“రేపటి కోసం మన అబ్బాయిని చదివిస్తున్నాం కదా. ఈ చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడంలో తప్పేమీ లేదు” అన్నాడు వీరేంద్ర.

“సరే, మీ ఇష్టం” అంది మంజుల.

వెంటనే వీరేంద్ర పది లక్షల కారు కొని, ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చూపించాడు.

తండ్రి కారు చూసి, “ఇది కూడా ఈఎంఐ మీద తీసుకున్నావా?” అని అడిగాడు.

“అవును, మనమేమీ కోటీశ్వరులం కాదు కదా, అప్పు లేకుండా కొనడానికి!” అని వెంటనే వీరేంద్ర అన్నాడు.

“మనమేమీ కోటీశ్వరులం కాదు. ఇలా ప్రతిదీ అప్పు చేసి కొంటే బికారులం అవ్వడం ఖాయం” అన్నాడు అంజయ్య.

“అప్పు చేస్తే బికారులం అవుతాం, అది నిజమే. కానీ నేను అన్ని వస్తువులు ఈ. ఎం. ఐలో తీసుకుంటున్నాను” అన్నాడు వీరేంద్ర.

“మన సంపాదనకు మించి ఖర్చు చేస్తే అది ఏ రూపంలో ఉన్నా అప్పేరా!” అన్నాడు అంజయ్య.

“మీతో వాదించడం నా తప్పు. నేను ఏం చేసినా మీకు తప్పే కదా” అని గొణుక్కుంటూ గదిలోకి వెళ్ళాడు వీరేంద్ర.

“వెళ్ళురా, వెళ్ళు!” అని కోపంగా తన మంచంపై కూర్చున్నాడు అంజయ్య.

వీరేంద్ర తల్లి, వీరూ అని పిలుస్తూ గదిలోకి వెళ్ళింది. “ఏంటమ్మా?” అన్నాడు వీరేంద్ర. “కోపం, చికాకు తగ్గించుకుని నా మాట కాస్త విను నాన్నా.” “చెప్పమ్మా,” అని చికాకుగా అన్నాడు వీరేంద్ర. “నాన్నా, మన పెద్దలు ఏ మాట చెప్పినా అది మన మంచి కోసమే అని తెలుసు కదా? అలాంటిది, మీ నాన్న చెప్పే మాట కాస్త విని, ఆ ఈ.ఎం.ఐ.లు తగ్గించుకుని డబ్బు దాచు నాన్నా,” అంది. “సరేలే, నాన్న చెప్పినట్టే చేయడానికి ప్రయత్నిస్తాను,” అన్నాడు వీరేంద్ర. “కారు కొని తెచ్చావు మరి, మమ్మల్ని కారులో బయటకు తీసుకువెళ్ళవా?” అని అడిగింది అమ్మ. పదా అని , వీరేంద్ర తన తల్లిని ఊరంతా ఒకసారి తిప్పి తీసుకువచ్చాడు.

ఇంకో ఐదు నెలల్లో రాము పదో తరగతి పరీక్షలు రాబోతున్నాయని, శ్రద్ధ తీసుకోమని, బాగా కష్టపడి చదవమని రాముకి తాత చెప్పేవాడు. “నేను బాగానే చదువుతున్నాను కదా. రోజు ఈ గోలేంటి?” అని చికాకు పడేవాడు రాము. ఐదు నెలలు ముగిసిపోయాయి. పెద్ద పరీక్షలు వచ్చాయి. రాముని వీరేంద్ర ప్రతిరోజూ కారులో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు. పరీక్షలు పూర్తయ్యాయి. రెండు నెలల్లో పరీక్ష ఫలితాలు వచ్చాయి.

వీరేంద్ర ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. రాము బొటాబోటి మార్కులతో ఏదో పాస్ అయ్యాడు. వీరేంద్రకు మతి పోయినంత పనైంది. రాముని తాత గట్టిగా తిట్టాడు. రాము చిన్నబుచ్చుకుని, “నేను ఫెయిల్ అవ్వలేదు కదా, మరెందుకు ఈ గొడవ?” అని సణుగుకుంటూ గదిలోకి వెళ్లాడు. అంజయ్య వీరేంద్రను చూసి, “ఇది నీ గారాబం మహిమే, అనుభవించు” అన్నాడు.

వీరేంద్ర ఏమీ మాట్లాడలేక తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. కొంతసేపటి తరువాత రాము గదిలోంచి బయటకు వచ్చి, “నాన్న, నా స్నేహితులందరూ ఇంజనీరింగ్ లో చేరడానికి ఇంటర్మీడియట్ నుంచే ‘హై టెక్నో కళాశాల’లో చేరుతున్నారు. నేను కూడా వారితోనే చదవాలని అనుకుంటున్నాను.” అని చెప్పాడు.

అదేంటి కన్నా, నీకు చిన్నప్పటి నుంచీ కలెక్టర్ అవ్వడం ఇష్టమని కదా చెప్పేవాడివి? ఇప్పుడు ఇంజనీరింగ్ అంటావేంటి? అని తల్లి మంజుల అడిగింది. “నేను నా స్నేహితులు ఏది చదివితే అదే చదువుతాను” అని రాము గట్టిగా చెప్పేసి బయటకు వెళ్లిపోయాడు. “ఏంటండీ, వీడు ఇలా అంటున్నాడు?” అని కంగారుగా, బాధపడుతూ వీరేంద్ర దగ్గరకు వచ్చి అంది మంజుల. “మనం ఏం చేయగలం? వాడు కోరుకున్న చదువే చదివిద్దాంలే” అన్నాడు వీరేంద్ర.

రాము కోరుకున్న కళాశాలకు వీరేంద్ర వెళ్ళాడు. అక్కడ ప్రిన్సిపాల్, ఫీజు, హాస్టల్ సదుపాయాల వివరాలు చెబుతూ, రెండేళ్లకు కలిపి ఐదు లక్షలు అవుతుందని తెలిపారు. వీరేంద్ర సరేనని చెప్పి, అడ్వాన్స్ కింద యాభై వేలు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే మంజుల, “ఫీజు ఎంత?” అని అడిగింది. వీరేంద్ర, “ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు? నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు, వాడు హాస్టల్‌కి వెళ్ళేందుకు కావాల్సినవన్నీ సిద్ధం చేయి” అన్నాడు. మంజుల సరేనని వెళ్ళింది.

రాము తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా కళాశాలలో ప్రవేశించాడు. కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లతో ఒక సంవత్సరం ఎంతో ఆనందంగా గడిచిపోయింది. రెండో సంవత్సరం కూడా ఏదో అంతంత మాత్రంగా చదివి, చివరి పరీక్షల్లో బొటాబొటి మార్కులతో పాస్ అయ్యాడు. రాముకు మంచి మార్కులు రాలేదని వీరేంద్ర ఎంతో బాధపడిపోయాడు. ఇంటర్ ముగించుకున్నాక రాము ఇంటికి వచ్చాడు.

రాము ఇంజనీర్ అవ్వడం కోసం ఎంసెట్ రాయాలనుకున్నాడు. కోచింగ్ తీసుకుని పరీక్షలు రాశాడు. కానీ పాస్ కాలేదు. దాంతో రాము తన తండ్రి వీరేంద్రతో ఇంజనీరింగ్ సీటు కొనాలని చెప్పాడు. అప్పుడు వీరేంద్ర, ‘నీకు వచ్చిన మార్కులతో నువ్వు ఇంజనీర్ అవుతావనే నమ్మకం నాకు లేదు. అందుకే నువ్వు మామూలుగా డిగ్రీ చదువుకో’ అని అన్నాడు. వెంటనే రాము ‘నేను చదివితే ఇంజనీరింగ్ మాత్రమే చదువుతాను. లేకపోతే ఇంకేమీ చదవను’ అని అన్నాడు.

