వేసవి కాలం ముగిసే సమయానికి…
మేనర్ ఫామ్‌లో జరిగిన సంఘటన గురించి వార్త చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించడం మొదలైనది.
అక్కడ ఒక అసాధారణమైన విషయం జరిగింది.
జంతువులు తిరుగుబాటు చేశాయి.
తమ యజమానిని తరిమేశాయి.
ఫామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
అంతేకాదు…
మనుషుల సహాయం లేకుండానే దాన్ని నడుపుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసింది .
మొదట్లో ఈ కథ విన్నవారికి నమ్మశక్యంగా అనిపించలేదు.
మనుషులను జంతువులు ఓడించడమా?
జంతువులే ఒక ఫామ్‌ను నడపడమా?
తమ కోసం తామే చట్టాలు చేసుకోవడమా?
అసలు అది ఎలా సాధ్యం?
కాని రోజులు గడుస్తున్న కొద్దీ…
ఆ వార్త మరింత దూరం ప్రయాణించింది.
ఒక ఫామ్ నుంచి మరో ఫామ్‌కు…
ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి…
అలా చుట్టుపక్కల ప్రాంతమంతా యానిమల్ ఫామ్ కథ వ్యాపించింది.
ప్రతిసారి ఆ కథ చెప్పినప్పుడు…
అది మరింత శక్తివంతంగా మారింది.
తమ తిరుగుబాటు గురించి యానిమల్ ఫామ్‌లో మాత్రమే తెలిసి ఉంటే సరిపోదని స్నోబాల్, నెపోలియన్ భావించారు.
ఇతర ఫామ్‌లలోని జంతువులకు కూడా ఈ విషయం తెలియాలి.
అందుకే పావురాలను చుట్టుపక్కల ఫామ్‌లకు పంపడం మొదలుపెట్టారు.
ఆ పావురాలు ఒక సందేశాన్ని తీసుకు వెళ్లాయి.
మేనర్ ఫామ్‌లో ఏం జరిగిందో ఇతర జంతువులకు చెప్పాయి.
మిస్టర్ జోన్స్‌ను తరిమేశామని చెప్పాయి.
ఇప్పుడు జంతువులు స్వేచ్ఛగా ఉన్నాయని చెప్పాయి.
ఫామ్ ఇప్పుడు వాటిదేనని చెప్పాయి.
అంతేకాదు…
యానిమల్ ఫామ్‌లో జంతువులకు స్ఫూర్తినిచ్చిన విప్లవ గీతాన్ని కూడా ఇతర జంతువులకు నేర్పించాయి.
పావురాలు పొలాల మీదుగా ఎగిరాయి.
ఒక్కో ఫామ్‌లో దిగాయి.
అక్కడి జంతువులతో మాట్లాడాయి.
ఎక్కడికి వెళ్లినా ఒకటే సందేశం.
మనుషులు యజమానులుగా లేకపోయినా జంతువులు జీవించగలవు.
జంతువులకు ఆ మాటటలు ఆశలు కలిగించాయి .
కాని …
మనుషులకు మాత్రం ఆ మాటలు చాలా ఇబ్బందికరమైనవి .
యానిమల్ ఫామ్‌కు దగ్గరలో రెండు ముఖ్యమైన ఫామ్‌లు ఉన్నాయి.
వాటిలో ఒకటి—
“ ఫాక్స్‌వుడ్.”
అది చాలా పెద్దది. పాత తరహా ఫామ్.
దాని యజమాని మిస్టర్ పిల్కింగ్టన్.
అతను ఫామ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం కంటే వేటకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులలో ఎక్కువ సమయం గడిపేవాడు.
అందుకే ఫాక్స్‌వుడ్ నిర్వహణ అంత బాగా ఉండేది కాదు.
కంచెలను సరిగా పట్టించుకునేవారు కాదు.
కొన్ని పొలాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు .
అయినా అది చాలా పెద్ద ఫామ్.
మరో ఫామ్ పేరు—
“పించ్‌ఫీల్డ్.”
