కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతున్నది. మానవ మేధస్సు ముందు కృత్రిమ మేధస్సు అన్నివేళలా పనిచేయదని నెమ్మది నెమ్మదిగా తెలిసి వస్తున్నది. ఈ విషయాన్ని నిరూపించే సంఘటన ఇటీవల అమెరికాలో జరిగింది.
శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో స్వయం నియంత్రిత (డ్రైవర్ లేని) వాహనాలను నడుపుతున్న’ వేమో’ (Waymo) సంస్థకు ఇటీవల ఎదురైన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నది. కృత్రిమ మేధస్సుతో ఏదైనా సాధించవచ్చుననేది భ్రమయేనా ? కొన్ని సందర్భాలలో మానవ మేధస్సును త్రోసిరాజనలేమా? కృత్రిమం ఎప్పటికీ కృత్రిమమేనా ? సాంకేతికత వైపు పరుగులు తీస్తున్న మనం కొత్తగా నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ?అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
జూలై 4 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైనది. ఆ సమయంలో’ వేమో’కు చెందిన అనేక డ్రైవర్ లేని కార్లు ట్రాఫిక్‌లోనే నిలిచిపోయాయి. ఈ వాహనాల బ్యాటరీలు పూర్తిగా ఖాళీ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే గంటల తరబడి నిలిచిపోయాయి. వాటిని ప్రత్యేక టోయింగ్ వాహనాల సహాయంతో తరలించవలసి వచ్చింది.
ఈ సంఘటన కేవలం ఒక సాంకేతిక లోపమే కాదు. మనం వేగంగా పరుగెత్తుతున్న “ఆటోమేషన్ భవిష్యత్తు” ఎంత వరకు సమాజానికి మేలు చేస్తుందనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నది.
సాంకేతికత మనిషికి తోడుగా ఉండాలా? లేక ప్రత్యామ్నాయంగా మారాలా?
కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు ప్రమాదకరమైన లేదా పునరావృత పనులను సులభతరం చేయడానికి ఉపయోగపడితే వాటిని స్వాగతించవచ్చు. కాని లక్షలాది కుటుంబాల జీవనాధారమైన ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేసే స్థాయికి సాంకేతికతను తీసుకెళ్లడం సమాజానికి హితం కాదు.
ఒక డ్రైవర్ ఉద్యోగం కోల్పోతే ఆ ప్రభావం కేవలం ఒక వ్యక్తి పైనే కాదు. అతని కుటుంబం, పిల్లల చదువు, ఆరోగ్యం, ఆర్థిక భద్రత తదితర అంశాలపై కనిపిస్తుంది.
కార్పొరేట్ లాభాలే అసలు లక్ష్యమా?
పెద్ద కంపెనీలు ఆటోమేషన్ ద్వారా ఉద్యోగులను తగ్గిస్తే జీతాలు, బీమా, ఇతర ఉద్యోగ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. దానితో కంపెనీల లాభాలు పెరుగుతాయి, షేర్ విలువలు కూడా పెరగవచ్చు.కాని అదే సమయంలో వేలాది మంది ఉపాధిని కోల్పోతే ఆ సామాజిక వ్యయాన్ని ఎవరు భరిస్తారు? సాంకేతిక పురోగతి వల్ల కలిగే లాభాలు కొద్ది మంది పెట్టుబడిదారులకు మాత్రమే పరిమితం అవుతాయా? లేక సమాజంలోని అందరికీ అందేలా ఉండాలా? అనే చర్చ ఇప్పుడు మరింత అవసరం.
సాంకేతికత కూడా తప్పులు చేస్తుంది
శాన్ ఫ్రాన్సిస్కో ఘటనలో ట్రాఫిక్, రోడ్ల మూసివేత, భారీ జనసందోహం వంటి అనూహ్య పరిస్థితులను AI వ్యవస్థలు సమర్థంగా నిర్వహించలేకపోయాయి. కొన్ని వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒకానొక సందర్భంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పని చేయలేదు.ఆ సమయంలో ‘వేమో’ సేవలు తాత్కాలికంగా నిలిపి వేయవలసి వచ్చింది.
ఇలాంటి ఘటనలు కొన్ని వాస్తవాలను స్పష్టం చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు ఎంత అభివృద్ధి చెందినా అన్ని సందర్భాలలోనూ మానవ నిర్ణయ సామర్థ్యాన్ని పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాకపోవచ్చు.
మనిషి విలువను మరచిపోవద్దు
సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికి ఉపయోగించవచ్చు. కాని మనిషి ఉనికిని ప్రశ్నార్ధకంగా చేసే దిశగా ప్రయాణిస్తే, అది సామాజిక అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉంది.
ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది తమ ఉద్యోగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో “మానవ శక్తిని పూర్తిగా తొలగించి, గరిష్ఠ లాభాల కోసం ఆటోమేషన్‌ను అమలు చేయడం” సరైన అభివృద్ధి కాదని సామాజిక, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హద్దులు అవసరం
కృత్రిమ మేధస్సును నిలిపి వేయవలసిన అవసరం లేదు. కాని దానికి స్పష్టమైన హద్దులు ఉండాలి.
సాంకేతికత మనిషికి సహాయకారిగా ఉండాలి. ప్రత్యామ్నాయంగా కాదు. అభివృద్ధి అంటే కేవలం కంపెనీల ఆదాయం పెరగడం మాత్రమే కాదు. ఉద్యోగాలు, జీవనోపాధి, సామాజిక స్థిరత్వం, గౌరవం కూడా అంతే ముఖ్యమైనవి.“మనిషి కోసం సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామా? లేక సాంకేతికత కోసం మనిషిని త్యాగం చేస్తున్నామా?” అనే విషయాన్ని అందరూ ప్రశ్నించుకోవాలి.