పిల్లాడి భవిష్యత్తు పాడవుతుందేమోనని భావించిన వీరేంద్ర, కొడుకు కోరుకున్న చదువు చదివించడానికి ఒప్పుకున్నాడు. రాము నాలుగు సంవత్సరాలు హాస్టల్‌లో ఉండి తన చదువు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుండగా, తల్లి మంజుల నుంచి ‘నువ్వు వెంటనే మన ఊరు సిటీ హాస్పిటల్‌కు రా’ అని ఫోన్ వచ్చింది.

“అమ్మ హాస్పిటల్‌కి ఎందుకు రమ్మంది? ఎవరికి ఏమైంది?” అని ఆలోచిస్తూ రాము కంగారుగా కారులో బయలుదేరాడు. సాయంత్రానికి వాళ్ళ ఊరి హాస్పిటల్‌కి చేరుకున్నాడు. హాస్పిటల్ దగ్గర కారు దిగి, డబ్బులు చెల్లించి, తల్లి ఎక్కడ ఉందోనని చుట్టూ చూశాడు. ఒక మందుల దుకాణం పక్కన తల్లి మామూలు నూలు చీర కట్టుకుని, మెడలో పసుపుతాడుతో నిలబడి ఉంది. తల్లిని అలా చూసిన రాముకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం తల తిరిగినట్టయింది.

రాము వెంటనే తల్లి దగ్గరకు వెళ్లి, ‘అమ్మా, నువ్వు ఇలా ఎందుకున్నావు? నన్ను హాస్పిటల్‌కి ఎందుకు రమ్మన్నావు? ఎవరికి ఏమైంది?’ అని కంగారుగా అడిగాడు. మంజుల ఏడుస్తూ, ‘మీ నాన్నకు ఆక్సిడెంట్ అయింది’ అని చెప్పింది. ‘ఏమిటి! నా…న్న, నాన్నకు ఆక్సిడెంట్ అయిందా? ఎప్పుడు? ఎలా?’ అని రాము కంగారుగా ప్రశ్నించాడు. ‘ఉదయం ఆఫీస్‌కి వెళ్తుండగా ఆక్సిడెంట్ అయింది’ అని మంజుల వివరించింది. ‘ఇప్పుడు నాన్నకు ఎలా ఉంది?’ అని అడిగాడు రాము.

“ఐసీయూలో ఉన్నారు. డాక్టర్లు ఏమేమో చెబుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు” అని అంది మంజుల. “పద!” అని చెప్పి రాము చాలా వేగంగా వెళ్ళాడు. ఐసీయూ లోపలికి వెళ్తుండగా, అక్కడ ఉన్న అటెండర్ “లోపలికి ఎవరూ వెళ్ళకూడదు” అన్నాడు. “మా నాన్న లోపల ఉన్నారు, నేను వెళ్ళాలి” అన్నాడు రాము. “కుదరదు” అన్నాడు అటెండర్. అప్పుడే రౌండ్స్‌కు వచ్చిన డాక్టర్ అది గమనించి రామును తన గదికి వచ్చి కలవమని చెప్పారు. రాము డాక్టర్ గారి గది దగ్గర ఆయన కోసం ఎదురుచూస్తూ నిలుచున్నాడు.

కొంతసేపటికి డాక్టర్ రామునీ, మంజులనీ లోపలికి పిలిచారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళిన రాము, “మా నాన్నకు ఎలా ఉంది? ప్రమాదమేమీ లేదు కదా?” అని ఆందోళనగా అడిగాడు. “మీ నాన్న కాళ్ళు ఆక్సిడెంట్ లో పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయాయి. తక్షణమే ఆపరేషన్ చేసి ఆ కాళ్ళు తీసేయాలి,” అని డాక్టర్ చెప్పాడు. “ఈ ఆపరేషన్ కి సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. డబ్బులు సిద్ధం చేసుకోండి,” అని వివరించాడు. “వాట్! నో!” అంటూ రాము గట్టిగా అరిచాడు. “చూడండి, ఇంత పెద్ద ప్రమాదంలో ఆయన ప్రాణాలకు ఏమీ కాలేదు. దానికి సంతోషపడాలి,” అని డాక్టర్ వారికి ధైర్యం చెప్పి, కాళ్ళు తీసేయడానికి ఒప్పించారు.

రాము సరేనని అంగీకరించి, కాగితాలపై సంతకాలు చేశాడు. డాక్టర్ వెంటనే డబ్బులు తీసుకువచ్చి కట్టమని చెప్పారు. రాము తన తల్లి దగ్గరకు వెళ్లి, నాన్న అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందని అడిగాడు. మంజుల, నాన్న అకౌంట్‌లో సాధారణ నిల్వ మాత్రమే ఉందని చెప్పింది. “ఏంటి, సాధారణ నిల్వ మాత్రమే ఉందా? సరే, సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా?” అని రాము అడిగాడు. “సేవింగ్స్ కూడా ఏమీ లేవు” అని మంజుల బదులిచ్చింది. “అయ్యో, సేవింగ్స్ కూడా చేయకుండా ఏం చేస్తున్నారు అమ్మా?” అని రాము ఆశ్చర్యంగా అడిగాడు.

సరే, ఇంటికి పద అన్నాడు రాము తల్లిని. ఇద్దరూ ఇంటికి వెళ్లడానికి ఆటో పిలిచి ఎక్కారు. ఆటో నేరుగా రాము వాళ్ళ ఇంటి ముందు ఆగింది. రాము ఆటో దిగాడు. వెంటనే అంజయ్య కంగారుగా వచ్చి, ఏమైంది? ఎలా ఉందని మంజులను అడిగాడు. మంజుల డాక్టర్ చెప్పింది చెబుతుండగా, రాము ఆశ్చర్యంగా తాతయ్యను చూసి, “అదేంటి తాతయ్య, మీరు మన ఇంటి నుంచి కాకుండా ఎదురింటి నుంచి బయటకు వచ్చారు!” అని అడిగాడు.

అంజయ్య, “మనం ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాము,” అని చెప్పాడు. “అదేంటి, మన ఇల్లు ఏమైంది?” అని రాము అడిగాడు.

“ముందు నువ్వు లోపలికి పదా!” అని చెప్పి మంజుల కొడుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది.

“అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి” అని రాము గట్టిగా అడిగాడు.

“మీ నాన్న ఎవరి మాట వినకుండా ప్రతి దానికీ ఈ.ఎం.ఐ.లు పెట్టుకుని పూర్తిగా అప్పులపాలైపోయాడు. నెల జీతం కన్నా ఎక్కువగా ఈ.ఎం.ఐ.లు కట్టాల్సివచ్చేది. దాంతో వాటిని కట్టడానికి డబ్బు లేక బ్యాంకు క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అవి కూడా సమయానికి కట్టలేక చాలా ఇబ్బంది పడేవాడు.”

“డబ్బు సకాలంలో చెల్లించలేకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటిని, కారుని జప్తు చేశారు. ఈ మధ్య మీ నాన్నమ్మకు ఒంట్లో బాగోలేనప్పుడు హాస్పిటల్ ఖర్చులకు ఒక రెండు లక్షలు ఖర్చు అయింది, అప్పుడు డబ్బు లేక మీ అమ్మ నగలు అమ్మాల్సి వచ్చింది” అని అంజయ్య చెప్పాడు.

అందుకేనా నాన్న నన్ను ఈ నాలుగేళ్లుగా ఇంటికి వస్తానంటే వద్దు అనేవారు అని రాము తనలో తాను అనుకున్నాడు. “తాతయ్యా, ఇప్పుడు నాన్నకు ఆపరేషన్ చేయించాలి, అందుకోసం బోలెడు డబ్బు కావాలి, ఇప్పుడు ఎలా” అని రాము అడిగాడు.