అది ఫాక్స్‌వుడ్ కంటే చిన్నది.
కాని చాలా పద్ధతిగా నిర్వహించే వారు.
దాని యజమాని మిస్టర్ ఫ్రెడరిక్.
ఫ్రెడరిక్ చాలా తెలివైన, కఠినమైన వ్యాపారవేత్తగా పేరు పొందాడు.
అతను తరచూ గొడవలు, న్యాయ వివాదాలలో ఉంటాడని ప్రజలు చెప్పుకునేవారు.
పిల్కింగ్టన్‌కు, ఫ్రెడరిక్‌కు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు.
దాదాపు ప్రతి విషయంలోనూ వాళ్లిద్దరూ విభేదించేవారు.
ఒక విధంగా చెప్పాలంటే
వాళ్లు ప్రత్యర్థులు.
కాని ఇప్పుడు…
వాళ్లిద్దరినీ ఒకే విషయం కలవరపెడుతున్నది. అదే “ యానిమల్ ఫామ్. “
మొదట్లో చుట్టుపక్కల రైతులు యానిమల్ ఫామ్ గురించి విని నవ్వుకున్నారు.
జంతువులు నడిపే ఫామ్?
అది ఎంతకాలం నడుస్తుంది?
కొన్ని వారాలు కూడా నిలబడదని అనుకున్నారు.
జంతువులు సోమరులైపోతాయని చెప్పారు.
పంటలు పండవని అన్నారు.
వాటి మధ్య గొడవలు వస్తాయని అనుకున్నారు.
ఎవరూ ఎవరి మాటా వినరని భావించారు.
చివరకు ఆహారం లేక ఆకలితో అలమటిస్తాయని అనుకున్నారు.
తమను మళ్లీ పాలించమని మనుషుల దగ్గరకు జంతువులు వస్తాయని ఆశించారు.
కాని …
వారాలు గడిచిపోయాయి.
యానిమల్ ఫామ్ మామూలుగానే నడుస్తున్నది .
జంతువులు పంట కోశాయి.
తమకు కావలసిన ఆహారాన్ని పండించుకున్నాయి.
పనులను పద్ధతిగా నిర్వహించుకున్నాయి.
ఎలాగోలా…
ఫామ్ నడుస్తూనే ఉన్నది.
ఇది చుట్టుపక్కల రైతులకు ఆందోళన కలిగించింది.
ఎందుకంటే ఇప్పుడు వారి ముందు ఒక ప్రమాదకరమైన ప్రశ్న ఉన్నది.
ఒక ఫామ్‌ను జంతువులే విజయవంతంగా నడపగలిగితే…
మిగతా ఫామ్‌లలోని జంతువులు కూడా ప్రశ్నలు అడగడం మొదలుపెడితే?
గుర్రాలు…
“ఈ భూమంతా మనుషులదే ఎందుకు?”
అని అడిగితే?
ఆవులు…
“మనం ఇచ్చే పాలు ఎక్కడికి వెడుతున్నాయి?”
అని ప్రశ్నిస్తే?
కోళ్లు…
“మనం పెట్టే గుడ్లన్నీ ఏమవుతున్నాయి?”
అని ఆలోచించడం మొదలుపెడితే?
ఒక ఫామ్‌లో మొదలైన తిరుగుబాటు…
మిగతా ఫామ్‌లకు కూడా వ్యాపిస్తే?
ఆ ఆలోచనే మనుషులను భయపెట్టింది.
నిజానికి…
యానిమల్ ఫామ్ కంటే కూడా ఆ ఆలోచనే వారికి ఎక్కువ ప్రమాదకరంగా అనిపించింది.
అందుకే మనుషులు తమ వైపు నుంచి కొన్ని కథలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
యానిమల్ ఫామ్‌లో పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నదని చెప్పారు.
అక్కడి జంతువులు ఆకలితో చనిపోతున్నాయని అన్నారు.
ఎప్పుడూ ఒక దానితో ఒకటి గొడవపడుతున్నాయని చెప్పారు.
ఒకదానినొకటి చంపుకుంటున్నాయని ప్రచారం చేశారు.
ఫామ్ మొత్తం గందరగోళంగా మారిపోయిందన్నారు. ఈ కథలు ఒకరి నుంచి మరొకరికి చేరే సరికి
మరింత భయంకరంగా మారాయి.
తిరుగుబాటు చేస్తే చివరకు దుఃఖం, ఆకలి, అల్లకల్లోలం తప్ప ఏమీ మిగలదని తమ జంతువులు నమ్మాలని మనుషులు ప్రయత్నించారు. విచిత్రం ఏమిటంటే చుట్టుపక్కల ఫామ్‌లలోని జంతువులు ఆ కథలను పూర్తిగా నమ్మలేదు.
ఎందుకంటే…
యానిమల్ ఫామ్ నుంచి పావురాలు ఇంకా వస్తూనే ఉన్నాయి.
అంతేకాదు…
కొన్నిసార్లు పొలాల మధ్య నుంచి ఒక పాట వినిపిస్తున్నది.
యానిమల్ ఫామ్‌లో పుట్టిన విప్లవ గీతం…
ఇప్పుడు ఇతర ఫామ్‌లలో కూడా వినిపించడం మొదలైనది.
మొదట ఒకటి రెండు జంతువులు మాత్రమే పాడి ఉండవచ్చు.
కాని తరువాత…
ఆవులు తమ స్వరంతో పాడాయి.
గుర్రాలు సకిలిస్తూ పాడాయి.
గొర్రెలు తమ గొంతులతో పాడాయి.
చెట్ల మీద పక్షులు ఆ గీతాన్ని ఆలపించాయి.
మనుషులకు ఆ పాట అంటే అసహ్యం.
తమ ఫామ్‌లో ఏ జంతువైనా ఆ పాట పాడితే…
వెంటనే దాన్ని శిక్షించేవారు.
కాని శిక్షలు…
ఆ ఆలోచనను మాత్రం చంపలేకపోయాయి.
నిజానికి…
కొన్ని సందర్భాల్లో ఆ పాట మరింత శక్తివంతంగా మారింది.
ఏదో మార్పు .
తిరుగుబాటు జరిగింది ఒక్క ఫామ్‌లోనే.
కాని …
తిరుగుబాటు అనే ఆలోచన మాత్రం చాలా దూరం ప్రయాణిస్తున్నది.
ఇది ఇలా ఉండగా…
మిస్టర్ జోన్స్ మాత్రం తన ఫామ్‌ను మర్చిపోలేదు.
ఒకప్పుడు యానిమల్ ఫామ్ అతని ఆస్తి.
అక్కడ ఉన్న ఇల్లు అతనిది.
పొలాలు అతనివి.
గోదాములు అతనివి.
ఇప్పుడు…
అక్కడ జంతువులు నివసిస్తున్నాయి.
ఆ విషయాన్ని జోన్స్ తట్టుకోలేకపోయాడు.
తన ఫామ్ తనకు తిరిగి కావాలి.
కొన్ని వారాల పాటు అతను తన దురదృష్టం గురించి అందరికీ చెప్పుకుంటూ తిరిగాడు.
జంతువులు తన ఆస్తిని దొంగిలించాయని తన మాట వినే వారందరికీ చెప్పాడు.
కాని …
బాధపడుతూ కూర్చుంటే ఫామ్ తిరిగి రాదు.
చివరకు జోన్స్ ఒక నిర్ణయం తీసుకున్నాడు.
యానిమల్ ఫామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
అందుకోసం కొంతమంది మనుషులను కూడగట్టాడు.
వారిలో కొందరు అతని పాత పనివాళ్లు.
మరికొందరు చుట్టుపక్కల ఫామ్‌ల నుంచి వచ్చారు.
పిల్కింగ్టన్ కు, ఫ్రెడరిక్‌కు జోన్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు.
కాని ఒక మనిషిని జంతువులు ఓడించి ఫామ్ నుంచి తరిమేశాయనే విషయం…
వాళ్లందరికీ ప్రమాదకరంగా అనిపించింది.