అంజయ్య, రాముని వెంటబెట్టుకుని, తన స్నేహితుడి కొడుకైన సీతారామయ్యను అప్పు అడిగి చూద్దామని బయలుదేరాడు. సీతారామయ్య ఇంటికి వెళ్లి అంజయ్య కాలింగ్ బెల్ మ్రోగించాడు. సీతారామయ్య భార్య వచ్చి తలుపులు తెరిచింది. ఎదురుగా అంజయ్యను చూసి, “ఓహ్, మావయ్యా, మీరా! లోపలికి రండి” అని ఆహ్వానించింది. అంజయ్య లోపలికి వెళ్ళాడు. సీతారామయ్యకు అంజయ్య వచ్చిన సంగతి అతని భార్య చెప్పింది. సీతారామయ్య వస్తూనే, “బాబాయి, ఎలా ఉన్నారు?” అని పలకరించాడు. “నేను బాగానే ఉన్నాను… కానీ” అని అంజయ్య అన్నాడు. సీతారామయ్య అతని చేతిలో చేయి వేసి, “బాబాయి, ఏమైంది?” అని అడిగాడు.

అంజయ్య సీతారామయ్యతో, “సీతా, నాకు ఐదు లక్షలు వెంటనే అప్పుగా కావాలిరా, వీరేంద్రకు ప్రమాదం జరిగింది” అన్నాడు. సీతారామయ్య కంగారుగా, “అయ్యో! ఎప్పుడు, ఎలా జరిగింది?” అని అడిగాడు. “అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు డబ్బు కడితేనే డాక్టర్ ఆపరేషన్ చేస్తారు” అని అంజయ్య బదులిచ్చాడు. సీతారామయ్య, “ఉండండి బాబాయ్” అంటూ వెంటనే లోపలికి వెళ్లి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడు. అంజయ్య ఆ డబ్బును తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. డబ్బు కట్టాడు. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు.

ఆపరేషన్ జరిగిన ఒక రోజు తర్వాత వీరేంద్ర నెమ్మదిగా కళ్లు తెరిచాడు. భర్త కళ్లు తెరవడం చూసి మంజుల ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. “ఏమైంది మంజూ?” అని వీరేంద్ర ప్రేమగా అడిగాడు. “మీకు ఇప్పుడు ఎలా ఉంది?” అని మంజుల అడిగింది. “పరవాలేదు” అన్నాడు వీరేంద్ర. కొంతసేపటికి డాక్టర్ వచ్చి వీరేంద్రను పరీక్షించి, “బాగా రికవరీ అవుతున్నారు” అని అన్నారు. “నన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తారు డాక్టర్ గారు?” అని వీరేంద్ర అడిగాడు. “తొందరలోనే” అని డాక్టర్ బదులిచ్చారు.

కొడుకుకి తెలివి వచ్చిందని తెలిసిన వెంటనే, వీరేంద్ర తల్లిదండ్రులు రాముతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. వీరేంద్ర తల్లి కొడుకుని పట్టుకుని ఏడవసాగింది. “ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేమీ కాలేదు కదా, ఏదో చిన్న ప్రమాదం జరిగింది అంతే కదా,” అన్నాడు వీరేంద్ర. తండ్రి అంజయ్య వీరేంద్రను వింతగా చూశాడు.

“అదేంటి నాన్న, మీకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మీ రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేసి వాటిని తీసేయాల్సి వచ్చింది," అన్నాడు రాము. కొడుకు మాటలు విన్న వీరేంద్రకు తల తిరిగింది.

“అదేంటి, నేను బాగానే ఉన్నాను కదా? నాకేమైంది?" అనుకుంటూ తనపైన కప్పిన దుప్పటిని పక్కకు తొలగించాడు. చూస్తే, తన రెండు కాళ్ళు లేవు. దాంతో అతను తీవ్రంగా కుమిలిపోయాడు. “ఇంక నాకు ఈ జీవితం ఎందుకు? నన్ను చంపేయండి!” అంటూ గట్టిగా అరవసాగాడు. వెంటనే డాక్టర్ వచ్చి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని పడుకోబెట్టారు. కుటుంబానికి “మరేమీ పర్వాలేదు” అని ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్లారు.

కొంతసేపటికి వీరేంద్రకు మెల్లగా స్పృహ వస్తుండటం గమనించిన మంజుల, వెంటనే డాక్టర్‌ని పిలిచింది. డాక్టర్ వచ్చి, వీరేంద్రకు పూర్తిగా తెలివి వచ్చిన తర్వాత, అతనికి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో వీరేంద్ర మళ్ళీ మామూలు మనిషిలా మారాడు. రెండు రోజుల అనంతరం వీరేంద్రకు కొన్ని మందులు సూచించి, తదుపరి చెకప్ కోసం ఒక తేదీని నిర్ణయించి, ఇంటికి పంపించారు డాక్టర్. వీల్ చైర్‌లో ఇంటికి తిరిగి వచ్చిన వీరేంద్రను పలకరించడానికి చుట్టుపక్కల వారందరూ వచ్చి వెళ్ళారు.

వీరేంద్ర ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులు మామూలుగానే గడిచిపోయాయి. మూడో రోజు నుంచి కుటుంబ కష్టాలు మొదలయ్యాయి. రాముతో వాళ్ళ అమ్మ, ‘నువ్వు మంచి ఉద్యోగం సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించాలి’ అని చెప్పింది. ‘సరే అమ్మ’ అన్నాడు రాము. తన సర్టిఫికెట్లు పట్టుకుని ఇంటర్వ్యూలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలోనూ, అతని విద్యార్హతలు సరిపోవని చెప్పి తిరస్కరించారు. ఎక్కడికి వెళ్ళినా మార్కులు చాలా తక్కువగా ఉండటం వల్ల ఉద్యోగం దొరకకపోవడంతో, ‘అయ్యో, చదువుకోవాల్సిన వయసులో సమయాన్ని వృథా చేసుకున్నానే. బాగా చదువుకుని ఉంటే ఇప్పుడు ఉద్యోగం కోసం…ఇంతలా కష్టపడే అవసరం ఉండకపోను.’ అని బాధపడసాగాడు.

ఒకరోజు రాము తన స్నేహితులను కలవడానికి ఎంతో సంతోషంగా వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చాక ఎంతో విచారంగా తన గదిలో కూర్చుండిపోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న అంజయ్య మనవడు రామును చూసి ఏమైందని అడిగాడు. ‘నాతో పాటే చదువుకున్న నా స్నేహితులందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. కానీ వారితో పాటే, వారు చదివిన కళాశాలలోనే నేను చదివాను. నాకు మాత్రం ఉద్యోగం రాలేదు’ అని తన బాధనంతా తాతయ్యకు వివరించాడు రాము.

తాను ఇష్టపడే పనిని ఎవరైనా సరే ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా, ప్రేమగా చేస్తారు. అందుకే వారు ఆ పనిలో బాగా రాణిస్తారు. అలా కాకుండా, ఇతరుల కోసమో, స్నేహితులు చేస్తున్నారనో ఏదైనా పని చేస్తే, వారు కష్టపడతారు. కాబట్టి, మనం ఎప్పుడూ ఏమి చేయగలం, ఏ విషయంలో మనకు ఆసక్తి ఉంది, ఏ రంగంలో మనం రాణించగలం అనే విషయాలను తెలుసుకుని, వాటి గురించి ఆలోచించుకుని ముందడుగు వేయాలి అని అంజయ్య చెప్పాడు.

తాతయ్య మాటలు విన్న రాము, “నిజమే తాతయ్య, నాకు చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనే కోరిక ఉండేది. నాకు ఈ ఇంజినీరింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా స్నేహితులు చదువుతున్నారు కదా అని ఆ కోర్సును నేను ఎంచుకున్నాను,” అని చెప్పాడు. “అదే నీ తప్పు. చూశావా, ఆ ఒక్క తప్పు వల్ల నీ జీవితం ఇప్పుడు ఏమైందో?” అని అన్నాడు అంజయ్య. “అవును తాతయ్య, నా తప్పు కారణంగా నేను చాలా బాధ పడుతున్నాను,” అన్నాడు రాము.

గది బయట నుండి అన్నీ వింటున్న వీరేంద్ర, వీల్‌చైర్‌లో లోపలికి వచ్చి, “నువ్వే కాదు, నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను. జీవితంలో ఈ.ఎం.ఐ అనే వ్యసనాన్ని అలవాటు చేసుకుని మీ అందరి జీవితాలనూ నాశనం చేశాను. నా కొడుకుకి భవిష్యత్తు లేకుండా చేశాను” అని బాధపడసాగాడు.