అందుకే పక్క ఫామ్‌ల నుంచి కూడా కొంతమంది జోన్స్‌తో చేరారు.
ఒక శరదృతువు ఉదయం…
యానిమల్ ఫామ్‌లోని జంతువులు వారిని చూశాయి.
దూరం నుంచి…
కొంతమంది మనుషులు ఫామ్ వైపు వస్తున్నారు.
వారిలో…
మిస్టర్ జోన్స్ కూడా ఉన్నాడు.
వాళ్లు ఖాళీ చేతులతో రావడం లేదు.
కొంతమంది చేతుల్లో కర్రలు ఉన్నాయి.
మరికొందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి.
జోన్స్ చేతిలో…
“తుపాకీ ఉంది.”
మనుషులు యానిమల్ ఫామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారు.
ఓల్డ్ మేజర్ ఒకప్పుడు హెచ్చరించిన పరిస్థితి ఇప్పుడు నిజమైనది.
తిరుగుబాటుకు మొదటి నిజమైన పరీక్ష ఎదురైనది.
మొదటిసారి జోన్స్‌ను తరిమేసినప్పుడు పరిస్థితి వేరు.
అప్పుడు అన్నీ అకస్మాత్తుగా జరిగాయి.
జోన్స్, అతని పని వాళ్లు జంతువులు తమపై తిరగబడతాయని ఊహించలేదు.
కాని …
ఈసారి పరిస్థితి పూర్తిగా వేరు.
ఈసారి మనుషులు సిద్ధంగా వచ్చారు.
వాళ్లు కావాలనే వచ్చారు.
యుద్ధం చేయడానికి వచ్చారు.
ఫామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు.
అయితే…
స్నోబాల్ కూడా ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించాడు. మనుషులు యుద్ధాల గురించి రాసిన ఒక పాత పుస్తకాన్ని అతడు చదివాడు.
గతంలో జరిగిన యుద్ధాల గురించి తెలుసుకున్నాడు.
సైన్యాలు ఎలా పోరాడతాయో చదివాడు.
ఎలాంటి వ్యూహాలు పన్నుతాయో నేర్చుకున్నాడు.
ఇప్పుడు…
ఆ జ్ఞానాన్ని ఉపయోగించే సమయం వచ్చింది.
జంతువులు అన్నీ వెంటనే ఒకచోట చేరాయి.
స్నోబాల్ ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
ప్రతి జంతువుకూ ఒక పని ఉన్నది.
చిన్న జంతువులు కూడా సహాయం చేయగలవు.
మొదట…
పావురాలను పంపించాడు.
అవి మనుషుల తలల మీదుగా ఎగురుతూ వారిని ఇబ్బంది పెట్టాయి.
ఆ తరువాత బాతులు, గీసులు ముందుకు దూసుకెళ్లి మనుషుల కాళ్లను కొరకడం మొదలుపెట్టాయి.
మనుషులు అరుస్తూ వాటిని తన్నడానికి ప్రయత్నించారు.
అయినా ముందుకు వస్తూనే ఉన్నారు.
కాని …
ఈ మొదటి దాడి మనుషులను ఓడించడానికి కాదు.
అది స్నోబాల్ వ్యూహంలో మొదటి భాగం మాత్రమే.
వారిని ఇబ్బంది పెట్టాలి.
వారి దృష్టి మరల్చాలి.
వారికి కోపం తెప్పించాలి.
ఆ తరువాత మరో బృందం ముందుకు వచ్చింది.
గొర్రెలు.
మురియెల్.
బెంజమిన్.
అవి కూడా మనుషుల పైకి దూసుకెళ్లాయి.
మనుషులు కర్రలతో ఎదురుదాడి చేశారు.
కొద్దిసేపు పోరాటం జరిగింది.
అప్పుడు…
స్నోబాల్ ఒక సంకేతం ఇచ్చాడు.
జంతువులు ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి.
పరుగెత్తడం మొదలుపెట్టాయి.
మనుషులు అది చూసి సంతోషించారు.
జంతువులు భయపడి పారిపోతున్నాయని అనుకున్నారు.
తాము గెలుస్తున్నామని భావించారు.
వాటి వెనుక పరుగెత్తారు.
స్నోబాల్ కోరుకున్నది కూడా అదే.
మనుషులు ఫామ్ లోపలికి మరింత ముందుకు వచ్చారు.
జంతువులు తమను చూసి భయపడిపోయాయని వాళ్లు అనుకున్నారు.
యుద్ధం దాదాపు ముగిసిపోయిందని భావించారు.
కాని …
వాళ్లకు తెలియకుండా…
ఒక ఉచ్చులోకి నడుస్తున్నారు.
వాళ్లు ఫామ్ యార్డ్‌లోకి వచ్చిన వెంటనే…
స్నోబాల్ వ్యూహంలోని రెండో భాగం మొదలైనది.
అప్పటి వరకు పెద్ద జంతువులు దగ్గరలో దాక్కుని ఉన్నాయి.
ఆవులు.
గుర్రాలు.
పందులు.
అవి ఒక్కసారిగా మనుషుల వెనుక నుంచి బయటకు వచ్చాయి.
అదే సమయంలో…
భయపడి పారిపోతున్నట్లు నటించిన జంతువులు కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగాయి.
మనుషులను చుట్టుముట్టాయి.
ముందు జంతువులు.
వెనుక జంతువులు.
తప్పించుకునే దారి చాలా తక్కువ.
అప్పుడు స్నోబాల్ సంకేతం ఇచ్చాడు.
దాడి!
ఒక్కసారిగా ఫామ్ యార్డ్ మొత్తం యుద్ధరంగంగా మారిపోయింది.
అన్ని వైపుల నుంచి జంతువులు మనుషులపైకి దూసుకు వచ్చాయి.
ఆవులు కొమ్ములతో ముందుకు వచ్చాయి.
గొర్రెలు వారి పైకి దూకాయి.
గుర్రాలు తమ బలమైన కాళ్లతో తన్నాయి.
మనుషులు కర్రలు ఊపుతూ తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు.
ఆ గందరగోళం మధ్య…
స్నోబాల్ నేరుగా మిస్టర్ జోన్స్ వైపు పరుగెత్తాడు.
జోన్స్ తన తుపాకీ పైకి ఎత్తాడు.
ఒక్క క్షణం…
ఢాం!
తుపాకీ శబ్దం ఫామ్ అంతా మారుమోగింది.
స్నోబాల్‌కు గాయం తగిలింది .
తుపాకీ నుంచి వచ్చిన చిన్న గుండ్లు అతని వీపును తాకాయి.
తెల్లటి శరీరంపై రక్తం కనిపించింది.
అతని దగ్గరలోనే ఒక గొర్రె కింద పడిపోయింది.
ఒక్క క్షణం…
అంతా ఆగిపోయినట్లు అనిపించింది.
కాని…
స్నోబాల్ ఆగలేదు.
గాయం తగిలినా…
జోన్స్ వైపు పరుగెత్తుతూనే వెళ్లాడు.
తన శరీరంతో బలంగా జోన్స్ కాళ్లను ఢీకొట్టాడు.
ఆ దెబ్బకు జోన్స్ అదుపు కోల్పోయాడు.
వెనక్కి పేడ కుప్పలో పడిపోయాడు.
అతని చేతిలోని తుపాకీ దూరంగా ఎగిరి పడింది.
అది చూసిన జంతువుల్లో కొత్త ధైర్యం వచ్చింది.
ఇప్పటివరకు మనుషులు చాలా శక్తివంతులని అవి భావించాయి.
కాని ఇప్పుడు…
ఒక విషయం వాటికి స్పష్టమైనది.
మనుషులను కూడా ఓడించవచ్చు.
అంతలో బాక్సర్ యుద్ధంలోకి దూసుకు వచ్చాడు.
అతని బలం ముందు మనుషులు నిలబడటం చాలా కష్టం.
బాక్సర్ తన వెనుక కాళ్లపై నిలబడ్డాడు.