అంజయ్య, “తప్పు చేయని మనిషి ఉండడు. కానీ ఆ తప్పును తెలుసుకుని, సరిదిద్దుకుని, మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉన్నవాడే మంచి మనిషి అవుతాడు” అని అన్నాడు.

వెంటనే రాము, “నాన్న, నువ్వు నేను అడిగినవన్నీ ఇచ్చావు. నేనే నీ ప్రేమను అలుసుగా తీసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను” అన్నాడు. “జరిగింది ఏదో జరిగింది. ఇప్పటినుంచి మనం చేసిన తప్పులను సరిదిద్దుకుని ముందడుగు వేద్దాం” అంది వీరేంద్ర తల్లి.

“నిజమే అమ్మ నువ్వు చెప్పింది. ఇవాళ్టి నుంచి నేను కాళ్ళు పోయాయని బాధపడుతూ కూర్చోను. నాకు చేతనైన పని చేసి కుటుంబానికి ఎంతోకొంత సహాయపడతాను” అన్నాడు వీరేంద్ర. “నేను నా చదువుకు, మార్కులకు ప్యూన్ ఉద్యోగం వచ్చినా పర్వాలేదు. కష్టపడి పని చేసి, మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతాను” అన్నాడు రాము.

వీరేంద్రను పలకరించడానికి వచ్చిన సీతారామయ్య, ఆ సంఘటన చూసి, వాళ్ళ మాటలన్నీ విని చప్పట్లు కొట్టాడు. దాంతో అందరూ వెంటనే వెనక్కి తిరిగి చూశారు. సీతారామయ్య, “ఇకపై మీకు అంతా మంచే జరుగుతుంది” అన్నాడు. రాము “థాంక్స్ అండి” అన్నాడు. ఆ తర్వాత సీతారామయ్య, “ఇప్పుడు ఎలా ఉంది వీరేంద్రా?” అని పలకరించాడు. “బాగానే ఉంది” అన్నాడు వీరేంద్ర.

అంజయ్య కంటతడి పెట్టుకుంటూ, “నువ్వే సమయానికి సహాయం చేసి ఉండకపోతే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు” అన్నాడు. సీతారామయ్య, “ఊరుకోండి బాబాయ్, ఒక మనిషిగా ఇంకో మనిషికి నాకు తోచిన సహాయం చేశానంతే” అన్నాడు. “తొందర్లోనే మీ అప్పు తీర్చేస్తాము” అన్నాడు రాము. వీరేంద్ర, “అప్పేంటి? అసలు మీరంతా దేని గురించి మాట్లాడుకుంటున్నారు?” అని అడిగాడు.

నీ ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం సీతారామయ్యను ఐదు లక్షలు అప్పు అడిగాను. మనం తిరిగి చెల్లించగలమో లేదో కూడా ఆలోచించకుండా, మన పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన వెంటనే డబ్బు ఇచ్చాడు అని అంజయ్య చెప్పాడు. ఆ మాట వినగానే వీరేంద్ర, సీతారామయ్య చేతిలో చేయి వేసి, ‘చాలా కృతజ్ఞతలు. నీ అప్పును త్వరగా తీర్చేస్తాను’ అన్నాడు.

అప్పుడు సీతారామయ్య, ‘ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ముందు మీరు నెమ్మదిగా స్థిరపడండి. ఆ తర్వాత అప్పు తీర్చే సంగతి ఆలోచిద్దాం’ అన్నాడు. ‘చాలా సంతోషం రా సీత!’ అన్నాడు అంజయ్య. ‘సరే, నేను ఇక బయలుదేరుతాను’ అన్నాడు సీతారామయ్య.

సీతారామయ్యతో పాటు అందరూ సరేనని వీధి గుమ్మం దగ్గరికి వచ్చారు. గుమ్మం దగ్గరకు వచ్చిన సీతారామయ్య, “అన్నట్టు, ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. నాకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అందులో పని చేస్తావా?” అని రాముని అడిగాడు. రాము వెంటనే “తప్పకుండా చేస్తాను” అన్నాడు. “అయితే రేపు పది గంటలకు నా ఆఫీస్‌కి వచ్చి కలువు” అని సీతారామయ్య చెప్పి తన ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు. రాము సరే అన్నాడు.

మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకే రాము తన సర్టిఫికెట్లు తీసుకుని, సిటీ బస్ ఎక్కి సీతారామయ్య ఇచ్చిన చిరునామాకు చేరుకున్నాడు. బయట రాము అనే వ్యక్తి వస్తే లోపలికి పంపమని ప్యూన్‌కు సీతారామయ్య చెప్పాడు. ప్యూన్ రాము దగ్గరకు వెళ్లి, “మిమ్మల్ని సార్ లోపలికి రమ్మన్నారు” అని చెప్పాడు. రాము ప్యూన్ వెనకాల వెళ్ళాడు. ప్యూన్ గది చూపించి వెళ్ళిపోయాడు. తలుపు కొంచెం తెరిచి, రాము “నేను లోపలికి రావచ్చా?” అని అడిగాడు. “ఎస్ కమింగ్” అని లోపలి నుండి రాముకి వినిపించింది. రాము తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లాడు.

రాము తన సర్టిఫికెట్లను సీతారామయ్యకు ఇచ్చాడు. అన్నీ పరిశీలించిన సీతారామయ్య, మార్కులు తక్కువగా ఉన్నా ఫర్వాలేదని వెంటనే ఫోన్ చేసి కావ్యను లోపలికి పంపమని చెప్పాడు. “నువ్వు పని నేర్చుకుని శ్రద్ధగా చేస్తే, ఈ సర్టిఫికెట్లతో నాకు పని లేదు. నేను మనిషిలోని ఏకాగ్రతను, పట్టుదలను ప్రధానంగా చూస్తాను” అని సీతారామయ్య చెప్పాడు. “బడిలో, కళాశాలలో గురువులు నేర్పిన చదువును నేను ఏకాగ్రతతో వినలేదు. పట్టుదలగా చదవలేదు. కానీ, జీవితం నేర్పిన పాఠం ద్వారా, జీవితంలో ఎదగడానికి ఆ రెండు ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకున్నాను.”

“మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని నేర్చుకుంటాను” అని రాము అన్నాడు. ఇంతలో, “నేను లోపలికి రావచ్చా సార్?” అని ఒక మధురమైన స్వరం వినిపించింది. సీతారామయ్య, “లోపలికి రండి” అని అన్నాడు. రాము వెంటనే చూపు తిప్పి తలుపు వైపు చూశాడు. అక్కడ, ఒక అపురూప శిల్పి చెక్కిన శిల్పంలా ఎంతో అందంగా, వినయ విధేయతలతో నిలబడి ఉంది కావ్య. “కావ్య, ఇతను రాము. ఈ రోజు నుంచి మన కంపెనీలో చేరుతున్నాడు అంటూ పరిచయం చేశాడు సీతారామయ్య . అతన్ని నీ టీంలో చేర్చుకుని, పని ఎలా చేయాలో నేర్పించు” అని చెప్పాడు.

కావ్య “సరే సార్” అంది. వెంటనే సీతారామయ్య రాముతో, “ఈ అమ్మాయి కావ్య. ఈ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తోంది. నువ్వు తన దగ్గర పని నేర్చుకోవాలి” అని చెప్పాడు. రాము సరేనన్నాడు. ఇద్దరూ బయటికొచ్చాక, “హాయ్, నా పేరు కావ్య” అంటూ చేయి కలపడానికి తన చేయి ముందుకు చాచింది. రాము అవేవీ గమనించకుండా, కావ్యనే చూస్తూ ఉండిపోయాడు. కావ్య “హలో” అంటూ రాము ముఖం ముందు తన చేయి ఊపింది. రాము వెంటనే తేరుకుని, “సారీ, ఏమంటున్నారు మీరు?” అని అడిగాడు.