తన బలమైన ఇనుప నాడాలు ఉన్న కాళ్లతో ముందుకు కొట్టాడు.
ఒక యువకుడికి ఆ దెబ్బ తగిలింది.
అతను వెంటనే నేలపై పడిపోయాడు.
కదలకుండా పడి ఉన్నాడు.
అది చూసిన బాక్సర్…
ఒక్కసారిగా ఆగిపోయాడు.
కొద్దిసేపటి క్రితం అతనిలో ఉన్న యుద్ధ కోపం మాయమైనది.
నేలపై పడిపోయిన యువకుడిని చూస్తూ నిలబడ్డాడు.
బాక్సర్ ఎవరినీ చంపాలని అనుకోలేదు.
తన ఫామ్‌ను కాపాడుకోవడానికి మాత్రమే పోరాడుతున్నాడు.
కాని ఇప్పుడు…
తన దెబ్బకు ఒక మనిషి చనిపోయాడని అనుకున్నాడు.
అతని మనసు కలత చెందింది.
స్నోబాల్ వైపు చూశాడు.
తాను ఎవరినీ చంపాలని కోరుకోలేదని చెప్పాడు.
మనిషినైనా సరే…
ఒక ప్రాణం తీయడం తనకు ఇష్టం లేదని అన్నాడు.
స్నోబాల్ అతనికి గుర్తు చేశాడు.
ఇది యుద్ధం.
తమ స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాడుతున్నాము.
కాని …
బాక్సర్ మనసులో బాధ మాత్రం తగ్గలేదు.
తన బలానికి అతను గర్వపడలేదు.
అతని శరీరం ఎంత బలమైనదైనా…
అతని మనసు మాత్రం ఎంతో సున్నితమైనది.
తన వల్ల ఒక ప్రాణం పోయిందనే ఆలోచన అతనిని తీవ్రంగా బాధించింది.
కాని ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు.
యుద్ధం ఇంకా కొనసాగుతున్నది.
ఇప్పుడు మనుషులు ఓడిపోతున్నారు. మనుషులు ఊహించింది
ఫామ్ జంతువులు భయపడుతూ ఉంటాయని.
కాని వాళ్ల ముందు ఉన్నవి…
తమ స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాడుతున్న జంతువులు.
మనుషుల్లో భయం మొదలైనది.
ఒక వ్యక్తి వెనక్కి తిరిగి పరుగెత్తాడు.
అతని వెంట మరొకరు.
కొద్దిసేపటికే…
అందరూ తప్పించుకోవడానికి పరుగులు తీస్తున్నారు.
జంతువులు వారిని ఫామ్ యార్డ్ నుంచి తరిమి కొట్టాయి .
మనుషులు రోడ్డుపైకి చేరుకుని అక్కడి నుంచి పారిపోయారు.
మరోసారి…
మిస్టర్ జోన్స్ నుయానిమల్ ఫామ్ నుంచి జంతువులు తరిమి తరిమి కొట్టాయి .
కాని ఈసారి…
ఇది అకస్మాత్తుగా జరిగిన తిరుగుబాటు కాదు.
మనుషులు సిద్ధంగా వచ్చారు.
ఆయుధాలతో వచ్చారు.
ఫామ్‌ను తిరిగి తీసుకోవడానికి వచ్చారు.
అయినా…
జంతువులు వారిని ఓడించాయి.
తమ ఫామ్‌ను కాపాడుకున్నాయి.
తమ తిరుగుబాటును కాపాడుకున్నాయి.
తమ స్వేచ్ఛను కాపాడుకున్నాయి.
యుద్ధం ముగిసింది.
ఉత్సాహం నెమ్మదిగా తగ్గింది.
అప్పుడు జంతువులు తమ చుట్టూ చూశాయి.
ఫామ్ యార్డ్ మొత్తం యుద్ధం జరిగిన గుర్తులతో నిండిపోయింది.
స్నోబాల్ వీపు నుంచి ఇంకా రక్తం వస్తున్నది.
మరికొన్ని జంతువులకు కూడా గాయాలు తగిలాయి.