“పదండి, మీరు ఎక్కడ కూర్చోవాలో చూపిస్తాను” అంది కావ్య. ఆమె వెంట వెళ్ళాడు రాము.

కావ్య రాముని తన టీమ్ సభ్యులందరికీ పరిచయం చేసింది. అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ రోజంతా చాలా ఆనందంగా గడిచిపోయింది. రాము ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం బస్టాప్‌కి బయలుదేరాడు. సీతారామయ్య తన కారు తీసుకొచ్చి, రాముతో “కారు ఎక్కు, నిన్ను ఇంటి దగ్గర దింపుతాను” అన్నాడు. “వద్దు సార్, నేను బస్సులో వెళ్ళిపోతాను” అన్నాడు రాము. “మరేం పర్వాలేదు” అంటూ సీతారామయ్య కారు తలుపులు తెరిచి, రమ్మని పిలిచాడు.

కాదు అనలేక, మొహమాట పడుతూనే రాము కారు ఎక్కాడు. సీతారామయ్య కారు వచ్చి వీరేంద్ర ఇంటి ముందర ఆగింది. రాము వెంటనే కారు దిగి, ‘ధన్యవాదాలు సార్, రేపు సమయానికి కార్యాలయానికి వచ్చేస్తాను’ అన్నాడు. ‘సరే’ అని చెప్పి సీతారామయ్య వెళ్ళిపోయాడు.

రోజులు గడుస్తుండగా, రాము ఎంతో పట్టుదలగా పనులన్నీ నేర్చుకుంటున్నాడు. ఒక ఏడాది గడిచాక, ఒకరోజు సీతారామయ్య రాముని పిలిచి, ‘ఎన్ని రోజులు అలా బస్సులో వెళ్ళి వస్తుంటావు? ఈ.ఎం.ఐ. పద్ధతిలో ఒక బండి కొనుక్కోవచ్చు కదా!’ అన్నాడు. ‘ఆమ్మో, ఈ.ఎం.ఐ.నా! వద్దు వద్దు’ అన్నాడు రాము.

సీతారామయ్య, “ఈ.ఎం.ఐ అంటే అంత భయపడుతున్నావు ఏమిటి?” అని అడిగాడు.

తన తండ్రి ఈ.ఎం.ఐ అనే పద్ధతిని మితిమీరి వాడడం వల్ల వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయ్యాయో రాము అంతా వివరించాడు.

“అవును, ఏదైనా మితిమీరకుండా అదుపులోనే ఉంచుకోవాలి,” అన్నాడు సీతారామయ్య.

“అవును సార్, నిజమే. అందుకే నేను కష్టపడి సంపాదించుకుంటున్న డబ్బులో దాచుకుంటూ, ఆలస్యమైనా పరవాలేదు, మెల్లగా అన్ని సుఖాలనూ పొందాలని అనుకుంటున్నాను. తొందరగా ఈ.ఎం.ఐ వల్ల వచ్చే సుఖాలు నాకు వద్దు,” అన్నాడు రాము.

“చాలా మంచి ఆలోచన,” అని చెప్పి మెచ్చుకుని, సీతారామయ్య, “ఈ రోజు నుంచి నీకు ముప్పై వేల జీతం ఇస్తున్నాను” అన్నాడు. రాము చాలా ఆనందపడ్డాడు.

సాయంత్రం రాము ఇంటికి వచ్చేటప్పుడు మిఠాయి కొనుక్కుని వచ్చి, ఇంట్లోని అందరికీ జీతం పెరిగిన విషయం చెప్పాడు. అందరూ సంతోషపడ్డారు. అంజయ్య వెంటనే సీతారామయ్యను కలుద్దామని బయలుదేరాడు.

అంజయ్యను చూసి సీతారామయ్య లోపలికి ఆహ్వానించాడు. సీతారామయ్యను అంజయ్య కౌగిలించుకుని, “నా మనవడికి మంచి ఉద్యోగం, జీతం, మంచి జీవితం ఇచ్చినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు!” అన్నాడు.

“ బాబాయ్, రాము చాలా మంచివాడు. అతడికి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. అంతేకాకుండా, మంచి పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నవాడు. అందుకే అతడికి ఉద్యోగం ఇవ్వడంలోనూ, జీతం పెంచడంలోనూ నా స్వార్థం కూడా ఉందని” సీతారామయ్య అన్నాడు. “నువ్వు ఏమంటున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు సీత” అన్నాడు అంజయ్య.

“ఏమీ లేదు బాబాయ్. నా చెల్లెలు శ్రీదేవి ఉంది కదా, తన కూతురు కావ్యను మన రాముకి ఇచ్చి పెళ్ళి చేయాలనేది నా కోరిక. రాముని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను. అందుకే అతడికి ఉద్యోగం ఇచ్చాను. వాడు ఎలాంటివాడో పరీక్షించిన తర్వాతే జీతం పెంచాను. నువ్వు ఏమంటావు బాబాయ్?” అని అడిగాడు సీతారామయ్య.

అంజయ్య ఏమీ మాట్లాడలేదు.

ఇంతలో సీతారామయ్య, కావ్యతో తాతయ్యకు కాఫీ తీసుకురమ్మని అన్నాడు.

కావ్య కాఫీ తీసుకుని వచ్చింది.

కావ్యను చూసి, “పిల్ల చాలా బాగుందిరా సీత. ఈ పెళ్ళి ఖాయం” అన్నాడు అంజయ్య.

“చాలా సంతోషం బాబాయి. ఒక మంచి రోజు చూసి పిల్లను చూడటానికి రండి” అని చెప్పాడు సీతారామయ్య. సరేనన్నాడు అంజయ్య.

ఇంటికి వస్తూనే అంజయ్య, “రాము, రాము” అని ఆనందంతో పిలిచాడు. “ఏంటి తాతయ్య?” అని గదిలోంచి బయటకు వచ్చి అడిగాడు రాము.

ఇంట్లో అందరూ వచ్చి అంజయ్య చుట్టూ చేరారు.

అంజయ్య, “ఒక శుభవార్త ఉందిరా మనవడా” అన్నాడు. “ఏంటది?” అని అడిగాడతను.

మన సీత తన మేనకోడలిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని అంజయ్య చెప్పాడు. నాకు ఇష్టం లేదు అని రాము అన్నాడు. ఆ పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుందిరా అని అంజయ్య అన్నాడు. నేను ఆఫీసులో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని రాము చెప్పాడు. అవునా! నీ మనసు తెలుసుకోకుండానే నేను సీతకు మాటిచ్చేశాను అని అంజయ్య అన్నాడు. నేను నా మనసు చంపుకుని ఈ పెళ్లి చేసుకోలేను అని రాము అన్నాడు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? అని మంజుల అడిగింది. తెలియదు అమ్మా, నేను ప్రేమిస్తున్న విషయం ఇప్పటిదాకా ఆ అమ్మాయికి చెప్పలేదు అని రాము అన్నాడు.

“ఆ అమ్మాయికి ముందు నీ ప్రేమ గురించి చెప్పు. ఆమె ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకో. ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం,” అంది మంజుల.

“సరే, రేపే ఆ అమ్మాయికి నా ప్రేమ సంగతి చెబుతాను,” అన్నాడు రాము.

రోజులాగే ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమై, ఎంతో ఆనందంగా బయలుదేరాడు రాము. ఆఫీసు గుమ్మంలో అడుగు పెట్టగానే వాచ్‌మన్, “మీరు నక్క తోక తొక్కి ఉంటారు సార్, అందుకే అదృష్టం మిమ్మల్ని వరించింది,” అన్నాడు.

“దేని కోసం?” అని అడిగాడు రాము.

“లోపలికి వెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది,” అన్నాడు.

రాము ఆఫీసు లోపల అడుగు పెట్టాడు. అందరూ, “అదృష్టం అంటే రాముదే. చదువు లేకపోయినా త్వరగా స్థిరపడిపోయాడు” అని గుసగుసలాడుకుంటున్నారు. అవన్నీ విన్న రాముకి చాలా కోపం వచ్చింది. నేరుగా సీతారామయ్య గది దగ్గరకు వెళ్ళి తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేద్దాము అనుకున్నాడు. ఇంతలో సీతారామయ్య ఎదురు వచ్చి నేనే నిన్ను కలుద్దాం అనుకున్నా. ఇంతకు మా కావ్యని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? అని అడిగాడు రాముని.