అన్నింటి కంటే బాధాకరమైన విషయం…
ఒక గొర్రె చనిపోయింది.
విజయం వచ్చింది.
కాని …
దానికి ఒక మూల్యం చెల్లించవలసి వచ్చింది.
అప్పుడు బాక్సర్‌కు తాను కొట్టిన యువకుడు గుర్తొచ్చాడు.
అతని శరీరం కోసం చుట్టూ చూశాడు.
కాని …
అతను అక్కడ లేడు.
ఆ యువకుడు చనిపోలేదు.
బాక్సర్ దెబ్బకు కొంతసేపు స్పృహ కోల్పోయాడు అంతే.
యుద్ధంలోని గందరగోళంలో మళ్లీ స్పృహ వచ్చాక లేచి పారిపోయాడు.
అది తెలిసిన వెంటనే బాక్సర్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
తాను ఒక మనిషిని చంపలేదు.
ఆ సంఘటనను మాత్రం అతను అంత సులభంగా మర్చిపోలేకపోయాడు.
బాక్సర్ పని చేయడానికి సిద్ధం.
యానిమల్ ఫామ్‌ను కాపాడుకోవడానికి, పోరాడటానికీ సిద్ధం.
కాని
హింసలో అతనికి ఆనందం లేదు.
అంతలో ఎవరో ఒక విషయం గమనించారు.
మాలీ ఎక్కడ?
యుద్ధంలో ఆమెకు గాయమైనదా?
మనుషులు ఆమెను తీసుకెళ్లారా?
జంతువులు వెతకడం మొదలుపెట్టాయి.
చివరకు…
ఆమె తన కొట్టంలో కనిపించింది.
గడ్డిలో తల దాచుకుని వణుకుతున్నది.
తుపాకీ శబ్దం విన్న వెంటనే ఆమె భయపడిపోయింది.
మిగతా జంతువులు తమ ఫామ్‌ను కాపాడుకోవడానికి పోరాడుతున్నప్పుడు…
మాలీ మాత్రం యుద్ధం నుంచి పారిపోయి దాక్కున్నది.
తిరుగుబాటు గురించి మాలీ ఆలోచనలు మిగతా జంతువుల కంటే ఎంత భిన్నంగా ఉన్నాయో మరోసారి స్పష్టమైంది.
కాని దాని గురించి మాట్లాడే సమయం అది కాదు.
ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
జంతువులన్నీ ఫామ్ యార్డ్‌లో ఒక ప్రదేశంలో చేరాయి.
తమ మొదటి పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొన్నాయి.
అందులో విజయం సాధించాయి.
ఆ విజయాన్ని గుర్తుంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఆకుపచ్చ జెండాను ఎగురవేశారు.
జంతువులన్నీ కలిసి తమ విప్లవ గీతాన్ని పాడాయి.
యుద్ధంలో చనిపోయిన గొర్రెను గౌరవంగా పాతిపెట్టాయి.
ఆ సమాధి దగ్గర ఒక చెట్టు నాటారు.
స్నోబాల్ జంతువుల ముందు మాట్లాడాడు.
యానిమల్ ఫామ్‌ను కాపాడుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
ఇప్పుడు జంతువులకు ఒక ముఖ్యమైన విషయం అర్థమైనది.
స్వేచ్ఛను ఒక్కసారి సాధిస్తే సరిపోదు.
దాన్ని కాపాడుకోవాలి కూడా.
ఫామ్ బయట ఇంకా మనుషులు ఉన్నారు.
పాత వ్యవస్థ తిరిగి రావాలని కోరుకునే మనుషులు.
అందుకే తాము సాధించినదాన్ని రక్షించుకోవలసిన బాధ్యత తమదేనని స్నోబాల్ చెప్పాడు.
ఆ తర్వాత యుద్ధంలో ధైర్యంగా పోరాడిన వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.
అత్యున్నత గౌరవానికి పేరు పెట్టారు—
”యానిమల్ హీరో — ఫస్ట్ క్లాస్.”
స్నోబాల్‌కు ఆ గౌరవం ఇచ్చారు.
బాక్సర్‌కు కూడా ఇచ్చారు.
ఇద్దరికీ పతకాలు ఇచ్చారు.
యుద్ధంలో చనిపోయిన గొర్రెను కూడా మర్చిపోలేదు.
ఆమెకు మరణానంతరం మరో గౌరవం ఇచ్చారు.
దాని పేరు—
”యానిమల్ హీరో — సెకండ్ క్లాస్.”
జోన్స్ వదిలేసి వెళ్లిన తుపాకీ కూడా దొరికింది.
దానిని పారేయకూడదని జంతువులు నిర్ణయించాయి.
జెండా స్తంభం దగ్గర దానిని ఉంచాయి.
ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆ తుపాకీ పేల్చాలని నిర్ణయించారు.
ఒకసారి…
తిరుగుబాటు జరిగిన రోజును గుర్తు చేసుకోవడానికి.
మరోసారి…
ఈ యుద్ధంలో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి.
ఆ యుద్ధానికి కూడా ఒక పేరు పెట్టారు. “ది బ్యాటిల్ ఆఫ్ ది కౌషెడ్”
”గోశాల యుద్ధం.”
ఇకపై ఆ రోజు యానిమల్ ఫామ్ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా గుర్తుండిపోతుంది.
ఆ సాయంత్రం…
జంతువులు తమ ఫామ్ వైపు ఎంతో గర్వంగా చూశాయి.
ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనిని అవి సాధించాయి.
మొదట…
తమ మనిషి యజమానిని తరిమేశాయి.
ఇప్పుడు…
అదే యజమాని తన ఫామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు…
మళ్లీ ఓడించాయి.
ఇక తిరుగుబాటు అనుకోకుండా వచ్చిన అదృష్టం మాత్రమే కాదు.
దాని కోసం అవి పోరాడాయి.
గాయపడ్డాయి.
రక్తం చిందించాయి.
ఒక జంతువు తన ప్రాణాన్ని కూడా కోల్పోయింది.
ఇప్పుడు యానిమల్ ఫామ్…
కేవలం ఒక ఫామ్ మాత్రమే కాదు.
జంతువులకు అది ఒక నమ్మకానికి గుర్తు.
మనుషులను ఎదిరించగలమనే నమ్మకం.
తమను తాము రక్షించుకోగలమనే నమ్మకం.
ఓల్డ్ మేజర్ కల ఇంకా బతికే ఉన్నదనే నమ్మకం.
కాని …
యానిమల్ ఫామ్ సరిహద్దుల అవతల కూడా ఏదో జరుగుతున్నది.
ఇతర ఫామ్‌లలోని జంతువులు ఈ కథలు వింటున్నాయి.
యానిమల్ ఫామ్ గురించి తెలుసుకుంటున్నాయి.
విప్లవ గీతాన్ని నేర్చుకుంటున్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా…
తమ జీవితాలు కూడా మారవచ్చేమోనని ఆలోచించడం మొదలుపెడుతున్నాయి.
మనుషులు భయపడింది కూడా దానికే.
మిస్టర్ జోన్స్ తన ఫామ్‌ను కోల్పోయాడు.
చుట్టు పక్కల రైతులకు ఇప్పుడు ఒక విషయం నెమ్మదిగా అర్థమవుతున్నది.
వారి నియంత్రణ నుంచి తప్పించుకున్నది…
కేవలం ఒక ఫామ్ కాదు.
అంతకంటే ప్రమాదకరమైన ఒక ఆలోచన.
ఒక జంతువును గేటు వెనుక బంధించవచ్చు.
ఒక జంతువును శిక్షించవచ్చు.
పని చేయమని బలవంతం చేయవచ్చు.
కాని …
ఒకసారి ఒక ఆలోచన మనసులో పుట్టిన తరువాత…
దానిని అంత సులభంగా బంధించలేము.
ఆ ఆలోచన ఇప్పుడు యానిమల్ ఫామ్ గేట్లు దాటి బయటకు వెళ్లిపోయింది.