రాము ‘ఏంటి కావ్యా మీ మేనకోడలా!’ అని అడిగాడు. అవును నీకు ఇప్పటిదాకా తెలీదా ఈ సంగతి? అని అన్నాడు సీతారామయ్య. లేదు నాకు తెలియదు అన్నాడు రాము. సరే మీరిద్దరూ అలా ఎటైనా వెళ్ళి ఒంటరిగా మాట్లాడుకుని రండి అని అన్నాడు సీతారామయ్య. ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి కాఫీ దుకాణానికి వెళ్లారు.

కాఫీ దుకాణంలో కాఫీ ఆర్డర్ చేశారు. కావ్య సిగ్గుపడుతూ కూర్చుంది. రాము కంగారు పడుతూ, ఏమీ మాట్లాడకుండా కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో వెయిటర్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు కావ్య కొంచెం చొరవ తీసుకుని, ‘నేను అంటే మీకు ఇష్టమేనా?’ అని అడిగింది. ఆ ప్రశ్నకు రాము, ‘ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు,’ అని అన్నాడు. దానికి కావ్య, ‘అంటే నేను మీకు నచ్చలేదా?’ అని తిరిగి అడిగింది.

అసలు విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని చూసిన రోజే మీతో ప్రేమలో పడిపోయాను. “కానీ మీరు మా సార్ మేనకోడలు అని నాకు తెలియదు” అన్నాడు రాము. “సీతారామయ్యగారి మేనకోడలైతే మీకేంటి ఇబ్బంది?” అని అడిగింది కావ్య.

“సీతారామయ్యగారు నా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు. నాకు చదువు లేకపోయినా, మార్కులు సరిగ్గా రాకపోయినా, కష్టపడి పని నేర్చుకుంటానని నమ్మి నాకు ఉద్యోగం ఇచ్చి చాలా సహాయం చేశారు. ఈ నెల నుంచే నా జీతం కూడా పెంచారు. నా జీతం పెరగడానికి కారణం నేను పడిన కష్టమే అనుకున్నాను. కానీ దాని వెనుక కూడా ఆయన సహాయమే ఉందని తెలిసి, నేను కేవలం ఇతరుల సహాయంతోనే బ్రతుకుతున్నానా అని నాపై నాకే అసహ్యం వేస్తోంది,” అన్నాడు రాము.

రాము మాటలు విన్న కావ్య, “ఒకరి సహాయానికి కృతజ్ఞతగా నన్ను మీరు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు,” అంది. “అయితే మరి మీ ప్రేమ సంగతి ఏంటి?” అని ప్రశ్నించింది.

“నేను జీవితంలో నా ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని ఇద్దరినీ వదులుకోను. ఈ రోజు నుంచీ ఎవరి సహాయం లేకుండా కష్టపడి నా కాళ్లపై నేను నిలబడతాను,” అప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను. అప్పటిదాకా మీరు ఎదురు చూస్తారు కదా?” అని అడిగాడు రాము.

“మీ లాంటి అబ్బాయి కోసం ఎన్ని జన్మలైనా ఎదురుచూస్తాను” అని బదులిచ్చింది కావ్య.

“చాలా ధన్యవాదాలు, కావ్య గారు” అన్నాడు రాము.

“మన మధ్య ‘మీరు’ అనే పిలుపు, ‘ధన్యవాదాలు’ అనే పదాలు దూరం పెంచడం నాకు ఇష్టం లేదు” అని చెప్పింది కావ్య. “సరే, కావ్య” అన్నాడు రాము.

“ఇంతకీ, మన పెద్దలకు ఏం సమాధానం చెబుదాం?” అని అడిగింది కావ్య.

“మరో కొన్ని రోజులు పెళ్లిని వాయిదా వేయమని చెబుదాం” అని రాము అన్నాడు. “సరే” అంది కావ్య. ఇద్దరూ ఆఫీసుకు తిరిగి వచ్చి సీతారామయ్యను కలిశారు.

రాముని సీతారామయ్య , “నీకు మా కావ్యను పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా?” అని అడిగాడు. “సార్, మీ సహాయాన్ని నేను జీవితాంతం మరిచిపోలేను. కానీ, జీవితాంతం మీ సహాయంతోనే బ్రతకాలంటే నాకు కష్టంగా ఉంటుంది . నన్ను నేను నిరూపించుకుని, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక వచ్చి కావ్యను తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఇంటికి వచ్చిన రాముని చూసి, తల్లి మంజుల అతడి దగ్గరకు వెళ్లి, “నీ ప్రేమ సంగతి అమ్మాయికి చెప్పావా? అమ్మాయి ఏం సమాధానం ఇచ్చింది?” అని ఎంతో ఆత్రుతగా అడిగింది. రాము ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి, హాల్ లోకి వచ్చి అంజయ్య పక్కన కూర్చుని, “నేను సీతారామయ్యగారి దగ్గర ఉద్యోగం మానేస్తున్నాను” అని చెప్పాడు. “అదేంటి!” అని ఇంట్లో అందరూ ఒకేసారి అడిగారు. రాము “ఒకరి సాయంతోనే నా జీవితాన్ని గడపడం తనకు ఇష్టం లేదు” అని చెప్పి డాబాపైకి వెళ్లిపోయాడు.

మెల్లగా మెట్లు ఎక్కి రాము దగ్గరకు వెళ్ళాడు అంజయ్య. రాము మంచంపై పడుకుని ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. తాతయ్యను చూసి వెంటనే లేచి కూర్చున్నాడు రాము. “అసలు ఏం జరిగింది రా?” అని అడిగాడు అంజయ్య. రాము సీతారామయ్యాకు, కావ్యకు చెప్పిన మాటలన్నీ చెప్పాడు. రాము మనసును అర్థం చేసుకున్న అంజయ్య, “అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?” అని అడిగాడు. “అదే అర్థం కావట్లేదు” అన్నాడు రాము. సూర్యుడు ఉదయించాడు. ఎనిమిది గంటలైంది, అయినా రాము ఇంకా నిద్ర లేవలేదు. మంజుల రాముని నిద్ర లేపేందుకు మెట్లు ఎక్కబోతుండగా… ఎదురుగ్గా కారు వచ్చి ఆగింది. కారులోంచి సీతారామయ్య దిగాడు. మంజుల వెంటనే అతని దగ్గరకు వెళ్లి, ‘లోపలికి రండి’ అని ఆహ్వానించింది. సీతారామయ్య ఇంట్లోకి వచ్చి, అంజయ్య చేతులు పట్టుకుని, ‘బాబాయ్, మనం నిర్ణయించిన పెళ్లిని ఇంకా కొన్ని రోజులు వాయిదా వేద్దాము’ అన్నాడు. ‘సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం’ అన్నాడు అంజయ్య. సీతారామయ్య ‘రాము ఎక్కడ?’ అని అడిగాడు. మంజుల ‘మేడపైన ఉన్నాడు’ అని చెప్పింది. సీతారామయ్య ‘రాముతో మాట్లాడాలి’ అన్నాడు. వెంటనే మంజుల వెళ్లి రాముని కిందకు రమ్మని పిలిచింది.

రాము కిందకు వచ్చి సీతారామయ్యను చూసి, “సార్, ఇంత పొద్దున్నే వచ్చారేంటి?” అని అడిగాడు. “కొంచెం పని ఉండి వచ్చాను,” అని సీతారామయ్య బదులిచ్చాడు. "నా స్నేహితుడు ఒక కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఒక జనరల్ మేనేజర్ కావాలని చెప్పాడు. నేను నీ గురించి అతనికి చెప్పాను. అతను కూడా నాలాగే కష్టానికి విలువ ఇచ్చే మనిషి. అందుకే వెంటనే నీకు ఆ జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఒక్కసారి వెళ్లి కలిసి రా. ఇది నేను నీకు చేసే సహాయం కాదు, నీ కష్టానికి నేను మెచ్చి నీకు చూపిస్తున్న అవకాశం. ఇంక నీ ఇష్టం” అని చెప్పి, అతని చిరునామాను రాము చేతిలో పెట్టి సీతారామయ్య వెళ్లిపోయాడు.

“ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రాము? వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదు” అని అంజయ్య అన్నాడు.

ఇంతలో, కాఫీ కప్పు తీసుకొని వచ్చి రాము చేతిలో పెడుతూ, “నువ్వు చిన్నప్పటినుంచి కలెక్టర్ అవ్వాలని కలలు కన్నావు, కానీ చదివింది మాత్రం ఇంజనీరింగ్. అంటే, నీ లక్ష్యంపై నిలకడ లేదు. ఇప్పుడు ఉద్యోగంలో కూడా అంతే. ఒక చోట స్థిరంగా కష్టపడకుండా, కేవలం జీతం పెరిగింది అనగానే ఈ ఉద్యోగం మానేస్తాను అంటున్నావు” అని ఏడుస్తూ అంది మంజుల.

వీరేంద్ర వీల్‌చైర్‌లో రాము దగ్గరకు వచ్చి, ‘కన్నా, అసలు ఏంటి ఇదంతా?’ అని అడిగాడు. ‘ఏమీ లేదు నాన్న’ అని చెప్పి, రాము వెంటనే లేచి తయారై బయటకు వెళ్ళాడు.

సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చి, ‘అమ్మా, ఒక శుభవార్త!’ అని అన్నాడు. సీతారామయ్య చెప్పిన ఆఫీసులో ఉద్యోగం వచ్చి ఉంటుందని మంజుల ఎంతో సంతోషంగా వంటగదిలోంచి బయటకు వచ్చింది. రాము అందరి నోరు తీపి చేస్తూ, ‘నాకు పక్కనే ఉన్న “రిలయన్స్ మార్ట్”లో ఉద్యోగం వచ్చింది. నెలకు పదిహేను వేలు జీతం!’ అని చెప్పాడు.

“ఏంటి, అంత పెద్ద ఉద్యోగం, హోదా, జీతం అన్నీ వదిలేసి ఈ చిన్న ఉద్యోగం చేస్తావా? సిగ్గు లేదా?” అని మంజుల అంది. “నీ కొడుకు ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సిగ్గుపడాలి. ఉద్యోగంలో చిన్న, పెద్ద ఏమిటి?” అని అంజయ్య అన్నాడు. “మీకు నచ్చింది చేసుకోండి” అని చెప్పి మంజుల గదిలోకి వెళ్ళిపోయింది.

రాము ఉదయాన్నే నిద్రలేచి రిలయన్స్ మార్ట్‌కు బయలుదేరాడు. అక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తూ, ప్రతి నెలా ఉత్తమ ఉద్యోగి పురస్కారాన్ని అందుకుంటున్నాడు.

ఒక రోజు ఒక వ్యక్తి రిలయన్స్ మార్ట్‌కి సరుకులు కొనేందుకు వచ్చాడు. అక్కడ రాము తన తోటి ఉద్యోగులకు, కస్టమర్‌లను ఎలా ఆకట్టుకోవాలి, వారికి ఏ వస్తువు అవసరమైనా ఈ రిలయన్స్ మార్ట్‌కే వచ్చేలా ఎలా చేయాలి అనే విషయాలపై మంచి సూచనలు ఇస్తున్నాడు. ఆ సంభాషణ అంతా విన్న ఆ వ్యక్తి, సాయంత్రం రాము ఇంటికి వెళ్లే సమయంలో అతన్ని కలిశాడు. ఆ వ్యక్తి, ‘నా పేరు దశరథ్. నేను ఉదయం రిలయన్స్ మార్ట్‌లో మీరు మీ తోటి ఉద్యోగులకు ఇస్తున్న సూచనలన్నీ విన్నాను. మీరు నాకు ఒక సహాయం చేయగలరా?’ అని దశరథ్ రాముని అడిగాడు.

రాము, “అసలు మీరు ఎవరు? నేను మీకు ఏ సహాయం చేయగలను?” అని అడిగాడు.

“నేను చాక్లెట్ల వ్యాపారం చేస్తుంటాను. ఒక హోల్ సేల్ వ్యాపారి దగ్గర నుంచి చాక్లెట్లు కొని, పక్కన ఉండే పల్లెటూళ్ళలోని దుకాణాలకు అమ్ముతుంటాను. మొదట్లో వ్యాపారం బాగానే ఉండేది. డబ్బు బాగా సంపాదిస్తుండటంతో నేను ముందు వెనుక ఆలోచించకుండా ఈ.ఎం.ఐ.లు తీసుకున్నాను. ఇప్పుడు వ్యాపారం బాగా సాగకపోవడంతో, నాకు ఊరిలో ఉన్న పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాను. ఇప్పుడు ఆ రుణం, ఈ.ఎం.ఐ.లు అన్నింటి భారం ఎక్కువగా ఉంది.”

“మీరు నా వ్యాపారం అభివృద్ధికి ఏదైనా సలహా ఇచ్చి సహాయం చేయగలరా? లేకపోతే నేను అంతా కోల్పోతాను” అని దశరథ్ చెప్పాడు. రాముకి తన తండ్రి ఈఎంఐల కారణంగా అంతా కోల్పోయిన దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. వెంటనే రాము, “మీ వ్యాపార ప్రదేశం ఎక్కడ ఉంది?” అని అడిగాడు. “రండి” అని దశరథ్ రాముని తనతో తీసుకెళ్లి చూపించాడు.

రాము, “అసలు చాక్లెట్ వ్యాపారం బాగా సాగకపోవడానికి కారణమేమిటి?” అని అడిగాడు. “నేను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు బాగా అమ్ముడుపోయాయి. కానీ రెండు సంవత్సరాల తర్వాత, నేను సరుకు తీసుకుంటున్న హోల్‌సేల్ వ్యాపారి నన్ను మోసం చేస్తూ…” లాభం కనిపించకుండా, పెట్టుబడిని విపరీతంగా పెంచేశాడు.

నేను ఆ విషయం తెలుసుకుని అడిగినప్పుడు, ఆ వ్యాపారి ఇతరులతో కలిసి నన్ను లక్ష్యంగా చేసుకుని, నా చాక్లెట్లు పల్లెటూర్లలో అమ్ముడుపోకుండా చేస్తున్నారని దశరథ్ చెప్పాడు.

రాము, ‘సరే, నేను ఆలోచించి రేపు చెబుతాను’ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. రాము ఆలస్యంగా ఇంటికి రావడం చూసిన మంజుల, ‘ఎందుకు ఇంత ఆలస్యం అయింది?’ అని అడిగింది. పని వల్ల ఆలస్యం అయిందని రాము చెప్పాడు. ‘ఏంటో అంత పని?’ అని అడిగింది మంజుల. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు రాము.

రాము ఉదయం లేచి, రోజులాగే తన పనికి వెళ్ళాడు. చాలాసేపు పని చేసిన తర్వాత, మేనేజర్ రాముని ఒక చిన్న వాన్‌లో పక్కనే ఉన్న పల్లెటూరి సమీపంలోని చిన్న బ్రాంచ్‌కి కొన్ని సరుకులు పంపించాడు. రాము వెంటనే బయలుదేరి వెళ్ళాడు.

సరుకులన్నీ బ్రాంచ్‌లో దింపుతుండగా, అక్కడికి ఒక అవ్వ తన మనవరాలితో వచ్చి, “చిన్న చాక్లెట్ కోసం ఇంత దూరం రావాలి. అసలు ఈ చాక్లెట్‌లో ఏముంది?” అని సణుగుకుంటూనే ఒక చిన్న చాక్లెట్ కొనుక్కుని వెళుతుండగా… రాము ఆ అవ్వను దారిలో ఆపి, “మీరు ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు.

“రెండు కిలోమీటర్ల దూరం నుంచి రావాలి” అని అవ్వ చెప్పింది. ఆ మాటలు విన్న రాముకి వెంటనే ఒక ఆలోచన తట్టింది. సాయంత్రం దశరథ్‌ని కలిసి, “ఇప్పటి వరకు మీరు పల్లెటూళ్ళలోని దుకాణాలకు చాక్లెట్లు పంపారు. ఇప్పటి నుంచి మీరే ఒక మినీ వ్యానులో చాక్లెట్లను పల్లెటూళ్ళన్ని తిరుగుతూ, వాళ్ళ గుమ్మాల దగ్గరకు తీసుకెళ్ళి అమ్మితే ఎలా ఉంటుంది?” అని అన్నాడు రాము.

రాము సలహా విన్న దశరథ్, “ఆలోచన బాగుంది కానీ నా దగ్గర సరుకు మాత్రమే ఉంది. పెట్టుబడి లేదు” అన్నాడు. నిజమే, దేనికైనా పెట్టుబడి అవసరమేనని అంగీకరించిన రాము, తెలిసిన వారెవరైనా ఉంటే చూడమని చెప్పి ఇంటికి వచ్చేశాడు.

ఇంటికి వచ్చిన రాము తన పనులు ముగించుకుని, ‘పెట్టుబడి ఎలా?’ అనే ఆలోచనలో పడ్డాడు. రాముని చూసిన వీరేంద్ర అతని దగ్గరకు వచ్చి, ‘ఏమైంది?’ అని అడిగాడు. రాము దశరథ్ గురించి అంతా చెప్పాడు. ఆ మాటలు విన్న వీరేంద్ర, తన స్నేహితుడు రమేష్ దగ్గర ఒక మినీ వాన్ ఉందని, ఆ వాన్ ని అద్దెకు తీసుకోమని అన్నాడు.

రాము మరుసటి రోజు రమేష్ దగ్గరకు వెళ్ళి, దశరథ్ ఇబ్బందిని వివరించాడు. కొన్ని రోజుల కోసం వ్యాన్ అద్దెకు తీసుకుని, ఆ వ్యాన్ లోనే దశరథ్ దగ్గరకు వెళ్ళి, తమకు తెలిసిన వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులకే వ్యాన్ అద్దెకు తీసుకున్నానని చెప్పాడు. “అయితే, ఈ వ్యాన్ లో తిరుగుతూ ఎవరు అమ్ముతారు?” అని దశరథ్ అడిగాడు. “మా నాన్నకు కాళ్ళు లేవు కాబట్టి మా నాన్నను, ఇంకో అబ్బాయిని పంపిద్దాం వ్యాన్ లో” అని రాము అన్నాడు. దశరథ్ సరే అన్నాడు. రెండు రోజుల్లోనే, వీరేంద్ర, ఇంకో అబ్బాయి కలిసి దశరథ్ దగ్గర ఉన్న కొన్ని చాక్లెట్లను వ్యాన్ లో వేసుకుని పల్లెటూర్లకు బయలుదేరారు.

పల్లెటూర్లలో వాన్‌ను ఆపి, ‘చాక్లెట్లు… చాక్లెట్లు… అన్ని రకాల చాక్లెట్లు మా దగ్గర దొరుకుతాయి’ అని ఒక వాయిస్ రికార్డును ప్లే చేశారు. ఆ రోజు ఒక్కరు కూడా కొనలేదు. ఐదు పల్లెటూర్లు తిరిగే సరికి కేవలం మూడు చాక్లెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సాయంత్రం తిరిగి వచ్చిన వీరేంద్ర, ‘కేవలం చాక్లెట్లు మాత్రమే అమ్మడం కష్టమేమో, ఆలోచించు’ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. రాము వెంటనే తను పనిచేస్తున్న రిలయన్స్ మార్టుకు వెళ్లి మేనేజర్‌తో మాట్లాడి, ‘వచ్చే నెల తన జీతం బదులు, ఆ డబ్బుకు సరిపడా సరుకులు కావాలి’ అని అడిగాడు.

మేనేజర్ సరేనని, వచ్చే నెల జీతం అందుకున్నట్లు సంతకం పెట్టమన్నాడు. వెంటనే రాము సంతకం చేసి, పప్పులు, బియ్యం, సర్ఫ్, సబ్బులు, నూనె వంటి సరుకులు తీసుకుని వీరేంద్రతో కలిసి బయలుదేరాడు. ఊరిలో ఒకరిద్దరు వచ్చి అత్యవసరంగా నూనె, సబ్బు కొనుక్కుని వెళ్లారు. సాయంత్రం వరకు ఐదు పల్లెటూళ్లు తిరిగేసరికి సరుకులన్నీ అమ్ముడుపోయాయి… కానీ చాక్లెట్లు అమ్ముడుపోలేదు.

సరుకులు అమ్మిన డబ్బుతో మళ్ళీ సరుకులు కొనుక్కుని రాము పల్లెటూర్లకు వెళ్ళాడు. కానీ సరుకులే అమ్ముడుపోతున్నాయి, చాక్లెట్లు మాత్రం అమ్ముడుపోవడం లేదు. అప్పుడు రాము, ‘ఐదు రూపాయల చాక్లెట్ కొన్న వారికి రూపాయి కప్ కేక్ ఉచితం’ అని ప్రకటించాడు. దాంతో పిల్లలందరూ చాక్లెట్లు కొనేందుకు ఎగబడ్డారు. ఆ రోజున తీసుకెళ్ళిన సరుకులు, చాక్లెట్లు అన్నీ అమ్ముడుపోయి, ఖాళీ వాన్‌తో రాము తిరిగి వచ్చాడు. దశరథ్‌కి, ‘రోజుకు ఒక్కో స్కీమ్ పెట్టి ఇలా అమ్మండి’ అని రాము చెప్పాడు.

“సరుకులన్నీ ఇళ్ల ముందుకి తీసుకెళ్లండి” అని చెప్పి, రాము వాన్ తాళాలు అందించాడు. “తాళాలు ఎందుకు ఇస్తున్నారు? మీరు నా వ్యాపారంలో నాకు తోడుగా, ముఖ్య భాగస్వామిగా ఉండాలి. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం” అని దశరథ్ అన్నాడు.

“ఇది నీ తెలివితేటలకు, కష్టానికి దక్కిన అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకో” అని దశరథ్ చెప్పాడు. దశరథ్‌తో రాము సరేనని చెప్పి, ‘లిటిల్ కృష్ణ’ పేరుతో పల్లెటూర్లకు నిత్యావసర సరుకులు, చాక్లెట్లు వంటివి తీసుకెళ్లి అమ్మడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత, రాము మెల్లగా పల్లెటూర్లకు దగ్గరగా ‘లిటిల్ కృష్ణ సూపర్ మార్కెట్’ ను స్థాపించి, దాన్ని ‘లిటిల్ కృష్ణ బిగ్ బజార్’ గా మార్చాడు. ఆ బజార్‌లో బట్టలు, సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి ఎన్నో రకాల వస్తువులను పల్లెటూరి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు.

కొద్ది సమయంలోనే పెద్ద పేరు సంపాదించాడు. లిటిల్ కృష్ణ మార్ట్ బాగా సాగడం చూసి, రాము పురోగతిని అభినందించడానికి సీతారామయ్య తన మేనకోడలితో వచ్చాడు. రాము వారిని తన ఇంటి వద్ద చూసి, వెంటనే కావ్యతో తమ వివాహానికి ముహూర్తం నిర్ణయించమని కోరాడు.

ఒక మంచి ముహూర్తాన కావ్య, రాము వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చదువు ఎంత అవసరమో గ్రహించి రాము, తాను బాగా చదువుకోకపోయినా అనుకున్నది సాధించి, తండ్రి ఈ.ఎం.ఐ.ల కారణంగా కోల్పోయిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు తన కుటుంబానికి ఎంతో ఓర్పుతో, నేర్పుతో తిరిగి అందించాడు.